Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐరాసకు చెందిన 'ప్రపంచ కార్మిక సంస్థ' సౌజన్యంతో ప్రతి ఏటా 28 ఏప్రిల్ రోజున 'ప్రపంచ విధి నిర్వహణలో భద్రత మరియు ఆరోగ్య దినం' మరియు 'అంతర్జాతీయ కార్మికుల స్మారక దినం' జరుపు కోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ రోజున కార్య క్షేత్ర సమస్యలు, అనారోగ్య కారకాలు, ఎదురయ్యే ప్రమాదాలు, నివారణ మార్గాలు, ప్రాణ రక్షణలు, ఆత్మరక్షణ చర్యలు, గాయాలకు సత్వర చికిత్సలు, విధుల్లో ప్రాణాలర్పించిన శ్రామికుల స్మారకార్థ కార్యక్రమాలు లాంటి పలు అంశాల పట్ల సంపూర్ణ అవగాహన కలిగేలా కార్యక్రమాలు చేపడతారు. 2003 నుంచి ఇలాంటి అత్యవసర కార్యక్రమాలను 'ప్రపంచ కార్మికసంస్థ (వరల్డ్ లేబర్ ఆర్గనైజేషన్, ఐయల్ఓ)' ప్రతి ఏటా చేపడుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజు 6,300మంది శ్రామికులు విధులు నిర్వహిస్తూ ప్రమాదంలో లేదా వ్యాధులతో మరణిస్తుండగా, ఏడాదికి 2.3 మిలియన్లు ప్రాణాలొదులుతున్నారు. ఏడాదికి దాదాపు 317 మిలియన్ల ప్రమాదాలు నమోదు అవుతున్నాయి. క్షేత్ర సంబంధ ప్రమాదాలు, వ్యాధులను తగ్గించే సదుద్దేశంతో పలు దేశాలు అవసర చర్యలు చేపట్టాలని 2017లో ప్రపంచ కార్మిక సంస్థ విజ్ఞప్తి చేసింది.
కోవిడ్ మహమ్మారి ప్రభంజనానికి ప్రభుత్వాలు, ఉద్యోగులు, శ్రామికులు, సాధారణ ప్రజానీకం అనేక సవాళ్ళను ఎదుర్కోవడంతో పాటు కార్యక్షేత్రంలో అసాధారణ పరిస్థితులను అనుభవిస్తున్నారు. వైరస్ సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉద్యోగ శ్రామిక వర్గాల ఆరోగ్య పరిరక్షణ, భద్రతలకు సంబంధించిన పలు సమగ్ర చర్యలు తీసుకోవలసిన కనీస బాధ్యత యాజమాన్యాల మీద ఉంది. కార్య క్షేత్రంలో పని చేస్తున్న సిబ్బంది సంపూర్ణ ఆరోగ్య, భద్రతలకు సంబంధించిన చర్యలు తీసుకోవడానికి 'నేషనల్ అక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ సిస్టమ్'ను ఏర్పాటు చేసి కార్మిక, శ్రామిక, భద్రత, ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన పలు మార్గనిర్ధేశకాలు విడుదల చేస్తూ, పటిష్టంగా అమలు అయ్యేలా చూడాల్సిన కర్తవ్యం ప్రభుత్వ, యాజమాన్యాల మీద ఉన్నది. ఉద్యోగ శ్రామికవర్గాలు అంకితభావంతో పని చేస్తేనే దేశ ఆర్థిక ప్రగతి రథం సక్రమంగా సాగుతుంది. ఇప్పటికే కరోనా రెండవ వేవ్ ప్రళయానికి రోజుకు దాదాపు 3.5 లక్షల కేసులు, వేలల్లో మరణాలు నమోదు అవుతున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో అత్యవసర సేవలు, పారిశ్రామిక ప్రగతి కొనసాగేలా చూడాలి. కరోనా అకాలంలో ఆరోగ్య పరిరక్షణ యజ్ఞంలో ప్రాణాలొడ్డి అమూల్య సేవలు అందిస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్లను కాపాడుకోవలసిన కనీస బాధ్యత ప్రభుత్వాలు, మనందరి మీద ఉందని మరువరాదు.
మన అపార మానవ సంపదను కోవిడ్-19 నుంచి కాపాడుకుంటూ, ఆర్థిక పురోగమనాన్ని కొనసాగించాలి. ముఖ్యంగా ఉద్యోగ, శ్రామిక, కార్షక, కార్మిక వర్గాల మానసిక స్థైర్యాన్ని కాపాడాల్సి ఉంది. ప్రమాదాలను పసిగడుతూ, సంక్షోభాలను సమర్థవంతంగా ఎదుర్కొనే శిక్షణలు తీసుకుంటూ, ఆరోగ్య భద్రతలను కాపాడే వ్యవస్థలను ప్రతి సంస్థ, కార్యాలయం, పరిశ్రమ, వ్యాపార, వర్తక వర్గాలు వెంటనే నెలకొల్పాలి. క్షేత్ర స్థాయిలో జరిగే ప్రమాదాలను నివారించడం, వత్తి సంబంధ వ్యాధులను అరికట్టడం, గాయపడిన వారికి సత్వర చికిత్సలు అందించడం, భవిష్యత్తు భద్రతా చర్యలను చేపట్టడం గూర్చిన అవగాహన చేపట్టాలి. 28 ఏప్రిల్ రోజున విధుల్లో ప్రాణాలర్పించిన శ్రామిక సోదరులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించే వేదికగా కార్యక్రమాలను రూపొందించాలి. సిబ్బందిలో పెరిగిన పని భారం, ఉద్యోగాల్లో కోతతో పని ఒత్తిడి, పని క్షేత్రంలో శుచి శుభ్రత కొరవడడం లాంటి కారణాలతో ఆరోగ్యం గాల్లో దీపం అవుతున్నది. ఉద్యోగాలు, ఉపాధులు కోల్పోవడం, వేతనాల్లో కోతల వల్ల క్షేత్రస్థాయి అనారోగ్యాలు, అభద్రతలు పెరిగాయి. రసాయన పరిశ్రమల్లో విధులు నిర్వహించే సిబ్బంది ఆరోగ్యం అతి ప్రమాదకరం అవుతున్నది. శ్రామికులే ప్రగతిరథ కందెనలు. శ్రామిక శక్తితోనే బహుముఖీన అభివృద్ధి సాధ్యపడుతుంది. విధి నిర్వహణలో ప్రమాదాలు, అకాల మరణాలు నివారించాలి. ప్రభుత్వాలు, పరిశ్రమల యాజమాన్యాలు, కార్మిక సంఘాలు.
- డా||బి.ఎం.రెడ్డి
సెల్: 9949700037