Authorization
Mon Jan 19, 2015 06:51 pm
26వేల ప్రభుత్వ పాఠశాలల్లో.! 26 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు..!! 10,815 ప్రయివేటు పాఠశాలల్లో.! 34 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు..!! ఇవన్నీ ప్రభుత్వం చెప్పే లెక్కలే! అంటే ప్రభుత్వ పాఠశాలలు ఎక్కువ, విద్యార్థులు తక్కువ. ప్రయివేటు పాఠశాలలు తక్కువ విద్యార్థుల సంఖ్య ఎక్కువ. ప్రభుత్వంపైన చెప్పినట్లుగా ప్రభుత్వ పాఠశాలల్లోని బోధన బోధనేతర సిబ్బంది సంఖ్య, వేతనాలు, బడ్జెట్ వివరాలు కూడా ప్రజల ముందు పెడితే బాగుంటుంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, కోవిడ్-19 మూలంగా సంవత్సరం కాలంగా ప్రయివేటు పాఠశాలల ఉపాధ్యాయు లకు జీతాలులేవు. బతుకు దుర్భరం అయింది. అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల పుణ్యమా అని నెల రోజులు పాఠశాలలు తెరిచారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల పుణ్యమా అని ప్రయివేటు ఉపాధ్యాయులకు రూ.2 వేల నగదు, 25 కేజీల రేషన్ బియ్యం ఇస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు యాబై నుంచి లక్ష రూపాయల వరకు వేతనాలు ఉన్నాయి, మీరు ఎలాగూ నిరుద్యోగ భృతి ఇస్తామని అంటున్నారు కాబట్టి కనీసం నెలకు రూ.10వేలు అయినా ఇవ్వాలని ప్రయివేటు ఉపాధ్యాయులు కోరారు. అయినా ప్రభుత్వం ప్రకటించిన రెండు వేల రూపాయల కోసం మార్చి నెల 2020 హాజరు పట్టిక ప్రకారం 2,06,383మంది ఉపాధ్యాయులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం నుంచి పరోక్ష సంకేతమో లేక ఎవరిదైనా అత్యుత్సాహమో, ఏదైతేనేం దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయుల సంఖ్యను వడపోసి లక్షా 18 వేలకు కుదించారు. ముందుగా అధికారులు లక్షా 45వేల వరకు ఉపాధ్యాయులు ఉన్నారని ప్రభుత్వానికి లెక్క చెప్పడంతో ఆ లెక్కన ముఖ్యమంత్రి కేసీఆర్ 32కోట్ల రూపాయలను విడుదల చేశారు. కానీ దరఖాస్తు చేసుకున్న ప్రకారం ఇంకో పది కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఎక్కడ అక్షింతలు పడతాయోనని దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్యను రకరకాల కొర్రీలతో కుదిస్తున్నారు. జిల్లాకు ఒకటి రెండు పాఠశాలల వారు ఉపాధ్యాయుల సంఖ్యను ఎక్కువగా చూపించి ఉండవచ్చు. అంత మాత్రాన అందరినీ ఒకే గాటినకట్టి సుమారు లక్ష మంది ఉపాధ్యాయులను తగ్గించాలని చూస్తారా!? ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్యను, ప్రయివేటు పాఠశాలల్లోని విద్యార్థులు ఉపాధ్యాయుల సంఖ్యను పోల్చి చూస్తే ఇట్టే అర్థమవుతుంది కదా. ప్రభుత్వం ఇచ్చే 2వేలకే ఇంత తక్కువా అని పెద్ద ఎత్తున విమర్శలు వస్తుంటే, ఆ రెండు వేలు రూపాయలను కూడా అందరికీ ఇవ్వక పోతే ఎలా అని పలువురు వాపోతున్నారు. ఇక్కడే ఈ ప్రభుత్వం మర్మం ఏమిటో తెలిసింది. ఇక నిరుద్యోగ భృతి ఇస్తారంటే ఎవరూ నమ్మే పరిస్థితి ఉండకపోవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఇలా ఒక్కొక్కటిగా ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోతే 2023 ఎన్నికల్లో కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే. రాష్ట్రంలో సరియైన ప్రతిపక్షమే లేదనే ధీమా ఉండవచ్చు. అతి విశ్వాసం, అతి నమ్మకం ఎప్పటికీ పనికి రాదు. ఇప్పటికైనా విద్యా శాఖ అధికారులకు చెప్పి దరఖాస్తు చేసుకున్న ప్రయివేటు ఉపాధ్యాయులందరికీ మీరు ఇస్తానన్న రూ.2 వేలు 25కేజీల రేషన్ బియ్యాన్ని మరలా పాఠశాలలు తెరిచే వరకు ఇచ్చి, మరోసారి వారు రోడ్డెక్కి ఆందోళన బాట పట్టకుండా చూడండి.
-తుమ్మలపల్లి ప్రసాద్
సెల్: 9912010030