Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కర్నాటక రాష్ట్రంలో 2021 ఏప్రిల్ 6న ఒక వ్యక్తి తన సోదరిని, ఎవరితోనో సంబంధముందనే కోపంతో హత్య చేశాడు. 28 మార్చిన, ఉత్తరప్రదేశ్లోని హమీపూర్ జిల్లాలో, ఒక మహిళ ఆమె మేనల్లుడు హత్య గావింపబడినారు. దీనిని పోలీసులు పరువు హత్యగా పేర్కొన్నారు. ఇలాంటి మరొక భయానకమైన సంఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. ఒక వ్యక్తి తన బావమరిది తల నరికి, అతని తలను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళాడు (ఈ విషయం వీక్ పత్రికలో ప్రచురించబడింది). ఇటీవల కాలంలోనే న్యూఢిల్లీలో ఒక సబ్ ఇన్స్పెక్టర్, అతనితో పనిచేసే కానిస్టేబులును పరువు హత్య కేసులో అదుపులోకి తీసుకున్నారు. పరువు, గౌరవం పేరుతో జరుగుతున్న ఈ హత్యలకు ఎవరు కారకులు?
ప్రేమించడం నేరం కాదు. పరస్పరం గాఢంగా ప్రేమించుకున్న జంటను హత్య చేయడమనేది ఊహించుటకు వీలుకాని నేరం. ప్రేమించుకోవడం, తన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడం యుక్త వయసు వచ్చిన వారి హక్కు. వారి జీవితాలలో జోక్యం చేసుకోనే అర్హత ఎవరికీ లేదు. నిష్కల్మశమైన, నిస్వార్థమైన ప్రేమ సహజమమైనదేకాక, కులానికి, మతానికి, వర్గానికి అతీతమైనది. కాబట్టి, ఒక స్త్రీ పురుషుడు కలిసి జీవించాలనుకున్నప్పుడు, కృత్రిమమైన, గౌరవం పేరుతో చంపడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదు.
భారతదేశ చరిత్రలో కులాంతర, మతాంతర వివాహాలు అనేకం జరిగాయి. అలాంటప్పుడు, ఒకరి కొకరు తమ భావాలను, ఆసక్తులను కలబోసుకుని, తమకు నచ్చిన, ఇష్టమైన వారిని ఎంచుకునే హక్కును కాలరాస్తూ, కొందరు భారతీయులు వారిని వేధించడం, హత్యలు చేయడమెందుకు?
తల్లిదండ్రులు తమ పిల్లలకు జన్మనిచ్చి, ఎంతో ప్రేమగా, జాగ్రత్తగా పెంచినవారు, వారు తమ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకున్నప్పుడు, తిరోగమన సామాజిక నిబంధనలైన కులం, గోత్రం, వర్గం, మతం లేక లింగాలకు అనుగుణంగా లేరనే నెపంతో ఎందుకు అంత కఠినంగా వ్యవహరిస్తున్నారు?
ప్రేమలో పడినందుకు, వారిని అవమానిస్తున్నారు. సాంప్రదాయ, సనాతన వాదాల పేరుతో వారి ప్రేమను అంగీకరించడం లేదు. తల్లిదండ్రులు స్వార్థ బుధ్ధితో వారి పిల్లల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. అందువల్ల, వారి కుల స్వచ్ఛతను, వారికి సమాజంలో ఉన్న కీర్తిని, ఖ్యాతిని కాపాడుకోవడానికి తీవ్రమైన చర్యలకు పాల్పడుతున్నారు. ఒకొక్కప్పుడు కుటుంబ సభ్యుల నుంచి తీవ్రమైన ఒత్తిడి వల్ల, ప్రేమ విషయంలో శత్రు భావం ఉన్నవారివల్ల జంటలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది గ్రామీణ భారతంలో, చిన్న పట్టణాలలో కనబడుతున్న కఠోర వాస్తవం. కానీ ఇలాంటి సంఘటనలకు పెద్ద పట్టణాలు కూడా మినహాయింపు కాదు. క్రూరంగా హత్యలు చేసేవారు, అనేక సందర్భాలలో తాము దోషులమని భావించకపోవడం, పూర్తిగా అవమానకరమైన విషయం.
బాధాకరమైన విషయమేమంటే ''పరువు హత్యలు'' కేవలం గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాలేదు. అందరూ భావించే దానికి భిన్నంగా పట్టణాలలోని ఉన్నత విద్యావంతులు కూడా ''పరువు'' విషయంలో భూస్వామ్య ఆలోచనలకు లోనవుతున్నారు. వారి శారీరక, మానసిక భావాలకు, స్పందనలకు, కాపలాదారులుగా భావిస్తూ, పిల్లలు పెద్దవారయిన తరువాత కూడా వారి వ్యక్తిగత నిర్ణయాలలో జోక్యం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు తమ కుమార్తెలను, తోలు బొమ్మలుగా భావిస్తూ, మన కుల నియంత్రిత సమాజంలో వారి తప్పుడు అహంభావాన్ని, కీర్తిని సంతృప్తి పరుచుకునేందుకు పిల్లల శారీరక మానసిక భావాలను, స్పందనలకు నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రేమతో, ఆప్యాయంగా, జాగ్రత్తగా పెంచినప్పటికీ, వారిని తమ స్వంత ఆస్తిగా భావించరాదు. ఒకసారి వారికి యుక్తవయసు వచ్చిన తరువాత వారు ఎవరినైతే ఎన్నుకుని, ఇష్టపడతారో వారిని వివాహం చేసుకునే హక్కు లేక అసలు వివాహం చేసుకోకుండా ఉండేందుకు కూడా వారికి హక్కు ఉంటుంది. వారి వారి నైపుణ్యాలకు, అభిలాషలకు అనుగుణంగా వృత్తులను ఎన్నుకునే హక్కు వారికి ఉన్నది. పిల్లలను తమ భావోద్వేగాలతో బెదిరిస్తూ, తాము కుదిర్చినవారితో వివాహాలు జరపాలని కోరుకుంటున్నారు. ఇలాంటి చర్యలను, మన సమాజంలో నెలకొని ఉన్న ఇతర దురాచారాల మాదిరిగానే అభివృద్ధి నిరోధకమైనవిగా భావించాల్సి ఉంటుంది. ఇరువురి భాగస్వాముల అంగీకారం లేకుండా, బలవంతంగా నిర్వహించిన వివాహాలు, న్యాయబద్ధంగాగానీ, చట్టబద్ధంగాగానీ గుర్తించ బడవు. పరువు హత్యలు ఈ క్రింది కారణాల వల్ల జరుగుతున్నాయని పరిశోధకులు తెలిపారు.
1. సమాజం అంగీకరించలేని, గోత్రం, కులం, మతం లేక లైంగిక ధోరణితో స్త్రీ పురుషులు ప్రేమలో పడటం. 2. ప్రేమ వివాహాలు కుటుంబాలు కుదిర్చిన వివాహాలకు వ్యతిరేకంగా ఉండటం. 3. కుటుంబ సభ్యుల మధ్య అక్రమమైన, మోసపూరితమైన, లైంగిక సంబంధాలు.
హర్యానా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రప్రభుత్వాలు కులాంతర లేక గోత్రేతర వివాహాలకు వ్యతిరేకంగా కఠినమైన షరతులతో కూడిన, ఆదేశాలను జారీ చేసాయి. ఆధిపత్య కులాలకు చెందిన గ్రామస్తులు, కుటుంబాలచేత అనేక మంది యువజంటలు హత్యలకు గురయ్యారు. మెట్రోపోలిటన్ నగరాల్లో కూడా కుల విద్వేషాలు ప్రతికూల పాత్రను పోషిస్తున్నాయి. విద్యావంతులు కులాన్ని నమ్మరనే బ్రాహ్మణవాదుల ప్రచారానికి భిన్నంగా ఇది జరుగుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం, చెన్నరు లాంటి మెట్రో నగరంలో, వెనుకబడిన కులానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నడనే కారణంతో ఒక దళిత యువకుడిని పట్టపగలే హత్యచేశారు. ఈ సంఘటన ఆధారంగానే సూపర్ హిట్ అయిన ''శైరత్'' అనే మరాఠీ చిత్రాన్ని నిర్మించారు.
పరువు హత్యలకు మరొక కారణం మతాంతర వివాహాలు. ముస్లిం యువకులు ప్రేమ పెళ్ళిపేరుతో, హిందూ యువతులకు ఎర (గాలం) వేస్తున్నారనీ, వారిని ఇస్లాం మతంలోకి మార్చేందుకు ప్రయత్నిస్తున్నారనీ ఆరోపిస్తున్నారు. మితవాదులు దానిని ''లవ్ జిహాద్''అని పిలుస్తారు. అయితే, లవ్ జిహాద్ అనేది అవాస్తవమని, మితవాదులు ముస్లింలకు వ్యతిరేకంగా అసహ్య భావాన్ని వ్యాపింపజేయడానికి, సమాజాన్ని మతపరంగా విభజించడానికిచేసే ప్రచారమేనని అనేకసార్లు నిరూపించబడింది. కేరళకు సంబంధించిన హదియా కేసు ఇలాంటి సంఘటనకు ఒక ఉదాహరణ. హదియా ఒక ముస్లిం యువకుడిని వివాహం చేసుకుని, తన ఇష్ట పూర్తిగా ఇస్లాం మతాన్ని స్వీకరించింది. ఆమె కుటుంబం, సమాజంలోని కొందరు కలిసి ఆవిధంగా మారినందుకు, ఆమెను లక్ష్యంగా చేసుకుని వేధించారు.
తాము ఉన్నత కులాలకు చెందినవారిమని నమ్ముతున్న కుటుంబాలు, తమ పిల్లలు ''కులస్వచ్ఛత''ను కాపాడుకోవాలని కోరుకుంటున్నారు. ఒకవేళ ఉన్నత కులస్తురాలైన స్త్రీ, తక్కువ కులస్థుడైన పురుషుని వివాహమాడినట్లయితే, అది కలుషిత మైనట్లుగా పరిగణిస్తున్నారు. ఈ వివాహం ద్వారా జన్మించిన పిల్లలను శాస్త్రాల ప్రకారం ''వర్ణ సంకరం''అని పిలుస్తారు. ఇలాంటి కేసులలో వాస్తవంగా ఆస్తి సంబంధాలే ప్రాధాన్యత వహిస్తాయి. ఆయా కుటుంబాలు, వంశాలు వారి ఆస్తులు వారి కుల పరిధిలోనే ఉండాలని కోరుకుంటాయి. కులాంతర వివాహాలు ఈ పరిస్థితిని మార్చగలవు. ఉన్నత కులాలని పిలువబడేవారు ఈస్థితిని అంగీకరించడానికి ఇష్టపడరు. కుల స్వచ్ఛతను, నకిలీ గౌరవానికి అనుసంధానం చేస్తారు. ఇది ఆయా కుటుంబాలు ఎలాంటి అపరాధ భావనగానీ లేకుండా హత్యలు చేయవచ్చని నమ్మిస్తుంది.
బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు, కుల నిర్మూలన కోసం పోరాడడం, దీనితో పాటు ప్రజాస్వామ్య సంస్కతిని వ్యాపింప జేయడం, కుల వివక్ష వ్యతిరేక చట్టాలను అమలుచేయడం, సామాజిక, సాంస్కతిక, మరియు ఆర్థిక సమానత్వ సాధనకోసం పరిస్థితులను సృష్టించడం వల్ల మాత్రమే పరువు హత్యలకు దారితీస్తున్న తప్పుడు దురభిమానం అంతమవుతుంది.
చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని తమ నేరాలను సమర్థించుకుంటున్న ఫ్యూడల్ శక్తులకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య ప్రభుత్వం తీవ్రమైన చర్యలు చేపట్టాలి. కుల నిర్మూలన మాత్రమే పరువు హత్యలను నిర్మూలించగలదు.
రచనా అగర్వాల్
అనువాదం: మల్లెంపాటి వీరభద్రరావు, సెల్:9490300111