Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏప్రిల్ 17న పశ్చిమబెంగాల్లోని ఒక ఎన్నికల సభలో మాస్కులు లేకుండా పోగయిన జనాలు తోసుకుంటుండగా, భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ''ఇంతటి భారీ జనాలను నేనెప్పుడు చూడలేదు'' అని గర్వంగా ప్రకటించాడు. అయన ముఖానికీ మాస్కు లేకపోవటం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అదేరోజు భారతదేశం 2,34,000 కొత్త కరోనా కేసులను నమోదు చేసుకుంది. 1,341 మరణాల సంఖ్య ఆ రోజుకి లెక్క తేలింది. అప్పటినుంచి కొత్త కేసులు, మరణాల సంఖ్యా పెరుగుతూనే ఉంది. ఇంతకుమునుపు ఏనాడూ చూడని విషాదచ్ఛాయల్లోకి దేశం తరలిపోతున్నది. ఒక్కవారంలో 16లక్షల కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య కోటి 50లక్షల పైబడింది. కేవలం 12రోజుల వ్యవధిలో కరోనా పాజిటివ్ రేట్ రెండింతలయి 17శాతానికి చేరింది. అది ఢిల్లీలో 31శాతంగా ఉన్నది. దేశంలోని ఆస్పత్రుల పడకలన్నీ పూర్తిగా నిండి పోయాయి. అయితే, ఈసారి ముఖ్యంగా యువజనం మంచాన పడ్డారు. ఢిల్లీలో 65శాతం కేసులు 40ఏండ్ల వయస్సులోపు వారివే.
భారతదేశంలో కరోనా కొత్త అవతారం ఎత్తిందని, దానికి త్వరగా అంటుకుపోయే లక్షణం ఉన్నదని ఒక సాకుగా చెపుతున్నప్పటికీ, దేశంలో అత్యున్నత నాయకత్వ స్థానంలో వున్న మోడీ ప్రభుత్వపు రాజకీయ మార్గదర్శక వైఫల్యం స్పష్టంగా కనపడుతోంది. కరోనా కట్టడిలో వివిధ పార్టీల చేతుల్లో ఉన్న రాష్ట్రప్రభుత్వాలు మెతకధోరణి అవలంబిస్తున్నాయి. ఆపై ఆరోగ్య శాఖాధికారుల నిర్లక్ష్యవైఖరి వెరసి భారతదేశం కరోనాను ఓడించిందనే భావన తప్పని తేలింది. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు కె. శ్రీకాంత్ రెడ్డి ''ఈ మహమ్మారి దేశం వదలి వెళ్లిపోలేదని దేశనాయకత్వం ప్రజలకు అర్థమయ్యే విధంగా సరిగ్గా వివరించలేదు'' అని అన్నారు. ''విజయాన్ని సాధించకుండానే, అపరిపక్వతతో గెలిచామని ముందుగానే ప్రకటించి దేశమంతటా సంబరాలు చేశారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఆర్థిక వ్యవస్థ సజావుగా నడుస్తున్నదని, కాబట్టి తాము ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని నిర్ణయించుకోవటం దీనికి కారణం. దీంతో వైరస్ మరోసారి విజృంభించే అవకాశం వచ్చింది.''
పశ్చిమబెంగాల్లో బీజేపీ గెలుస్తుందని ఆశతోవున్న మోడీ ప్రభుత్వం అక్కడి ఎన్నికల దశలను కుదించటానికి నిరాకరించింది. ఒక పక్కన దేశంలో ఆస్పత్రుల ఎదుట అంబులెన్సులు బారులు తీరివుంటే, అక్కడ మోడీ, అమిత్‌షాలు బహిరంగసభలు, రోడ్‌షోలు ఒక పరంపరగా కొనసాగించారు. మోడీ ర్యాలీ నిర్వహించిన ఏప్రిల్ 17న బెంగాల్లో 7,713 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా మొదలైన తరువాత ఇదే అప్పటికి అక్కడ అత్యధిక సంఖ్య. ఎన్నికలలో నిలబడిన అభ్యర్థులు కరోనా వైరస్ కారణంగా చనిపోయారు. ఏప్రిల్ 18న వీశీసఱ వీaసవ ణఱఝర్వతీ అనే హాష్ ట్యాగ్‌తో ట్విట్టర్ హౌరెత్తింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగినంత సంసిద్ధతతో లేనందువలన, బెడ్స్ కొరతతో కోవిడ్ పేషంట్స్‌కు వైద్యం అందించలేక పోతున్నామని కరోనా రోగులు కోకొల్లలుగా చనిపోతు న్నారని ఫ్రంట్లైన్లో పనిచేసే డాక్టర్లు విలపిస్తున్నారు.
ముంబైలోని నిరామయ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ అమిత్ థఢాని, కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపంలో విరుచుకుపడనున్నదని తాము ఫిబ్రవరిలోనే హెచ్చరించామని, ఆ హెచ్చరికలన్నీ నిర్లక్ష్యానికి గురి అయ్యాయని అన్నారు. ముంబైలోని ఈ నిరామయ హాస్పిటల్ కరోనా పేషంట్లకు మాత్రమే వైద్యం చేస్తుంది. ''ఇప్పుడు మా ఆస్పత్రి పేషంట్లతో నిండిపోయింది. ఎవరైనా డిశ్చార్జి అయితే మరుక్షణం ఆ బెడ్ నిండుతుంది'' అని డాక్టర్ థఢాని అన్నారు. పదిరోజుల క్రితం ఆ హాస్పిటల్‌కు ఆక్సిజన్ కొరత ఏర్పడింది. అయితే తగిన సమయంలో ఇతరవిధంగా ఆక్సిజన్ సరఫరా తెచ్చుకున్నారు. డా|| థఢాని ఇలా అన్నారు.. ''హాస్పిటల్ బయట బెడ్ కోసం ప్రయత్నిస్తున్న ప్రజలు బారులు కట్టి నిలబడివున్నారు. మాకు దయచేసి బెడ్ ఇవ్వండి అనే విజ్ఞాపనలతో ప్రతిరోజూ ప్రతి 30 సెకండ్లకు మేము ఫోన్ కాల్స్ అందుకుంటున్నాం.'' ఈ ఫోన్‌కాల్స్‌లో ఎక్కువ భాగం క్లిష్టమైన అనారోగ్య స్థితిలో ఉన్న పేషంట్లనుంచి వస్తున్నాయి. వారికి ఆస్పత్రి సంరక్షణలో వైద్యం అందటం అవసరం. కానీ మాదగ్గర వారిని చేర్చుకునే చోటులేదు. దానితో మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రతివారు తమ శక్తికి మించి పని చేస్తున్నారు.'' థఢాని ప్రకారం ఈసారి వచ్చిన వైరస్ ''ఎంతో భీకరంగాను, త్వరత్వరగా వ్యాపించేదిగాను ఉన్నది''. ముఖ్యంగా ఈసారి యువజనం దీని బారిన పడుతున్నారు. ''20-30సంవత్సరాలు వున్నవాళ్ళు తీవ్రమైన వ్యాధి లక్షణాలతో వస్తున్నారు. ఈ యువ వయసులలోనే మరణాలు కూడా చాలా అధికంగా ఉన్నాయి'' అని డా.థఢాని అన్నారు.
దేశ రాజధానిలో ఈ మూలనుంచి ఆ మూలదాకా అంబులెన్సుల సైరన్ మోత నిర్విరామంగా వినిపిస్తూ ఉన్నది. ఢిల్లీలోని అతిపెద్ద కోవిడ్ సదుపాయలుగల ఆస్పత్రిగా ఉన్న లోక్‌నాయక్ ప్రభుత్వ ఆస్పత్రి సామర్థ్యానికి మించిన అధిక భారంతో పనిచేస్తున్నది. ఆక్సిజన్ సిలెండర్ల కొరతతో ఒక బెడ్‌కు ఇద్దరు పేషంట్లను పెట్టి ఆక్సిజన్ అందిస్తున్నారు. ఆస్పత్రి బయట స్టెచ్చర్ల, అంబులెన్స్‌లలో ఊపిరికోసం కిందమీదా అవుతున్న పేషంట్లు, వారి ప్రక్కన శోకాలతో వెక్కిళ్ళు పెడుతున్న పేషంటు బంధువులు కనపడతారు. కొంతమంది తాము సొంతంగా తెచ్చుకున్న ఆక్సిజన్ సిలెండర్లతో ఆస్పత్రి బయట అడ్మిషన్ కోసం పడిగాపులు కాయటం కనపడే దృశ్యం. హాస్పిటల్ కారు పార్కింగ్‌లో అడ్మిషన్ల కోసం ఎదురుచూసి మరణించిన వారు ఉన్నారు. కరోనా సెకండ్ వేవ్‌ను చవిచూసిన మొదటి నగరం ముంబై. ముంబైలోని లీలావతి హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ జలీల్ పార్కర్ ''మొత్తం వైద్యసంరక్షణ వ్యవస్థ కుప్పకూలిపోయింది. డాక్టర్లు నిస్పృహకు లోనవుతున్నారు'' అని అన్నారు. ''బెడ్స్‌కు కొరత, ఆక్సిజన్‌కు కొరత, మందులకు కొరత, వాక్సిన్లకు కొరత, తక్కువలో కరోనా పరీక్షలు - ఇది ఇక్కడి పరిస్థితి'' అని కూడా అన్నారు.
''కోవిడ్ రోగుల కోసం భవనంలో ఇంకొక భాగాన్ని తెరిచాం. అయినప్పటికీ రోగులకవసరమైనన్ని బెడ్స్ లేవు. దీనితో కొంతమంది పేషంట్లను కారిడార్‌లో ఉంచి వైద్యం చేస్తునాం. మార్పులుచేసి బేస్మేంట్ ప్రాంతంలో కోవిడ్ రోగులను ఉంచాం. హాస్పిటల్ బయట అంబులెన్సులలో, చక్రాల కుర్చీలలో ఎదురుచూపులు చూస్తున్న రోగులు ఉన్నారు. ఒక్కొక్కసారి బయట అక్కడనే ఆక్సిజన్ ఇస్తున్నాం. ఇంతకు మించి ఏమి చేయగలం.'' చివరికి, అధికారంలో అత్యున్నతస్థానంలో ఉన్నవారు కూడా తమ ప్రియమైన వారికి బెడ్ గురించి తంటాలు పడాల్సి వస్తున్నది. ''ప్లీజ్, సహాయం చేయండి. నా సోదరుడికి కరోనా వచ్చింది. వైద్యంకోసం బెడ్ అవసరం అయింది. ఘజియాబాద్‌లో బెడ్స్ దొరకటం లేదు''- ఇది మోడీ ప్రభుత్వంలో సహాయ రవాణా శాఖా మంత్రి, యూపీ నుంచి ఎంపీగా ఎన్నికైన వి.కె. సింగ్ ట్విట్టర్లో చేసుకున్న విజ్ఞప్తి.
ఆరోగ్య సంరక్షణా వ్యవస్థ కుప్పకూలకుండా ఆపేప్రయత్నంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఏప్రిల్ 19న ఆరు రోజుల లాక్డౌన్ ప్రకటించారు. ఆ సందర్భంలో ఎటువంటి దాపరికం లేకుండా ఒక మాట అన్నారు- ''ఢిల్లీలో కోవిడ్ పరిస్థితి ఘోరాతిఘోరంగా ఉన్నది.'' దేశ రాజధానిలోని ఆస్పత్రులలో ఉన్న ఐసియు బెడ్స్‌లో 99శాతానికి పైగా ఏప్రిల్ 19న, ఆ మర్నాడు నిండిపోయాయి. ఢిల్లీలోని అనేక ఆస్పత్రులు వందలకొద్ది కరోనా రోగులతో నిండిపోయాయి. ఈ ఆస్పత్రులు తమవద్ద మరికొద్ది గంటలకు సరిపడే ఆక్సిజన్ మాత్రమే ఉన్నదని, ఆక్సిజన్ అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి.
కరోనా వైరస్ వల్ల సంభవించిన మరణాల వాస్తవ సంఖ్యను దాచి పెడుతున్నారని గుజరాత్, ఉత్తరప్రదేశ్ మొదలైన రాష్ట్ర ప్రభుత్వాలపై ఆరోపణలు వచ్చాయి. ఇక్కడ మార్చురీలలో ఉన్న శవాలసంఖ్య ప్రభుత్వం చెపుతున్న మృతులసంఖ్యను మించి ఉన్నది. ఉత్తరప్రదేశ్‌లో కోవిడ్ వలన బాగా దెబ్బతిన్న నగరం లక్నో. అంబులెన్సు డ్రైవర్‌గా పనిచేస్తున్న సరోజ్ కుమార్ పాండే చిన్నప్పటినుంచి తనచేతుల మీదుగా పెరిగిన పెంపుడు కుమార్తె దీప్తి మిస్త్రిని ఎంత ప్రయాస పడినా కోవిడ్ బారినుంచి రక్షించుకోలేకపోయాడు. ఏప్రిల్ 14న కరోనా సోకిన దీప్తి ప్రాణాన్ని కాపాడటానికి ఒక డజన్ ప్రయివేటు, గవర్నమెంటు హాస్పిటల్స్ చుట్టూ తిరిగాడు. ఆమె ఏప్రిల్ 17న ఆక్సిజన్ అందుబాటులో లేక ప్రాణాలు విడిచింది. ఆమెకే గనుక హాస్పిటల్లో వైద్యం, ఆక్సిజన్ దొరికి ఉన్నట్టయితే ఇప్పుడు బతికి వుండేది'' అని సరోజ్ వాపోయాడు. హాస్పిటల్స్‌లో బెడ్స్‌కోసం, ఆక్సిజన్, ప్లాస్మా, కోవిడ్ పేషెంట్స్‌కు క్లిష్ట సమయాలలో వాడే రెమిడెసివిర్ మందుకోసం ట్విట్టర్, ఫేస్ బుక్ లలో వేలాది విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి.
ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ స్మశాన వాటికలు, సమాధి స్థలాలు మృతుల సంఖ్యతో అతిభారాన్ని మోస్తున్నాయి. తమ ప్రియమైన వారి దహన సంస్కారాలకు కుటుంబాలు రోజుల తరబడి ఎదురు చూడవలసి వస్తున్నది. శవ దహనాలు రెట్టింపు చేసి, 60కిపైగా దహనాలు నిర్వహించినప్పటికీ ఏప్రిల్18న ఢిల్లీలోని చాలా పెద్ద స్మశానవాటిక నిగమ్ బోధ్ ఘాట్‌లో శవాలు ఉంచటానికి స్థలం లేకపోయింది.
మే1నుండి 18ఏండ్ల పైబడ్డ వారందరూ వ్యాక్సిన్‌కు అర్హులని వ్యాక్సిన్ విస్తరణ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుండగా కొద్దినెలల ముందు ఎత్తివేసిన తాత్కాలిక కోవిడ్ సదుపాయాల వసతులను తిరిగి నిర్మించటానికి ఢిల్లీ, ముంబైలలోని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయాస పడుతున్నాయి. కాకపొతే వాక్సిన్ కొరత మాత్రం అదేవిధంగా ఉన్నది. దేశంలోని హాస్పిటల్స్ నుంచి మునుపు ఎదుర్కోని డిమాండ్‌ను అందుకోవటానికి పారిశ్రామిక అవసరాలకు వాడే ఆక్సిజన్‌ను వైద్య అవసరాలకు మళ్ళించాలని కేంద్రప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ద్రవరూపంలో ఉన్న ఆక్సిజన్‌ను, ఆక్సిజన్ సిలెండర్లను రవాణా చేయటానికి 'ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్'ల పేరుతో ప్రత్యేకమైన రైళ్ళు నడపటానికి భారత రైల్వేలు సిద్ధపడుతున్నాయి. రైల్వే కంపార్టుమెంట్లను వేలాదిమంది పేషంట్లకు ఉపయోగపడే విధంగా కోవిడ్ బెడ్స్‌గా మార్చింది. అయినప్పటికీ, చేసింది చాలా తక్కువ, చాలా చాలా ఆలస్యంగా చేస్తున్నట్టు అనేకమంది భావిస్తున్నారు. ''పరిస్థితి యొక్క ప్రమాదాన్ని ఎన్నో నెలల ముందరనే గ్రహించి ఉండాలి. కానీ ప్రభుత్వాలు వాస్తవస్థితిని పట్టించుకోవటానికి నిరాకరించాయి. ఈ వైరస్ ఇక ఎంత మాత్రమూ ప్రమాదకరమైనది కాదనే సందేశాన్ని వదిలాయి'' అని డాక్టర్ థఢాని అన్నారు. ''ఇంతకంటే భయానకమైన పరిస్థితిని చూడనున్నామని నేను ఆందోళన పడుతున్నాను''.
- హన్నా ఎల్లిస్ పిటర్సన్
'ది గార్డియన్' పత్రిక వార్తా కథనానికి
సంక్షిప్తీకరణ: కర్లపాలెం భాస్కర్.