Authorization
Mon Jan 19, 2015 06:51 pm
(ఆదివారం సంచిక తరువాయి)
ఇది మనను వాస్తవమైన ప్రశ్న వైపు తీసుకువెళుతుంది. ప్రజలను నిర్బంధించే విషయంలో ఈ సంస్థలు అనుసరించే విధానం ఏమిటి? న్యాయాధికారుల చేత పరిశీలనలాంటి పద్ధతులను అనుసరించాల్సి ఉంటుంది. అలాంటి ప్రక్రియ లేకుండా సక్రమంగా పని చేయకపోవడం, శతృ భావంతో మోసపుచ్చడంలాంటి చర్యలు చేపట్టారు. అందువల్ల మనం అధిక సంఖ్యలో అలాంటి అభియోగాలను గమనిస్తున్నాం.
ఉగ్రవాద చట్టాలపై గట్టి పట్టు ఉన్న తీస్తా సెతల్వాద్, 'ఊపా'ని గురించి చర్చిస్తూ, టాడా, పోటా లాంటి టెర్రరిస్టు వ్యతిరేక చట్టాలు-1987లకు సమీక్షా బోర్డులు, నిబంధనలు ఉంటాయని తెలిపారు. ఎందువల్లనంటే రివ్యూబోర్డు ప్రజల అభిప్రాయాలను విచారణకు తీసుకుంటుంది. 'ఊపా' భారతదేశ ప్రభుత్వం చేతిలో నేర చట్టాలలో ఒక శాశ్వతమైన చట్టం. దీనర్థం ఏమంటే రాజ్యం చేతిలో ఇది ఒక శాశ్వతమైన ఆయుధమయింది. దీనికి ఎలాంటి నిబంధనలు గాని, రివ్యూ బోర్డు గానీలేదు. ఇది ఒక చెడ్డ, పనికిరాని చట్టం. ఆచరణలో కూడాచెడ్డదే. ఇది హానికరమైనదేకాక, ద్వేష పూరితమైన తీర్పులకు కూడా దారి తీస్తుంది.
బాధితులు ఎదుర్కొన్న అస్తవ్యస్తమైన వ్యక్తిగత విషాదానికి మూల్యం ఎవరు చెల్లించాలి? అనే అంశంపై మనం గళం విప్పవలసి ఉంటుంది. మనకి ఇప్పటికిప్పుడు ఈ విషయంలో ఏమైనా నియమనిబంధనలు లేవా? అనుమానిత ఉగ్రవాద కార్యకలాపాలపై ఆస్ట్రేలియన్ అయిన, డాక్టర్ మహమ్మద్ హనీఫ్‌ను అరెస్టు చేసి తరువాత విడుదల చేశారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం రహస్యంగా పారితోషకం ఇవ్వడమే కాక, అతని గౌరవాన్ని హుందాతనాన్ని పునరుద్ధరించడానికి, వారు చేయ గలిగినంత చేశారని తీస్తా సెతల్వాద్ తెలిపారు.
2000 సంవత్సరపు తొలి దినాల్లో ఒక పద్ధతి ప్రకారం, ముస్లింలపై బురదజల్లి, అపఖ్యాతిపాలు చేసే ప్రక్రియ ఆ రాష్ట్రంలో చరిత్రను మార్చే క్రమంలో జరిగింది. 2002 సంవత్సరానికి ఈ విభజన ఊపందుకొని తీవ్ర స్థాయికి చేరుకొని గుజరాత్ నరమేధంలో వేల మంది ముస్లింలు కిరాతకంగా చంపబడ్డారు. సూరత్ కేసులోని విశేషమేమంటే, ఒక పద్ధతి ప్రకారం వారిని దోషులుగా నిందించడం, హింస ద్వారా నిర్మూలించే ప్రయత్నం జేయడం. అందరూ గమనించినట్లుగా, అల్లర్లు సృష్టించి ముస్లింలను సర్వ నాశనం చేసే ప్రయత్నం చేశారు.
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) మాజీ కార్యదర్శి అరుణ్ మెహతా మాట్లాడుతూ.. ''ఆ సమయంలో బీజేపీకి పరిస్థితులు అనుకూలంగాలేవు. హిందూ మహాసభకు సంబంధించిన ప్రవీణ్ తొగాడియా, ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ ద్వేషాన్ని వ్యాపింప చేయడమే కాక సిమీ ప్రమాదాన్ని గురించి మాట్లాడేవాడు. ప్రజలు ముస్లింల పట్ల మరింత అనుమానాస్పదంగా మారడానికి ఈ చర్య దోహదపడింది. ఆ విధంగా ''ఆల్ ఇండియా ఎడ్యుకేషన్ బోర్డు'' సమీకరణాలను స్పష్టమైన లక్ష్యంగా ఎంచు కున్నారు అన్నారు. ''ఆ సంవత్సరం ప్రణాళికాబద్ధమైన మత విద్వేషాన్ని పెంచడాన్ని గమనించాము. నీవు ముస్లిం అయితే మిలిటెంట్‌గా ముద్ర వేసేవారు. నీవు ట్రైబల్ అయితే నక్సలైట్‌గా ముద్ర వేసేవారని'' గుజరాత్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త రోహిత్ ప్రజాపతి అన్నాడు. 2002 అల్లర్ల సమయంలోని బాధితులను గూర్చి అహ్మదాబాద్‌కు చెందిన ముస్లిం మైనారిటీ హక్కుల కార్యకర్త ఫాదర్ సెడ్రిక్ ప్రకాష్ మాటల్లో ''తన ఉద్దేశ్యంలో నిరంకుశమైన నిర్బంధాలకు సంబంధించి సూరత్ కేసు ముఖ్యమైనది. ఇలాంటి పరిస్థితిని చాలా మంది ముస్లింలు గతంలో ఎన్నడూ చూడలేదు''. మేము వెనుక గతంలోకి వెళ్లి చూస్తే, పౌర సమాజం దీనిని చూడలేదు. దీనిపై దృష్టి పెట్టడానికి ఇష్టపడలేదు. వారు గమనిస్తున్న దానిని చూసి భయపడ్డారు. మేము సమిష్టిగా కార్యకలాపాలు చేపట్టలేకపోయాము. ఆ పరిస్థితులలో మేము కార్యకలాపాలను కొనసాగించవలసి వస్తున్నదని'' అన్నాడు.
కొందరు వ్యాఖ్యాతలు తెలిపిన ప్రకారం, ఆనాడు గుజరాత్లో ఉన్న రాజకీయాలు, మతోన్మాదం పెరగటంలో ప్రధాన పాత్ర పోషించాయి. ఈ పరిస్థితులే సూరత్‌లో నిర్బంధాలకు దారితీశాయి. రాష్ట్రం బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య విభజింపబడి రాజకీయ నాయకత్వం బలాన్ని నిరూపించుకొనే స్థితిలో ఉంది. 1998 నుంచి బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ 2001లో అనేక స్థానిక ఎన్నికలలో ఆ పార్టీ తీవ్ర నష్టాలకు గురైంది. వాస్తవంగా తమకు ప్రతిష్టాత్మకమైన అహ్మదాబాద్, రాజ్‌కోట్ మున్సిపల్ కార్పొరేషన్లను కోల్పోయింది. వాటిని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అరుణ్ మెహతా అన్నట్లుగా ''ఎప్పుడైతే రెండు ప్రధాన మధ్యంతర ఎన్నికలలో ఓటమి పాలయ్యారో, ఆ పార్టీ ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకొని ఉంటుందని భావించారు.''
ప్రజాదరణ పొందిన ప్రముఖులైన న్యాయవాదుల బృందంతో సంబంధిత పౌర ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడమైనది. విఆర్ కృష్ణ అయ్యర్, హాస్బెట్ సురేష్, పిసి సావంత్ గుజరాత్ మారణహౌమం గురించి 2002 అక్టోబరులో ఒక నివేదికను తీసుకువచ్చారు. ఆ నివేదిక ''1998 నుంచి బీజేపీకి రాష్ట్రంలో వరుసగా అననుకూల పరిస్థితులు నెలకొనడం, ఫిబ్రవరి 28 నుంచి జరిగిన సంఘటనలను బట్టి ఏవైనా రాజకీయ సమీకరణాలుగాని, కుట్రలు, కుతంత్రాలుగాని జరిగాయా అనే విషయంపై అనేక మందిలో ప్రశ్నలు ఉదయించాయి. ఇదంతా ఊహాజనితంగా ఉన్నప్పటికీ, మోడీ ప్రభుత్వం సమయానికి ముందుగానే రాష్ట్ర అసెంబ్లీని రద్దుచేయడం, రాష్ట్రంలో పరిస్థితి సాధారణ స్థితికి భిన్నంగా ఉన్నప్పటికీ, ముందస్తు ఎన్నికల ప్రకటన చేయడంవల్ల, బీజేపీ క్రిందిస్థాయిలో స్థిరంగా తన పలుకుబడిని కోల్పోతున్నదనే అభిప్రాయం అన్ని స్థాయిల్లో ఏర్పడింది. అందువల్ల వెంటనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం వల్ల మోడీ మొండిగా, స్వార్థంతో ప్రజల ప్రజాభీష్టాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి విభజన రాజకీయాలను, హింసను ప్రయోగించాడు.
2000 సాక్ష్యాలను ట్రిబ్యునల్ స్వీకరించింది. ట్రిబ్యునలో సాక్షిగా తీస్తా సెతల్వాద్ సాక్ష్యం ఈ విధంగా ఇస్తూ, ''సెప్టెంబర్ 2001న నరేంద్ర మోడీని తీసుకురావడంతో రాష్ట్ర బీజేపీలో తీవ్రవాద రాజకీయాలకు నాంది పలికినట్లైందని తెలిపింది. స్థానిక ఎన్నికలలో బీజేపీ తన ప్రాభవాన్ని కోల్పోతున్న సమయంలో మోడీని తీసుకురావడంతో 1990లో డిప్యూటీ ప్రధాన మంత్రి రూపకల్పన చేసిన రథయాత్ర నేపథ్యంలో రాజకీయ సంబంధమైన అంశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. విద్వేష పూరిత ప్రసంగాలు, ప్రచారం, దానితో పాటు ప్రణాళికా బద్ధమైన హింసను భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్‌లు ప్రేరేపించాయి'' అని చెప్పింది.
ప్రజలను విడదీయడం కోసం దృఢమైన, ప్రణాళికాబద్ధమైన ప్రయత్నం 2001లో జరిగిందని ఆమె వద్దనున్న ఆధారాల ద్వారా నిరూపించింది. జనవరి 21న బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ప్రచురించిన ''సాధన'' అనే వారపత్రికకు చందాదారులుకమ్మని అన్ని పాఠశాలలకు ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్ సాంఘికశాస్త్ర పుస్తకాలలో ఆలోచనా విధానంలో విద్వేషాన్ని, దురభిమానాన్ని పెంచే విధానాన్ని చేపట్టారు. ఆ పుస్తకాలలో కొన్ని పదబంధాలను చేర్చారు. వాటిలో కొన్ని, ముస్లింలు, క్రిస్టియన్స్, పార్శీలు విదేశస్తులని, కుల వ్యవస్థ మానవ జాతికి ఒక వరమని, అదేవిధంగా ముస్సోలినీని, హిట్లర్‌ను శ్లాఘించే పద్ధతిని ప్రవేశపెట్టి, భారతదేశంలోని ఒక తరానికి మన ప్రాచీన చరిత్రను, మన గతాన్ని గూర్చి వక్రీకరించబడిన అంశాలతో వారి మెదడులో జొప్పించే ప్రయత్నం చేశారు. ఆర్ఎస్ఎస్, విహెచ్పి, భజరంగ్ దళ్ సమిష్టిగా ప్రణాళికా బద్ధమైన విభజన రాజకీయాలతో గుజరాత్లో బీజేపీ పరిపాలనను చట్టబద్ధం చేశాయి.
గుజరాతుకు సంబంధించి, మరొక అన్యాయానికి స్పష్టమైన ఉదాహరణ అక్షరధామ్ దేవాలయంపై దాడి కేసు. ఈ కేసులో ఆరుగురు 8నెలలు జైలులో మగ్గారు. వారిలో ముగ్గురికి మరణశిక్ష విధించారు. చివరకు సరైన సాక్ష్యాలు, ఆధారాలు లేక వారిని నిర్దోషులుగా విడుదల చేశారు. సెప్టెంబర్ 24 2002న పోలీసుల కథనం ప్రకారం ఆ సంవత్సరం జరిగిన మతపరమైన అల్లర్లకు ప్రతీకారంగా గాంధీనగర్‌లో సాయుధులైన వ్యక్తులు దేవాలయంపై దాడి చేసి 30మంది మరణానికి కారణమయ్యారు.
గుజరాత్ పోలీసులు ప్రాథమిక విచారణ జరిపిన తరువాత తెహ్రిక్-ఇ-కాసాన్ (ప్రతీకార ఉద్యమానికి సంబంధించిన సంస్థలు) ఈ దాడుల వెనుక ఉన్నట్టుగా తేల్చారు. అంటే టెర్రరిజం స్క్వాడ్ ఈ కేసును చేపట్టి అనేక కుట్ర సిద్ధాంతాలను ముందుకు తెచ్చింది. ఈ కుట్రలో, పాకిస్థాన్, సౌదీ అరేబియా హైదరాబాద్ (ఇండియాకు) చెందిన తీవ్రవాద సంస్థలకు భాగస్వామ్యం ఉందని తేల్చారు. కానీ దర్యాప్తు ఏ మాత్రం ముందుకు సాగలేదు. పోలీసులు డజను మందిని అనుమానించి వారిని ఉగ్రవాద నిరోధక చట్టం (పోటా) ద్వారా అరెస్టు చేశారు. వీరిలో ఆరుగురిని దర్యాప్తు స్థాయిలోనే విడుదల చేశారు.
జూలై 2004న పోటా కోర్టు ముగ్గురికి మరణశిక్ష, ఒకరికి జీవితఖైదు, మరొకరికి 10 సంవత్సరాలు, ఇంకొకరికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 2014లో సుప్రీంకోర్టు నిందమోపబడిన వారందరినీ విడుదల చేసింది. కేసు దర్యాప్తు చేయడంలో గుజరాత్ పోలీసుల అసమర్థతను వెలికితీసింది. వారిపై మోపబడిన నేరారోపణలు వాస్తవం కాదని, నేరారోపణ చేయబడిన వ్యక్తులు అమాయకులని నమ్ముతున్నా మని కోర్టు స్పష్టం చేసింది.
- అనుపమ కటకం
'ఫ్రంట్ లైన్' సౌజన్యంతో
అనువాదం: మల్లెంపాటి వీరభద్రరావు, సెల్:9490300111