Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోడీ ప్రతిజ్ఞలన్నీ మోసాలే. ఉచితంగా టీకా ఇస్తామని బీహార్ ఎన్నికల్లో చేసిన ప్రతిజ్ఞ భంగమైంది. పశ్చిమబెంగాల్ ఎన్నికల్లోనూ అదే ప్రతిజ్ఞ చేశారు. కరోనా టీకాలు రాజకీయ, వాణిజ్య టీకాలని ఒక మిత్రుడు అన్నాడు. ఆ మర్మం ప్రధాని టీకా పంపిణీ విధానంతో తెలిసింది.
దేశంలో ప్రఖ్యాత ఔషధ కంపెనీలు ఎన్నో ఉన్నాయి. బహిరంగ వేలం ద్వారా కరోనా టీకా తయారీ దారులను ఎన్నుకోకుండా భారత సీరం సంస్థ, భారత్ బయోటెక్‌లను ఎన్నుకున్నారు. టీకా ధర ప్రభుత్వం నిర్ణయించాలి. టీకా ఆవిష్కరణలో ఈ టీకా కంపెనీల మేథో పెట్టుబడి శూన్యం. వైరాలజీ జాతీయ సంస్థ, వైద్య పరిశోధన భారతీయ మండలి (ఐ.సి.ఎం.ఆర్.) భారత్ బయోటెక్కుకి కోవాక్సిన్ టీకా ఇచ్చాయి. యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం సీరంకు కోవిషీల్డ్ టీకా ఫార్ములా ఇచ్చింది. ఈ టీకాలను ప్రభుత్వ సంస్థల శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ఈ టీకా కంపెనీలకు ధర నిర్ణయించే గుత్తాధిపత్యం లేదు. కానీ, ఈ కంపెనీలకు మోడీ ధరల నిర్ణయ స్వేచ్ఛ ఇచ్చారు. టీకా ఉత్పత్తిలో 50శాతం కేంద్ర ప్రభుత్వానికి రూ.150లకు అమ్మాలి. 50శాతం రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రయివేటు ఆస్పత్రులకు ఇష్టమొచ్చిన ధరకు అమ్ముకోవచ్చు. రాష్ట్రాలు తమ అవసరాలకు కొనేటట్లైతే కేంద్రం ఉత్పత్తిలో సగం ఎందుకు కొనాలి? ఒక దేశం, ఒకే పార్టీ, ఒకే మతం, ఒకే మార్కెట్, ఒకే పన్ను, ఒకే ఎన్నికలు, ఒకే రేషన్ సూత్రం ఒక దేశం-ఒకే ధర ప్రాణరక్షక కరోనా టీకాకు వర్తించదా? ప్రయివేటు కంపెనీలు ఇదే అదనుగా టీకాలకు ఇష్టమొచ్చిన ధరలు ప్రకటించాయి. రెండింటి కేంద్ర ప్రభుత్వ ధర రూ.150లు. సీరం సంస్థ రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400లు, ప్రయివేట్లకు రూ.600లు నిర్ణయించగా, భారత్ బయోటెక్ రూ.600లు, 1200లుగా ప్రకటించింది. సీరం ఐరోపా మార్కెట్లలో రూ.161 నుంచి రూ.210లకు అమ్ముతోంది. ''రూ.150 ల్లోనే లాభాలు ఉన్నాయి. ధర పెరిగితే అత్యధిక లాభాలు వస్తాయి. ధర రూ.750లకు పెరగవచ్చు'' అని సీరం ముఖ్య కార్య నిర్వహణాధికారి ఆదార్ అన్నారు. కేంద్రం బాధ్యత నుంచి తప్పుకున్న నేపథ్యంలో సీరం ధర రూ.1,000లకు, భారత్ బయోటెక్ ధర రూ.2,000లకు చేరగలవు. ఒక వ్యక్తి 2 డోసుల టీకా ఖర్చు రూ.2 నుండి రూ.4 వేలు అవుతుంది. 18ఏండ్ల పైబడిన భారత జనాభా 90కోట్లు. వీళ్ళ టీకా ఖర్చు: 90×2 డోసులు × 150 = రూ.27 వేల కోట్లు. 2021-22 బడ్జెట్లో కోవిడ్ టీకాకు రూ.35 వేల కోట్లు కేటాయించారు. ఇతరతంకా రూ.8 వేల కోట్లు మిగులుతాయి. పెంచిన ధరలలో, 18ఏండ్లు పైబడిన జనాభా టీకా ఖర్చు రూ.62,375 కోట్లు. ఇందులో కేంద్ర వాటా రూ.10,189 కోట్లే. 18-45ఏండ్ల మధ్య వయసు వారికి మాత్రమే టీకా ఉచితంగా ఇస్తామని ప్రధాని మనసు మాటలో చెప్పారు. కానీ ఈ వయసువారు ప్రయివేటు టీకాలు వేయించుకోవాలి, లేదా రాష్ట్రాలు ఖర్చు భరిస్తాయేమో పరిశీలించాలని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇప్పటి దాకా 14.2 కోట్ల డోసుల టీకాలు, 7.1 కోట్ల జనాభాకు ఇచ్చారు. 2 డోసులు 2శాతం కంటే తక్కువ, ఒక డోసు 9శాతం కంటే తక్కువ జనాభాకు లభించాయి.
టీకా విధానం గురించి రాష్ట్రాలతో చర్చించలేదు. ఇది సార్వత్రిక కోవిడ్ నిరోధకతకు భంగం. 18-44 మధ్య వయస్కులు అధికంగా ఆర్థిక అస్థిరులు. టీకా కోసం డబ్బు ఖర్చుపెట్టలేరు. కేంద్రం 30కోట్ల జనాభా టీకా బాధ్యత మాత్రమే తీసుకుంది. 60 కోట్ల జనాభాను రాష్ట్రాలు, ప్రయివేట్ల దయకు వదిలేసింది. గత పాలనల్లో ఎప్పుడూ ఇలా జరగలేదు. పిల్లల టీకా బాధ్యతనూ రాష్ట్రాలు, ప్రయివేట్లపై నెట్టేసారు. రాష్ట్రాల ఖర్చు, టీకా కంపెనీల లాభాలు పెరుగుతాయి. ఈ కేంద్ర విధానాలతో ఆర్థికంగా బలహీనపడిన రాష్ట్రాలు ఈ బరువు మోయలేవు. టీకా సేకరణలో రాష్ట్రాల మధ్య, రాష్ట్రాలు ప్రయివేట్ల మధ్య అనారోగ్య పోటీ పెరుగుతుంది. ప్రయివేట్లు నెగ్గుతాయి. అధికార పక్ష రాష్ట్రాలు తర్వాతి స్థానంలో ఉంటాయి. తెలంగాణకు ఎక్కువ టీకాలు ఇస్తామని భారత్ బయోటెక్ ముఖ్య కార్య నిర్వహణాధికారి కృష్ణ ఎల్లా అన్నారు. ఇలా పక్షపాతాలు మొదలవుతాయి. ఒక వస్తువు ఏదో కారణాన ఒక మిత్రునికి చౌకగా వస్తుందనుకోండి, మనమంతా ఆ మిత్రుని ద్వారా ఆ వస్తువును చౌకగా కొంటాం. కేంద్రానికి టీకా తక్కువ ధరకు దొరుకుతుండగా రాష్ట్రాలకు, ప్రయివేట్ల పోటీతో, ఎక్కువ ధరకు అంటగట్టడం ఎందుకు? అంతా ప్రజల సొమ్మేగదా! మొత్తం టీకాలను తానే కొని ప్రజలకు పంపిణి చేయవచ్చు కదా? రెండు కంపెనీలకు రూ.45 వేల కోట్ల ప్రజాధనం ఇచ్చి కూడా వాటికి అధికధరలు వసూలుచేసే అవకాశం ఎందుకు ఇవ్వాలి? పన్ను చెల్లింపుదారులకు రెండు భారాలా? కేంద్రం టీకాపై నియంత్రణ కోల్పోతుంది. కొన్ని రాష్ట్రాలు తక్కువ టీకాలు కొంటాయి. కొన్ని అసలు కొనకపోవచ్చు. టీకాలు ప్రయివేట్ల పరమవుతాయి. అధిక జనాభా ఆరోగ్య భద్రత కోల్పోతారు. జనాలకు కోవిడ్‌ను అంటిస్తూనే ఉంటారు. ప్రజలు జీవితాలనే కాదు జీవనాలనూ, బతుకుదెరువునూ కోల్పోతారు. మరి సార్వత్రిక ఆరోగ్య, జీవన భద్రతలు ఎలా సాధ్యం?
మామూలు పరిస్థితుల్లోనే ఒక వస్తువుకు మూడు ధరలు అనైతికం. విశ్వమారి నియంత్రణ టీకాకు 3 ధరలు ప్రకటించటం, లాభాలు పొందడం దారుణం. దీనికి కేంద్ర ప్రభుత్వ మద్దతు మహానేరం. కరోనా నిత్యపరివర్తనలతో రెట్టింపు, మూడురెట్ల శక్తితో రూపాంతరం చెందింది. ప్రభుత్వం ఈ ద్వితీయ తరంగ కరోనా వ్యాప్తికి అవకాశాలు కల్పించింది. ఆక్సిజన్ ఉత్పత్తిని అశ్రద్ధచేసింది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ లేక రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. కోవిడ్ రోగికి ఉపశమనం కలిగించే(?) రెమిడెస్విర్ సూది మందు అందుబాటులో లేదు. రూ.2,000 సూదిని నల్ల బజారులో రూ.30 వేలకు అమ్ముతున్నారు. టీకా కేటాయింపులో బీజేపీ, బీజేపీయేతర రాష్ట్రాలకు తేడా ఉంది. మహారాష్ట్రకు మే 1 నుండి టీకాలు లేవు.
పేదలు తమ సామాజిక-ఆర్థిక పరిస్థితుల వలన ఎక్కువగా తిరుగుతారు. ఎక్కువ మందితో కలుస్తారు. కరోనా జాగ్రత్తలు సక్రమంగా పాటించలేరు. వీరికి కరోనా సోకే అవకాశం ఎక్కువ. వాళ్ళు కోవిడ్ అంటించే అవకాశాలూ ఎక్కువే. వీరికి ఉచితంగా టీకా అందించటం వల్ల సమాజానికే మేలు. కానీ కేంద్ర ప్రభుత్వ టీకా విధానంతో వారికి టీకా ఉచితంగా అందదు. సగం టీకాలు కేంద్రం దగ్గర మురిగిపోతాయి. రాష్ట్రాలకు కావలసిన మోతాదులో అందుబాటులో ఉండవు. ఉన్నా అవి కొనే ఆర్థిక స్థితిలో ఉండవు. టీకా చిల్లర ధర ఎక్కువగా ఉంటుంది. పేదలు కొనలేరు. జనాలకు కోవిడ్ అంటిస్తూ తిరుగుతారు. అది పెరుగుతూనే ఉంటుంది. మోడీ ప్రభుత్వ అసంబద్ధ టీకా ధరల వ్యూహం కరోనా నియంత్రణ ప్రయత్నాలను అసమర్థత, తాత్కాలికతల ఊబిలో దింపుతుంది. కోవిడ్ వ్యాప్తి నిరోధం, ఆక్సిజన్, కీలక ఔషధాలు, టీకాల కేటాయింపులపై జాతీయ విధానాన్ని కోరుతూ సుప్రీంకోర్టు సుమోటో విచారణ చేపట్టింది. టీకా, అత్యవసర మందుల ధరలను ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తున్నారు? వాటి హేతుబద్దతను వివరించమని రాష్ట్రాలను కోరింది. రెండు కంపెనీలే దేశ టీకా అవసరాలు తీర్చలేవు. బహిరంగ పద్ధతిలో ఇతర ఔషధ కంపెనీలకు టీకా తయారీ అప్పజెప్పాలి. అందువల్ల గుత్తాధిపత్యం, ద్వంద్వాధిపత్యంతో పాటు ధరలు కూడా తగ్గుతాయి.
రాజ్యాలను దేశంలో కలిపింది నెహ్రూ పాలన. రాజభరణాలను రద్దుచేసింది ఇందిర నిరంకుశత్వం. దేశాన్ని కార్పొరేట్లకు అమ్ముతోంది మోదీ నియంతృత్వం. పెద్ద నోట్ల ప్రవేశం నుండి కోవిడ్ నియంత్రణ దాకా మోడీ ప్రజలకు వంచనే మిగిల్చారు. ఇది ఇంకా ఎన్నాళ్ళు? ప్రతిపక్షాల నిరాసక్తత, విభజన రాజకీయాలు, భయాలు, భ్రమలు, పక్షపాతాలు, స్వలాభాలు ఈ నియంతృత్వానికి వంతపాడుతున్నాయి. చైతన్య పౌరసమాజాలు, ప్రజాసంఘాలు మేల్కొనాలి, ఏకమవాలి. ఆలస్యం చేస్తే ఆస్తిత్వమే మిగలదు.
-ఎస్. హనుమంతరెడ్డిఎస్. హనుమంతరెడ్డి
సెల్:9490204545