Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మోడీ పాలనా కాలం మూల్యం ఎంత?' అన్న పేరుతో నేనొక పుస్తకాన్ని ఇటీవలే పూర్తి చేశాను. అది త్వరలో ప్రచురణకు పోనున్నది. 2014 నుంచీ దేశ ఆర్థిక వ్యవస్థలో, జాతీయ భద్రత విషయంలో, పాలనా వ్యవస్థలో, న్యాయ వ్యవస్థలో జరిగిన పరిణామాలను, వాటికి సంబంధించిన వివరాలను అందులో ప్రస్తావించాను. ఆ పుస్తకం లోని వివరాలను నేనిక్కడ చర్చించబోవడంలేదు. ఆ పుస్తకం రాయడానికి సమాచారం ఎక్కడి నుంచి సేకరించానో చెప్పాలనుకుంటున్నాను.
ఆ పుస్తకంలో నేను 85సార్లు 'ది వైర్' అనే వెబ్సైట్ నుంచి, 54సార్లు 'స్క్రోల్ డాట్ ఇన్' నుంచి ఉటంకించాను. వాటితో పోల్చితే 'టైమ్స్ ఆఫ్ ఇండియా' నుంచి తక్కువగానే (37సార్లు మాత్రమే) ఉటంకించాను. ఆ పత్రికలో కన్నా ఈ వెబ్ సైట్ల నుండే నాకు కావలసిన సమాచారం ఎక్కువగా లభించడం ఇందుకు కారణం.
మన సాంప్రదాయ వార్తా పత్రికలతో బాటు 'న్యూస్ క్లిక్', 'ది న్యూస్ మినిట్', 'ఆల్ట్ న్యూస్' వంటి వెబ్ సైట్లు కూడా గత దశాబ్దంగా ముఖ్యమైన వార్తా సాధనాలయ్యాయి. వీటిలో ఎక్కువ సైట్లను జర్నలిస్టులు సడుపుతున్నారు. విరాళాలతోను, గ్రాంట్లతోను వాటిని కొనసాగించ గలుగుతున్నారు. బడా వ్యాపార సంస్థలు గానీ, బడా మీడియా సంస్థలు గానీ ఈ వెబ్సైట్లకు ఏవిధంగానూ తోడ్పడుతున్నది లేదు. బహుశా ఆ వెబ్సైట్లలో వచ్చే కంటెంట్ అందుకే విభిన్నంగా ఉంటుంది. సాంప్రదాయ మీడియా చాలా విషయాలకు కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడుతుంది. మోడీ ప్రభుత్వం సంవత్సరానికి రూ.1200కోట్లు పత్రికలలో ప్రకటనల కోసం ఖర్చు చేస్తోంది. ఇదికాక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఇంకో రూ.1000కోట్లు ప్రకటనల కోసం ఖర్చు పెడతాయి. అంటే మీడియాకి నెలకు దాదాపు రూ.200కోట్లు ప్రభుత్వం ద్వారా లభిస్తుంది. ఇది చాలా ఎక్కువ సొమ్ము. ఊరికే రాదు కదా! ఇదికాక ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించే ప్రకటనల బడ్జెట్లు అదనం.
కేవలం ప్రకటనలే కాదు. టీవీ స్టేషన్లకు లైసెన్సులు మంజూరు చేయడానికి, ఉచితంగా కాని, సబ్సిడీ ధరకు భూమిని పొందడానికిగానీ దిగుమతి చేసుకునే యంత్రాలకు, న్యూస్ ప్రింట్కు సుంకాల రద్దు కానీ, రాయితీ గానీ పొందడానికి ప్రభుత్వంతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక పెద్ద పెద్ద మీడియా సంస్థలైతే వివిధ సందర్భాలలో ప్రధానమంత్రినిగానీ, ఇతర కేంద్ర మంత్రులనుగానీ ఆహ్వానించి ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహిస్తారు (అటువంటి సమావేశాలకు బడా కార్పొరేట్ల నుంచి 'స్పాన్సర్షిప్' లభిస్తుంది). ఒకవేళ ప్రధాని గానీ, ఇతర మంత్రులు కాని ఒకానొక పత్రిక పతాక శీర్షికలో వచ్చిన వార్త పట్ల తమ అసంతప్తిని వ్యక్తం చేశారనుకోండి. అప్పుడు అటువంటి సమావేశాలకు హాజరు కావడానికి తిరస్కరించే ప్రమాదం ఉంటుంది. అప్పుడు స్పాన్సర్ చేసే సంస్థలు తమ పెట్టుబడికి పూర్తి ప్రతిఫలం రాలేదని పెదవి విరుస్తాయి. ఇన్ని రకాల కారణాల వలన సాంప్రదాయ మీడియా ప్రభుత్వ వ్యతిరేకతను కొని తెచ్చుకోడానికి సిద్ధపడదు. అటువంటి ఒత్తిడి ఏదీ వెబ్ సైట్ల మీద ఉండదు.
అందుకే మోడీ ప్రభుత్వం కొత్తగా ఐటీ నిబంధనలను జారీ చేసింది (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యంతర మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా నైతిక ధర్మాలు, నిబంధనలు, 2021). ఎటువంటి చట్టమూ చేయకుండానే టీవీల విషయంలో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నియంత్రణ చేపట్టిందో, అదే విధంగా ఇప్పుడు ఇంటర్నెట్ విషయంలో, ఆఖరికి మెసేజ్‌లను కూడా నియంత్రిస్తూ అదుపు చేయడానికి పూనుకుంది.
ఈ నిబంధనలు ప్రింట్ మీడియాకు చెందిన ఈ-పేపర్లకు వర్తించవు. కేవలం 'వైర్, స్క్రోల్, న్యూస్ క్లిక్' వంటి వెబ్ సైట్లకు మాత్రం వర్తిస్తాయి. బడా ప్రింట్ మీడియాకు చెందిన ఈ-పేపర్ రూపంలోని వెబ్ సైట్లకు నిబంధనలు వర్తించవు. అంటే తమకు లోబడి ఉండే వెబ్ సైట్లను మినహాయించింది ప్రభుత్వం.
ఈ నిబంధనలు సాధారణ పౌరులను కూడా నియంత్రిస్తున్నాయి. 'వాట్సప్, సిగల్, టెలిగ్రాం' వంటి యాప్‌ల నిర్వాహకులు అందులో పెట్టిన మెసేజ్‌గానీ, ఫొటో గానీ, కార్టూన్గానీ ఎవరి నుంచి మొదట వచ్చిందో నిర్ధారించవలసి ఉంటుంది. అంటే ఒకరి నుంచి ఇంకొకరికి మాత్రమే చేరేలా పంపే సమాచారం ఇక ముందు గోప్యంగా ఉండజాలదు. ఎప్పుడైతే గోప్యత ఉండదో, ఆ సమాచారం ఎవరెవరికి ఫార్వర్డ్ చేయబడుతోందో నియంత్రించే వీలు కూడా ఉండదు.
వెబ్సైట్లలో వచ్చే కంటెంట్‌ను ప్రభుత్వ యంత్రాంగం పర్యవేక్షించడానికి ఈ నిబంధనలు వీలు కల్పిస్తున్నాయి. అంటే ఇదొక సెన్సార్షిప్ వంటిదే. ప్రభుత్వం కావాలనుకుంటే ఒకానొక సమాచారాన్నికానీ, మొత్తం వెబ్ సైట్‌ను కానీ నిలిపివేయవచ్చు. దాంతో ప్రముఖ యాప్‌లన్నీ తమకు తామే స్వీయ నియంత్రణ చేయడం ప్రారంభిస్తున్నాయి. అందువలన మనం ఆ యాప్‌ల ద్వారా పంపదలచుకున్న మెసేజ్‌లు మనం చేరాలనుకున్న చోట్లకు చేరకపోవచ్చు. మొత్తం మీద ప్రభుత్వం తాను కోరుకున్న విధంగానే సమాచారం ప్రజలకు పోయేటట్టు, తనకు ఇబ్బందికరమైన విషయాలు, అవి వాస్తవం అయినా సరే, ప్రసారం కాకుండా ఉండేటట్టు చేయడానికే ఈ రూల్స్ ఉపయోగపడతాయి.
ఈ పరిణామాలు మన దేశానికి మంచివి కావు. ఈ ప్రభుత్వం అత్యంత శక్తివంతంగా ఉంది. ప్రధాని ఎక్కువ పలుకుబడి కలిగివున్నాడు. ఈ మతవిద్వేష నియంతృత్వాన్ని ఎదిరించి పోరాడవలసిన ప్రతిపక్షాలకు ఇంకా పట్టు చిక్కడంలేదు. ఇటువంటి సమయంలో ఈ దేశంలో ఏం జరుగుతోందో ప్రజలకు నిర్భయంగా చెప్పగలిగే స్వతంత్ర మీడియా చాలా అవసరం. అటువంటి మీడియా ఉనికిలో లేకుండా చేయడానికే ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. 'ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక' (వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్)లో గత ఏడాది మన దేశం 142వ స్థానంలో ఉంది. 2021కి సంబంధించి వచ్చే నెలలో వెలువడనున్న ఆ సూచికలో ఇంకెక్కడ ఉంటామో ఊహించండి!
- ఆకార్ పటేల్