Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్ర ప్రభుత్వం 10/15సంవత్సరాల మోటారు వాహనాలను స్క్రాప్ చేయడం కోసం మోటారు వాహనాల చట్టం 1988లోని కేంద్ర నిబంధనలను సవరించడానికి జీ.ఎస్.ఆర్ 191(ఈ) ముసాయిదాను 15-3-2021న విడుదల చేసింది. 2021 అక్టోబర్ 1నుంచి అమలు చేయనున్నట్లు, 30రోజులలోగా అభ్యంతరాలు తెలియజేయాలని అందులో పేర్కొన్నది. ద్విచక్ర, త్రిచక్ర, 4చక్రాల, మీడియం, భారీ వాహనాలన్నిటికి ఇది వర్తిసుంది. అయితే ఇందుకు సంబంధించిన ప్రకటన రవాణా శాఖామాత్యులు 18-03-2021న లోక్‌సభలో చేశారు. ఆ సందర్బంగా మంత్రివర్యులు మాట్లాడుతూ తదుపరి కొద్ది వారాల్లో ఇందుకు సంబంధించిన ముసాయిదా విడుదల చేస్తామని చెప్పారు. పార్లమెంటులో ప్రకటనకు ముందే ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసి పార్లమెంటులో మాత్రం తదుపరి కొద్ది వారాల్లో ముసాయిదా విడుదల చేస్తామని చెప్పి మంత్రి వర్యులు సభను పక్కదారి పట్టించారు. కాలుష్యం తగ్గించడం, భద్రత ఈ పాలసీ ప్రధాన లక్ష్యాలుగా తెలియజేసారు. ఈ పాలసీ అమలు వలన 10,000కోట్ల పెట్టుబడులు, 35,000 కొత్త ఉద్యోగాలు వస్తాయని తెలియజేసారు.
ఇందులో చెప్పిన లక్ష్యాలు, కొత్త పెట్టుబడుల రాక, కొత్త ఉపాధి అవకాశాలు చూసినప్పుడు ఈ స్క్రాప్ పాలసీ చాలా మంచిది, తక్షణం తీసుకురావాలి అనిపిస్తుంది ఎవరికైనా. కానీ ఈ పాలసీ లక్ష్యాలు నిజాయితీతో కూడినవా లేక వీటి వెనుక మరేదయినా దాగి ఉందా అనేదే ప్రధాన అంశం. వివరాలు పరిశీలిద్దాం...
పర్యావరణం, కాలుష్య నియంత్రణ, భద్రత ప్రధానం అయితే తక్షణం దేశంలోని అన్ని ఆర్టీసీలను బలవత్తరం చేసి, ప్రయాణికుల అవసరాలకనుగుణంగా విస్తరించాలి. ఈ విషయాన్ని సుమారు 12సంవత్సరాల క్రితం ప్లాయింగ్ కమిషన్‌కు అందజేసిన నివేదికలో చెప్పారు. నేటికీ అది జరగలేదు సరిగదా ప్లాయింగ్ కమిషన్‌ను రద్దు చేశారు. దాదాపుగా దేశంలోని ఆర్టీసీలన్నీ తీవ్ర ఆర్ధిక సంక్షోభంలోకి నెట్టబడ్డాయి.
ప్రజా రవాణాను విస్తృతపరచి, వ్నవ్యక్తిగత వాహన వినియోగాన్ని నియంత్రించడం కాలుష్య నియంత్రణలో మొదటి చర్యగా ఉండాలి. ప్రపంచంలోని అధిక దేశాల అనుభవం ఇదే. అయితే యూరోప్‌లో ప్రజా రవాణా ప్రయివేట్ వ్యక్తులకు అప్పగించడంతో చాలా ఖరీదు అయింది.
అభివృద్ధి పేర అడవులను నరికివేయడం, అక్రమ నిర్మాణాలను అనుమతించడం ఫలితంగా సుమారు 15సంవత్సరాల క్రితం హైద్రాబాద్‌లో మూసి పొంగి వరదలొచ్చిన విషయం మనకు తెలిసిందే. తాజాగా ఉత్తరాఖండ్‌లో జరిగిన విషాదం, అంతకుముందు ఉత్తరాఖండ్‌లోనే హరిద్వార్‌లో జరిగిన విపత్తులు చూసాం. వీటిని మానవ కల్పిత విలయతాండవాలుగా మీడియా ఘోషించింది. వాటిని వొదిలి వాహన కాలుష్య నియంత్రణ, భద్రత గురించి మాట్లాడటం వెనుక పరమార్థం వేరు అనేది చెప్పకనే తెలుస్తున్నది.
స్క్రాప్ విధానాన్ని కొత్తగా కనిపెట్టారా? దేశంలోని ఆర్టీసీలన్ని బస్సు తిరిగిన మైలేజి లేదా దాని వయసును బట్టి 15సంవత్సరాలలోపే స్క్రాప్ చేస్తుంటాయి. (ఆర్థిక సంక్షోభం కారణంగా గత కొంత కాలంగా దీని అమలు సక్రమంగా జరగడం లేదు). ప్రయివేట్ కమర్షియల్ వాహన యజమానులు కూడా వాహన కండిషన్ ఆధారంగా 15సంవత్సరాలకు ముందే మార్చివేసి కొత్త వాహనం కొనేవారు. ఇందుకు రెండు ప్రధాన కారణాలు. 1. ఎక్కువ సంవత్సరాలు అయితే దాని మెయింటెనెన్స్ చాలా ఖరీదు అవుతుంది. ఎప్పుడు ఎక్కడ వాహనం ఆగిపోతుందో తెలియదు. 2. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్నప్పుడు తదనుగుణంగా కొత్త పరిజ్ఞానాన్ని అమలు చేసుకోకపోతే మనుగడ సాధ్యం కాదు. వ్యక్తిగత వాహనాలున్న వారు కూడా ఇదే పాటిస్తారు. అందుచేత ప్రభుత్వం ఇప్పుడే కొత్త విధానాన్ని కనిపెట్టలేదనేది యదార్థం.
అసలు సమస్య ఎక్కడుంది? కరోనాకు ముందే ఆర్థిక మాంద్యంలోకి మన దేశ ఆర్థిక వ్యవస్థ నెట్టబడింది. ప్రజల దగ్గర డబ్బులులేక కొనుగోలుశక్తి తగ్గింది. ఉత్పత్తి రంగం తిరోగమన దశలోకి నెట్టబడింది. ప్రధానంగా ఆటోమొబైల్ రంగంలో అనేక కంపెనీలు ఉత్పత్తిని తగ్గించి, కార్మికులను ఇంటికి పంపాయి. కరోనా ఈ పరిస్థితిని మరింత దిగజార్చింది. కోవిడ్ కాలంలో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం తద్విరుద్ధంగా ప్రజలపై భారాలు మోపి ఖజానా నింపుకుంది. 2020 మార్చి- జూన్ నెలల్లో కేంద్ర ప్రభుత్వం కేవలం డీజిల్ మీద లీటరుకు 16, పెట్రోల్ మీద రూ.13లు ఎక్సయిజ్ డ్యూటీ పెంచి 2లక్షల 94 వేల కోట్లు ఖజానాలో జమచేసుకుంది. (భారీగా ఉద్దీపన ప్యాకేజి ఇచ్చామని చెప్పిన దాంట్లో వాస్తవంగా నగదు రూపంలో ఖర్చు చేసింది 2 లక్షల కోట్ల లోపేనని పలువురు ఆర్థిక శాస్త్రవేత్తలు బట్టబయలు చేశారు). వరుసగా పెరుగుతున్న డీజిల్ ధరలు, టోల్ టాక్స్ భారాలు, ఇతర పన్నులు కలసి రవాణా రంగాన్ని కోలుకోలేని విధంగా కృంగదీశాయి. ఫలితంగా కొత్త వాహన అమ్మకాలు మందగించి ఉత్పత్తి సంస్థల లాభాలు తగ్గాయి. కొంతమేర నిల్వలు కూడా పేరుకుపోయాయి. ఈ స్థితిలో వాహన ఉత్పత్తి సంస్థలను ఆదుకోవాలి. స్క్రాప్ పాలసీ రూప కల్పనలో ఇది ఒక ప్రధాన అంశం. కానీ చిన్న యజమానులను గెంటివేసి బడా కార్పొరేట్ సంస్థలకు రవాణా రంగాన్ని అప్పగించాలన్నది ప్రభుత్వ యోచన. 2019లో ఆమోదింపజేసికున్న మోటారు వాహన చట్ట సవరణ లక్ష్యం ఇదే. గతంలో లేని ''అగ్రిగేటర్'' అనేదాన్ని కొత్తగా చేర్చడమే ఆ సవరణ ప్రధాన లక్ష్యం. అగ్రిగేటర్ అంటే ప్రయాణికుడిని-డ్రైవర్‌ను అనుసంధానం చేసే ఎలక్ట్రానిక్ ప్లాట్ ఫారమ్.(ఉబర్, ఓలా ఇంకా అనేక సంస్థలు సరుకు రవాణాలో ఇటీవల వచ్చాయి). ఇప్పుడు ఈ స్క్రాప్ పాలసీ ఫలితంగా ఒకటి రెండు వాహనాలుండి కుటుంబాన్ని పోషించుకుంటున్నవారిని తరిమివేసి పెద్ద పెద్ద కంపెనీలకు రంగాన్ని ధారాదత్తం చేయదలచింది ప్రభుత్వం. స్క్రాప్ పాలసీ అసలు రహస్యం ఇదే. ఒకవైపు వాహన ఉత్పత్తి కంపెనీల లాభాలకు గ్యారంటీ ఇవ్వడం, రెండవ వైపు చిన్న యజమానులు తరిమివేసి పెద్ద పెద్ద కంపెనీలకు అప్పగించటం. ప్రభుత్వ విధానం వెనుక దాగి ఉన్న ఈ ప్రమాదాన్ని గమనించకుండా పర్యావరణం, ప్రజల ఆరోగ్యం, భద్రతా వంటి ప్రభుత్వ మోసపూరిత ప్రకటనలకు బలికాకూడదు.
ఇక కొత్త పెట్టుబడులు, 35 వేల కొత్త ఉద్యోగాల కల్పన ఎండమావిలో నీరే. ప్రస్తుతం ఉన్న కంపెనీలు పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి చేయగలిగితే అదే గొప్ప. కరోనాకు ముందే ఆటోమొబైల్ రంగంలో మాంద్యం కారణంగా 5లక్షల మంది కార్మికులు తొలగించబడ్డారు. బహుశా అందులో కొందరికి తిరిగి ఉపాధి లభించవచ్చు తప్ప కొత్త ఉపాధి రాదు. వ్యవసాయ చట్టాల సందర్బంగా కూడా ప్రభుత్వం ఎలాంటి మోసపూరిత వాదనలు ముందుకు తెచ్చిందో మనం చూసాం. రైతుల సమైక్య ఆందోళన వాటిని బట్టబయలు చేసింది. కార్మిక చట్టాల స్థానంలో కోడ్లు రూపొందించినప్పుడు కూడా కార్మికుల ప్రయోజనం కోసమేనని నమ్మించడానికి ప్రభుత్వం నానా తంటాలు పడింది. ఉన్నత విద్యకు పేదలను దూరం చేసే నూతన విద్యా విధానం కూడా ఈ కోవాలోనిదే. అయితే స్క్రాప్ పాలసీని వ్యతిరేకిం చాలా? అవసరం లేదు. కాలుష్య నియంత్రణ, ప్రజల ఆరోగ్యం, భద్రత పట్ల ప్రభుత్వానికి చిత్త శుద్ధి, నిజాయితీ ఉంటే కింది చర్యలు చేపట్టాలి.
1. స్క్రాప్ స్వచ్ఛందం చేయాలి. తప్పనిసరి విధానం చేయకూడదు. 2. ఆర్టీసీలను పటిష్టం చేసి ప్రజావసరాల కనుగుణంగా విస్తరించాలి. వ్యక్తిగత వాహన వినియోగాన్ని నియంత్రించాలి. 3. పాత వాహనం స్థానంలో కొత్త వాహనం తీసికునేప్పుడు దాని ఖరీదులో ఒక భాగం ప్రభుత్వ సబ్సిడీ, ఒక భాగం కంపెనీలు డిస్కౌంట్ ఇవ్వాలి. మూడవ భాగం వాహన దారుడు భరించడానికి ప్రభుత్వం బ్యాంక్ ద్వారా రుణ సదుపాయం కల్పించాలి. 4. ముసాయిదా పాలసీపై అభ్యంతరాల గడువును 30రోజుల నుంచి కనీసం 180 రోజులకు పెంచాలి. 5. ముసాయిదా పై సంబంధిత వర్గాల వారితో వివిధ స్థాయిల్లో విస్తృతంగా చర్చించాలి.
- ఆర్. లక్ష్మయ్య
సెల్:9490098889