Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీహరి నామస్మరణ చేస్తూ నారదుడు యమలోకంలోకి ప్రవేశించాడు. పాపులు ఎక్కువగా లేరు. శిక్షలు అనుభవిస్తున్నవారు కూడా చాలా తక్కువగా ఉన్నారు! ఇదంతా చూసి ఆశ్చర్యపోయాడు నారదుడు! యమధర్మరాజు ఆంతరంగిక మందిరంలోకి వెళ్ళాడు. అక్కడ యముడు ఏకాంతంగా కూర్చున్నాడు! బాగా అలసిపోయినట్టు కన్పిస్తున్నాడు.
''నారాయణ! నారాయణ! యమధర్మరాజా అంతా కుశలమేనా!'' అంటూ పలకరించాడు నారదుడు.
''రా! నారదా! కుశల ప్రశ్నలు వేయకు! ఎక్కడ నుంచి విచ్చేశావు!'' అన్నాడు యముడు అలసటగా.
''భూలోకము నుండే వస్తున్నాను! బాగా అలసిపోయనట్లుంది! అయినా పాపులు తక్కువ సంఖ్యలో కనిపిస్తున్నారు. భూలోకంలో అందునా భారతదేశంలో మరణాలు పెద్ద ఎత్తున సంభవిస్తున్నాయి! ఏమీ అర్థంకావటం లేదు!'' అన్నాడు నారదుడు.
''ఆ మరణాలకు నేను బాధ్యుడిని కాదు కదా! నారదా!'' అన్నాడు యముడు.
''అయ్యో! సమవర్తీ నీవు ప్రాణాలు తీస్తావన్న మాటే జనం మర్చిపోయారు. మరణం సంభవిస్తే అది కరోనా కాటేనని జనం అనుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో జనం ప్రాణాలు పోతున్నాయి. ఇక్కడేమో అంతా ఖాళీ! ఎందుకు అన్న ప్రశ్నకు నీవు సమాధానం దాటవేస్తున్నావు! ఇది నీకు న్యాయమా సమవర్తీ!'' అన్నాడు నారదుడు.
''అది దేవరహస్యం నారదా!'' అన్నాడు యముడు.
''దేవర్షికి దేవరహస్యం తెలియకూడదా? సమవర్తి'' అన్నాడు నారదుడు.
''ఆ దేవ రహస్యం నీకు తెలిస్తే, రహస్యమెలా అవుతుంది నారదా! ఐనా నీవు అడిగావు కనక చెబుతున్నాను. కరోనా వల్ల చనిపోయిన వారంద రినీ ఎలాంటి పాప, పుణ్యాల విచారణ లేకుండా నేరుగా స్వర్గానికి పంపుతున్నాను. అందువల్ల ఇక్కడ ఖాళీగా ఉంది!'' అన్నాడు యముడు.
''ఈ విషయం త్రిమూర్తులకు తెలుసా?'' ఆశ్చర్యంగా అడిగాడు నారదుడు.
''ఆు వారికీ తెలుసు! పాలకుల నిర్లక్ష్యంతో ఆకాల మరణం పొందినవారిని విచారించవలసిన అవసరం లేదు. వారి పాపాలు కూడా పాలకుల ఖాతాలోనే రాసేయమన్నారు'' వివరించాడు యముడు.
''చాలా కాలానికి త్రిమూర్తులు మంచి నిర్ణయమే తీసుకున్నారు'' అన్నాడు నారదుడు.
''సరేగానీ! భూలోకం విశేషాలు ఏమి నారదా! పాపులను విచారించవలసిన అవసరం లేనందున, భూలోకం విశేషాలు పెద్దగా తెలియటం లేదు!'' అన్నాడు యముడు.
''భారతదేశంలో విశేషాలే కాక, విచిత్రాలు కూడా జరుగుతున్నాయి!'' అన్నాడు నారదుడు.
''విచిత్రాలనగా ఏమి నారదా?'' అడిగాడు యముడు.
ప్రభుత్వరంగ సంస్థలను అయినవారికి, అగ్గువకు అప్పగించాలని భారతదేశ పాలకులు కంకణం కట్టుకున్నారు. ఆరు నూరైనా ప్రయివేటీకరిస్తామని శపథం కూడా చేశారు. అట్లా ప్రయివేటీకరిస్తామన్న సంస్థలలో విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ఉంది! దాన్ని అమ్మేందుకు రేటు కూడా నిర్ణయించారు. ఇప్పుడు పాలకుల చేతగాని తనంతో దేశంలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ప్రజల ప్రాణాలు కాపాడే ఆక్సిజన్ నేను సరఫరా చేస్తానని విశాఖస్టీలు ప్లాంట్ ముందుకు వచ్చింది. దేశంలోని అనేక రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తున్నది!'' వివరించాడు నారదుడు.
''ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరి స్తామని శపథాలు చేసినవారిని చెప్పుతో కొట్టినట్టైంది! భలే శాస్తి జరిగింది. ప్రభుత్వరంగ సంస్థలు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రజలకు అండగా నిలబడతాయని విశాఖ స్టీలు ప్లాంట్ మరోసారి నిరూపించింది! భళా విశాఖా భళా!'' అంటూ మీసాలు దువ్వాడు యమధర్మరాజు.
''అంతే కాదు! స్టీలు ప్లాంటును కొందామనుకున్న వారు, పాలకుల ప్రాణమిత్రులు అయిన అంబానీలు, ఆదానీలు ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో కనబడటం లేదు. వినబడటం లేదు!'' అన్నాడు నారదుడు.
''భారతీయులందరికి రిలయన్స్ ఉచితంగా టీకా వేయిస్తుందని, నీతు అంబానీ ప్రకటించనట్టు గుర్తు. ఆ ప్రయత్నాలేమైనా చేస్తున్నారా నారదా?'' ఆరా తీశాడు యముడు.
''అయ్యో! యమధర్మరాజా! నీతు అంబానీకి ప్రస్తుతం అంత తీరికలేదు. ఐపీఎల్లో తమ ముంబై ఇండియన్ జట్టుకి కప్పు తెప్పిచ్చే ప్రయత్నంలో ఉన్నది. టీకా గురించి ఆలోచనే లేదు!'' అన్నాడు నారదుడు.
''మరి ప్రజలకు టీకాలు ఎవరు వేస్తున్నారు!'' అడిగాడు యముడు.
''భారతదేశంలో కరోనా టీకాలకు పెద్ద ఎత్తున కొరత ఏర్పడింది! చాలా రాష్ట్రాల్లో టీకాలు లేక, టీకా కేంద్రాలు మూసివేశారు. టీకాలు కావాలని రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి!'' అన్నాడు నారదుడు.
''మరి ''టీకా ఉత్సవ్'' నిర్వహించు కుందామని ప్రధాని పిలుపునిచ్చారు కదా!'' ఆశ్చర్యంగా అడిగాడు యముడు.
''దేశంలో ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్లు ఇతర దేశాలకు బహుమతులుగా పంచిపెట్టారు. దాంతో దేశంలో కొరత ఏర్పడింది. ఇదేదీ పట్టించుకోకుండా వ్యాక్సిన్ ఉత్సవ్ అని ఆర్భాటంగా పిలుపునిచ్చారు'' అన్నాడు నారదుడు.
''గతంలో నల్లడబ్బు బయటకు తెస్తాం! బ్యాంకు అకౌంట్లలో 15లక్షలు వేస్తాం ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తాం! లాంటి ఆర్భాటాలు చేశారు. ఆ ఆర్భాటాల్లో ఇప్పుడు టీకాలు కూడా చేరిపోయాయన్నమాట!'' అన్నాడు యముడు.
''అవును! యమధర్మరాజా! మరో విచిత్రం కూడా ఉంది!'' అన్నాడు నారదుడు.
''భారతదేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండీ వింతలూ విచిత్రాలకు కొరతలేదన్న మాట!'' అన్నాడు యముడు.
''కరోనా ఇంత ఉధృతిలో ఉండగానే! హరిద్వారాలో కుంభమేళా నిర్వహించారు!'' అన్నాడు నారదుడు.
''అదేమిటి నారదా! హరిద్వార్ కుంభమేళా వచ్చే సంవత్సరంలో జరగవలసి ఉంది కదా! ఇప్పుడెలా నిర్వహించారు?'' అన్నాడు యముడు ఆశ్చర్యంగా!
''అందుకే అది విచిత్రం! వచ్చే ఏడాది జరపవలసిన కుంభమేళా ఈ ఏడాదే జరిపారు. ఫలితంగా లక్షలాది మంది సాధువులు వచ్చి గంగానదిలో స్నానం చేశారు. దాంతో దాదాపు 5లక్షల మంది సాధువులకు కరోనా సోకింది! వారి వల్ల మరెంత మందికి కరోనా సోకిందో తెలియటం లేదు!''
''ఇది నిజంగా విచిత్రమే! గత ఏడాది తబ్లిగి మజీద్లో కొన్ని వందల మంది ముస్లింలు సమావేశం జరిపితే దానివల్ల దేశానికి కరోనా వచ్చిందని తెగ ప్రచారం చేశారు. మరి ఇప్పుడు లక్షలాది మంది సాధువులను ఒక చోట చేర్చారు! కరోనా సెకండ్ వేవ్ ఉన్నదని తెలిసీ కుంభమేళా నిర్వహించారు! అంటే ఇప్పటిదాకా బీజేపీ చెబుతున్నది నిజమే! హిందువులు ప్రమాదంలో ఉన్నారు! ఐతే ఇతరుల వల్ల ఆ ప్రమాదం లేదు! స్వయంగా హిందూ పాలకుల వల్లే ఆ ప్రమాదం సంభవిస్తున్నది. ఈ విషయం వారే అర్థం చేసుకోవాలి'' అన్నాడు యముడు.
''అవును సమవర్తీ! గంగామాత కూడా ఇదే సెలవిచ్చింది!'' అన్నాడు నారదుడు.
''పూర్తిగా వివరించు నారదా!'' కోరాడు యముడు.
''నేను గతంలో ఎంతో పవిత్రంగా ఉండేదానను. మానవుల స్వార్థ ప్రయోజనాల కోసం నన్ను కలుషితం చేశారు! ఇప్పుడు అనవసరంగా కుంభమేళా నిర్వహించటంతో ఎక్కడెక్కడివారో వచ్చి, నాకు కరోనా అంటించారు. నమామి గంగే! అంటే కోట్లాది నిధులు ఖర్చుచేసి నన్ను ఉద్ధరించలేదు! పైగా పవిత్ర గంగలో మునిగితే వైరస్ నశిస్తుందని అవాకులు, చవాకులు పేలుతున్నారు. బీజేపీ పాలనలో నేను పూర్తిగా అపవిత్రం అయ్యానని గంగాదేవి కన్నీళ్ళు పెట్టుకుంది!'' అని వివరించాడు నారదుడు.
''అవును నారదా! నిజమే! గత వారం రోజులుగా పవిత్ర వారణాశిలో పెద్ద ఎత్తున కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా సోకిన వారికి తగు వైద్యం అందక, ఆస్పత్రుల్లో బెడ్లు దొరకక, ఆక్సిజన్ లభించక ఎందరో అభాగ్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. వారణాశిలో తనువు చాలిస్తే పునర్జన్మ ఉండదని, ఎందరో ఎక్కడెక్కడి నుంచో చరమదశలో వారణాశి చేరుకుంటారు. కాని ప్రస్తుతం వారణాశిలో ఉంటే అకాల మరణం సంభవిస్తోందని, వారణాశి వదలి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంత దారుణం! విశ్వనాథుడికి ఎంత అవమానం!'' అన్నాడు యముడు.
''ప్రస్తుతం, ప్రపంచంలో అత్యంత ప్రమాదకర స్థితిలో భారతీయుల ఆరోగ్యస్థితి పడిపోయింది. దేశాన్ని ఎంతో అభివృద్ధి చెందించామని బీజేపీ చెప్పుకుంటున్న గొప్పలు ఒట్టి దిబ్బలే అని స్పష్టంగా తెలిసిపోయింది. మా గంగాకి బేటా అని తనకు తాను చెప్పుకున్న ప్రధాని, గంగామాతకి తీరని ద్రోహం చేసినట్టే! ఇటు ప్రజలకు ద్రోహం చేసి, అటు దేవతలకు ద్రోహం చేసిన పాలకులకు ఎలాంటి శిక్షలు విధిస్తారు?'' ప్రశ్నించాడు నారదుడు.
''హహ్హహ్హ! నారదా బీజేపీ పాలకుల పాపాలు ఎన్నతరం కాదు! అందుకే వారి పాపాల చిట్టా రాయటానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశాను. వారి పాపాలకు తగిన శిక్షలే విధించబడతాయి!'' అంటూ యముడు సమావేశాన్ని ముగించాడు.
- ఉషా కిరణ్