Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో కరోనా రెండవ అల ఉప్పెనలా మారింది. రోగం ఎక్కువై తగ్గి మరలా ఎక్కువగా పెరగడం రోగ అల. ఈ అల పునరావృతం అవడం రెండవ అల. కొన్ని రాష్ట్రాల్లో కరోనా మూడవ అల కనిపిస్తోంది. దేశ వ్యాపితంగా రోజుకు సగటున 3లక్షల మందికి పైగా కోవిడ్ సోకుతోంది.
మహారాష్ట్ర కోవిడ్ పరీక్షల్లో 50శాతం రెట్టింపు ఉత్పరివర్తనాలు కనిపించాయి. జన్యుక్రమం అత్యంత వాడిమొనలు గల బి.1.617, ఇ484క్యు, ఎల్452ఆర్ వైవిధ్య వైరస్‌లను చూపించింది. ఇవి రోగి కణాలను అతుక్కొని గట్టిగా పట్టుకుంటాయి. నయంకావడానికి చాల సమయం పడుతుంది. రోగం సులభంగా, తొందరగా వ్యాపిస్తుంది. రోగనిరోధకశక్తిని అధిగమిస్తుంది. ఇతర 8 రాష్ట్రాల్లోనూ కొంత తక్కువ స్థాయి బి.1.617 వైవిధ్య వైరస్ కన్పించింది. ఇ484క్యు వైవిధ్య వైరస్ ప్రతిరోధక (యాంటిబాడి) తటస్థీకరణను తప్పించుకో గలదు. ఎల్452ఆర్ వైవిధ్య వైరస్ సంక్రమణస్థాయి ఎక్కువ. కేరళలో ఎన్440, పశ్చిమ బెంగాల్లో బి.1.618 బలమైన స్థానిక వైవిధ్యాలను గుర్తించారు. మన దేశంలో దక్షిణాఫ్రికా, బ్రెజిల్, యునైటెడ్ కింగ్‌డమ్‌లకు రెట్టింపు రూపాంతర వైవిధ్య వైరస్లు వ్యాపించాయి. రెట్టింపు రూపాంతర వైవిధ్య వైరస్ అత్యంత తీవ్రమైన, అసాధారణ రోగ లక్షణాలు కలిగిస్తుంది. 45ఏండ్ల లోపు యువకులకు, చిన్న పిల్లలకు సులభంగా సోకుతుంది. ఇప్పుడు ఈ రూపాంతరాల వ్యాధి తీవ్రత పెరుగుతోంది. మారిన వీటి లక్షణాలను గుర్తించడం వైద్యులకూ కష్టంగా ఉంది. వైరస్ రూపాంతరాలు బలహీనపడతాయి. కానీ మోసపూరితంగా ప్రవర్తిస్తాయి. చాలా తెలివిగా దొరకకుండా దీర్ఘకాలం మనుగడ సాగిస్తాయి. ఏండ్ల తరబడి ఒంట్లో ఉండి శరీరాన్ని నిదానంగా కృశింపజేస్తాయి. టీకా వేయించుకున్నా కొందరిలో ప్రతిరోధక తటస్థీకరణ తక్కువగా, గందరగోళంగా ఉంటుంది. ఒక వైరస్‌కు నిరోధకశక్తి పొందిన రోగికి కొత్త వైరస్ వలన మరలా కోవిడ్ వస్తుందని లాంసెట్ నివేదించింది. కోలుకున్న కోవిడ్ రోగుల్లో రక్తం గడ్డకడుతుందని కొత్త పరిశోధనలు తెలిపాయి. రెండవ అల కోవిడ్ 4 రకాలుగా ఉంటోంది. 1.కొత్త లక్షణాలతో తొలిసారి సోకడం 2.టీకా వేయించుకున్నా సోకడం 3.కోవిడ్ రెండోసారి రావడం 4.పాత వైరస్‌తో కోవిడ్. జనవరి నుంచి వైరస్ సోకినవారిలో ఒకశాతం మందికే పరీక్షలు జరిగాయి. కోవిడ్-19 గాలి ద్వారా వ్యాపిస్తుందనడానికి బలమైన ఆధారాలున్నాయని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు యునైటెడ్ కింగ్డమ్ వైద్య వారపత్రిక లాంసెట్లో నివేదిక సమర్పించారు. అంతకు ముందే హైదరాబాద్ సెంటర్ ఫార్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సిసిఎంబి) శాస్త్రజ్ఞులు ఆస్పత్రుల్లో, కోవిడ్ రోగులున్న మూసిన గదుల నుంచి నమూనాలను పరీక్షించారు. లాంసెట్ ప్రచురించిన విషయాన్ని జనవరిలోనే ప్రకటించారు. దీర్ఘకాలం కోవిడ్ రోగులున్న గదుల నుంచి వారు వెళ్ళిపోయిన రెండు గంటల తర్వాత కూడా రెండు మీటర్ల దూరాన్ని దాటి కరోనా వైరస్ రేణువులను గుర్తించారు. కోవిడ్ రోగ తీవ్రత ఎక్కువగల రోగులు ఎక్కువమంది ఎక్కువ సేపు ఉన్న గదుల నుంచి కరోనా వైరస్ గాలి ద్వారా ఎక్కువ మోతాదులో వ్యాపిస్తుంది. దగ్గితే, తుమ్మితేనే గాక మాట్లాడినా కూడా ఈ వైరస్ గాలి ద్వారా వ్యాపించే అవకాశాలు ఉన్నాయి. వైరస్ సోకిన వ్యక్తి సంగతి తెలిసేలోపు ఎంతమందితో సంపర్కంలో ఉన్నాడు, వాళ్ళు ఎంతమందిని కలిశారు, వైరస్ సోకిన వాళ్ళంతా ఎంతకాలం ఏ విధంగా జనాల్లో తిరిగారు అన్న అంశాలపై వైరస్ పునరుత్పత్తి నిష్పత్తి, ఈ నిష్పత్తిపై రోగవ్యాప్తి ఆధారపడి ఉంటాయి. స్వయం నియంత్రణ, ఏకాంతవాసం, నోరు, ముక్కులను పూర్తిగా మూసుకునే విధంగా మాస్క్ ధరించడం దీనికి పరిష్కారం.
ఇప్పుడు కోవిడ్ పాత లక్షణాలు కనిపించవు. జీర్ణాశయ సమస్యలు, ఊపిరి తిత్తులు ఛాతీ గుండెల్లో మంట, పొత్తి కడుపు, కండరాల, కీళ్ల, దవడల, కాళ్ళుచేతుల, వేళ్ళ, పక్కటెముకల, మూత్రపిండ నొప్పులు, నీరసం, ఆకలి మందగింపు, వికారం, వాంతులు, మెదడు పోటు, శరీర ఉష్ణోగ్రత తగ్గడం, చర్మం మంట, రక్తపోటు పడిపోవటం, నరాల బలహీనత, లింఫ్, థైరాయిడ్ గ్రంధుల వాపు, ఎక్కువగా ఉమ్మి, మూత్రం రావటం, గొంతు ఎండటం, రక్తహీనత, పెదాలు నల్లబడ్డం, భ్రమ భ్రాంతి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. కొత్త వైరస్ సమస్యలకూ జాగ్రత్తలే శరణ్యం. మాస్క్, శానిటైజర్ వాడాలి. గాలి ద్వారా వైరస్ వ్యాప్తిని ఆపడానికి కనీసం 6అడుగుల భౌతిక దూరం పాటించాలి. మత, రాజకీయ, కుటుంబ సామూహిక కార్యక్రమాలు నిర్వహించరాదు. హాజరు కారాదు. ప్రత్యేకించి బస్సు, రైలు ప్రయాణాలు మానాలి. సొంత వాహనాలు వాడాలి. బయటి నుంచి రాగానే స్నానం చేస్తే మంచిది. క్లబ్బులు, పబ్బులు, బార్లు, మద్యం అమ్మకాలు, సినిమాలు, హౌటళ్లు, విద్యాలయాలు మూసేయాలి. టీకాలో రాజకీయ ప్రయోజనాలు, కార్పొరేట్ల లాభాలు ఉంటాయి. అయినా టీకా వేయించుకోవాలి. కానీ టీకా తిరగబెడితే, రక్తం గడ్డకడితే, పరోక్ష ప్రభావం చూపితే, టీకా ప్రతిచర్య విపరీతంగా ఉంటే ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సౌకర్యాలను అన్ని టీకా కేంద్రాలకు అందజేయాలి. పుష్టికర ఆహారం తినాలి. రోజూ కనీసం గంట వ్యాయామం చేయాలి. మధుమేహ, రక్త పోటు, శ్వాసకోశ, గుండె, థైరాయిడ్, మూత్రపిండాల రోగులు వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో ఉండాలి. ధూమ, మద్యపానాలు, పొగాకు ఉత్పత్తుల వాడకం హానికరం. ప్రజలు ఈ జాగ్రత్తలు పాటించడంలో ప్రభుత్వం సహకరించాలి. పరీక్ష సౌకర్యాలు, పరికరాలు, చికిత్స ఉచితంగా అందించాలి. రోగులు తిరిగిన ప్రాంతాలు, కలిసిన వ్యక్తులను వెదకడంలో, చికిత్సలో ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పిల్లలను ఈసారి మరింత జాగ్రత్తగా చూడాలి. రాజకీయ ప్రయోజనాలు, కార్పొరేట్ల లాభాల కల్పన మానాలి. భౌతిక దూరం పాటింపునకు ఖాళీ విద్యాలయాల, పరిశ్రమల, కార్యాలయాల భవనాలు, ప్రాంగణాలు, శౌచాలయాలను వారికి అప్పజెప్పాలి. అన్నిటినీ మించి ప్రభుత్వ గిడ్డంగులలోని ఆహార పదార్థాలను వారికి ఉచితంగా పంచిపెట్టాలి. ఎన్నికల్లో ఎప్పుడైనా గెలవచ్చు. ప్రజల మనసులు గెలవడం కష్టం. వారికి ప్రాణరక్షణ కల్పించడం ఒక మార్గం.
ఎస్.హనుమంతరెడ్డి
సెల్: 9490204545