Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ఒకరైన అమరజీవి కామ్రేడ్ ఏలూరి లక్ష్మినారాయణ 29వ వర్థంతి సందర్భమిది. బీహార్ రాష్ట్రం సమస్తిపూర్ అఖిల భారత వ్యవసాయ కార్మిక మహాసభలలో పాల్గొని, తిరుగు ప్రయాణంలో అనారోగ్యానికి గురై కలకత్తా ఆస్పత్రిలో 1992 ఏప్రిల్ 25న ఆయన మరణించాడు.
కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చిన చీలికల ప్రభావంతో ఆనాడు ఉమ్మడి కొత్తగూడెం డివిజన్ ఉద్యమం పూర్తిగా దెబ్బతిన్నది. ఇల్లందు, కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, బూర్గంపాడు, గార్ల, బయ్యారం ప్రాంతాలకు చెందిన భౌగోళిక ప్రాంతమే ఉమ్మడి కొత్తగూడెం డివిజన్. ఈ ఉద్యమాన్ని పునర్నిర్మాణం చేయడంలో ఏలూరి పాత్ర మరువలేనిది. ఈ కృషిలో భాగంగానే 1968 జూన్‌లో కామ్రేడ్ ఏలూరి ఆధ్వర్యంలో కారేపల్లిలో 150మంది యువ విద్యార్థులకు కె.యల్. ఇంటి వద్ద శిక్షణా తరగతులు జరిగాయి. వారం రోజులపాటు జరిగిన ఈ క్లాసులలో పార్టీ అగ్ర నాయకులు కామ్రేడ్స్ మోటూరు హనుమంతరావు, పర్సా, మంచికంటి, టి.వి.ఆర్.చంద్రంగార్లు వివిధ పాఠ్యాంశాలను బోధించారు. ఈ క్లాసులు ఆనాడు ఉమ్మడి కొత్తగూడెం డివిజన్ ఉద్యమం తిరిగి పట్టాలపైకి ఎక్కడానికి పునాదిగా పనిచేశాయి. క్లాసుల అనంతరం వ్యవసాయ కార్మికుల కూలి, భూమి, పాలేర్ల వేతనాలు, తునికాకు, పోడు భూములు, భూస్వాముల ''నాగు, వడ్డీ దోపిడీ'', దౌర్జన్యాలు తదితర సమస్యలపై 15రోజుల పాటు ఇల్లందు ప్రాంతంలో ఏలూరి ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచార యాత్ర సాగింది. ఏలూరి చేసిన ప్రసంగాలు వ్యవసాయ కార్మికులను ఆకట్టుకున్నాయి. సమావేశాలకు జనసమీకరణ కోసం ఆయన పాటలు పాడేవాడు. ప్రసంగాలు చేసేవాడు. 1952లో కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిగిన జనరల్ ఎన్నికల సందర్భంగా ఆయన మంచి బుర్ర కథ కళాకారుడుగా కూడా వ్యవహరించాడు. ఆ అనుభవం ఈ యాత్రలో బాగా ఉపయోగపడింది.
ఏలూరి నేతృత్వంలో
జరిగిన ప్రజా పోరాటాలు
1970, 80 దశకాలలో భూస్వాముల, పెత్తందార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఏలూరి ప్రత్యక్ష నాయకత్వంలో జరిగిన ఉద్యమాలు ఆనాడు పార్టీ నిర్మాణంపై పెద్ద ప్రభావాన్ని చూపాయి. ఈ పోరాటాల వల్లనే వ్యవసాయ కార్మికుల కూలి రేట్లు, తునికాకు రేట్లు, పాలేర్ల జీతాలు పెరిగాయి. వడ్డీ, నాగు దోపిడీలు తగ్గాయి. ఫారెస్ట్ పోడు భూములు గిరిజనులు, యితర పేదలకు దక్కాయి.
ఈ పోరాటాలలో ఉసిరికాయలపల్లి భూ పోరాటం ప్రత్యేకంగా పేర్కొనదగింది. జమీందారు పర్సా కిషన్‌రావు దుర్మార్గాలు, ఆగడాలకు అంతు ఉండేది కాదు. అనేక సంవత్సరాలుగా సాగు చేస్తున్న గిరిజన రైతులను, కౌలుదార్లను ఏజెన్సీ నిబంధనలకు విరుద్ధంగా 1/70 లాంటి చట్టాలు ఉన్నప్పటికీ అక్రమంగా వారిని భూముల నుంచి బేదఖళ్ చేసేవాడు. వారి భూములను గిరిజనేతర పెత్తందార్లకు, భూస్వాములు, ధనిక రైతులకు అమ్ముకోవడం ప్రారంభించాడు. దీనిని ప్రజలు కామ్రేడ్ ఏలూరి నాయకత్వంలో ప్రతిఘటించారు. ఈ పోరాటం దాదాపు అయిదేండ్లపాటు పెద్ద ఎత్తున సాగింది. ''కాంగ్రెస్ పాలనలో భూ సంస్కరణల బండారం, ఉసిరికాయలపల్లి బడా భూస్వామి పర్సా కిషన్‌రావు అక్రమాలు'' అనే పేరుతో ఏలూరి ప్రత్యేకంగా ఒక బుక్‌లెట్‌ను తయారుచేశాడు. ఈ బుక్‌లెట్‌ను వేల సంఖ్యలో ప్రచురించి ఆనాడు జిల్లా, రాష్ట్ర స్థాయిలో విస్తృతంగా పంచడం జరిగింది. ఈ పోరాటం వల్ల గిరిజనులు, యితర పేదలు తమ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడుకున్నారు.
భూస్వాముల దాడులు, ప్రభుత్వ నిర్భంధం
ఈ పోరాటాలలో భూస్వాముల దాడులు, హత్యా ప్రయత్నాలు, ప్రభుత్వ నిర్భంధాలు, అక్రమ కేసులతో ఏలూరి జీవితం మమేకమైపోయింది. అయినప్పటికీ, ఆయన వీటిని ఏ మాత్రం ఖాతరు చేయలేదు. 1965-66 నుంచే ఆయన జైలు జీవితం ప్రారంభమైంది. ఆనాడు కేంద్రంలోని నెహ్రూ ప్రభుత్వం దేశంలోని కమ్యూనిస్టులను అక్రమంగా నిర్భంధించినప్పుడు ఏలూరిని కూడా ప్రభుత్వం అరెస్ట్‌చేసి హైదరాబాద్ చంచల్‌గూడ జైలులో రెండు సంవత్సరాల పాటు నిర్భంధించింది. 1972లో కరువు వ్యతిరేక ఉద్యమాలు పార్టీ పిలుపుపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరిగాయి. ఈ ఉద్యమం సందర్భంగా కామ్రేడ్స్ ఏలూరి, కె.యల్.గార్లను ప్రభుత్వం అరెస్ట్‌చేసి నెల రోజుల పాటు ఇల్లందు సబ్ జైలులో నిర్భంధించింది. భూస్వామ్య గూండాల దాడులు ఆయనపై అనేకసార్లు జరిగాయి. 1952 జనరల్ ఎన్నికల క్యాంపెయిన్‌లో ఉన్నప్పుడు ఇల్లందు నియోజకవర్గం టేకులపల్లిలో కాంగ్రెస్ నాయకుడు లక్కినేని వెంకటేశ్వరరావు గూండాలు ఆయనపై దాడిచేసారు. పోరాటాలు ఉధృతంగా జరుగుతున్న 70వ దశకంలో కూడా విశ్వనాధపల్లి, సీతారాంపురం, పాత లింగాలలో భూస్వామ్య గూండాల దాడులతోపాటు, పోలీసుల దాడులు కూడా జరిగాయి. తప్పుడు కేసులలో సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ పార్టీ కార్యకర్తలను వెంటేసుకొని తిరిగాడు. 1975 ఎమర్జెన్సీ సమయంలో ఆయన ఇరవై నెలల పాటు అజ్ఞాతంలో గడిపాడు.
ఖమ్మం జిల్లా ఉద్యమం
నిర్మాణంలో ఆయన పాత్ర
ఆయన కొత్తగూడెం డివిజన్ పార్టీ కార్యదర్శిగానూ, జిల్లా పార్టీ కార్యదర్శివర్గ సభ్యులుగానూ, పార్టీ రాష్ట్ర కమిటి సభ్యులుగానూ బాధ్యతలు నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం కొత్తగూడెం డివిజన్ కమిటి కార్యదర్శిగానూ, ఖమ్మం జిల్లా కార్యదర్శిగానూ, రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షులుగానూ, అఖిల భారత సంఘం కౌన్సిల్ సభ్యులుగానూ బాధ్యతలు నిర్వహించారు. తమ స్వంత గ్రామం కోమట్లగూడెం సర్పంచ్ బాధ్యతలు కూడా నిర్వహించారు. ఆయన ఏ బాధ్యతలలో ఉన్నప్పటికీ, జిల్లాలో ఆయన అవసరం ఎక్కడ అని పార్టీ భావిస్తే అక్కడికెళ్ళి పనిచేశాడు. 1984, 89 శాసనసభ ఎన్నికలలో పార్టీ నిర్ణయం మేరకు భద్రాచలం వెళ్ళి పార్టీ అభ్యర్థి కుంజా బొజ్జి గెలుపునకు కృషి చేశాడు. 1985లో భద్రాచలం డివిజన్ ఉద్యమంపై నక్సలైట్ల దాడి మొదలైంది. ఆ డివిజన్ ఉద్యమ నిర్మాతలలో ఒకరైన కామ్రేడ్ బండారు చందర్రావు, బత్తుల భీష్మారావులను నక్సలైట్లు హత్య చేశారు. ఆ డివిజన్ ఉద్యమాన్ని నిలబెట్టాల్సి వచ్చింది. కామ్రేడ్ ఏలూరిని జిల్లా పార్టీ భద్రాచలం పంపింది. ఏలూరి ఆ డివిజన్లో గిరిజన గ్రామాలన్నీ తిరిగాడు. సభలు, సమావేశాలు, ప్రదర్శనలు విస్తృతంగా జరిపి, నక్సలైట్ల దురాగతాన్ని ఖండించాడు. గిరిజనులతో విల్లంబులు పట్టించి, ఆయన ప్రత్యక్షంగా ప్రదర్శనలలో పాల్గొన్నాడు. ఆ డివిజన్ కామ్రేడ్స్‌లో మనో ధైర్యాన్ని, నిబ్బరాన్ని నింపాడు. ఉద్యమాన్ని చెక్కు చెదరకుండా కాపాడాడు. ఆయన అవసరం సత్తుపల్లికి ఉందని పార్టీ నిర్ణయిస్తే, అక్కడికి వెళ్ళి ఉద్యమానికి సహకరించాడు. మంచి శక్తి, సామర్థ్యాలు ఉన్న నేత. ఆజానుబాహుడు. 1972 అసెంబ్లీ ఎన్నికలలో ఆయనను ఇల్లందు నియోజకవర్గానికి పార్టీ అభ్యర్థిగా నిర్ణయిస్తే కేవలం ఒక మోటారు సైకిల్ (టూ వీలర్) పైనే నియోజకవర్గమంతా పర్యటించాడు, ప్రచారం చేశాడు. గణనీయమైన సంఖ్యలో ఓట్లను సాధించాడు.
కార్యకర్తల పట్ల ఆప్యాయత
కేడర్ విలువ తెలిసిన నాయకుడు. కార్యకర్తలను అపారంగా ప్రేమించేవాడు. ఎక్కడైనా కార్యకర్తలపై దాడి జరిగిందంటే, క్షణాలలో అక్కడ వాలిపోయేవాడు. పార్టీ శాఖలు, సభ్యులు, శాఖా కార్యదర్శుల పనిని నిరంతరం పర్యవేక్షించేవాడు. కారేపల్లి మండలం గాంధీనగరం గ్రామంలోని ఆయన ఇల్లు డివిజన్ ఉద్యమానికి కేంద్రంగా ఉండేది. ఎప్పుడూ కార్యకర్తలతో నిండి ఉండేది. ఆయన భార్య జయమ్మ పార్టీ సభ్యురాలు. మహిళా రంగం బాధ్యతలు చూస్తూ, ఉద్యమంలో భర్తకు సహకరిస్తూ, కుటుంబ, వ్యవసాయ బాధ్యతలతోపాటు, యింటికి వచ్చే కార్యకర్తలకు రాత్రింబవళ్ళు వండి పెడుతూ, నిరంతరం శ్రమించేది. ప్రపంచ ప్రసిద్దిగాంచిన మాక్సిం గోర్కి ''అమ్మ'' నవలలోని అమ్మ పాత్ర జయమ్మది. పార్టీ కార్యకర్తలందరికీ ఆమె అమ్మే. కుమారుడు రఘు పార్టీ కార్యకర్తగా చురుకుగా ఉండేవాడు. బాధాకరమైన విషయం, అనారోగ్యంతో చనిపోయాడు. పెద్ద కుమార్తె అరుణ పార్టీ సభ్యురాలే. ఏలూరిది ప్రాథమిక విద్యాస్థాయే. కానీ 65లో జైలులో ఉన్న రెండు సంవత్సరాల కాలాన్ని అధ్యయనానికి బాగా ఉపయోగించుకున్నాడు. ఇంగ్లీష్‌ను కూడా నేర్చుకున్నాడు. పీపుల్స్ డెమోక్రసీ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా చదివేస్థాయికి ఎదిగాడు. మంచి మార్క్సిస్టు బోధకుడు. అర్థశాస్త్రం నుంచి గతి తార్కిక చారిత్రిక భౌతికవాదం మొదలుకొని పార్టీ కార్యక్రమం, నిర్మాణం వరకు అన్ని సబ్జెక్టులను సులభ శైలిలో కార్యకర్తలకు అర్థమయ్యే రీతిలో బోధించేవాడు. కమ్యూనిస్టు విలువలు, ప్రమాణాలు, నిరాడంబరత, క్రమ శిక్షణకు కట్టుబడిన నాయకుడు. అనేక మందిని కమ్యూనిస్టు కార్యకర్తలుగా తీర్చిదిద్దిన నాయకుడు. ఆయన ఆదర్శాలను అంది పుచ్చుకుందాం. ఆశయాలకు పునరంకిత మవుదాం. అదే ఆయనకు నిజమైన నివాళి.
పి. సోమయ్య
సెల్:9490098043