Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొద్ది రోజుల క్రితం అధికారికంగా ప్రకటించిన టోకు ధరల సూచీ ప్రకారం మార్చి 2020తో పోల్చితే మార్చి 2021లో ధరలు 7.39శాతం అధికంగా పెరిగాయి. గత ఎనిమిది సంవత్సరాలలోనూ ద్రవ్యోల్బణం ఎప్పుడూ ఇంత ఎక్కువగా లేదు. 2012 అక్టోబర్ నెలలో మాత్రమే మనం 7.4శాతం ధరల పెరుగుదలను చూశాం. (అంతకు ముందేడాది అక్టోబర్‌తో పోల్చితే)
గత ఏడాది చాలా కట్టుదిట్టంగా లాక్డౌన్ అమలు చేసినందున, ఆ కాలంలో వినిమయ వస్తువుల ధరలకు సంబంధించిన పూర్తి వాస్తవ సమాచారం లేనందున గత మార్చిలో లెక్క వేసిన ధరల సూచీ అంత పక్కాగా తయారైందని అనుకోలేమని, దానితో పోల్చి ఈ మార్చిలో వేసిన లెక్క కూడా పక్కాగా ఉందని భావించనవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ఈ మారు మనకొక జాగ్రత్త చెప్పింది. ఆ వివరణ వలన మనకేమీ ఊరట కలగదు. ఎందుకంటే, ఈ ఫిబ్రవరి 2021తో పోల్చి చూసినా, ధరలు ఒక్క నెలలోనే ఏకంగా 1.57 శాతం పెరిగాయి.
అంటే మనం చాలా స్పష్టంగా ద్రవ్యోల్బణం విజృంభించడాన్ని కండ్లారా ఇప్పుడు చూస్తున్నాం. కొంత కాలంగా ఈ ధోరణి బలపడుతూవస్తోంది. జనవరి 2020తో పోల్చితే జనవరి 2021లో 2.51శాతం, ఫిబ్రవరి 2020తో పోల్చితే ఫిబ్రవరి 2021లో 4.17శాతం ధరలు పెరిగాయి. ఇక్కడ ప్రశ్న ఏమంటే ఈ ధరల పెరుగుదలకు కారణం ఏమిటి? అన్నదే.
దేశంలో నిరుద్యోగం భారీ స్థాయిలో ఉంది. పరిశ్రమల్లో ఉన్న సామర్థ్యంలో చాలా భాగం మేరకు ఉత్పత్తి జరగడం లేదు. ప్రభుత్వం దగ్గర పెద్ద ఎత్తున ఆహార ధాన్యాలు నిలవ ఉన్నాయి. అంటే కొనుగోలు శక్తి తగినంత లేక ఆర్థిక వ్యవస్థ ముడుచుకుపోయివుంది. సరుకులున్నా వాటిని కొనుగోలు చేయగల పరిస్థితి లేనప్పుడు ధరలు ఎందుకు పెరగాలి? ప్రజల కొనుగోలు శక్తితో పోల్చితే సరుకుల కొరత లేదు కదా? ఎక్కడో ఒకటి, రెండు చోట్ల తాత్కాలికంగా కొన్ని సరుకుల కొరత ఏర్పడినా, అది వెంటనే సర్దుకుపోతుందే తప్ప ధరలు అలా పెరుగుతూ పోవలసిన అవసరం లేదు. అందునా, ఇంత పెద్ద మోతాదులో పెరగవలసిన అవసరం అసలే లేదు.
కొనుగోలు శక్తి పరిమితంగా ఉన్న ఆర్థిక వ్యవస్థలో ధరలు పెరగడానికి ఒక్కటే కారణం ఉంది. ఆ సరుకుల ఉత్పత్తి ఖర్చులు పెరగడమే కారణం. సరిగ్గా మన దేశంలో ఇప్పుడు అదే జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం పాలనాపరంగా తీసుకున్న కొన్ని నిర్ణయాల ఫలితంగా అన్ని రకాల ఉత్పత్తుల ధరలూ పెరుగుతున్నాయి. అందుచేత ఈ ధరల పెరుగుదలకు కారణం ప్రభుత్వం కేంద్రీకృతంగా తీసుకున్న ఆ నిర్ణయాలే. అంటే ప్రభుత్వం ధరలు పెరగాలని కోరుకుని ఆ నిర్ణయాలను చేసిందని కాదు. కానీ ప్రభుత్వం పనిగట్టుకుని, పూర్తి స్పృహతో తీసుకున్న నిర్ణయాల పర్యవసానమే ఈ ద్రవ్యోల్బణం. అందుచేత దీనిని కేంద్ర ప్రభుత్వం కేంద్రీకృతంగా దేశవ్యాప్తంగా అమలు చేసిన ద్రవ్యోల్బణం అని చెప్పాల్సి ఉంటుంది.
అతి ముఖ్యమైనది పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం. మొదట్లో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గినప్పుడు కూడా ఇక్కడ పెట్రో ఉత్పత్తుల ధరలను తగ్గించకపోవడం, క్రూడాయిల్ ధరలు పెరిగినప్పుడు మాత్రం ఇక్కడ కూడా పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచడం అనేది కేంద్రంలోని ప్రభుత్వం అమలు చేసేది. కానీ రానురాను మోడీ ప్రభుత్వం ఇంకా ముందుకు పోయి, క్రూడాయిల్ ధరలు తగ్గినప్పుడు కూడా ఇక్కడ పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచడం మొదలుబెట్టింది.
ఇక రెండవది సబ్సిడీలను తగ్గించడం. గతంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధర పెరిగి, దానివలన ఎరువుల ఉత్పత్తి ఖర్చులు పెరిగినప్పుడు ఆ భారం రైతులమీద పడకుండా కేంద్రం ఎరువులకు సబ్సిడీని పెంచేది. కానీ ఇప్పుడు అంతర్జాతీయంగా ధరలు పెరగకపోయినా, కేంద్రం స్వంత నిర్ణయం కారణంగా పెట్రోధరలు పెరిగి దాని వలన ఎరువుల ధరలు పెరుగుతున్నా, ఎరువుల సబ్సిడీని పెంచడం లేదు. ఆభారాన్ని రైతులమీదకే నెట్టివేస్తోంది. పోనీ ఆ రైతులకేమన్నా కనీస మద్దతు ధరను పెంచుతున్నదా అంటే అదీ లేదు. అటు ద్రవ్యోల్బణాన్ని కావాలని ఎగదోస్తూ, ఇటు రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కాకుండా చేయడమే కేంద్ర ప్రభుత్వ విధానం సారాంశం.
చమురు, ఇంధన రంగంలో టోకుధరలసూచీ గతేడాదితో పోల్చితే 10.25శాతం పెరిగిందంటే ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. వంట గ్యాస్ ధర 10.3శాతం, పెట్రో ధరలు 18.48శాతం పెరిగాయి. పెట్రో ఉత్పత్తులు సార్వత్రిక మాధ్యమాలు. అన్ని రకాల సరుకుల ఉత్పత్తి, రవాణాలో వాటి పాత్ర ఉంటుంది. అందుచేత సరుకుల ఉత్పత్తి రంగంలో ఉత్పత్తి ఖర్చులు పెరిగి, ధరలు 7.34శాతం పెరిగాయి.
సార్వత్రిక మాధ్యమాల (పెట్రోఉత్పత్తుల) ధరలను పెంచడం, మరోపక్క శ్రామిక ప్రజలకు ధరల పెరుగుదలనుంచి ఊరటనిచ్చే సబ్సిడీలకు కోతపెట్టడం బట్టి ఈ ద్రవ్యోల్బణం వెనక కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధాన వైఖరి ఉందని స్పష్టంగా రుజువు అవుతోంది. ఇది కేంద్రం పనిగట్టుకుని, కావాలని అమలు చేస్తున్న ద్రవ్యోల్బణం.
కావాలనే కేంద్రం అమలు చేసే ఈ ద్రవ్యోల్బణ ఆర్థిక విధానపు పర్యవసానాలు ఏవిధంగా ఉండబోతున్నాయి? (ఇక్కడ విషయాన్ని సరళంగా వివరించడానికి గాను, శ్రామిక ప్రజలు ఆర్జించే సంపాదననంతటినీ ఖర్చు చేస్తారన్న ప్రతిపాదనతో మొదలు పెడుతున్నాను) ప్రజల వద్ద తగినంత కొనుగోలు శక్తి లేని కారణంగా ఉత్పత్తి తగ్గినప్పుడు ఆర్ధిక మాంద్యం ఏర్పడుతుంది. అటువంటి సందర్భంలో ప్రభుత్వమే పూనుకుని బ్యాంకులనుంచి రుణాలు తీసుకుని ఖర్చు చేయడం ద్వారా ఉత్పత్తిని పెంచవచ్చు. దాని వలన ఉపాధి కల్పన కూడా పెరుగుతుంది. ఇక్కడ ప్రభుత్వం వేరే ఎవరి ఆదాయాలకూ కోతపెట్టి ఆ సొమ్మును ఖర్చు చేయడం లేదు. నిజానికి బ్యాంకుల్లో ఖర్చు కాకుండా ఉన్న నిల్వలనుంచి మళ్ళించి ఖర్చు చేస్తోంది. దీనివలన ప్రభుత్వ బడ్జెట్‌లోటు పెరగవచ్చు అంతే. ఆదాయాల మధ్య ఉండే అసమానతలలో కూడా మార్పు ఎమీ ఉండదు. (అదనంగా ఉత్పత్తి జరుగుతుంది తప్ప దానిమీద వచ్చే మిగులులో పెట్టుబడిదారుడి వాటా అదనంగా పెరిగేది ఉండదు) అయితే పెట్టుబడిదారులకు అదనపు సంపద చేకూరుతుంది. (ప్రభుత్వం పెట్టే అదనపు వ్యయం అంతిమంగా పెట్టుబడిదారుల దగ్గరే చేరుతుంది) అలా పోగుబడే అదనపు సంపద మీద అదనంగా సంపద పన్ను విధించవచ్చు. లేదా వారి లాభాలపై పన్ను విధించవచ్చు. ఆ విధంగా చేస్తే ద్రవ్యలోటును కూడా పూడ్చుకోవచ్చును. అంటే ఈ పద్ధతిలో ప్రభుత్వం ఎవరి ఆదాయాలపైనా కోత పెట్టకుండా, ఆదాయాల అసమానతలలో తేడాలు కొత్తగా తలెత్తకుండా, నిరుపయోగంగా పడివున్న వనరుల్ని ఉపయోగపెట్టుకుని పరిస్థితిని చక్కదిద్దవచ్చును.
అలా గాక, ఇంకో పద్ధతిని చూద్దాం. ప్రభుత్వం అదనంగా ఖర్చు చేయడం కోసం ద్రవ్యోల్బణం పెరిగే విధంగా తానే పాలనాపరంగా నిర్ణయాలు తీసుకుంటే (ఇప్పుడు మోడీ ప్రభుత్వం చేస్తున్నట్టుగా) అప్పుడు ఏం జరుగుతుంది? ద్రవ్యోల్బణం వలన శ్రామిక ప్రజల నిజ ఆదాయాలు తగ్గిపోతాయి. అందువలన వారి వినిమయ శక్తి తగ్గిపోతుంది. వినిమయం తగ్గిపోయినప్పుడు సరుకులకు అదనపు మార్కెట్ ఏమీ ఏర్పడదు. అందువలన అదనపు ఉత్పత్తి జరగదు. అంటే ఆదనంగా ఉపాధి కల్పన ఏమీ జరగదు. అందువలన ఆర్ధిక మాంద్యం నుంచి కోలుకోవడానికి వీలు పడదు.
మొదటి పద్ధతితో పోల్చినప్పుడు రెండవ పద్ధతిని అనుసరించడం వలన ఆదాయాల్లో అసమానతలు పెరుగుతాయి. (ధరలు పెరిగినప్పుడు శ్రామికుల నిజవేతనాలు పడిపోతాయి కాని సంపన్నుల దగ్గర పోగుపడిన నిల్వలు తరిగిపోవు) పైగా ఆర్థిక వ్యవస్థ కోలుకోడానికి ఎంతమాత్రమూ తోడ్పడదు. ఏ విధంగా చూసినా ఈ రెండో పద్ధతి ఉత్త పనికిమాలినదే గాక మతిమాలినది కూడా. బ్యాంకులలోని నిల్వలను ప్రభుత్వం ఉపయోగించడానికి గాని, మానవ వనరులను ఉపయోగించడానికి గాని ఇది ఎంతమాత్రమూ తోడ్పడదు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానం హానికరమైనది కూడా..
మరి ఒక మెరుగైన విధానాన్ని అమలు చేసే అవకాశం ఉన్నప్పటికీ మోడీ ప్రభుత్వం ఈ పనికిమాలిన విధానాన్నే ఎందుకు అమలు చేస్తోంది? ఒక కారణం మోడీ ప్రభుత్వానికి ఆర్ధిక విషయాలపై ఏమాత్రమూ అవగాహన లేకపోవడం. ఎటువంటి ప్రజావ్యతిరేక విధానాలను అనుసరించినా ప్రజలను మత పరంగా చీల్చి, విద్వేషాలను రగిల్చి, డబ్బు విపరీతంగా విరజిమ్మి, రాజ్యాంగ వ్యవస్థలనన్నింటినీ లోబరుచుకుని దుర్వినియోగం చేసి ఎన్నికలలో తాను లబ్ధి పొందగలననే మితిమీరిన నమ్మకం రెండో కారణం. అటువంటి నమ్మకం ఉన్నప్పుడు విధానాల గురించి పెద్దగా పట్టించుకోనవసరం లేదు. .
కాని అంతకన్నా ముఖ్యమైన కారణం అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఆదేశాలకు మోడీ ప్రభుత్వం పూర్తిగా లొంగి వ్యవహరించడమే. సంపదపై పన్నులు గాని, లాభాలపై పన్నులు గాని వేయడానికి అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి అంగీకరించదు. ద్రవ్యలోటు పరిమితికి మించి పెరిగినా అంగీకరించదు. గత ఏడాది ద్రవ్య లోటు పెరిగింది. ప్రజలకు సహాయం చేయడం కోసం ప్రభుత్వం తన వ్యయాన్ని పెంచినందువలన ఈ ద్రవ్య లోటు పెరిగిందనుకుంటే పొరపాటు. లాక్డౌన్ కారణంగా మన జీడీపీ తగ్గడం, దానితోబాటు పన్నుల ద్వారా వచ్చే రాబడి తగ్గడం వలన మన ద్రవ్యలోటు పెరిగింది. ఇప్పుడు మోడీ ప్రభుత్వానికి అన్నింటికన్నా ప్రధానమైనది అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిని ఎలాగైనా సంతృప్తి పరచడం. అందుచేత ద్రవ్యలోటు తగ్గించడానికి శ్రామిక ప్రజలమీద భారాలు మోపుతోంది. పెట్రో ఉత్పత్తులపై ధరలు పెంచడం ఇందులో భాగమే. దానివలన ఉత్పత్తి తగ్గినా, నిరుద్యోగం పెరిగినా ఈ ప్రభుత్వం పట్టించుకోదు.
ఒకపక్క జో బైడెన్ అమెరికాలో శ్రామిక ప్రజలకు సహాయం అందించే ప్యాకేజిలను అమలు చేస్తూ ఆ ప్యాకేజికి అవసరమయే నిధులకోసం సంపన్నులపై అదనంగా పన్నులు వేయడానికి తయారవుతున్నాడు. మరోపక్క మోడీ ప్రభుత్వం శ్రామిక ప్రజలను పీల్చి పిప్పి చేసే విధానాలను అనుసరిప్తోంది. ఎందుకంటే సంపన్నులపై అదనంగా పన్నులు విధించి అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఆగ్రహానికి గురయ్యే ధైర్యం మోడీ ప్రభుత్వానికి లేదు.
-స్వేచ్ఛానుసరణ
ప్రభాత్ పట్నాయక్