Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజకీయ నేతలు ఎంత వత్తిడికి గురైనా సంయమనం కోల్పోతే అవి ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చెప్పలేం. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గతేడాది అక్టోబరు 30న కాబినెట్ సమావేశంలో చేసినట్టు చెబుతున్న వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీశాయి. ''వేలాది శవాలు గుట్టలుగా పడినా సరే రెండవసారి లాక్డౌన్ ప్రకటించే ప్రశ్నేలేదు'' అన్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మాటలు మీడియా పతాక శీర్షికలకు ఎక్కటంతో రాజీనామా చేయాలన్న డిమాండ్ ముందుకు వచ్చింది. తానా మాటలు అనలేదని ప్రధాని ప్రకటించిన తరువాత కూడా వార్తలను రాసిన వారు అవి నిజమే అని ప్రకటించటంతో ఈ ఉదంతం ఏవైపు దారి తీస్తుందో చూడాల్సి ఉంది. ప్రధాన ప్రతిపక్షం లేబర్ పార్టీ ఇది రాస్తున్న సమయానికి రాజీనామా డిమాండ్ చేయలేదు. వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలని డిమాండ్ చేసింది. స్కాటిష్ నేషనల్ పార్టీ రాజీనామా చేయాలని కోరింది.
2020 అక్టోబరు30న జరిగినట్టు చెబుతున్న ఉదంతం గురించి బీబీసీ, ఐటీవీ, మెయిల్ ఆన్లైన్ తదితర మీడియా సంస్థలు పేర్కొన్న సమాచార సారం ఇలా ఉంది. కాబినెట్ మంత్రి మైఖేల్ గోవ్ మరోసారి ఇంగ్లండ్‌లో లాక్డౌన్ విధించాల్సిన అవసరాన్ని వివరిస్తూ కరోనా పీడితులు ఆసుపత్రులకు మిలిటరీ సిబ్బంది రక్షణగా ఉండటాన్ని మీరు చూడాలనుకుంటే తప్ప మరోసారి లాక్డౌన్ పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది, జనం మనల్ని క్షమించరు, పార్టీ అధికారం నుంచి వైదొలగాల్సి ఉంటుంది అన్నారట. దాని మీద తీవ్ర అసహనంతో ఊగిపోయిన జాన్సన్ ''... (వాడిన పదానికి బూతు పని-నష్టదాయకం అనే రెండు అర్థాలున్నాయి) లాక్డౌన్లు ఉండవు, వేలాది శవాలను గుట్టలుగా పడనివ్వండి'' అని వ్యాఖ్యానించారట. ఈ ఉదంతం అక్టోబరు 30న జరిగింది, మరుసటి రోజే లాక్డౌన్ ప్రకటించారు. మీడియాలో ఈ ఉదంతం గురించి వార్తలు రావటంతో పార్లమెంట్లో స్కాటిష్ నేషనల్ పార్టీ నేత ఇయాన్ బ్లాక్‌ఫోర్డు ఒక ప్రకటన చేస్తూ ఈ మాటలు తీవ్ర అసహ్యంగా ఉన్నాయి, నిజమైతే వెంటనే ప్రధాని బోరిస్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గతంలో అనేక అబద్దాలు చెప్పి ఉన్నందున ప్రధాని ఈ మాట అనలేదు అంటే ఎవరూ నమ్మటం లేదని అదే పార్టీకి చెందిన మరో నాయకురాలు నికోలా స్టర్జియన్ పేర్కొన్నారు. మే 6న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామం అధికార పార్టీని ఇరుకున పడవేసింది. టోరీ-లేబర్ పార్టీల మధ్య ఓటర్లు సరిసమానంగా ఉన్నట్టు సర్వేలు ప్రకటించాయి. తాజా వార్తలతో అది టోరీ పార్టీకి ప్రతికూలంగా పరిణమిస్తే బ్రిటన్ పరిణామాలు మరో మలుపు తిరిగే అవకాశం ఉంది.
ప్రధాని అలాంటి వ్యాఖ్యలు చేయలేదని ప్రభుత్వం ప్రకటించింది. మరోసారి లాక్డౌన్ ప్రకటించాలా లేదా అని చర్చించేందుకు జరిగిన సమావేశంలో ప్రధాని అలాంటి వ్యాఖ్యలు చేసినట్టు తనకు వినిపించలేదని మంత్రి మైఖేల్ గోవ్ చెప్పారు. మరోసారి లాక్డౌన్ విధించేందుకు ప్రధాని అంగీకరిస్తూనే ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఆ సమయంలో అక్కడ ఉన్న ఒకరు పేర్కొన్నట్టు డైలీ మెయిల్ పత్రిక పేర్కొన్నది. ఐటీవీ రాజకీయ విలేకరి పెస్టన్ మాట్లాడుతూ అలాంటి వ్యాఖ్య చేసినట్టు ఇద్దరు సాక్షులు తనకు చెప్పారని, ఆ సమయంలో అక్కడ మరొకరు కూడా ఉన్నారని పేర్కొన్నారు. లాక్డౌన్ విధించేందుకు అయిష్టంగా అంగీకరిస్తూనే కేకలు వేసిన ప్రధాని ఈ వ్యాఖ్యలు చేసినట్టు, ఆ సమయంలో గది తలుపులు తెరిచే ఉన్నందున అనేక మంది వినే అవకాశం ఉందన్నారు. తాను పేర్కొన్న అంశాన్ని మెయిల్ పత్రిక నిర్థారించింది. అయితే తనకు సమాచారం ఇచ్చిన వారు మెయిల్‌కు వెల్లడించలేదని చెప్పారని, అందువలన మరొకరు దానికి చెప్పి ఉంటారని పిస్టన్ చెప్పారు. లాక్డౌన్ విధించే కంటే వేలాది శవాలు గుట్టలు పడినా తనకు లెక్కలేదని ప్రధాని అన్నట్టు డెయిలీ మెయిల్ ప్రధాన శీర్షికగా వార్త ప్రచురించింది.
తాను చేసినట్టు చెబుతున్న వ్యాఖ్యల వెనుక తన మాజీ సలహాదారు డొమినిక్ కమ్మింగ్స్ హస్తం ఉన్నదని బోరిస్ జాన్సన్ స్వయంగా వార్తలను ప్రచురించిన సంపాదకులతో మాట్లాడుతూ చెప్పారని వార్తలు వచ్చాయి. లాక్డౌన్ ప్రకటించటం ఒకటి అయితే, ఆ సమయంలో కొందరు ఆశ్రితులకు ప్రధాని లబ్దిచేకూర్చారనే అంశాలు వెలుగులోకి రావటం ముఖ్యమైన అంశం. బహుశా ఈ కారణంగానే ఆరునెలల క్రితం చేసినట్టు చెబుతున్న వ్యాఖ్యలు ఇప్పుడు మీడియాలో వచ్చాయని చెప్పవచ్చు. కమ్మింగ్స్ సలహాదారుగా పని చేసిన కాలంలో బోరిస్ జాన్సన్ సన్నిహితురాలు కారీ సైమండ్స్‌తో పెత్తనం గురించి వారి మధ్య పోరు నడిచింది. ఆ సమయంలో వాణిజ్యవేత్త సర్ జేమ్స్ డైసన్ లేవనెత్తిన కొత్త వెంటిలేటర్ల పన్ను సమస్యను పరిష్కరిస్తానంటూ ప్రధాని పంపిన వర్తమానం, అదే విధంగా సౌదీరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ మధ్య నడిచిన వర్తమానాలు బయటకు రావటం వెనుక కమ్మింగ్స్ హస్తం ఉందని వార్తలు వచ్చాయి. అంతే కాదు ప్రధానిగా బోరిస్ జాన్సన్ ప్రభుత్వ అధికారిక నివావసరలో ఉన్నప్పటికీ దాని మరమ్మతులకు ప్రయివేటుగా నిధులు సమకూర్చమని కోరినట్టుగా, అధికార టోరీ పార్టీకి వచ్చిన విరాళాల గురించి కమ్మింగ్స్ ఆరోపించటం వివాదాస్పదంగా మారింది. తన నివాసానికి చేసిన ఖర్చును ప్రధానే స్వయంగా చెల్లించారని ప్రభుత్వం చెబుతుంటే అధికార పార్టీ చెల్లించినట్టు వార్తలు వచ్చాయి. దీంతో అసలేం జరిగిందో విచారించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాణిజ్యవేత్త డైసన్ జరిపిన సంభాషణలు బయటకు రావటానికి తనకూ సంబంధం లేదనీ అయితే బోరిస్ జాన్సన్ గురించి కొన్ని అంశాలను బయటపెడతాననీ కమ్మింగ్స్ ప్రకటించాడు. రెండవ సారి లాక్డౌన్ ప్రకటించే అంశాల గురించి ప్రధాని ముందుగానే తన సన్నిహితురాలు కారీ సైమండ్స్‌కు చెప్పారని దాని గురించి విచారణను ప్రధాని అడ్డుకుంటున్నారని ఆరోపించాడు. గత కొద్ది రోజులుగా నడుస్తున్న ఈ వివాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలోనే ప్రధాని వ్యాఖ్యలు మీడియాలో దర్శనమిచ్చాయి. వచ్చేనెల 26న కమ్మింగ్స్ కామన్స్ సభ కమిటీ ముందు వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంది.
గతేడాది మే 7న జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా కారణంగా వాయిదా పడి ఈ ఏడాది మే 6న జరగనున్నాయి. ఇది కూడా తాజా వివాదం, బోరిస్ వ్యాఖ్యల మీద దుమారానికి దోహదం చేసి ఉండవచ్చు. కమ్మింగ్స్ ఆరోపణలకు ముందు ఒక సంస్థ జరిపిన సర్వేలో టోరీ పార్టీ మద్దతు ఐదుపాయింట్లు తగ్గినట్టు ప్రకటించారు. లేబర్ పార్టీతో పోల్చితే మూడు పాయింట్ల స్వల్ప ఆధికత్యతో 40శాతం మంది మంది మద్దతు టోరీకి ఉన్నట్టు చెబుతున్నారు. ఇప్పుడు సంచలనాత్మక జాన్సన్ వ్యాఖ్యలు, కమ్మింగ్స్ చెబుతున్న అంశాలు కచ్చితంగా టోరీ పార్టీని ఇబ్బందుల్లో పడవేస్తాయి.
ఆరోపణలు కాదు, ప్రధాని ఆచరణ ముఖ్యం అంటూ కొన్ని పత్రికలు బోరిస్ జాన్సన్‌కు మద్దతుగా రంగంలోకి వచ్చాయి. ప్రధాని పార్లమెంట్లో ఒక ప్రకటన చేయాలని, అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని లేబర్‌పార్టీ కోరింది. నలభైనాలుగు లక్షల మందికి వైరస్ సోకి 1,27,434 మరణాలతో (మార్చి నెలాఖరుకు లక్షా 50వేల మంది మరణించినట్టుగా ధృవీకరణ పత్రాలు జారీ చేసినట్టు మరో వార్త) ప్రపంచంలో 7వ స్థానంలో ఐరోపాలో మూడవ దేశంగా బ్రిటన్ ఉంది. రెండవ దశలోనే మరణాలు ఎక్కువగా ఉన్నాయి.
గతేడాది సెప్టెంబరు, అక్టోబరు మాసాల్లో రెండవసారి లాక్డౌన్ విధించాలని అనేక మంది నిపుణులు, మంత్రులు సూచించారు. ప్రధాని వారి సలహాలను ఖాతరు చేయలేదు. రోజుకు రెండువేల కేసులు ఉన్నప్పుడు చేసిన ఈ సూచనకు నిరాకరించిన బోరిస్ ఆరువేలకు పెరిగిన తరువాత అక్టోబరు 31న లాక్డౌన్ ప్రకటించారు. అంతకు ముందు పదిరోజుల క్రితం పార్లమెంట్లో మాట్లాడుతూ లాక్డౌన్ ఆలోచన మూఢత్వ ఉన్నత స్ధాయికి నిదర్శనం అని ఎద్దేవా చేశారు. అయితే అక్టోబరు 30న మంత్రి మైఖేల్ గోవ్ తీవ్రమైన హెచ్చరిక చేయటంతో ప్రధాని ఉక్రోశం పట్టలేక నోరు జారి ఉండవచ్చని బలంగా నమ్ముతున్నారు. మొదటి దశ కరోనా సమయంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారు. రెండవ దశలోకి ప్రవేశించిన తరువాత కూడా కొత్త రకం వైరస్‌ను నవంబరు వరకు గుర్తించలేదు. మూడవ దశ కూడా రానున్నట్టు తాజాగా హెచ్చరికలు వెలువడ్డాయి. బ్రిటన్‌లో కరోనా విజృంభణ కారణంగానే మన రిపబ్లిక్ దినోత్సవానికి అతిధిగా రావాల్సిన బోరిస్ ప్రతిపక్ష విమర్శలను నివారించేందుకు పర్యటనను వాయిదా వేసుకున్నారు. మన దేశంలో కరోనా రెండవ దశ తీవ్ర స్థాయిలో ఉన్న కారణంగా ఏప్రిల్ నెలలో జరగాల్సిన పర్యటనను రద్దు చేసుకున్నారు.
మీడియాలో వచ్చిన వార్తలను ఖండించిన తరువాత బోరిస్ అబద్దాలకోరు అనే హాస్టాగ్‌తో పెద్ద ఎత్తున ట్విటరైట్లు స్పందిస్తున్నారు. ఈ వార్తలను చూసిన తరువాత మరణించిన వారి కుటుంబాలు ఎలా ఉంటాయో ఊహించుకోలేం, కుటుంబాలు తట్టుకోలేవు అనే వ్యాఖ్యలు వెలువడ్డాయి. సలహాదారులుగా ఉన్న వారు కక్షగడితే పాలకుల పరువు ఎలా తీయగలరో, తెరవెనుక జరిగిన బాగోతాలను ఎలా బయటపెడతారో ఈ ఉదంతం వెల్లడిస్తోంది. ఇది టీ కప్పులో తుపానులా సమసిపోతుందా లేక బోరిస్ జాన్సన్ రాజీనామా వరకు దారి తీస్తుందా అన్నది ఆసక్తి కలిగిస్తోంది. ఐరోపా యూనియన్ నుంచి తప్పుకున్న బ్రిటన్ నిర్ణయం వెనుక కమ్మింగ్స్ సలహాలే ప్రధానంగా పని చేశాయి. ఆ నిర్ణయం తరువాత ఆర్థిక పరిస్థితి కరోనాతో మరింతగా దిగజారింది. ఆర్థిక పరిస్థితి దిగజారినప్పుడు అనేక సందర్భాలలో రాజకీయ సంక్షోభాలకు దారి తీస్తుందని అనేక దేశాల అనుభవాలు నిరూపించాయి. బ్రిటన్‌లోనూ అదే జరగనుందా?
- ఎం. కోటేశ్వరరావు
సెల్: 8331013288