Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా మహమ్మారి రెండో దశ ప్రస్తుతం యావత్ భారతాన్నీ వణికిస్తున్నది. రాష్ట్రాలకు రాష్ట్రాలు దాని తాకిడికి విలవిల్లాడుతున్నాయి. ఆక్సిజన్, రెమిడిసివిర్ ఇంజక్షన్ల కొరత ఆస్పత్రులను వేధిస్తున్నాయి. దీంతో సరైన సమయంలో వైద్యం అందక జనాలు ప్రాణాలొదులు తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనే సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, పాలనలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న మంత్రి కేటీఆర్‌లు కూడా కరోనా బారిన పడ్డారు. సీఎం తన సొంత ఫామ్‌హౌస్‌లోనే ఉండి చికిత్స పొందుతుండగా... కేటీఆర్ ఇంట్లోనే హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ క్రమంలో గతేడాది ఇదే సమయంలో కరోనా ప్రారంభ దశలో ఉన్నప్పుడు... దాని గురించి సీఎం కేసీఆర్, శాసనసభలో చెప్పిన మాటలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. 'కరోనా మనకు రానే రాదు.. తెలంగాణకు దాన్ని రానే రానీయం.. వచ్చినా దాన్ని అడ్డుకుంటం.. ఒకవేళ వచ్చినా నాతో సహా ఎమ్మెల్యేలందరం మాస్కులు కట్టుకోకుండా పని చేస్తం.. అవసరమైతే వెయ్యి కోట్లు కేటాయించైనా సరే... జనాన్ని కాపాడుకుంటం...' అంటూ అప్పట్లో ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ప్రజలకు భరోసా కల్పించేందుకు సీఎం ఆ విధంగా మాట్లాడారో లేక అతి అంచనాకు పోయారో తెలియదుగానీ... ఆ తర్వాత పరిస్థితి తారుమారైంది. ఈ నేపథ్యంలో ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఇలాంటి సున్నిత అంశాల్లో అశాస్త్రీయంగా, వాస్తవాలకు దూరంగా అతి విశ్వాసాన్ని ప్రదర్శించకూడదంటూ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలోని ప్రతి పౌరుడూ సామాజిక బాధ్యతగా భావించి... విధిగా కరోనా నిబంధనలను పాటించాలనీ, తద్వారా తనతోపాటు తన కుటుంబాన్నీ, దేశాన్ని కరోనా నుంచి కాపాడాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా కరోనా వ్యాక్సిన్‌ను వేయించుకోవటం ద్వారా దాని తీవ్రత, ముప్పు నుంచి బయటపడాలని సూచిస్తున్నారు. సో... వారు చెప్పిన ఈ సూచనలను అందరూ పాటించాలని కోరుకుందాం. బాధితులందరితో పాటు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తో, కరోనా బారిన పడిన ఇతర ప్రజా ప్రతినిధులు త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం...
-బి.వి.యన్.పద్మరాజు