Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగి ఆరేండ్లు గడిచిపోయినా ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవ్వలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా సమస్యలన్నీ పేరుకుపోయాయి. ఉద్యోగులకు అందాల్సిన కనీస ప్రయోజనాలు, సౌకర్యాలు కూడా అందకపోవడం, పొందకపోవడం ఉద్యోగుల్లో తీవ్ర నిరాశకు కారణమైంది. సకలజనుల సమ్మెతో సాకారమైన తెలంగాణలో 'సకల జనుల సంబురం' ఉంటుందని భావించిన ఉద్యోగుల ఆశలు అడియాశలే అయ్యాయి.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 వాక్ స్వాతంత్ర హక్కును ప్రసాదించింది. ఆర్టికల్ 19(1) ప్రతీ ఒక్కరికి సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కును కల్పిస్తోంది. ఆర్టికల్ 15 రాజ్యంలోని పౌరులపై వివక్ష చూపవద్దని పేర్కొంటున్నది. ఆర్టికల్ 23 బలవంతపు శ్రమను నిషేధిస్తుంది. కానీ రాజ్యాంగం కల్పించిన పౌరహక్కుల ఉల్లంఘన నేడు దేశమంతటా చెలరేగిపోతున్నది. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు యాచించాలేతప్ప డిమాండ్ చేయకూడదనే ధోరణి కనబడుతోంది. ఉద్యమాలను సహించలేని పరిస్థితి గోచరిస్తున్నది. కానీ తమ సమస్యల పరిష్కారం కోసం పలు వర్గాలు రోడ్డెక్కుతున్నాయి. ఏదో ఓ చోట, ఏదో ఓ సమస్యపై అనుదినం నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులలో కూడా తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది. పలువర్గాలు ప్రతినిత్యం నిరసనలతో వార్తల్లోకి ఎక్కుతూ ఉంటే ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుందనే ఆత్మన్యూనత పాలకుల్లో పెరిగిపోతున్నది. సమస్యలను పరిష్కరించడం ద్వారా వారిలోని వ్యతిరేకతను దూరం చేయాలనే విశాల దృక్పథంతో కాకుండా కొంత మంది నాయకులను ఏమార్చడం ద్వారా ఉద్యమాలను అణచివేయవచ్చనే సంకుచిత భావాన్ని ప్రదర్శిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులందరికీ ''సెంట్రల్ పే స్కేల్స్'' అమలు చేస్తామని రాష్ట్ర అవతరణ తొలి నాళ్లలో హామీ ఇచ్చారు. కానీ నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ ఊసే మర్చిపోయారు. గత కొన్ని సంవత్సరాలుగా ''మన రాష్ట్ర ఉద్యోగులకు దేశంలోనే అత్యధిక వేతనాలు అందుతున్నాయి'' అనే దుష్ప్రచారాన్ని ఎత్తుకున్నారు. అదంతా అవాస్తవమని నిరూపితమయ్యాక ఇప్పుడు ఉద్యోగుల కోసం మన బడ్జెట్లో 40శాతం నిధులు కేటాయించాల్సి వస్తోంది.. అనే మరో అవాస్తవాన్ని ప్రచారంలో పెట్టారు. మన రాష్ట్రంలో ఉద్యోగస్తుల శాతం అధికంగా ఉందని దుష్ప్రచారం ప్రారంభించారు. కానీ ప్రభుత్వం నియమించిన ''పే రివిజన్ కమిషన్'' ఇచ్చిన రిపోర్టు ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 4,91,304 మంజూరైన పోస్టులు ఉన్నాయి. వీటిలో 3,00,178 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇంకా 1,91,126 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఉద్యోగులకు ఇవ్వాల్సిన కనీస ప్రయోజనాలపై కూడా విపరీతమైన దుష్ప్రచారానికి ఆస్కారం ఇస్తున్నారు. నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల ఆధారంగా ప్రతి 6 నెలలకోమారు పెంచాల్సిన డీఏను కూడా భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు. మీడియాలో పతాక శీర్షికలో వార్తలు రావడం, ఒకే వార్త పత్రికల్లో పలుమార్లు ప్రచురితమవ్వడం వల్ల ప్రజల్లో ఉద్యోగుల పట్ల సహజంగానే వ్యతిరేక భావన నెలకొంటున్నది. రాష్ట్రం అంటే కేవలం ఉద్యోగులేనా? మిగతా ప్రజల ప్రయోజనాలను వదిలేసి.. ఉద్యోగులకు మాత్రమే ప్రభుత్వం అధిక ప్రయోజనం కలిగిస్తున్నది అనే అనుమానం ప్రజల్లో వేళ్ళూనుకుంటున్నది. ఈ ప్రచారం ద్వారా... ఉద్యోగులు- ప్రజలు, ఉద్యోగులు- నిరుద్యోగుల మధ్య స్పష్టమైన విభజన రేఖలు గీస్తున్నారు. ఈ మధ్యనే 'ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉద్యోగులు కారు' అనే సరికొత్త విభజన వాదాన్ని ప్రేరేపించడం వల్ల ఉద్యోగ- ఉపాధ్యాయుల మధ్య కూడా శత్రుత్వం పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. తమ హక్కుల సాధన కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోరాటం చేయడానికి సిద్ధమైనా.. నిరుద్యోగులు, ప్రజల నుండి తీవ్రమైన వ్యతిరేకత రావాలనేది పాలకుల యొక్క ఎత్తుగడ.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగ, ఉపాధ్యాయులకు దక్కాల్సిన కనీస ప్రయోజనాలు కూడా అమలు చేయకపోవడంతో ధనిక రాష్ట్రమని ప్రగల్భాలు పలికిన మన రాష్ట్రంలో పీఆర్సీ, ఐఆర్ అమలులో జాప్యం చేయడాన్ని ఉద్యోగవర్గం జీర్ణించుకోలేకపోయింది. ఫలితంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపేవారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ఈ వ్యతిరేకత ప్రభావం పట్టభద్రుల ఎన్నికల్లో ఉంటుందని గ్రహించిన ప్రభుత్వం నష్టనివారణ చర్యలు ప్రారంభించింది. ప్రభుత్వానికి వంత పాడుతూ.. తమ స్వప్రయోజనాల కోసం పాకులాడే నాయకులతో ప్రభుత్వ పెద్దలు మంత్రాంగం నడిపారు. పీఆర్సీ ఫిట్మెంటు గురించి లీకులిస్తూ... మాకు మద్దతుగా నిలిస్తేనే పీఆర్సీ అమలు చేస్తాం లేకపోతే వాయిదా వేస్తాం అంటూ మైండ్‌గేమ్ ఆడారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో అనుకూల ప్రకటనలు చేయించుకుని మొత్తానికి గండం గట్టెక్కారు.
తెలంగాణ ఏర్పడిన కొత్తలో మిగులు బడ్జెట్‌తో 'బంగారు తెలంగాణ' దిశగా అడుగులు వేస్తుందనుకున్న రాష్ట్రం క్రమంగా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఉద్యోగుల వేతనాలు కూడా సరైన సమయంలో చెల్లించలేని దుస్థితిలోకి నెట్టివేయబడింది. 10వ తారీకు వరకు కూడా నెలసరి వేతనాలు తమ ఖాతాల్లో జమ కాకపోవడం ఉద్యోగుల పట్ల ప్రభుత్వ చిన్నచూపును తెలియజేస్తున్నది. నెలనెల మొదటి వారంలో ఈఎంఐలు కట్టాల్సిన ఉద్యోగులు అష్ట కష్టాలు అనుభవిస్తున్నారు.
భారత రాజ్యాంగం ప్రకారం ఉద్యోగులు ప్రభుత్వంలో అంతర్భాగం. కార్యనిర్వాహక వ్యవస్థలో కీలక భూమిక పోషించే ఉద్యోగుల పట్ల పాలకుల చిన్న చూపు మంచిది కాదు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం, పర్యవేక్షణను పటిష్టం చేయడం ద్వారా ప్రభుత్వ యంత్రాంగం బలపడుతుంది, పనితీరు మెరుగవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తొలినాళ్లలో 2014 ఆగస్టు 19న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ''సమగ్ర కుటుంబ సర్వే''ను ప్రపంచమే నివ్వెరపోయేలా ఒక్కరోజులోనే నిర్వహించడంలో ఉద్యోగుల పాత్ర విశిష్టమైనది కాదా? ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో, ప్రజలకు చేరవేయడంలో ఉద్యోగుల భాగస్వామ్యం లేదా? ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ సీటు ఖాళీ అయిన 6నెలల్లోపు వాటిని భర్తీ చేయడానికి ఎలక్షన్ కమిషన్ బాధ్యత వహిస్తుంది. మరి ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో అనితరసాధ్యమైన పాత్రను పోషించే ఉద్యోగుల స్థానాలు ఖాళీ అయిన వెంటనే భర్తీ చేయాలనే దిశగా ప్రభుత్వాలు ఎందుకు ఆలోచన చేయవు? కావలసినప్పుడు తమ వేతనాలు ఇష్టారాజ్యంగా పెంచుకునే ప్రజాప్రతినిధులు.. ఉద్యోగుల వేతనాలను సకాలంలో, సమయోచితమైన రీతిలో పెంచాలనే వివేచన చేయరెందుకు? తమ ఆకాంక్షలను నెరవేరడం కోసం ప్రజాస్వామిక పద్ధతుల్లో ప్రాతినిధ్యాలు, పోరాటాలు చేసే ఉద్యోగుల, ఉపాధ్యాయ సంఘాలను శత్రువులుగా భావించడం సరైన విధానం కాదు. ఉద్యోగుల్లో విభజనలను పెంచి పోషించడం సహేతుకం కాదు. ప్రజాస్వామ్య బద్ధంగా చేసే నిరసనలను సానుకూల దృక్పథంతో స్వీకరించి వారి ఆకాంక్షలను నెరవేర్చడమే అసలైన పరిష్కారమని ఈ ఏలికలు గ్రహించేదెన్నడు?
- వరగంటి అశోక్
సెల్:9493001171