Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల అమెరికా అధ్యక్షుడు బైడెన్ లక్షా తొంభైవేల కోట్ల డాలర్ల ఉద్దీపన పథకాన్ని ప్రకటించాడు. అమెరికా ఆర్ధిక వ్యవస్థతోపాటు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను కూడా కోలుకునేలా చేయాలన్న ఆశ ఈ పథకం వెనుక ఉంది. గత ఏడాది ట్రంప్ రెండు లక్షల కోట్ల ప్యాకేజిని ప్రకటించాడు. ఆ తర్వాత డిసెంబరు 2020లో మరో తొంభైవేల కోట్ల డాలర్ల సహాయ ప్యాకేజిని ప్రకటించారు. ఆ వెనువెంటనే వచ్చింది ఈ బైడెన్ ప్యాకేజి. కేవలం కరోనా మహమ్మారి ప్రభావం నుంచి ప్రజలను ఆదుకోవడమే గాక అమెరికా ఆర్థిక వ్యవస్థ ఒక కొత్త ఊపు అందుకోవాలన్న లక్ష్యంతో ఈ ప్యాకేజి వచ్చింది. గతంలో ట్రంప్ అమెరికన్ మార్కెట్లోకి విదేశీ దిగుమతులను నియంత్రిస్తూ చేపట్టిన రక్షణాత్మక చర్యల కారణంగా ఏర్పడిన ప్రతికూల పరిస్థితులను అధిగమించడమేగాక ఈ ప్యాకేజిల ద్వారా మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా సానుకూల ప్రభావం కలిగించగలుగుతామని ఆశిస్తున్నారు. అదే సమయంలో అమెరికా ద్రవ్యలోటు రెండవ ప్రపంచయుద్ధానంతర కాలంలో ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరుకోనుంది.
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలం వృద్ధి చెందుతూవచ్చింది. ప్రభుత్వ వ్యయం పెంచడం ద్వారా ప్రభుత్వాలు చురుకుగా జోక్యం చేసుకోవడం వలనే ఇది సాధ్యపడింది. ఆ తర్వాత ద్రవ్య పెట్టుబడి అంతర్జాతీయంగా ఎక్కడ కావాలనుకుంటే అక్కడికి సంచరించడం మొదలైంది. ఈ ధోరణి ప్రారంభం అయాక ఇక ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం నేరుగా వ్యయాన్ని పెంచడం కొనసాగలేదు. ద్రవ్యలోటు ఎక్కువగా ఉండడం, సంపన్నులపై అధిక పన్నులు విధించడం - ఈ రెండూ ద్రవ్య పెట్టుబడికి రుచించవు. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఆదేశాలను కాదని వ్యవహరించగల సత్తా మూడవ ప్రపంచ దేశాల ప్రభుత్వాలకు లేదు. ఒక వేళ ధిక్కరించి నిలబడితే తమ దేశం నుంచి పెట్టుబడులు క్షణాల్లో విదేశాలకు తరలిపోతాయన్న భయం వాటికి ఉంది. ఆ విధంగా విధానాల రూపకల్పనలో అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి నిర్ణయాత్మకం అయింది.
అమెరికా మీద మాత్రం ఇటువంటి ఒత్తిడులు ఏమీలేవు. అమెరికన్ డాలరు దాదాపు బంగారంతో దీటైన మార్పిడి సాధనంగా పరిగణించబడడం దీనికి కారణం. ఎక్కువమంది తమ ధనాన్ని డాలర్లలో దాచుకుంటారు. అందుచేత అమెరికా నుంచి పెట్టుబడులు ఎక్కడికో తరలిపోతాయన్న భయం లేదు. కానీ దీనివలన మరో సమస్య వచ్చింది. ఇతర దేశాల కరెన్సీలు డాలరుతో పోల్చినప్పుడు బలహీనం కావడంతో ఆ దేశాల సరుకులు చౌకగా లభిస్తున్నాయి గనుక ఇతర దేశాల సరుకులకు అమెరికాలో డిమాండ్ పెరిగింది. మరోపక్క ఇతర దేశాలు అమెరికన్ డాలర్ల నిల్వలను పెంచుకోవడం కూడా పెరిగింది. ఈ విధమైన ధోరణుల వలన అమెరికా విదేశీ రుణం పెరిగింది. పైగా ఉపాధి అవకాశాలు అమెరికా నుంచి ఇతర దేశాలకు తరలిపోయాయి. ఈ ధోరణులను అరికట్టేందుకే ట్రంప్ కొన్ని ''రక్షణాత్మక'' చర్యలను చేపట్టాడు. ఆ చర్యల ఫలితంగా అమెరికాకు వచ్చే విదేశీ దిగుమతులు తగ్గి అమెరికన్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుందని, అందువలన ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశించారు. కాని,. ఇటువంటి రక్షణాత్మక చర్యల అనంతరం కూడా అమెరికన్ వ్యాపార లోటు (ఎగుమతులు తక్కువై, దిగుమతులు ఎక్కువ అయినప్పుడు వ్యాపారలోటు ఏర్పడుతుంది) పెరుగుతూనేవుంది. అంటే అమెరికన్లు ఇంకా విదేశీ దిగుమతులపైనే ఆధారపడుతున్నారు. అయితే బైడెన్ ఇప్పుడు ప్రకటించిన ఉద్దీపన పథకంతోపాటు ఎటువంటి అదనపు రక్షణాత్మక చర్యలనూ ప్రస్తుతానికి చేపట్టలేదు. ఇది గమనార్హం.
అమెరికాలో ప్రకటించిన ఉద్దీపన పథకాల తరంగాలు భారతదేశానికి కూడా తాకుతాయని, అమెరికాలో పెరిగే డిమాండ్ వలన దానికనుగుణంగా భారతీయ సరుకులకు అక్కడ డిమాండ్ పెరిగి మన ఎగుమతులు పెరుగుతాయని ఇక్కడ కొంతమంది పరిశీలకులు ఆశిస్తున్నారు. ఐతే ఇక్కడ ఒక మౌలికమైన తేడా ఉంది. రెండవ ప్రపంచ యుద్ధానంతరం ప్రభుత్వాల జోక్యంతో పెరిగిన ప్రభుత్వ వ్యయం వలన ఇతర దేశాలమీద ఆ ఆర్థిక తరంగాల ప్రభావం పడిన పరిస్థితులు వేరు. అప్పటికి ద్రవ్య పెట్టుబడి అంతర్జాతీయ స్వభావాన్ని సంతరించుకోలేదు. ఇప్పుడు అది అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి అయింది.
ఇలా మారినందువలన ప్రతీ దేశమూ తన వడ్డీ రేట్లను అమెరికా దేశపు వడ్డీ రేట్లతో ముడిపెట్టుకోవాల్సి ఉంటుంది. అమెరికా బదులు ఇండియాలో పెట్టుబడి పెట్టాలంటే కొంత ఎక్కువ రిస్క్ తీసుకోవాలి. అటువంటి రిస్క్ ఉన్నప్పటికీ ఇండియాలో పెట్టుబడి పెట్టడానికి ఎవరైనా సిద్ధపడాలంటే అమెరికన్ వడ్డీ రేట్లకన్నా ఇక్కడ వడ్డీరేట్లు గణనీయంగా ఎక్కువగా ఉండాలి. ఒకవేళ వడ్డీ రేట్లను గనుక తగ్గిస్తే ఇక్కడికి వచ్చిన పెట్టుబడులు బైటకు తరలిపోయే ప్రమాదం ఉంటుంది.
గత కొంత కాలంగా అమెరికన్ ప్రభుత్వం తన ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహం ఇవ్వడానికి వడ్డీ రేట్లను తగ్గిస్తూ వచ్చింది. ఆ క్రమంలో అక్కడ వడ్డీ రేటు దాదాపు 'సున్నా'కి చేరింది. ఇప్పుడు మళ్ళీ ప్రత్యక్షంగా ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం వలన ఎంతో కొంత ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దానివలన అక్కడ వడ్డీ రేట్లు పెరుగుతాయి. ఇప్పటికే ఆ ధోరణి కనపడుతోంది. అక్కడ పెరిగే వడ్డీ రేట్లకు తగినట్టు ఇక్కడ ఇండియాలో వడ్డీ రేట్లు పెంచాల్సి ఉంటుంది. ఇప్పటికే మనం విదేశీ బాండ్ల మీద (ముఖ్యంగా అమెరికన్ బాండ్లమీద) అధిక వడ్డీలు రెల్లించాల్సివస్తోంది. ఆ వడ్డీ రేట్లను తగ్గించడం, లేదా కనీసం పెరగకుండా చూసుకోవడం ఎలా అని రిజర్వు బ్యాంకు ఇప్పటికే నానా తిప్పలూ పడుతోంది. ఇప్పుడు అమెరికాలో పెరిగే వడ్డీ రేట్లకు అనుగుణంగా ఇక్కడ మరింత పెంచాల్సివచ్చేట్టుంది. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే అంత వడ్డీకి రుణాలు తీసుకుని మరీ పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకొస్తారు? దీని ఫలితంగా మన దేశంలో పెట్టుబడులు పెట్టడం తగ్గిపోతుంది.
బైడెన్ ఉద్దీపన పథకం ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది. దీనిగురించి అమెరికన్ వర్గాల్లో చాలా వేడిగా చర్చ సాగుతోంది. మితవాదులు ఇలా ద్రవ్యోల్బణం పెరగడం మంచిది కాదని భావిస్తూంటే వామపక్షం వైపు కాస్త మొగ్గు చూసుతున్న వాళ్ళు ఆ వాదనను కొట్టిపడేస్తున్నారు. ఏదేమైనా ఆ చర్చ అంతా అమెరికాలో తలెత్తబోయే ద్రవ్యోల్బణం గురించే తప్ప ఆ ఉద్దీపన ఫలితంగా ఇతర దేశాలలో కలగబోయే ద్రవ్యోల్బణం గురించి మాత్రం కాదు. అమెరికాకు వివిధ రకాల ముడిసరుకులను సరఫరా చేసే భారతదేశం, ఇతర మూడవ ప్రపంచ దేశాలలో ద్రవ్యోల్బణం ప్రభావం ఏవిధంగా ఉంటుందన్నది మనకు చాలా ముఖ్యం.
ద్రవ్యోల్బణం పెరిగితే అన్ని వస్తువుల ధరలూ పెరిగినట్టే ముడిసరుకుల ధరలు కూడా పెరుగుతాయి. ఆ ముడిసరుకులను సరఫరా చేసే దేశాల్లోనూ వాటి ధరలు పెరుగుతాయి. మనం ఉత్పత్తి చేసే సరుకులకు ఎక్కువ రేటు లభిస్తున్నప్పుడు మనం అటువంటి రంగాల్లో పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి పెంచడానికి అదనంగా పెట్టుబడులు పెట్టాలి. ప్రభుత్వమే ఆ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలి. కాని అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ప్రభుత్వం ఆ విధంగా పెట్టుబడులు పెట్టడానికి అనుమతించదు. ప్రభుత్వ పెట్టుబడుల వలన ద్రవ్యోల్బణం పెరిగిపోతుందని, ఆ విధంగా పెరగడానికి అనుమతించకూడదని అది నిర్దేశిస్తుంది. దానిని మన ప్రభుత్వం అమలు చేసి తీరాలి. కాబట్టి అదనంగా ఉత్పత్తి పెరగదు. జరిగిన ఉత్పత్తిలోనే ఎగుమతులకు ఎక్కువ భాగాన్ని కేటాయించవలసివుంటుంది. అప్పుడు దేశీయంగా వినిమయానికి లభించే భాగం తగ్గిపోతుంది. అంటే దేశీయ మార్కెట్ కుదించుకుపోతుంది.
రెండవ ప్రపంచ యుద్ధానంతర కాలంలో ఇటువంటి అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి పెత్తనం లేనందున ఆ కాలంలో మన సరుకులకు అంతర్జాతీయంగా పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా ఇక్కడ ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం తన వ్యయాన్ని మరింత పెంచగలిగింది. అప్పుడు మన ఆర్థిక వ్యవస్థ కూడా ఊపుగా పెరిగింది. అంటే అమెరికాలో అప్పుడు అమలు చేసిన ఉద్దీపన ప్రపంచం మొత్తంగానే ఆర్థిక ఉద్దీపనకు తోడ్పడింది. కాని ఇప్పుడు ఆవిధంగా జరగడానికి అవకాశం లేదు.
ప్రభుత్వ వ్యయాన్ని పెంచడంద్వారా ఆర్థిక ఉద్దీపనకు సహకరించాలని కీన్స్ ఆనాడు చెప్పాడు. దానితోబాటు ద్రవ్య పెట్టుబడి ప్రధానంగా జాతీయ స్వభావం కలిగివుండాలని కూడా చెప్పాడు. కాని ఇప్పుడు ఈ రెండో అంశాన్ని విస్మరించారు.
నయా ఉదారవాద పెట్టుబడిదారీ విధానం ప్రస్తుత ప్రపంచాన్ని ఈ సుదీర్ఘకాలపు సంక్షోభంలోకి నెట్టింది. దీనివెనుక ద్రవ్యపెట్టుబడి అంతర్జాతీయం కావడం అనేది ప్రధాన పాత్ర పోషిస్తోంది. దాని పెత్తనం అదే విధంగా కొనసాగుతున్నంతకాలమూ ప్రభుత్వాలు ఆర్థిక వ్యవస్థల్లో నేరుగా జోక్యం చేసుకోవడమూ సాధ్యం కాదు, అవి ఆ విధంగా జోక్యం చేసుకోకుండా ఉన్నంతకాలమూ ఆర్థిక వ్యవస్థలు కోలుకోవడమూ సాధ్యం కాదు.
అమెరికా వంటి సంపన్న దేశాలకు అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి పెత్తనం ఏ విధంగానూ ఒక సమస్యగా ఉండదు. తమలో తాము సమన్వయం చేసుకుంటూ వ్యవహరించే ఇతర సంపన్న దేశాలకూ సమస్య ఉండదు. కాని మూడో ప్రపంచ దేశాలపరిస్థితి అటువంటిది కాదు. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి పెత్తనాన్నుంచి విడివడి స్వతంత్రంగా ఆర్థిక విధానాలను రూపొందించుకో గలిగినప్పుడే వాటికి ఏదైనా దారి దొరుకుతుంది. కాని బైడెన్ ప్యాకేజి అటువంటి ప్రతిపాదన ఏదీ చేయలేదు. ఒకవైపు అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి పెత్తనం మూడో ప్రపంచ దేశాలపైన కొనసాగుతూండ గానే, మరోవైపు తన ప్యాకేజిని అమలు చేస్తే గతకాలంలోలాగే కీన్షియన్ డిమాండ్ మేనేజిమెంట్ చేయవచ్చని, అది అన్ని దేశాలకూ ప్రయోజనకరంగా ఉండగలదని బైడెన్ భావిస్తున్నాడు.
నిజానికి బైడెన్ ప్యాకేజి అమలు జరిగితే సంపన్న దేశాలకు, మూడవ ప్రపంచ దేశాలకు మధ్య అంతరం మరింత పెరుగుతుంది. సంపన్న దేశాలలో వృద్ధి సాధ్యపడుతుంది. కాని మూడవ ప్రపంచ దేశాలు మరింత తీవ్ర నిరుద్యోగంతో, మరిన్ని ఎక్కువ పొదుపు చర్యలతో చిక్కుల్లో పడతాయి. ఐఎంఎఫ్ అనుసరించే వివక్షాపూరిత విధానాల పర్యవసానమిది. ఒకవేళ ఐఎంఎఫ్ లేకపోయినా సంపన్న దేశాలు తమ ఆర్ధిక సంక్షోభాన్ని అధిగమించడానికి ఇటువంటి మార్గాలనే అనుసరిస్తాయి. బైడెన్ ప్యాకేజి సదుద్ధేశంతోటే వచ్చింది. దానికి సంపన్న దేశాలలోని వామపక్షాల మద్దత్తూ ఉంది. కాని ఈ వామపక్షాలు మూడో ప్రపంచదేశాలు ఎటువంటి చిక్కులను ఎదుర్కొన బోతున్నాయో అది కూడా కాస్త ఆలోచించాలి కదా.
-ప్రభాత్ పట్నాయక్ (స్వేచ్ఛానుసరణ)