Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యాయం అవహేళనకు గురైందనడానికి ఉదాహరణగా ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది గుజరాత్ మాత్రమే. నిషేధించబడిన స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా (SIMI)లో పాల్గొన్నారనే నేరారోపణతో 127 మందిని 2001లో చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ఊపా, (UAPA)1967 ప్రకారం, అరెస్ట్ చేశారు. సూరత్ న్యాయస్థానం ఈ 127 మందిని నిర్దోషులుగా ప్రకటించి, విడుదల చేసింది. ఇది ''న్యాయం జరగడంలో జాప్యం జరగడం అంటే, న్యాయాన్ని తిరస్కరించడమే'' అనే నానుడికి తగిన సంఘటన. మార్చి6 2021న, 19 సంవత్సరాల తరువాత దిగ్భ్రాంతి గొలిపే విధంగా చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఎ.యన్.దావే నేరారోపణ చేయబడిన వారు సిమికి చెందిన వారని దృఢమైన, నచ్చచెప్పదగిన, నమ్మించదగిన, సంతృప్తికరమైన ఆధారాలను సమర్పించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని తెలిపారు. విచారణలో జాప్యం వల్ల 127 మందిలో ఐదుగురు మరణించారు.
అన్యాయమే లక్ష్యంగా ఈ కేసు మోపబడింది. ఈ కేసు వల్ల బాధితులు ఆర్థికంగా, వ్యక్తిగతంగా కోలుకోలేని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సంఘటన ఎంత ప్రాముఖ్యమైనదంటే, గుజరాత్ రాష్ట్ర మత పరమైన చరిత్రలో ఒక మలుపు. 'ఫ్రంట్ లైన్' పత్రిక, గుజరాత్ రాష్ట్రంలోని రాజకీయ నాయకులు, హక్కుల కార్యకర్తలు, రాష్ట్రంలోని మతపరమైన వ్యవహారాలను పరిష్కరించే న్యాయవాదులను 2001కి సంబంధించిన కేసును గూర్చి వ్యాఖ్యానించమని అడిగింది. అదేవిధంగా ఆనాడున్న రాజకీయ వాతావరణం, సిమి (SIMI) ప్రాముఖ్యత, దుర్మార్గమైన 'ఊపా' చట్ట పరిధిలో ప్రజలను అరెస్టు చేయడం వల్ల వారి జీవితాలు ఏ విధంగా ధ్వంసమయ్యాయో పరిశీలించమని కూడా అడిగింది. ఈ అరెస్టులు ఒక పథకం ప్రకారం జరిగాయని, ప్రజలను విభజించటానికి, మతపరమైన హింసను సృష్టించే ప్రాతిపదికన వేదికను ఏర్పాటు చేసే కుట్రలో భాగంగా ఈ చర్యలు చేపట్టారని వ్యాఖ్యాతలు ఏకోన్ముఖంగా, స్పష్టంగా చెప్పారు.
పౌర హక్కుల కార్యకర్త, 'సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్' కార్యదర్శి, తీస్తా సెతల్వాద్, ''ఈ విధానమే(ప్రాసెస్) ఒక రకమైన శిక్ష'' అని తెలిపారు. ఈ తప్పుడు ఆరోపణలకు ఎవరు మూల్యం చెల్లించాలి? కోలుకోలేని నష్టానికి పరిహారం ఎవరు చెల్లించాలి? ఈ కేసుకు సంబంధించి రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి న్యాయపరమైన అంశం. రెండవది మానవ హక్కులకు సంబంధించిన అంశం. దీనిని మనం పదేపదే గమనిస్తున్నాము. దీని విషయంలో ఒక కాలపరిమితితో కూడిన విచారణగాని, ఏ ఒక్కరి జవాబుదారీతనంగాని లేదు. యూపీఏ, ఎన్డీయే రెండు ప్రభుత్వాలలో ఇదే పద్దతిని గమనించాం. ఎలాంటి నియమ, నిబంధనలు లేకుండా ప్రజలపై నేరం మోపవచ్చా అనేది ప్రశ్న.
డిసెంబర్ 28, 2001న 'యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్' రూపంలో (ఏటీఎస్) న్యూఢిల్లీ నుంచి పంపబడ్డామనే పేరుతో వచ్చిన స్క్వాడ్, సిమి(SIMI)కి సంబంధించిన సభ్యులు, మైనార్టీ విద్యా సంబంధమైన బోర్డు నిర్వహిస్తున్న సెమినార్లో పాల్గొని ఉండవచ్చని పోలీసులను హెచ్చరించారు. సెమినార్ నిర్వహించబడే రాజశ్రీ గెస్ట్ హౌస్‌పై దౌర్జన్యంగా బలగాలతో ప్రవేశించి, నిషేధింపబడిన సంస్థకు చెందిన వారనే నెపంతో 127మందిని అరెస్టు చేశారు. ఆ కాలంలో 'ఉపా' కింద అరెస్టు అయిన వారికి బెయిలు దొరికేది. అరెస్టయిన వారిలో అనేకమంది ఆ అవకాశాన్ని ఉపయోగించుకొనగలిగారు. అధికారిక పత్రాల ప్రకారం ప్రాథమికంగా నేరం మోపబడిన127మందిలో, 122 మంది 11నెలలు జైలుజీవితం గడిపారని, ఐదుగురు దాదాపు 19 సంవత్సరాలు జైల్లో ఉన్నారని తెలిసింది. విచారణకు ముందుగానే 122 మందిలో 5గురు చనిపోయారు.
ఈ విచారణలో పాల్గొన్న న్యాయవాదులు తెలిపిన ప్రకారం సుదీర్ఘమైన విచారణ వల్ల, వారికి ఉగ్రవాదులనే కళంకాన్ని ఆపాదించడంవల్ల, నిర్దోషులుగా ప్రకటించబడిన డాక్టర్లు, ప్రొఫెసర్లు, పాత్రికేయులు ఆర్థికంగా, వృత్తిపరంగా అపరిమితమైన బాధలకు గురయ్యారు. బాధితులలో ఒకరైన మొహమ్మద్ అబ్దుల్ హారు విడుదల అయిన కొద్దిరోజుల తర్వాత 'ఫ్రంట్‌లైన్'తో మాట్లాడుతూ, అరెస్ట్ అయిన తర్వాత 30 సంవత్సరాల, వృత్తిపరమైన తన భవిష్యత్తు ధ్వంసమైనట్టు తెలిపాడు. తనకు రావాల్సిన పదోన్నతి కూడా రద్దు చేయబడిందని వాపోయాడు. తాను 2015లో జేఎన్వీ యూనివర్సిటీ నుంచి (జోధాపూర్, రాజస్థాన్) పదవీ విరమణ చేశానని, కానీ ఇంతవరకు తనకు రావాల్సిన గ్రాట్యుటీ రాలేదని చెప్పారు. తన ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయి, సమస్యల వలయంలో చిక్కుకుపోయానని తెలిపాడు. ప్రస్తుతం జైపూర్‌లో నివసిస్తున్న ఈయన మాట్లాడుతూ, మైనారిటీస్ విద్యను గూర్చి సెమినార్లో పాల్గొనడానికి భారతదేశ వ్యాప్తంగా ఉన్న విద్యా సంబంధమైన మేథావులను ఆహ్వానించామని, ఇది ఏ విధంగానూ రహస్యంగా నిర్వహించింది కాదని చెప్పారు. వాస్తవంగా ముగ్గురు వైస్ ఛాన్సలర్లు, ఈ సమావేశంలో భాగస్వాములయ్యారు. మొహమ్మద్ అబ్దుల్ హారు 'బిజినెస్ Ê ఫైనాన్స్' పాఠాలను బోధించారు. ఈ పుస్తకాలన్నీ అధికారికంగా అనుమతి ఉన్న పుస్తకాలే. అదే కాకుండా ఈయన వృత్తిపరమైన పారిశ్రామిక సంస్థలకు సలహాదారుగా కూడా ఉన్నారు. అరెస్ట్ అయిన తర్వాత తాను లెక్కలోలేని వ్యక్తిగా, పనికిరాని వ్యక్తిగా దిగజార్చబడ్డానని వాపోయాడు.
అహమ్మదాబాద్‌కు చెందిన ఆసిఫ్ షేక్ మరొక బాధితుడు. ఆ సమయంలో జర్నలిస్టు కావాలని ఆశపడినవాడు. గుజరాత్ యూనివర్సిటీ నుంచి అప్పుడే డిగ్రీ పూర్తి చేసుకొని సెమినార్‌కు ప్రతినిధిగా హాజరయ్యాడు. ఆసిఫ్ షేక్‌ను గూర్చి ఒక న్యాయవాది చెప్పిన ప్రకారం, అతను చేయని నేరానికి బట్టలూడదీసి కొట్టడమే కాక 14రోజులు కస్టడీలో ఉంచారు. అతనిని నిర్బంధించిన తర్వాత ఆయన జీవితం దయనీయంగా మారింది. తనకు దగ్గరవారు, పరిచయస్తులు, స్నేహితులనుకున్నవారు కూడా అతనిని విస్మరించారు. ఏదైనా కాంట్రాక్టు ఉద్యోగం దొరికినా ఇతను కేసులో ఉన్నట్టు యజమాని గమనిస్తే, ఉద్యోగం నుంచి తొలగించేవారు. చివరి ప్రయత్నంగా, సుగంధ ద్రవ్యాలు అమ్మే చిరువ్యాపారాన్ని ప్రారంభించాడు. కానీ, పోలీసుల వేధింపులు అతని జీవితంలో ఒక భాగం అయ్యాయి. మతపరమైన ఏ సంఘటన జరిగినా ప్రతిసారీ పోలీసులు అతని ఇంటికి వెళ్ళడం, విచారణ పేరుతో వేదించడం పరిపాటి అయింది.
సిమీతో సంబంధం ఉన్న వ్యక్తుల వద్ద ఉర్దూ సాహిత్యం ఉన్నట్టు పోలీసులు ఆరోపణలు చేశారు. టెర్రరిస్టు చట్టంగా పిలువబడే యాక్ట్ సారాంశం ఈ విధంగా ఉంది. ''ఎవరైనా భారతదేశం యొక్క ఐక్యతకు, సమగ్రతకు భద్రతకు లేక సౌభ్రాతత్వానికి భంగం కలిగించే ప్రయత్నం చేయరాదు. ప్రజల్లో ఉగ్రవాద చర్యలను ప్రోత్సహించే, ఒక తరగతికి చెందిన ప్రజల్లో గాని, ఏదైనా విదేశంలో గాని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో చర్యలు చేపట్టరాదు.''
చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఏ ఎన్ దావే వారిపై ఉన్న అన్ని ఆరోపణలను కొట్టివేస్తూ 117 పేజీల ఉత్తర్వులలో బాధితులను నిర్దోషులుగా ప్రకటించారు. గుజరాతీలో ఉన్న ఈ తీర్పును న్యూస్ ఏజెన్సీ అనువదించింది. ఆ ఆర్డర్ ప్రకారం దర్యాప్తు దారులు, నేరారోపణ చేయబడిన వారు, 'నిషేధింపబడిన సంస్థకు సంబంధించిన వారు' అని నిరూపించడంలో విఫలమయ్యారని, ఉద్యమానికి ఊపునివ్వడానికి చేరిన వారు కాదని, విద్యా సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనడానికి మాత్రమే సమావేశమయ్యారని తెలిపింది. కోర్టు గమనించిన ప్రకారం నేరారోపణ చేయబడిన వారు దీనికి సంబంధించిన కార్యకలాపాల్లో పాల్గొన్నట్టు గానీ, స్వాధీనం చేసుకున్న పత్రాలలో ''సిమి''కి సంబంధించిన ఆధారాలు గానీ లేవు. దాడులు జరిగే సందర్భంలో కూడా అరెస్టు నుంచి తప్పించుకోవడానికి వారిలో ఒక్కరు కూడా ప్రయత్నం చేయలేదు.
సిమీ అనే సంస్థ జమాతే -ఇ -ఇస్లామీకి అనుబంధ విద్యార్థి విభాగంగా ప్రారంభమై తరువాతి కాలంలో దాని నుంచి విడిపోయింది. 1977లో అలీఘర్‌లో సిమీ ఏర్పాటైనప్పటినుంచి 2001 వరకు హౌం మంత్రిత్వశాఖ ఆ సంస్థను జాతీయ భద్రతకు తీవ్రమైన ప్రమాదకారిగా భావించి నిషేధించింది. అది ముస్లిం యువత అభివృద్ధి కోసం పనిచేసే న్యాయబద్ధమైన సంస్థ. ముంబైలో, ఇరుగుపొరుగు జిల్లాలలో సిమీ కార్యాలయాలు ఉండడాన్ని భిన్నంగా చూడవలసిన అవసరం లేదు. 'ఫ్రంట్ లైన్' సిమీకి సంబంధించి భద్రపరిచిన పత్రాలను, అందుబాటులో ఉన్న సాహిత్యాన్ని పరిశీలించినట్లయితే 1980లో అది ఉగ్రవాద సంస్థగా మారడం ప్రారంభమైంది. 1990 చివరికొచ్చేసరికి తీవ్రవాద సంస్థగా మారింది. తన సంస్థ సభ్యులను సమూలంగా కాలి ఫైట్, జీహాద్లుగా భావించేట్టు చేసింది.
బాధితులను నిర్దోషులుగా విడుదల చేయడంపై తీస్తా సెతల్వాద్ మాట్లాడుతూ.. ''అన్యాయం ఎప్పుడూ దిగ్భ్రాంతి కలిగించడంలో విఫలం కాలేదని'' ఈ సంఘటన తెలియ జేసిందన్నారు. ఎవరైనా గుజరాత్‌ను లోతుగా పరిశీలించి నట్టయితే అత్యంత తీవ్రమైన మత భావనలున్న రాష్ట్రంగా అర్థమవుతుంది. అరెస్టులు చేయడం అనేది ఆ కాలంలో పెద్ద విషయం. ఈ అరెస్టులు ఇండియన్ పార్లమెంట్‌పై దాడి జరిగినప్పుడు చేశారు. యూఎస్‌లో 9/11 దాడులు జరగడానికి ముందు ఈ సంఘటన జరిగింది. ఆ సమయంలో భారతదేశం అంతులేని మితవాద హిస్టీరియాకు లోనవుతుంది. గుజరాత్ ఒక ఆటస్థలంగా మారింది. వారి ఎజెండా ప్రారంభమైందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.'' సెక్షన్ 3 ప్రకారం ఒక సంస్థ నిషేధించబడినట్లయితే, ప్రజలకు తెలియజేయాల్సి ఉంటుంది. సూరత్ నోటిఫికేషన్ సరిగా ఇవ్వలేదని న్యాయాధిపతి భావించారు. ప్రాసిక్యూషన్ ప్రకటనకు అరెస్టులకు ఉన్న సంబంధాన్ని నిరూపించడంలో విఫలమయిందని తెల్పారు. చట్టపరమైన అంశాలకు సంబంధించి న్యాయమూర్తి అన్ని రకాల నిందారోపణలను కొట్టివేసారు. సెక్షన్-3 ప్రకారం నిషేధానికి సంబంధించిన నోటిఫికేషనుకు, అరెస్టులకు సంబంధంలేదని, స్థానిక పత్రికల్లో వచ్చినవి కూడా సమంజసంగాలేవని తేలింది. ప్రాసిక్యూషన్, అరెస్టయిన 127మందిలో ఎవరూ సిమితో సంబంధం ఉన్నట్టు నిరూపించలేక పోయింది. నిషేధించబడిన వస్తువులను సేకరించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. కానీ వారు సేకరించినది ఏ అంశం కూడా ఏది కూడా సిమీకి ఉన్న ఎలాంటి సంబంధాన్ని నిరూపించలేక పోయాయని న్యాయమూర్తి తెలియజేశారు.
(మిగతా మంగళవారం సంచికలో)
- అనుపమ కటకం
'ఫ్రంట్ లైన్' సౌజన్యంతో
అనువాదం: మల్లెంపాటి వీరభద్రరావు,
సెల్:9490300111