Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహత్తర మార్క్సిస్టు - వ్లదిమీర్ ఇల్యిచ్ ఉల్యనోవ్ లెనిన్ 151వ జయంతి నేడు. మార్క్స్, ఏంగెల్స్ సిద్ధాంతాన్ని అత్యంత ప్రతిభావంతంగా ఆచరణకు జోడించి, ప్రపంచంలో తొలి సోషలిస్టు విప్లవం సాధించిన మహానేత ఆయన. లెనిన్ ప్రతిభ బహుముఖమైనది. ఆయన సిద్ధాంతవేత్త: మార్క్స్, ఎంగెల్స్ సిద్ధాంతాన్ని సామ్రాజ్యవాద దశలోని పెట్టుబడిదారీ యుగానికి అనువర్తించేట్లుగా పరిపుష్టం చేశాడు. అందుకే మార్క్సిజం ఈ యుగంలో మార్క్సిజం-లెనినిజం అయింది. ఆయన గొప్ప ఆర్గనైజర్: రష్యన్ కార్మికవర్గాన్ని, రష్యన్ శ్రామిక వర్గంలోని ఇతర ప్రజానీకాన్ని ఆర్గనైజ్చేసి రష్యాలో సోషలిస్టు విప్లవానికి సారథ్యం వహించాడు. ఆయనో మహత్తర విశ్లేషకుడు: నిర్ధిష్ట పరిస్థితులకు నిర్ధిష్ట విశ్లేషణ చేయడం ఎలాగో నేర్పించాడు. ప్రపంచంలోనూ, రష్యా విప్లవంలోనూ ప్రతి సందర్భంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణమైన విశ్లేషణ చేయడం ద్వారా విప్లవాన్ని సాధించడమే కాదు ఆ విశ్లేషణలను ఆయన గ్రంథ రూపంలో మనకు అందించాడు. నేటికీ అవి విప్లవకారులకు కరదీపికలే. అన్నిటికీ మించి లెనిన్ గొప్ప ఎడ్యుకేటర్: విప్లవ సిద్ధాంతం లేనిదే విప్లవోద్యమం లేదంటాడాయన. విప్లవ సిద్ధాంతం ప్రజల పరమైనప్పుడే అది భౌతిక శక్తిగా మారుతుంది. సిద్ధాంతాన్ని ప్రజలపరం చేయాలంటే వారిని బయటినుండి ఎడ్యుకేట్ చేయాలి. ఈ కళలో బహుశా లెనిన్‌కు ఎవరూ సాటిరారు.
''పిల్లలకు బోధించడానికి నాలుగేండ్లు అవకాశమివ్వండి, ఇంక నేను నాటిన విత్తనాన్ని పెకిలించడం ఎవరి తరం కాదు'' అంటాడు లెనిన్. అధ్యయనంపై ఆయనకు చిన్ననాటి నుంచి ఆసక్తి. అయితే విప్లవోద్యమంలోకి వచ్చిన తరువాత ఆయన ప్రజాబాహుళ్యానికి బోధించాల్సిన అవసరాన్ని తెలుసుకున్నాడు. అందుకే సులభంగా బోధించే పద్ధతులకు కూడా పదునుపెట్టాడు. లెనిన్ యుక్తవయస్సులో ఆయన బోధనా విధానం గురించి ఇవాన్ బబుష్కిన్ అనే కార్మికుడు ఇలా రాశాడు: ''లెక్చరర్ మాకు నోట్సు చూడకుండా విషయాన్ని తన స్వంత మాటల్లో చెప్పారు. ఆయన తను చెప్పిన దాంతో మమ్మల్ని విబేధించేట్లు చేసేవారు, లేకుంటే ఒక వివాదాన్ని సృష్టించేవారు. ఒక విద్యార్ధిని తన వాదన విడమరచమనేవారు. తరువాత మమ్మల్ని ఒకరితో ఒకర్ని వాదనలోకి దించేవారు. అందువల్ల మా పాఠాలు చాలా సజీవంగా, ఆసక్తికరంగా ఉండేవి. ప్రజలతో మాట్లాడ్డం ఎలాగో నేర్పించేవి. విషయం మీద పట్టు సాధించడానికి ఇది మంచి బోధనా పద్ధతి''.
లెనిన్ వయస్సు అప్పుడు 23-24 ఏండ్లు. సెంట్‌పీటర్స్ బర్గ్‌లో విస్తృతంగా నడుస్తున్న కార్మికవర్గ స్టడీసర్కిల్స్‌లో లెనిన్ పేరు మారమోగుతోంది. అప్పటికే ఆయన ''రైతాంగ జీవనంలో నూతన ఆర్థిక ధోరణులు'' అన్న గ్రంథం (ఆయన తొలి గ్రంథం) రాశాడు. మార్క్స్-ఏంగెల్స్‌ల కమ్యూనిస్టు ప్రణాళికను రష్యన్ భాషలోకి అనవదించాడు. మార్క్సిజాన్ని ఔపోసన పడుతున్నాడు. సెంట్‌పీటర్స్ బర్గ్ చుట్టూ ఉన్న ఫ్యాక్టరీల్లో కార్మికవర్గ ఉద్యమాలు ఉదృతంగా సాగుతున్న రోజులవి. కార్మికులు చైతన్యవంతులవుతున్నారు. నరోద్నిజం మీద, మార్క్సిజం మీద, ఇతర సిద్ధాంతాల మీద చర్చలు విస్తృతంగా జరుగుతున్నాయి. అప్పటికే మార్క్సిజాన్ని వంటబట్టించుకున్న లెనిన్, శాస్త్రీయ సోషలిజం భావజాలాన్ని కార్మికవర్గానికి చేరవేయాలనీ, కార్మిక వర్గానికి మార్క్సిజం అనే శక్తివంతమైన ఆయుధాన్ని అందించాలనీ, జారిస్టు దుష్టపాలననూ, తదుపరి పెట్టుబడిదారీ వ్యవస్థనూ అంతమొందించేందుకు ప్రజాసమూహాలను సమీకరించగలిగే విప్లవకారుల సంస్థను నిర్మించాలనీ నిర్ణయానికి వచ్చాడు. సెంట్‌పీటర్స్ బర్గ్‌లో కార్మివర్గ నాయకత్వంతో ఏర్పడిన సాంగత్యం ఆయనను గొప్ప అనుభవశాలిని చేసింది. దాంతో ఆయనను రాజధాని నగరంలోని మార్క్సిస్టులు వోల్గా నుండి వచ్చిన ''వృద్ధుడు'' అనేవారు. రష్యన్ సోషల్‌డెమోక్రటిక్ ఉద్యమంలో చర్చలు చాలా జరిగేవి. కానీ సిద్ధాంతాన్ని విప్లవ కార్యాచరణతో అనుసంధానం చేసే సామర్ధ్యం ఉండేది కాదు. లెనిన్ ఆ పని చేశాడు. ఆయన మార్క్సిజాన్ని అధ్యయం చేయడం, రహస్యంగా పనిచేసే చిన్నచిన్న గ్రూపుల్లో ప్రచారం చేయడంతోబాటు ఫ్యాక్టరీ కార్మికులకు పాఠాలు బోధించేవాడు. కార్మికుల జీవితంలోనుండే అంశాలను తీసుకుని బొమ్మలతో సహా మార్క్స్ 'పెట్టుబడి' గ్రంథాన్ని సుబోధకంగా వారికి వివరించేవాడు.
లెనిన్ జీవితంలో చేసిన కృషి మొత్తంలో ఈ 'ఎడ్యుకేటర్' మనకు స్పష్టంగా కనిపిస్తాడు. ఆయన ఉపన్యాసాలు, ఆయన రచనలన్నీ వాదనతో కూడి (పొలిమికల్గా) ఉంటాయి. ఒకానొక నిర్ధిష్ట పరిస్థితిని విశ్లేషించేటప్పుడు ఆయన ఆ పరిస్థితుల్లో మార్క్సిజానికి విరుద్ధమైన వాదనలను తీసుకుని వాటిని పూర్వపక్షం చేయడం ద్వారా తన వాదనను - శాస్త్రీయ మార్క్సిస్టు విశ్లేషణను- శక్తివంతంగా ప్రజలముందుంచేవాడు. అందుకే లెనిన్ రచనలు నేడు మనం చదివి అర్ధం చేసుకోవాలంటే నాటి రాజకీయ ఆర్థిక పరిస్థితులు, రాజకీయ సైద్ధాంతిక చర్చల గురించి తెలిసి ఉండాలి. ఆ చర్చలకు నాయకత్వం వహించిన వారి గురించి తెలిసి ఉండాలి. లెనిన్ రాసిన ప్రతి గ్రంథమూ రష్యన్ విప్లవంలోనూ, అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలోనూ నిర్థిష్ట పరిస్థితిని గురించి కార్మికవర్గానికీ, శ్రామికవర్గ నాయకత్వానికీ బోధించడానికి చేసిన ప్రయత్నమే. అవన్నీ కూడా నిర్ధిష్ట పరిస్థితులకు నిర్థిష్టమైన విశ్లేషణలు. అందువల్ల ఆ గ్రంథాలు రష్యాగురించి తెలియజేయడం కన్నా మార్క్సిజాన్ని ఒకానొక నిర్థిష్ట పరిస్థితిలో ఆచరణకు ఎలా వర్తింపజేయాలో మనకు బోధిస్తాయి.
లెనిన్ 1894లో సెంట్‌పీటర్స్ బర్గ్‌లో ప్రత్యక్ష కార్యాచరణకు దిగినప్పుడు ఆయనకు ఎదురైన సమస్య నరోద్నిజం. ఈ తప్పుడు సిద్ధాంతాన్ని ఎండగట్టకుండా సోషల్ డెమోక్రటిక్ (కమ్యూనిస్టు) ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోలేమని భావించి ఆయన ''ప్రజల మిత్రులు ఎవరు, సోషల్-డెమోక్రాట్లతో వారు ఎలా పోరాడుతున్నారు'' అనే పుస్తకం రాశారు. నాటి రష్యన్ వాస్తవికతను మార్క్సిస్టు కోణం నుండి లెనిన్ చేసిన మొట్టమొదటి విశ్లేషణ అది. అందులో నరోద్నిక్కుల ఊహాజనిత, అభివృద్ధినిరోధక భావజాలాన్ని ఎండగట్టాడు. తద్వారా మార్క్సిజాన్ని బోధించాడు. కార్మికవర్గ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టే నిర్మాణం కావాలి కాబట్టి 1895లో ''కార్మికవర్గ విముక్తి కోసం పోరాట లీగ్'' స్థాపించాడు. దాంతో అరెస్టయి ప్రవాసానికి పంపబడ్డాడు. ప్రవాసంలో ఉండగా ఆయన దాదాపు 30 రచనలు చేశాడు. అవన్నీ కూడా ఆర్థిక, రాజకీయ విశ్లేషణలే. అందులో ''రష్యాలో పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి'' అనే గ్రంథంలో ఆయన రష్యాలోని నాటి సామాజిక-ఆర్థిక సంబంధాలను ఎంతో సమర్ధవంతంగా విశ్లేషించాడు. ఈ విశ్లేషణపై ఆధారపడి రష్యాలో కమ్యూనిస్టు పార్టీ కార్యక్రమం, వ్యూహం, ఎత్తుగడలు రూపొందించబడ్డాయి. రష్యన్ కార్మికవర్గ ఉద్యమానికి సంబంధించి ప్రజాతంత్ర, సోషలిస్టు లక్ష్యాల మధ్యనున్న సంబంధాన్ని విశ్లేషిస్తూ లెనిన్ ఈ కాలంలో రాసిన కరపత్రం 'రష్యన్ సోషల్ డెమోక్రాట్ల కర్తవ్యాలు'' కార్మికవర్గంలో గొప్ప చైతన్యాన్ని నింపింది.
20వ శతాబ్దం ప్రారంభంలో జర్మనీకి చెందిన బెర్న్‌స్టీన్ తదితరులు అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో 'ఆర్థికవాదాన్ని' ముందుకు తెచ్చారు. ఈ రివిజనిస్టు జాడ్యానికి వ్యతిరేకంగా లెనిన్ పోరాడాల్సి వచ్చింది. దానికోసం ఆయన ''రష్యన్ సోషల్ డెమోక్రాట్ల నిరసన'' అనే కరపత్రం రాశాడు. దానిపై 17మంది సోషల్ డెమోక్రాట్ నాయకులు సంతకాలు చేశారు. ఇది సోషల్ డెమోక్రటిక్ ఉద్యమంలో ఏర్పడిన గందరగోళాన్ని తొలగించడానికి ఎంతగానో తోడ్పడింది. రష్యన్ కార్మికవర్గాన్ని ఆర్గనైజ్ చేయడానికీ, దేశవిదేశాల్లోని సోషల్ డెమోక్రాట్లను ఒకే రాజకీయ ఛత్రం కిందకు తేవడానికీ ఒక అఖిల-రష్యా పత్రిక కావాలని భావించాడు. దానికోసం ప్లెఖనోవ్ లాంటి వాళ్లను ఒప్పించడానికి నానా తంటాలు పడ్డాడు. చివరికి 'ఇస్క్రా' (నిప్పురవ్వ) పత్రిక స్థాపించాడు. పత్రిక సమిష్టి ప్రచారకుడు, ఆందోళనకారుడు మాత్రమే కాదు నిర్మాణకర్త కూడానని లెనిన్ బోధించాడు. ఇస్క్రాలో లెనిన్ రాసిన 50కి పైగా వ్యాసాలు ఉద్యమాన్ని విశ్లేషించి ముందుకు నడపడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. వాటిలో 'మన ఉద్యమ తక్షణ కర్తవ్యం' అనే వ్యాసం, 'ఏం చేయాలి?' గ్రంథం నాటి నిర్థిష్ట పరిస్థితుల్లో ఉద్యమ తక్షణ లక్ష్యాలను నిర్ధేశించాయి. కార్మికవర్గం ఆర్థికపోరాటాలు చేస్తుందనీ, దానికి సోషలిస్టు చైతన్యం తనంత తానుగా రాదనీ, బయటి నుండి పార్టీ ఆ చైతన్యాన్ని అందించాలనీ లెనిన్ చెప్పాడు. రష్యన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ రెండవ మహాసభలో ఆయన పార్టీ కార్యక్రమం, నిర్మాణాలను రూపొందించడంలో తీవ్రమైన అంతర్గత పోరాటం చేయాల్సి వచ్చింది. ఆ సందర్భంగా ఆయన ప్రతిపాదించిన తీర్మానాలు ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమానికి విలువైన పాఠాలను అందించాయి. ఆ తరువాత రష్యాలో విప్లవ పరిస్థితులు పరిపక్వం అయిన తరువాత 1905 ఏప్రిల్ విప్లవ పరాజయం నుండి 1917 అక్టోబరు విప్లవ విజయం వరకు లెనిన్ ఎత్తుగడలు విధానాలు విప్లవకారులకు ఇప్పటికీ ఎప్పటికీ పాఠ్య గ్రంథాలే. ఈ మొత్తం రచనల్లో ఆయన నాటి మార్క్సిస్టు వ్యతిరేక భావాలనూ, ఎత్తుగడలనూ ఖండించడం ద్వారా కార్మికవర్గాన్నీ, కార్మికవర్గ పార్టీనీ ఎడ్యుకేట్ చేశాడు. ఆ విధంగా విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకుపోయాడు.
లెనిన్లోని ఈ ఎడ్యుకేటర్ గురించి జపాన్ కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు సెన్ కటయమా చాలా చక్కగా వివరించారు. తూర్పు దేశాల (చైనా, జపాన్, ఇండోనేషియా, మంగోలియా) విప్లవ సంస్థల తొలి సమావేశానికి హాజరైన లెనిన్ ప్రతి దేశ ప్రతినిధి వర్గంతోనూ విడిగా మాట్లాడేవాడట. అయితే ఆ సంభాషణ... లెనిన్‌కు ప్రతినిధులు వేసే ప్రశ్నలు, దానికి లెనిన్ ఇచ్చే సమాధానాలు అందరూ వినేట్లు చేసేవాడు. ఆ సంభాషణల్లో ఆయా దేశాల సమస్యలతోపాటు, మొత్తం తూర్పు దేశాల సమస్యలు ముందుకొచ్చేవి. ''ప్రతి ఒక్కరు చెప్పేది శ్రద్ధగా వినేవాడు. ఆయన చెప్పే సమాధానాలు అందరినీ సంతృప్తి పరిచేవి, ఉత్సాహపరిచేవి. ఆయనతో మాట్లాడ్డం మాకు చాలా తేలికగా ఉండేది'' అని కటయమా పేర్కొన్నారు.
లెనిన్ గురించి వియత్నాం విప్లవ యోధుడు హౌచి మిన్ చెప్పిన మాటలు ఆయనకు ఇచ్చిన గొప్ప నివాళి. ''జీవించి ఉన్న కాలంలో లెనిన్ మనకు తండ్రి, గురువు, కామ్రేడ్, బోధకుడు. ఈ రోజుకీ ఆయన మనకు సోషలిస్టు విప్లవ పథనిర్దేశకుడు'' అన్నారు.
రెడ్ సెల్యూట్ కామ్రేడ్ లెనిన్!
- ఎస్. వెంకట్రావు