Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''మానవుని జీవన మహత్తర ముగింపు విజ్ఞానమే కాదు కార్యాచరణ కూడా(The great end of Life is not Knowledge but action).'' తాను చెపిన ఈ మాటలకు సజీవ సాక్ష్యంగా ప్రపంచ చరిత్రలో నిలుస్తాడు కామ్రేడ్ లెనిన్ అని వేరుగా చెప్పనక్కర్లేదు. నిర్దిష్టపరిస్థితులకు అనుగుణంగా నిర్దిష్ట అధ్యయనం, నిర్దిష్ట విశ్లేషణతో పాటు నిర్దిష్టకార్యాచరణను జోడించినవాడు లెనిన్. అందుకే మార్క్సిజం-లెనినిజం విడదీయలేని సిద్ధాంతంగా అవతరించినట్టు స్టాలిన్ పేర్కొంటాడు.
ఇది లెనిన్ 151వ జయంతి సంవత్సరం. 1870 ఏప్రిల్ 22న జన్మించిన లెనిన్ 1924లో మరణించాడు. అలాగే భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావ శతజయంతి వేడుకలను కూడా వామపక్ష అభిమానులు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొండూరి వీరయ్య కూర్పుతో 'లెనిన్ యాదిలో' అను పుస్తకాన్ని నవ తెలంగాణ పబ్లిషంగ్ హౌస్ విడుదల చేయడం అభినందనీయం. లెనిన్ సమకాలికులు, సీపీఐ(ఎం) అగ్రనేతలు రచించిన వ్యాసాలతో పాటు లెనిన్ రచించిన వ్యాసాలను రెండో భాగంగా జోడించడం ఈ (సంకలనం) కూర్పు ప్రత్యేకత.
సోషలిస్టు చైతన్యం దానంతటదే రాదని, అలాగే అప్పటికప్పుడు పెల్లుబికే సద్యోజనిత(స్పాంటేనియస్) పోరాటాలపై ఆధారపడితే సరిపోదని తెలుపుతూ, విప్లవ చైతన్యం పాదుకొల్పేందుకు ప్రణాళికాయుత కృషి అవశ్యమని తమ్మినేని వీరభద్రం (సీపీఐ(ఎం) తెలంగాణ కార్యదర్శి) ముందు మాటలో ఉద్ఘాటించారు. 'పెట్టుబడి దారీ వ్యవస్థను కులదోసే ఉద్యమానికి న్యాయకత్వం వహిస్తున్న విప్లవకారులు, ఉద్యమకారులైన ప్రజలు, కార్మికులకు అందనంత వేగంగా పరిగెత్తరాదని, అలాగని అందుకోలేనంతగా వెనకబడి పోరాదన్న లెనిన్ హెచ్చరికను ఆయన గుర్తుచేసారు.
తత్వవేత్తలు ఈ ప్రపంచాన్ని పరిపరివిధాల వ్యాఖ్యానించారు. ఇప్పుడు మార్చడం మన కర్తవ్యమని మార్క్స్ చెప్పిన మాటలను ఆచరణ సాధ్యం చేసి చూపినవాడు లెనిన్ అని సీతారాం ఏచూరి (సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి) తన వ్యాసంలో తెలిపారు. 'పెట్టుబడి దారీ వ్యవస్థ తన వర్గ దోపిడీ కోసం ప్రజలను నిట్ట నిలువుగా చీలుస్తుంది. జీవన్మృతులను గావిస్తుంది. ఈ వ్యవస్థను కూలిస్తే తప్ప మానవాళికి విముక్తి లేదు. అలాగే మానవాళి తన సంపూర్ణ సామర్థ్యంతో పని చేయడం పెట్టుబడిదారి వ్యవస్థలో సాధ్యం కాదు' ఈ విషయాలను పదేపదే రుజువు చేయడంలోనే లెనిన్ జీవితము- కృషి ఇమిడి ఉన్నట్టు ఏచూరి వివరించారు. సరైన విశ్లేషణ ద్వారా సరైన అంచనాకు వచ్చినా విప్లవోద్యమం సరైన రాజకీయ ఎత్తగడల విధానాన్ని ఎంచుకోలేకపోతే, ఆ సరైన అవగాహన ఆచరణలోకి రాదన్న వాస్తవాన్నికూడా గుర్తెరగాలి అని అన్నారు. 20వ శతాబ్దం ఆరంభంలో గుత్త పెట్టుబడిదారి విధానం ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకున్నదని లెనిన్ విశ్లేషిస్తూ, దానిని సామ్రాజ్యవాద దశగా పిలిచాడు. సామ్రాజ్యవాద దశ యొక్క మౌలిక లక్షణం పారిశ్రామిక పెట్టుబడి కాదు, ద్రవ్య పెట్టుబడి అని పేర్కొంటూ, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కార్మికవర్గ పోరాటాలతో అనుసంధానం చేసే కర్తవ్యాన్ని లెనిన్ సిద్ధాంత గ్రంధంగా రూపొందించిన తీరును ఏచూరి విశదీకరించారు.
విప్లవ కార్యాచరణలో కార్మికవర్గ అగ్రగామిగా పార్టీ నిర్మాణ ఆవశ్యకత గురించి లెనిన్ నొక్కి చెప్పిన విషయాన్ని ప్రకాష్ కరత్ (పోలిట్ బ్యూరో సభ్యులు) తన వ్యాసంలో ఉటంకించారు. కార్మికులు తమ పోరాటాన్ని రైతాంగపు డిమాండ్ల సాధన కోసమో, దున్నేవానికే భూమి వంటి నినాదాలు కోసమో పరిమితం చేస్తే సరిపోదనీ, సోషలిజం సాధన దిశగా సాగే పెట్టుబడి దారి వ్యతిరేక పోరాటంలో ఈ కార్మిక కర్షక ఐక్యత మరింత గాఢంగా పెనవేసుకోవలసి ఉందని లెనిన్ విశ్లేషించడం చాలా కీలకమని 'విజయ ప్రసాద్' వ్యాసంలో పేర్కొన్నాడు. సోషలిజం ఏదో సుదీర్ఘకాలంలో సాధించాల్సిన లక్ష్యంగానో, అర్థంకాని ఆధునిక కళారూపంగానో లేదా ఓ మధుర జ్ఞాపక చిహ్నంగానో మిగిలిపోగుడదని లెనిన్ చెప్పిన మాటలు కార్యకర్తలకు నేటికీ శిరోధార్యమని ఆయన అభివర్ణించారు.
లెనిన్తో సహ నాటితరం విప్లవకారులను ప్రభావితం చేసిన రచయిత నికోలారు చెర్నిషెవిస్కీ. రాజకీయాభిప్రాయాల కారణంగా చెర్నిషెవిస్కీని నాటి నిరంకుశ ప్రభుత్వం బంధించింది. అప్పుడు ఆ రచయిత ఆ తరానికి ''ఏం చేయాలి?'' అని రాసిన నవల యువతకు మార్గదర్శకంగా మారింది. లెనిన్ 1902లో రాసిన తన ప్రథమ రచనకు ఆ నవల పేరు (ఏం చేయాలి?) ఎంచుకున్నాడని తారిక్ తన వ్యాసంలో గుర్తు చేసుకున్నాడు.
రాజకీయాధికారాన్ని సాధించడానికి, దానిని స్థిరీకరించడానికి, కార్మికవర్గం సాగించే పోరాటంలో అనుసరించదగిన ఎత్తుగడల రూపకల్పనలో లెనిన్‌కు గల అపూర్వమైన మేధోనైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని ప్రముఖ మార్క్సిస్టు మేధావి, నాయకులు మాకినేని బసవకున్నయ్య ఒక వ్యాసంలో సోదాహరణంగా వివరించారు. విప్లవాధికార సాధనకై సాయుధలైన ప్రజలు తిరుగుబాటు చేయడాన్ని సమర్ధిస్తూనే లెనిన్, ఆయన అనుచరులైన బోల్షివిక్‌లు, వ్యక్తిగత హింసావాదానికి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం సాగించడంలో ముందు పీఠిన నిలిచిన విషయాన్ని బసవపున్నయ్య తన వ్యాసంలో గుర్తుచేశారు. సాయుధ తిరుగుబాటు అనేది బాధ్యత, ప్రాధాన్యత కలిగిన అంశం అని పేర్కొంటూ అందుకు సిద్ధపడడమంటే సమస్యపరిష్కారానికి భౌతిక శక్తిని వినియోగించేందుకు సిద్ధపడటమేనన్న లెనిన్ వాఖ్యాలను వక్కాణించారు. లెనిన్ అన్నట్టు రాజకీయాలు ఓ విజ్ఞాన శాస్త్రం, ఓ కళ. బూర్జువారాజకీయాలను ఓడించాలంటే ఆ కళను, విజ్ఞానాన్ని కార్మిక వర్గ దృక్పథంతో క్షుణ్ణంగా ఆకళింపు చేసుకుంటే తప్ప సాధ్యం కాదని బసవపున్నయ్య పేర్కొన్నారు.
లెనిన్ అధ్యాయంతోనే 20వ శతాబ్దం ఆరంభమైంది. లెనిన్ 1913లో యూరప్‌లో కార్మికవర్గ యువత పోరాటదిశగా అడుగులు వేస్తున్న తరుణంలో చైనాతో సహా వెనుకబడిన దేశాల్లో మితవాద శక్తులు మద్యయుగాలకు పాత్రినిద్యం వహిస్తున్న శక్తులతో బూర్జువా వర్గం కుమ్మక్కు అయినట్లు లెనిన్ హెచ్చరించడం ఓ దూరదృష్టిగా హెచిమన్ వర్ణించాడు. అలాగే పోద్దు తిరుగుడు పూవుకు జీవంపోసే సూర్యకిరణాల మాదిరి శాంతి, స్వాంత్య్రం, ప్రజాస్వామ్యం సోషలిజం లక్ష్యాలుగా ప్రపంచ దేశాలకు లెనినిజం ప్రేరణగా నిలిచిందని కవిగా హెచిమన్ కవిత్వీకరిస్తాడు కూడా. పనిగా పెట్టుకుని గ్రంథాలయాలకు వెళ్ళి చదవడం, అదీ ఓ శోథనతో అధ్యయనం చేయడం, పుస్తకాలను తెప్పించుకుని చదవడం, లెనిన్ జీవితంలో చాల మటుకు నిత్యకృత్యంగా మారినట్టు క్రుప్రస్కయా తన వ్యాసంలో పేర్కొన్నది. లెనిన్ మాటల్లో జీవకళ ఉట్టిపడుతుందని ముఖ్యంగా కార్మికులు-కర్షకుల పట్ల ఆయన హృదయం ఆర్ద్రతతో కొట్టొచ్చినట్టు కన్పించేదని క్లారాజెట్కిన్ తెలిపారు. లెనిన్ ప్రజలను ఎలా అర్థం చేసుకుంటున్నారో ప్రజలూ లెనిన్‌ను అలానే అర్థం చేసుకోవడం ఓ గొప్ప విషయంగా ఆమె పేర్కొంటారు.
కార్మికులు విప్లవోద్యమ ముందుపీఠిన నిలవడమే కాదు, మొత్తం విప్లవోద్యమ గమనంపైనే ఆధిపత్యం సంపాయించడం పీడిత ప్రజానీకానికి నాయకత్వం వహించే రాజకీయ శక్తిగా ఎదగడం లెనిన్ సారధ్యంలోనే సాధ్యమైనదని స్టాలిన్ నొక్కి చెప్పాడు. ఒకతెగపై మరో తెగ చేసే తిరుగుబాటును విప్లవం అనలేమని, అదే సందర్భంలో పీడిత జన బాహుళ్యం దోపిడి వర్గాలకు వ్యతిరేకంగా సాగించే ప్రతి పోరాటాన్ని విప్లవంగా మార్చడం సాధ్యమని లెనిన్ రుజువు చేసాడుగనుకనే లెనినిజాన్ని మార్క్సిజం నుంచి వేరుచేసి చూడలేమని స్టాలిన్ వక్కాణిస్తాడు.
ఈ కూర్పులో ఆకర్షణీయమైన వ్యాసం ప్రజా రచయిత మాక్సిం గోర్కిది. మహసభలో లెనిన్ మాటలు వింటుంటే అదో వాదనగా అనిపించదు. ఏదో చారిత్రిక సత్యం చెప్తున్నట్టు ఆవిష్కతమవుతుంది. ఆ ఉపన్యాసంలో సమగ్రత, స్పష్టత, బలంచూస్తే శత్రువులు సైతం ముక్కున వేలు వేసుకోక మానరు. వాగాడంబరం ఉండదు మెచ్చుకోళ్ళు ఉండవు. అలంకారాలు ఉండవు, శరీరానికి కళ్ళు, చేతికి వేళ్ళు ఉన్నంత సహజంగానే ఆయన మాటలు ఉంటాయి. లెనిన్ ఉపన్యాసంలో సత్యాన్ని కాదనలేక కొందరు వెర్రి ప్రేలాపనలతో గోలచేస్తుంటే, రోజులక్సంబర్గ్ వారిని ఉద్దేశించి మీరు మార్క్సిస్టు సూత్రాలపై నిలబడలేదు. వాటిమిద కూర్చున్నారు. ఇంకా చెప్పాంలంటే పడుకున్నారని ఆమె చమత్కరించి నోళ్ళు మూయించినట్టు గోర్కి వివరిస్తాడు.
దిక్సూచి ముల్లులా ఆయన ఆలోచనలు ఎప్పుడూ కార్మికవర్గ ప్రయోజనాల చుట్టుతానే తిరగేవి. నాటకాల్లో హస్య పాత్రలు, సన్నివేశాలు చూసి కళ్ళు చెమర్చేలా పోట్ట చెక్కలయ్యేలా నవ్వేవాడు. వెనువెంటనే పెట్టుబడిదారీ వ్యవస్థలో కళా ఉత్పత్తి సామర్థ్యం ఎంతగానో వధా అవుతున్నదని, అరాచకత్వం వెర్రితలలు వేస్తుందని వాపోయేవాడు. దీనిమిద అధ్యయనంచేసి పుస్తకం రాయలేదని బాధపడేవాడు.
ఓసారి యుద్ధం గురించి మాట్లడుతూ ''కడుపు నిండిన వాళ్ళు ఆకలిగొన్న మనుషులను(సైనికులను) ఒకరిపై మరోకర్ని దాడికి వదులుతున్నారు. ఇంతకన్నా ఘోరం ఉందా..?'' అంటూ ఉద్వేగంతో ఊగిపోయేవాడు. ఇలా లెనిన్ గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. ఎంతైనా చదువుకోవచ్చు. కొండ అద్దమందు కొంచెమై ఉండునట్లు కామ్రేడ్ లెనిన్‌ను 'లెనిన్ యాదిలో' చూపడానికి ప్రయత్నంచారు. లెనిన్ రాసిన వ్యాసాలు ఈ కూర్పులో రెండో భాగంగా ఉండటం విశేషం. లెనిన్ జీవితాన్ని బాల్యం నుండి చివరివరకు ఓ కథలా తెలిపే వ్యాసం కూడా ఒకటి ఉంటే ఈ కూర్పుకు నిండుదనం వచ్చేది. ''ఏదిఏమైనా విప్లవకర జీవితం అన్నాక అటుపోట్లు పొరపాట్లు తప్పవు. ఎప్పుడైనా ఎక్కడైనా పొరపాటు జరిగిందని భావిస్తే ఓ సారి వెనక్కి తిరిగి చూడు నీ వెనకే నేనుంటాను'' అని అంటాడు లెనిన్. ఇది వ్యక్తికే కాదు. సమూహాలకు పార్టీలకీ వర్తిస్తుంది. అలాగే ఈ పుస్తకం కూడా.
కె. శాంతారావు
సెల్: 9959745723