Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్యారిస్ కేంద్రంగా సేవలు అందిస్తున్న అంతర్జాతీయ స్వచ్ఛంధ సంస్థ 'రిపోర్టర్స్ విథవుట్ బార్డర్స్ (రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటీయర్స్, ఆర్‌యస్‌యఫ్)' 20 ఏప్రిల్‌న విడుదల చేసిన 'ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక-2021 (వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్-2021)' నివేదిక ఆధారంగా ప్రపంచంలోని 180దేశాల్లో భారతదేశం 'ప్రమాదకర పత్రికా స్వేచ్ఛ'గల దేశాల వర్గంలో చేరి 142వ (ర్యాంకు) స్థానంలో నిలిచిందని వెల్లడించింది. పత్రికా స్వేచ్ఛ జాబితాలో 2002లో 80వ స్థానంలో ఉన్న ఇండియా, 2010లో 122, 2012లో 131, 2016లో 133వ స్థానానికి క్రమంగా పడిపోవడం జరిగింది. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వ పత్రికా వ్యతిరేక విధానాలతో కొందరిని జాతి-వ్యతిరేక జర్నలిస్టులుగా ముద్ర వేసి బెదిరింపులు, పత్రికల గొంతులను నొక్కడం, పత్రికారంగంపై ఆదిపత్య ధోరిణి పెరిగాయనే కారణాలను సంస్థ ప్రకటించింది. ప్రభుత్వ ధోరిణిని విమర్శించే పత్రికా యాజమాన్యాలు, విలేకరులు మరియు ఫ్రీలాన్స్ జర్నలిస్టుల విధులకు ఆటంకంగా నిలుస్తూ, ప్రభుత్వంపై విమర్శనాత్మక వ్యాసాలను రచించే వారిపై కక్ష కడుతూ, పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తోందని నివేదిక తెలియజేసింది. పత్రికా విలేకరుల కదలికలపై నిఘా పెట్టడం, పోలీసుల బెదిరింపులు, రాజకీయ నాయకులు నిఘా పెట్టడం, హింసా ప్రవత్తిని కనబర్చడం, నేర గ్రూపుల హింసలు. అవినీతి అధికారులు, రాజకీయ నాయకుల బెదిరింపులు పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నాయని తెలిపింది. హిందూత్వ భావనలతో పత్రికా స్వేచ్ఛకు అడ్డుతగులుతూ, కొందరు విలేకరుల ప్రాణాలు తీసే స్థాయికి హింసా ధోరిణి పెరిగిందని నివేదిక వివరించింది. కరోనా నిబంధనల పేరుతో గత సంవత్సర కాలంగా పత్రిక విలేకరులపై దాడులు పెరిగాయని, కాశ్మీర్లో పోలీసులు, మిలిటరీ మరియు పారామిలటరీ దాడులతో పత్రికా స్వేచ్ఛ పతన స్థాయిలోకి పడిపోయిందని వెల్లడించింది.
ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో ఉన్న 180 దేశాల్లోని 12 దేశాలు (7 శాతం) మాత్రమే ప్రత్రికా స్వేచ్ఛను పూర్తిగా అనుభవిస్తున్నాయని నివేదిక తెలియజేసింది. సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం 73 దేశాల్లో పత్రికా గొంతు పూర్తిగా (వెరీ బ్యాడ్) నొక్కడం జరుగుతోందని, భారత్ లాంటి 59 దేశాల్లో పాక్షికంగా (బ్యాడ్) విఘాతం కలుగుతోందని వర్గీకరించింది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో 1వ స్థానంలో నార్వే, 2వ స్థానంలో ఫిన్లాండ్, 3వ స్థానంలో స్వీడెన్, 4వ స్థానంలో డెన్మార్క్, 5వ స్థానంలో కోస్టా రికా దేశాలు సగర్వంగా నిలిచాయి. జాబితా చివరలో 180వ స్థానంలో ఎరిట్రియా, 179వ స్థానంలో దక్షిణ కొరియా, 178వ స్థానంలో తుర్కమెనిస్థాన్ పత్రికా స్వేచ్ఛలో పాతాళంలో నిలిచాయి.
భారతదేశం 142వ స్థానంలో నిలువగా పొరుగు దేశాలు నేపాల్ 106వ స్థానం, శ్రీలంక 127, మియాన్మార్ 140, పాకిస్థాన్ 145, బంగ్లాదేశ్ 152వ స్థానాల్లో ఉండడం జరిగింది. ప్రపంచంలోని ముఖ్య దేశాల్లో కెనడా 14వ స్థానంలో, ఆస్ట్రేలియా 25, యూకె 33, ఫ్రాన్స్ 34, యూయస్ 44, రష్యా 150వ స్థానాల్లో నిలిచాయి. పత్రికా స్వేచ్ఛ ప్రమాదకర (బ్యాడ్) స్థాయి జాబితాలో భారత్‌తో పాటు బ్రెజిల్, మెక్సికో, రష్యా లాంటి దేశాలు ఉన్నాయని నివేదిక తెలిపింది. రిపోర్టర్స్ విథవుట్ బార్డర్స్ విడుదల చేసిన ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక నివేదిక నిరాధారమైందని, భారత్‌లో పత్రికా స్వేచ్ఛకు ఎలాంటి ఆటంకాలు జరగడం లేదని కేంద్ర ప్రభుత్వం మండిపడింది. పత్రికా స్వేచ్ఛకు విలువ ఉన్నపుడే ప్రభుత్వ పథకాల్లో, వ్యవస్థలో జరుగుతున్న లోపాలు బయట పడతాయని గమనించాలి. పత్రికా స్వేచ్ఛకు పట్టం కట్టిన దేశాల్లో అవినీతి అంతం కావడం, సుపరిపాలన సాధ్యపడడం, ప్రజానీకానికి మేలు జరగడం లాంటి ప్రయోజనాలు కలుగుతాయని గుర్తుంచుకోవాలి. పత్రికా గొంతును నులిమితే అన్యాయానికి పట్టాభిషేకం చేసినట్లే అని గమనించాలి.
డా|| బి.మధుసూదన్‌రెడ్డి,
సెల్:9949700037