Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పీడిత ప్రజల విముక్తి కోసం గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు ఎన్నో ఉద్యమాలు చేసి విరామ మెరుగని విప్లవకారుడుగా నిలిచాడు కామ్రేడ్ మహ్మద్ గౌస్. తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరు గ్రామంలో నిరుపేద మైనార్టీ దంపతులు అబ్దుల్ రహమాన్-సర్వర్ బీబీలకు 1965లో జన్మించాడు గౌస్. ప్రగతిశీల విద్యార్థి ఉద్యమాలతో తన ప్రస్థానం ప్రారంభించి నాలుగు దశాబ్దాల పాటు విరామం లేకుండా సాగించిన జీవితం నేటి తరానికి ఆదర్శం.
స్వగ్రామంలో ప్రభుత్వ బడిలో చదువు ప్రారంభించి ఎం.ఎ. హిందీ పండిట్ వరకు విద్యాబ్యాసం చేసిన గౌస్ గ్రామ అభ్యుదయ యువజన సంఘం సభ్యునిగా చేరి గ్రామాల్లో నాటకాలు వేసి ప్రజలను చైతన్యం చేసి ఆదర్శ జీవనం వైపు నడిపించారు. 1982లో సీపీఐ(ఎం)లో చేరి పార్టీ చీలిక సమయంలో కమ్యూనిస్ట్ దిగ్గజం కామ్రేడ్ మద్దికాయల ఓంకార్‌తో కొనసాగి ఎంసీపీఐ పార్టీ నిర్మాణంలో కామ్రేడ్స్ గౌస్ కీలక పాత్ర పోషించడమే కాకుండా పార్టీ కార్యకర్తలపై ఎన్నో దాడులను రాజకీయంగా ఎదిరించి నిలిచారు. తన 40ఏండ్ల కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో 37సంవత్సరాలు ఎంసీపీఐ(ఎం) పార్టీలో కొనసాగి దేశ వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసి పీడిత ప్రజల విముక్తికోసం తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు గౌస్. ఆయన ప్రతి దశలోనూ తన అంకితభావం, సామర్థ్యం, పోరాట పటిమతో జాతీయ కార్యదర్శిగా ఎదిగారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యునిగా, కంట్రోల్ కమిషన్ చైర్మన్‌గా, పోలిటి బ్యూరో సభ్యునిగా, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన కామ్రేడ్ గౌస్ 2016 నుంచి తన మరణం వరకు ఐదు సంవత్సరాల పాటు ఎంసీపీఐ(ఎం) అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా పార్టీ బలోపేతానికి, విస్తరణకు ఎనలేని కృషి చేశాడు. ఎంసీపీఐ(యు) సిద్ధాంత పునాది అయిన ఇండియాలో కమ్యూనిస్టుల ఐక్యత, ఐక్య ఉద్యమాల అవసరాన్ని సీపీఐ(ఎం), సీపీఐ జాతీయ నాయకత్వంతో చర్చించి ఐక్యతలో గౌస్ తనదైన ముద్ర వేశారు.
వర్గ పోరాటాలు, సామాజిక పోరాటాలు సమన్వయం చేసి మార్కిజం, అంబేడ్కర్ ఆలోచన విధానం కలిపి ఐక్య పోరాటాలు చేయడం వలన దేశంలో విప్లవం విజయవంతం చేయాలని ఆ దిశగా గడిచిన మూడు సంవత్సరాలుగా జరుగుతున్న ఉద్యమాల్లో గౌస్ కీలకపాత్ర పోషించారు. ''లాల్-నీల్ జెండా నీడలో మనం కలిసి తీరుతాం! ఏకమై సాగుదాం!! సకల పీడిత ప్రజల ఐక్యత వర్థిలాల్లి-మనువాద పెట్టుబడిదారి పాలనకు గోరి కట్టాలని పిలుపినిచ్చి పోరాటాన్ని ముందుకు సాగించారు. ఆధిపత్య స్వభావంతో దేశంలో కొనసాగుతున్న సాంప్రదాయ కమ్యూనిస్టు ఉద్యమానికి సామాజిక ఉద్యమాలు జోడించి నడిపించాలని నూతన సామాజిక పోరాటాన్ని తన భుజస్కంధాలపై వేసుకున్నాడు.
కులరహిత, వర్గరహిత సమసమాజ స్థాపనలో అణచబడ్డ సామాజిక వర్గాల కీలక పాత్రని గౌస్ నొక్కి చెప్పాడు. భారత బూర్జువా వర్గమే కుల దురభిప్రాయాలను పెంచి పోషిస్తుందనీ, కుల వ్యవస్థకు, దళితుల అణచివేతకు వ్యతిరేకంగా ఐక్యత సాధించినపుడే కార్మిక వర్గ ఐక్యత ఏర్పడుతుందనీ ప్రచారం చేశారు. కుల వ్యవస్థ నిర్మూలనకై పోరాటం ప్రజాతంత్ర విప్లవంలో ముఖ్యమైన భాగం. ఆధిపత్య కులవాదానికి ప్రతినిధులుగా ఉన్న సంఫ్ుపరివార్ని ఎదిరించి నిలువరించాలంటే, ఆర్థిక దోపిడీదారులకు వ్యతిరేకంగా, ఆధిపత్య కుల అస్తిత్వవాదులకు వ్యతిరేకంగా కూడా ఏక కాలంలో ఐక్యంగా కమ్యూనిస్టు, వామపక్ష, ప్రజాతంత్ర పార్టీలు, సామాజిక న్యాయం కోసం పోరాడే శక్తులు, సంస్థలు, పార్టీలు పోరాడాలని పిలుపునిచ్చి ఆ దిశగా త్యాగపూరిత పోరాటం చేసిన గౌస్ ఆకస్మిక మరణం ఆ పార్టీకే కాదు, దేశంలో అభివృద్ధి చెందుతున్న సామాజిక ఉద్యమానికి కూడా పెద్ద నష్టం. సామాజిక ఉద్యమాలను కమ్యూనిస్టు ఉద్యమాలతో కలిపి బలోపేతం చేస్తున్న కీలక దశలో గౌస్ మరణం తీరని లోటు.
ఇండియాలో 85 శాతంగా గల బడుగు బలహీన వర్గాల విముక్తికీ, పేదరికం, అసమానతల నిర్మూలనకీ, మొత్తం దేశ పురోగమనానికీ దోహదపడే విధానాన్ని రూపొందించి, కార్యాచరణకి ఉపక్రమించడంలో గౌస్ పాత్ర కీలకమైనది. దేశీయ వాస్తవిక పరిస్థితులకి మార్క్సిజాన్ని అన్వయించి, ఫూలే, అంబేడ్కర్ భావజాలాన్ని కొనసాగిస్తూ, నూతన సిద్ధాంత కార్యాచరణలో జీవిత తుది ఘడియల వరకూ పోరాటం చేసిన కామ్రేడ్ గౌస్‌కు జోహార్లు.
ఎస్. నరేందర్
సెల్:9701916091