Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకవైపు భానుడి భగభగలు.. మరోవైపు అకాల వర్షాలు.. ఇవి చాలవన్నట్టు కరోనా గాండ్రింపులు... ఈ మూడింటితో జనాలు ఇప్పుడు ఉక్కిరిబిక్కిరై పోతున్నరు. ఏప్రిల్ నెల ముగియకముందే 45 నుంచి 46 డిగ్రీల సెంటిగ్రేడ్తో ఎండలు మండిపోతున్నాయి. పట్నం, పల్లె అనే తేడా లేకుండా మండుటెండలు దంచి కొడుతున్నాయి. సందట్లో సడేమియాగా చేతికొచ్చిన పంటలను నాశనం చేయటానికా అన్నట్టు వచ్చిన వడగండ్ల వానలు... పలు జిల్లాల్లోని రైతుల్ని నట్టేట ముంచాయి. వీటి గురించి ఆలోచిస్తున్న జనాన్ని పులి మీద పుట్రలా... ఇప్పుడు కరోనా రెండోదశ భయాందోళనలకు గురి చేస్తున్నది. ఆస్పత్రుల్లో పడకలు ఫుల్, ఆక్సిజన్ నిల్... అనే చందంగా పరిస్థితి తయారైంది. ఇటీవల హైదరాబాద్లో కలిసిన మిత్రులతో వీటిపై చర్చిస్తుండగా... మరో అంశం ప్రస్తావనకొచ్చింది. ఈ మూడింటికి తోడు మరికొద్ది రోజుల్లో మరిన్ని భగభగలతో జనానికి మరింత సెగ తగలనుందనే చర్చ మొదలైంది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్ఛేరిలో ఎన్నికల ప్రహసనం ముగింపు దశకు చేరుకున్నది. వీటి పుణ్యాన గత కొద్ది నెలల నుంచి అడ్డూ అదుపు లేకుండా పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు కాస్త కళ్లెం పడింది. ఇప్పుడున్న ధరలను కేంద్రం తగ్గించకపోయినా... ఎలక్షన్ల వల్ల అవి మరింత పెరక్కుండా ఆగాయి. కానీ మరికొద్ది వారాల్లో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. ఆ తర్వాత కోడ్ కూడా ముగుస్తుంది. అది జరిగిన వెంటనే మళ్లీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు రెక్కలొస్తాయి. అవి అమాంతం ఆకాశానికి ఎగురుతాయి. పోయిన సంవత్సరం కరోనా దెబ్బకే కుదేలైన బడుగు జీవులు... మళ్లీ పెరిగే ధరలను తట్టుకోగలరా...? అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతున్నది. వీటిని తగ్గించాల్సిన కేంద్రం మాత్రం... ఆ పని చేయకుండా ప్రభుత్వ కంపెనీలన్నింటినీ అమ్మేస్తూ... దేశాన్ని తాకట్టు పెట్టే పనిలో నిమగమైంది... అందుకే 73 ఏండ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా 'ఆకాశాన్నంటే ధరలొకవైపు.. అంతులేని నిరుద్యోగమింకొక వైపు...' అనే మహాకవి శ్రీశ్రీ పాటను పాడుకోవాల్సి వస్తున్నది. ఇదీ మన భారతం...
- బి.వి.యన్.పద్మరాజు