Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మొదటిసారి చూసినప్పుడు... పచ్చటి గోధుమ పొలాలతో ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ సమీపానున్న దాస్నా గ్రామం చాలా ప్రశాంతంగా ఉందనిపిస్తుంది. అధికశాతం గ్రామస్తులు పేదవారు. చదువు లేనివారు. కనీసం బ్యాంకు ఖాతాలు కూడా లేనివారు. ఉన్న కొద్దిపాటి సొమ్మును మహా అయితే బంగారం రూపంలో తమ దగ్గరే అట్టిపెట్టుకుంటారు. ఒక గొలుసు, ఒకటో రెండో ఉంగరాలు... ప్రత్యేక సందర్భాలలో కట్టుకునే బట్టలు... అన్నిటినీ ఒక చిన్న బుట్టలోకి సర్ది కుటుంబ పెద్ద పడుకునే చెక్క మంచం కింద దాచిపెట్టుకుంటారు.
అయితే తరచి చూస్తేగానీ అక్కడ చాప కింద నీరులా దాగివున్న మత ఉద్రిక్తత మనకు అర్థంకాదు. ఇప్పుడు తమ దగ్గరున్న కొద్దిపాటి బంగారాన్ని ఇంట్లోనే గొయ్యి తీసి భద్రపరుచుకుంటున్నారు. చాలా మంది ఆధార్ కార్డులు, ఓటర్ గుర్తింపు కార్డులను సైతం ఈ పద్ధతిలోనే దాచుకున్నారు. ఎక్కువ మంది దగ్గర తమ భూములకు సంబంధించిన పత్రాలులేవు. ఉన్నవారు దూరానున్న తమ బంధువుల ఇండ్లల్లో భద్రపరుచుకున్నారు.
''దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి... ఇప్పుడు గుడిలో ఈ ఘటన జరిగే వరకూ... గ్రామంలో రెండు మతాల వాళ్ల మధ్య ఎప్పుడూ గొడవలు లేవు. మేం ప్రశాంతంగా బతికాం. అలాంటిది ఇప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందోనని అందరం భయపడుతున్నాం.'' అంటున్నాడు గ్రామస్తుడు జాన్ మహ్మద్.
ఇంతకీ గుడిలో ఏం జరిగింది?
మార్చి 12వ తేదీన పద్నాలుగేండ్ల ముస్లిం పిల్లవాడు ఆసిమ్ (అసలు పేరు కాదు) నీళ్లు తాగడానికి దాస్నా దేవి ఆలయంలోకి వెళ్లాడు. ముస్లింలు ఆలయంలోకి రాకుండా ఆలయ ప్రథమ పూజారి యతి నర్సింఘానంద్సరస్వతి గుడి బయట ఒక బోర్డు పెట్టించాడు. 'ఈ ఆలయం హిందువులకు పవిత్రమైనది. ముస్లింలకు ప్రవేశం లేదు' అని ఉంటుందా బోర్డు మీద.
చెత్త కాగితాలు ఏరుకునే ఆసిమ్ మంచినీళ్లు తాగేందుకు గుడి లోపలికెళ్లాడు. చదువురాని ఆసిమ్‌కు బోర్డు మీద ఏం రాసివుందో తెలీలేదు. తీరా బయటికొచ్చేటప్పుడు ఆలయ ఉద్యోగి ఒకరు పిల్లవాణ్ణి ఆపి పేరడిగాడు. పేరు తెలిశాక చెంప చెళ్లుమనిపించి వెళ్లిపొమ్మన్నాడు. అయితే ఆలయం లోపల ఉన్న ష్రింగి యాదవ్ మాత్రం ఆసిమ్‌ను తీవ్రంగా కొట్టాడు. హిందూత్వ సంస్థ ఒకటి ఈ దాడికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పెట్టడంతో బాగా ప్రచారమైంది. అనేకమంది ఈ దాడిని ఖండించారు. సానుభూతి ప్రకటించారు. పిల్లవాడి చదువు కోసం రూ.10లక్షలు సమీకరించారు.
బాలల హక్కుల కోసం కృషి చేసే 'సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్' అనే స్వచ్ఛంద సంస్థ ఈ విషయమై జాతీయ కమిషన్‌ను కలిసింది. 'నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్'ను కలిసి పిల్లవాడి మీద జరిగిన దాడి విషయమై ఫిర్యాదు చేసింది. ఆలయ ప్రధాన అర్చకుడు నర్సింఘానంద్ సరస్వతి కూడా మొదట ఈ దాడిని సమర్థించాడు. దాడికి పాల్పడిన ష్రింగి యాదవ్‌ను పోలీసులు అరెస్టు చేసినప్పటికీ తర్వాత బెయిల్ మీద విడుదలయ్యాడు. ఘటనకు సంబంధించిన వీడియో రికార్డయిందని తెలిసిన వెంటనే ష్రింగి యాదవ్ మాట మార్చేశాడు. ఆసిమ్ దొంగతనం చేయడానికి లోపలికి వచ్చాడని మొదట చెప్పినవాడల్లా తర్వాత కథనం మార్చేశాడు. గుడిలోపల విగ్రహం మీద ఆసిమ్ మూత్ర విసర్జన చేశాడని చెప్పాడు.
హిందూత్వ క్రూరత్వం
ఆలయ పూజారి నర్సింఘానంద్ సరస్వతి మొదటి నుంచీ వివాదాలకు పెట్టింది పేరు. ఆసిమ్ మీద దాడి జరిగిన కొద్దిరోజుల అనంతరం మాజీ అధ్యక్షుడు ఎ.పి.జె అబ్దుల్ కలామ్ 'ఒక జిహాదీ' అని, పాకిస్థాన్‌కు అణుబాంబు తయారీ విధానాన్ని సరఫరా చేశారని అవాకులు చవాకులు పేలాడు. ఉన్నత స్థాయిలో ఉన్న ముస్లింలు ఎవరూ భారత దేశానికి అనుకూలంగా ఉండరన్నాడు. గత సంవత్సరం ఢిల్లీలో అల్లర్లు జరగక ముందు 'ఇస్లాంను ఖతం చేయకపోతే మనం బతికేదెట్లా?' అంటూ రెచ్చిపోయాడు.
'హిందూ స్వాభిమాన్ సంఘటన్' అనే హిందూత్వ సంస్థను కూడా నడుపుతున్నాడాయన. హిందూ యువతకు ఆయుధాలు సరఫరా చేసే 'ధరమ్ సేన' ఒకటి ఈ సంస్థ కింద ఉంది. మాజీ సైనికోద్యోగిగా చెప్పే పరమీందర్ ఆర్య నేతృత్వంలో సేన ఏర్పడింది. ''ప్రస్తుతం సైనిక శిక్షణ నడవడం లేదు. మా వాళ్లంతా ఆలయం లోపల ఉన్నారు. కొట్టారని చెపుతున్న ముస్లిం పిల్లవాడికి ఏవో కొద్దిగా దెబ్బలు తగిలాయంతే. మీడియానే కొండంతలు చేస్తోంది'' అంటాడు పరమీందర్.
దాస్నా ఘటన తర్వాత ఆ ప్రాంతంలో సామాజిక వర్ణవివక్ష కూడా కనిపిస్తోంది. కూరగాయలు, తినుబండారాలు అమ్మేవారిలో ఎక్కువమంది తమ మతం తెలిసేలా... బళ్ల మీద కాషాయ జెండాను పెట్టుకోసాగరు. ముస్లింల బళ్ల మీద ఆ జెండా ఉండదు. దాంతో వారు హిందువులు కారన్న విషయం అర్థమవుతుంది. ''ముస్లింలు సహకరించా లని మేం కోరుకోవడంలేదు. వారితో మత సామరస్యం అనేది ఉండదు. హిందువుల నమ్మకాన్ని ముస్లింలు ఎన్నడూ గౌరవించరు. స్థానిక ముస్లింలతో సమావేశం వేసే ప్రయత్నం మేమెన్నడూ చేయలేదు. మేం ఎందుకు చేయాలి? మేం బలవంతులం. మా ప్రయివేటు హిందూ సేనను పెంచాలనుకుంటున్నాం. హిందు వులు మరింత శక్తిమంతులు కావాలి. మేం బలంగా ఉంటేనే నరేంద్ర మోడీ సైతం మాకు మద్దతు ఇస్తారు' అంటాడు పింకీ చౌదరి. ఆ ప్రాంతంలో 'హిందూ రక్షా బల్' అనే సంస్థను నడుపు తున్నాడీయన. 'హిందూ స్వాభిమాన్ సేన'ను 2016లో స్థాపించారు. 'ముస్లిం ప్రమాదాన్ని' తిప్పికొట్టేందుకు దీన్ని స్థాపించారని అప్పట్లో చెప్పారు. తమ విశ్వాసాన్ని కాపాడుకునేందుకుగాను చావడానికైనా సిద్ధపడే 15,000 మంది సైన్యాన్ని తయారుచేశారట. దాస్నా, ముజఫర్ నగర్, మీరట్‌లో 50శిక్షణా కేంద్రాలను నడిపారు. అక్కడే ఆడ, మగపిల్లలకు ఆయుధాలు పట్టడమెలాగో నేర్పారు. కత్తినెలా పట్టాలి? లాఠీనెలా తిప్పాలి? తుపాకులనెలా పేల్చాలి? వంటి వాటన్నిట్లోనూ శిక్షణ ఇచ్చారు.
'ముస్లింకు సమాధానం హిందూ దేశమే. మేం సగటున నెలకు రెండు పంచాయతీలలో పర్యటిస్తున్నాం. మా హిందూ సింహాలను ధైర్యంగా ఉండాలని, అన్నివేళలా ఆయుధాలతో సిద్ధంగా ఉండాలని చెప్పాను' అని అప్పట్లోనే నర్సింఘానంద్ సరస్వతి మీడియాతో చెప్పాడు. అయితే స్థానిక హిందువులు ఆయన మాట మేరకు ఇండ్లల్లో ఆయుధాలను పెట్టుకున్నారా లేదా అనేది మాత్రం ఎవరూ పరిశీలించలేదు. ఒకటి మాత్రం స్పష్టం. ఘజియాబాద్‌లోని దాస్నా-మసౌరీ ప్రాంతం అంతా ఎప్పుడేం జరుగుతుందో తెలీక భయం గుప్పెట్లో ఉంది. 'ఆసిమ్ మీద దాడి జరిగిన దగ్గర నుంచి గుడిలో చాలా మంది మగవాళ్లు కత్తులు, చాకులు కలియతిప్పుతూ... ముస్లిం వ్యతిరేక నినాదాలు ఇవ్వసాగారు. దాంతో గుడి చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లొద్దని పిల్లలకు చెప్పాం. మా ఆడవాళ్ల గురించి కూడా కంగారుపడుతున్నాం. ఎక్కువ కుటుంబాలలో మగవాళ్లు ఘజియాబాద్కో, ఢిల్లీకో పనికి వెళ్తారు. సాయంత్రం ఎప్పుడో ఇండ్లకు ఆలస్యంగా తిరిగి వస్తుంటారు. అటువంటి వారు ఇప్పుడు ఏ కొంచెం వీలైనా ఇంటికి తొందరగా వస్తున్నారు. అలా కుదరనప్పుడు... ఆగంతకుల నుంచి తప్పించుకోవడానికి ఆడవాళ్లు తలుపులు వేసుకుని ఇండ్లల్లోనే ఉంటున్నారు'' అని అక్కడ నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితిని కండ్లకు కట్టాడు జాన్ మహ్మద్.
ఇదివరలో జాన్ మహ్మద్ ఆరుబయట నిద్రపోయేవాడు. ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్లకు రక్షణగా వరండాలో పడుకోసాగాడు. పోలీసులను కూడా కలిశాడు. ''అయినా గుడిదగ్గర ఏం జరుగుతున్నదో పోలీసులకు తెలీదా ఏంటి? ఇదంతా చాలా బాధగా ఉంది. ఇదివరలో మా పెద్దవాళ్లు గుడి కట్టడంలో సాయం చేశారు. అటువంటిది ఇవాళ వాళ్లు మతం ఆధారంగా నీళ్లను కూడా విడగొట్టారు. దేశ విభజన సమయంలో హిందూ నీళ్లు, ముస్లిం నీళ్లు అని చెప్పుకోవడం గురించి విన్నాం. అదే బాధ ఇప్పుడు మమ్మల్ని వెంటాడుతోంది...' అంటున్నాడు జాన్ మహ్మద్ విచారంగా.
ఒక్క దాస్నా లోనే కాదు. ఘజియాబాద్‌లో సైతం హిందూయేతరులను ఆలయాల్లోకి రానీకుండా అనేక గుళ్ల బయట హౌర్డింగులు వెలిశాయి. ఇనుప కచ్చడాలు మొలిశాయి. అవి ఆఖరికి పత్రికలవారిని, ప్రభుత్వ అధికారులను కూడా గుళ్లలోకి వెళ్లనీకుండా ఆపేస్తున్నాయి.
- జియా ఉస్ సలామ్