Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గంగానది పవిత్రమైనదో అపవిత్రమైనదో, ఎన్నికైన ప్రతీ నాయకుడూ గంగానదిని ఎందుకు ప్రక్షాళణ చేయాలనుకుంటాడో ప్రస్తుతానికి అవసరం లేదు గానీ, గంగానది మొదలు మూసీ నది వరకు వాటి ఒడ్డున వరుస కట్టిన సీరియల్ బల్బుల్లా కాంతులు రోజూ దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. అవి దివిటీలు కావు, కాగడాలు అంతకన్నా కాదు. అవి ''కాష్టాలు''. స్థితీ గతీ తప్పిన ప్రయత్నాల చితి మంటలు. శ్మశాన వాటికల కిటికీల్లోంచి కోరలు చాచి మన మొహాలపై మసిని పూస్తూ ఇన్నాళ్ళ నిర్లక్ష్యాన్ని హెచ్చరిస్తున్న భౌతిక జ్వాలలు. కదిలించే దిక్కులేక కమురుతున్న బాధ్యతారాహిత్యపు పాలకుల పరాకాష్టలకు సాక్షాలు అవి. ''కరోనా మహమ్మారి పట్ల జాగ్రత్తగా ఉండండి, గుంపులు గుంపులుగా గుమి గూడకండి'' అని ఒక్క పలుకు పలికితే ఎన్నికల ప్రచారానికి జనం పల్చబడతారేమో అనే సంకుచిత కుసంస్కారానికి పెరుగుతున్న పాపపు ఫలితపు రాసులే స్మశానాలు నిండిన ఈ కాష్టాలు. అర్థం పర్థంలేని అశాస్త్రీయ విధానాలతో కార్చిచ్చులా సమాజానికి కరోనాని అంటించి, అది దహించి వేస్తుంటే ఇంకా రివ్యూలు చేయడమేంటి! ఆరోగ్య అత్యవసర స్థితిని ప్రకటించకుండా!?
కరోనా వ్యాప్తికి కారణం ఎవరో బాధ్యత వహించకపోయినా కనీసం నియంత్రించ లేకపోవడానికి కారణమైనా బహిర్గత పరిచి బాధ్యత వహించకపోతే ఎలా! నియంత్రించే కర్తవ్యం ప్రభుత్వానిది కాక మరెవరిది? అంతా సవ్యంగా ఉంది, మేము చేసిందే సరైంది, మా నిర్ణయంలో మార్పుండదు అన్న మొండి తనమే ఈ దుస్థితికి కారణమన్నది వాస్తవం కాదా? ''ఈ దేశంలో వేడి ఎక్కువ, మన దేశ పౌరులకు ఇమ్యూనిటీ ఎక్కువ, లాక్డౌన్ విధించి మొత్తం కట్టడి చేశాం'', లైట్లు వెలిగించి గంటలు కొట్టి, ఏమీ అవ్వక ముందే హెలికాప్టర్ల ద్వారా డాక్టర్లపై పూల వర్షం కురిపించి అశాస్త్రీయమైన పోకడల్లోకి ప్రజలను నెట్టటం ద్వారానే అందరిలో నిర్లక్ష్యాన్ని, బాధ్యతా రాహిత్యాన్ని చొప్పించినట్లైందన్నదీ వాస్తవమే. ఇంకా చెప్పాలంటే ప్రజలను తప్పుదోవ పట్టించారు. తొమ్మిది గంటలకు తొమ్మిది నిమిశాలు లైట్లు ఆర్పేయండి కండ్లు కనపడక కరోనా మాయమై పోతది అంటూ అశాస్త్రీయమైన పద్ధతుల్లో సాధించామన్న అపోహలు కలిగించిన తరువాత మీరు వ్యాక్సిన్ వేసుకోండి అని చెప్పడంలో విశ్వసనీయత ఉంటుందా? ''భారత్‌లో తయారైన వ్యాక్సిన్ మంచిది దానిని నమ్మండి'' అంటూ సెల్ ఫోన్ కాలర్ ట్యూన్‌గా పెట్టి మరీ ప్రజలను ప్రాధేయ పడవలసిన దుస్థితికి కారణం ఈ అశాస్త్రీయ పద్ధతుల ద్వారా తప్పుదోవ పట్టించడమే. దానికి నేడు ప్రజలు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. అలాంటి పద్ధతులను ప్రోత్సహించిన వారు నేడు చట్టం ముందు దోషులుగా నిలబడాలి, మోరల్ రెస్పాన్సిబిలిటీతో రాజీనామా చేయాలి. కానీ అంతటి ఉదాత్తత నేటి నాయకుల నుంచి ఆశించగలమా? లేని గొప్పలకు పోయి మేమే ప్రాణదాతలమన్న కీర్తి కక్కుర్తిలో అరవైశాతం వ్యాక్సిన్లను ఎగుమతి చేసి నేడు వ్యాక్సిన్ల కొరత ఉన్నదని వాపోవడం ఎవరి తప్పిదం? మొదటి వేవ్‌లో ఆసుపత్రుల పడకలు సరిపోలేదనే హౌటళ్ళను ఉపయోగించుకున్న ఢిల్లీ సర్కారు నేడు మళ్ళీ అదే దుస్థితిలోకి నెట్టబడింది. అత్యవసర పరిస్థితుల్లో క్రీడా మైదానాలనూ, పాఠశాలలనూ ఆసుపత్రులుగా మార్చుకుంటామంటే కూడా ఢిల్లీ ముఖ్యమంత్రికి లెఫ్టినెంట్ గవర్నరు అనుమతి లేనిదే సాధ్యపడని స్థితిని నేటి కేంద్రం తెచ్చింది. దీనిని బట్టి వారికి ఏది ప్రాధాన్యమే అర్థమవుతూనే ఉందికదా!? రాజ్యాంగానికి బద్దులై ఉండవలసిన మంత్రులు, ముఖ్య మంత్రులు, ప్రధాన మంత్రీ రాజకీయ కోణంలో ప్రతి రోజూ విమర్శ ప్రతి విమర్శలతో సవాళ్ళు విసురుకుంటున్నారంటే ప్రజా సమస్య కన్నా వారి రాజకీయ భవిష్యత్తే ప్రముఖమన్నది బహిర్గమవుతున్నది. కరోనా వ్యాప్తి తెలిసి కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లనే నేడు ఆక్సిజన్ కొరత పెరిగింది. దీనిపై కూడా కేంద్ర రాష్ట్రాలు ఒకరిపైనొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. మూడు లక్షల మార్కు దాటి పోతున్నది కాబట్టి ఇప్పటికైనా ప్రతి పాఠశాలా, క్రీడా మైదానం, ప్రధాన హౌటాళ్ళనూ తాత్కాలిక ఆసుపత్రులుగా మార్చి సామూహిక ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
నా భక్తి ముందు వైరస్శక్తి ఎంత అంటూ విర్రవీగి అమాయకులను రెచ్చగొట్టి అభ్యంగన స్నానాలు చేయించి మాయ రోగానికి మంచం ఎక్కిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రికి ఆక్సిజన్ కొరత లేకపోవచ్చు, ఆయనకది పెద్ద సమస్య కాకపోవచ్చు కానీ ఆయన ధట్టించిన భక్తి ఘాటును ప్రశ్నిస్తే దేవుడు దెయ్యమై మనల్ని కాటేస్తాడేమోనని నిమ్మకు నీరెత్తినట్టు గుట్టుచప్పుడు కాకుండా ఉన్న అధికారులూ నాయకులది జుగుప్సాకర తత్వమే. కరోనా కాష్టాలతో మహానదులు మంగళహారతుల్లా ఒక వైపు భయపెడుతుంటే, రాజకీయ పీఠాలు అందుకున్నాక వారణాసికి వచ్చి మహాహారతి ఇవ్వడానికి దిక్కులేని వాళ్ళని దివిటీలుగ బలిస్తున్న సందర్భం నేటి రాజకీయ పెద్దల ద్వారా విధితమౌతున్నది. ''ఎన్నికల ర్యాలీలో కరోనా విజృంభిస్తే ఎలా, మీకు ఏమీ అనిపించడం లేదా'' అని దేశ గృహ మంత్రిని విలేకరులు ప్రశ్నిస్తే, ''ఈ అంశంపై ఎలక్షన్ కమిషన్ అడగండి'' అని ఎంత గొప్ప బాధ్యతతో సెలవిచ్చాడో చూడండి హౌమ్ మినిస్టర్! ఏడాది కాలంగా నరకయాతనను చూపిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి అరకొర వ్యాక్సిన్ తయారు చేయడం తప్ప సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సమాయత్తం కాలేదన్నది వాస్తవం. ఎవరిదీ పాపం?
యజ్ఞ యాగాదులు చేసేటప్పుడు, పూజలు చేసేటప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా, పరిసర పరిస్థితులు, సహజ బంధు జనం సరైన విధంగా ఉన్నారా లేదా అన్న అంశాలు పరిగణనలోకి తీసుకొని కార్యక్రమాలకు పూనుకోవాల్సినదిగా వేదాలు పురాణాలు పురమాయిస్తున్నట్టు పెద్దలు చెబుతారు. అంతుచిక్కని కరోనా వ్యాధినపడి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా ఆకలిగొన్న పులుల్లా ఓట్ల వేట కోసం వెంపర్లాటలు ఆగటం లేదు, తమ పాపాలన్నీ కడిగేసుకుని వేరే వారి కన్నా తమకే ఎక్కువ పుణ్యం దక్కాలన్న విచిత్ర భావజాలంతో గంగా స్నానాలు జరుగుతుంటే పదవిలో కూర్చుని సక్రమార్గాన్ని బోధించవలసిన నాయకగణమే పురమాయించి మరీ పుణ్య స్నానాలకు ప్రోత్సహిస్తుంటే ఎవరు విఫలమైనట్టు? రోజుకు మూడు లక్షల కేసులు నమోదవుతున్నాయంటే భౌతిక దూరాన్ని పాటించకపోవడాం కాదా? ''రెండు గజాల దూరాన్ని పాటించండి, రాత్రనకా పగలనకా మాస్కులు ధరించండి'' (దో గజ్కీట దూర్ మాస్క్ జరూర్) అని చెప్పిన నినాదం ఎన్నికల ప్రసంగాల్లో లక్షలమంది ఒకరినొకరు ఆనుకుని నిలబడి వింటుంటే గుర్తుకు రావడం లేదా ఈ పెద్దమనుషులకు? స్మశాన వాటికలకు కట్టెల మోపుల్లా శవాలను మోసుకు వస్తుంటే ఇది ఆత్మ దుర్భరతకు సాక్ష్యం అని అనిపించటంలేదా? ఆక్సిజన్ సరఫరాపై కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నందుకు రాష్ట్రాలపై ఒంటి కాలితో లేస్తున్న కేంద్రం, కరోనా కాలంలోనూ కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటింపజేసుకున్న కార్పొరేటు దిగ్గజాలు రోగులను ఆదుకునే పాత్ర పోషించాలని చెప్పడానికి ఎందుకు వెనకాడుతున్నది? వైద్య వ్యవస్థ ప్రభుత్వాధీనంలో లేకపోవడం వల్లనే కరోనా రోగులను కాపాడుకోలేకపోతున్నామన్న వాస్తవాన్ని ఇకనైనా గుర్తించి, ఆరోగ్య అత్యయిక పరిస్థితిని ప్రకటించి చిన్న చితకా నుంచి కార్పొరేటు ఆస్పత్రులన్నింటినీ జాతీయం చేయాలి. సిబ్బందినంతా ప్రభుత్వోద్యు గులుగా ప్రకటించాలి. లాభాలు గడించి బిలియనీర్లుగా నమోదైన కార్పొరేట్లందరికీ ఆరోగ్య భారత్ బాధ్యతను అప్పజెప్పాలి. ఈ మహమ్మారి ఇప్పట్లో తేలేట్టు లేదు, ఇంకెన్ని వేవ్‌లతో విరుచుకు పడుతుందో తెలియటంలేదు కాబట్టి ఇలాంటి సహసోపేతమైన చర్యలు అవసరం.
జి. తిరుపతయ్య
సెల్: 9951300016