Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆకర్షణీయమైన వ్యక్తిత్వ ముఖ్య లక్షణాలుగా నీతి నిజాయితీ, కరుణ, సానుభూతి-సహానుభూతి, కతజ్ఞతాభావం, వినయ సంపన్నత, ఓపిక, సహనశీలత, స్వీయ అవగాహన, సమస్యలను అధిగమించే సామర్థ్యం, సానుకూల దక్ఫథం, విజ్ఞాన వివేకాలు, నిగ్రహం, నిస్వార్థత, ధైర్య సాహసాలు, నాయకత్వ లక్షణాలు, అంకితభావం, ఆత్మ విశ్వాసం మొదలగునవి ప్రముఖంగా నిలుస్తాయి. వ్యక్తిగత జీవితంలో నిజాయితీకి అధిక ప్రాధాన్యత ఉన్నందున ప్రతి ఏటా ప్రపంచదేశాలు, ముఖ్యంగా అమెరికాలో 30 ఏప్రిల్ రోజున 'జాతీయ నిజాయితీ దినం (నేషనల్ హానెస్టీ డే)' పాటించుట జరుగుతున్నది. ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కతిక రంగాల్లో నీతి నిజాయితీకి అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. 'ది బుక్ ఆఫ్ లైస్' రచయిత యం. హిర్ష్ గోంబర్గ్ చొరవతో 1789 ఏప్రిల్ 30న నిర్వహించిన జార్జ్ వాషింగ్టన్ ప్రథమ వార్షికోత్సవానికి గుర్తుగా ఏప్రిల్ 30న 'జాతీయ నిజాయితీ దినం' జరుపుకొనుట ఆనవాయితీ అయ్యింది. మానసిక శారీరక ఆరోగ్య ప్రధాత నిజాయితీ మాత్రమే అని నమ్ముదాం. ఒక అబద్ధాన్ని కప్పివుంచడానికి వంద అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. దీనితో మానసిక ఒత్తిడి, ఆందోళన పెరిగి నిద్ర దూరం అవుతుంది. నిజాయితీ జీవితాంతం మనల్ని కాపాడే రక్షణ కవచంలా ఉంటుంది. నిజాయితీ అనేది కనబడే వస్తువు కాదు, అంతరంగంలో దాగి ఉంటూ, మన ప్రవర్తన ద్వారా బయట పడుతుంది. రాజకీయ నాయకుల్లో నీతి నిజాయితీ కొరవడితే అవినీతి, కుంభకోణాలు, అశ్రితపక్షపాతాలు, అబద్ధాలాడటం లాంటివి బయట పడతాయి. దాపరికం లేకుండా, సూటిగా, నిష్కపటంగా, సత్య ధర్మాలతో జీవితాలను సుసంపన్నం చేసుకోవాలనే ప్రచారాన్ని ఈ వేదికగా నిర్వహిస్తారు. ఒక పొరపాటును సత్వరమే సవరించు కోవడానికి మనకు అందుబాటులో ఉన్న ఆయుధమే నిజాయితీ అని గుర్తించు కోవాలి. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా మానవ సంబంధాలను నిర్ణయంచే గుణం నిజాయితీ మాత్రమే. జాతీయ నిజాయితీ దినం రోజున ప్రతి ఒక్కరు తాము చేసిన పొరపాట్లు, తప్పులను మనస్పూర్తిగా అంగీకరించి, సన్మార్గంలో పయనించేందుకు ఉద్యుక్తులు కావాలి. జాతీయ నిజాయితీ దినం రోజున నిజాయితీగా ఉండే ప్రయత్నం చేయడం, ఆ సద్గుణంలోని మాధుర్యాన్ని రుచి చూడడం మంచిది. మనం చేసే మంచి చెడులు, నీతి నిజాయితీ పనులు ముందుగా మనకు మాత్రమే పూర్తిగా తెలుస్తాయి. నిజాయితీని నమ్మిన వారు విలక్షణంగా గుర్తింపు పొందుతారు. నిజాయితీపరులు సమాజంలో అందరినీ సులభంగా ఆకర్షిస్తారు. మానవ సంబంధాలు పటిష్ట పడడానికి నిజాయితీ గుణమే వెలుగుగా నిలుస్తుంది. నిజాయితీకి సమాజం పట్టం కట్టాలంటే ముందుగా నిజాయితీపరుడు కావాలి. అబద్ధాలను ఆశ్రయించిన వారు అనతి కాలంలోనే అభాసుపాలు అవుతారు. నాయకులు నిజాయితీపరులు అయితే సమాజమంతా సన్మార్గంలో నడుస్తుంది. నిజాయితీ కొరవడిన నాయకుల మానసిక స్థితి అధమ స్థాయిలో పడిపోతుంది. అబద్ధాలు, అవినీతి కార్యాలను నమ్మేవారి మనసు చెదలు పట్టి క్రమంగా క్షీణిస్తుంది.
వివేకమనే పుస్తకంలో ప్రథమ పాఠం 'నిజాయితీ' అవుతుంది. నిజాయితీపరులు ఆరోగ్యంగా మరియు స్వచ్ఛమైన నవ్వులతో వర్థిల్లుతారు. నిజాయితీని సదా పాటించటానికి ప్రయత్నం చేయాలి. కొన్ని సందర్భాల్లో నిజాయితీ ప్రదర్శన కొందరి మనసులను నొప్పించే ప్రమాదం కూడా ఉంటుంది. కానీ నమ్మకం పెరగడానికి నిజాయితీ సహకరిస్తుందని మరువరాదు. బంధుమిత్రుల మనసు గెలవడానికి నిజాయితీ దోహదపడుతుంది. నిజాయితీపరుడు అందరినీ ఆకర్షిస్తాడు. ప్రాణ స్నేహితులను దగ్గరకు చేర్చే లక్షణం నిజాయితీకి ఉంటుంది. నిజాయితీ ఉన్న చోట నమ్మకం తిష్టవేస్తుంది. నిజాయితీపరుల ప్రవర్తన వల్ల శత్రువులు కూడా పెరగవచ్చు. అబద్ధాల జీవితానికి స్వస్తి పలకడానికి నిజాయితీ నీడను ఆశ్రయించాలి. చిన్నతనం నుంచే నిజాయితీ గుణాన్ని అలవర్చడం జరగాలి. నిజాయితీ నీడన దయ, క్రమశిక్షణ, సత్య పాలన, నైతికత లాంటి గుణాలు తిష్టవేస్తాయి. నిజాయితీ లోపించినపుడు దొంగతనం, లోభితనం, అపనమ్మకం, పిసినారితనం, మోసగించే లక్షణం, అబద్ధాలాడటం లాంటి అమానవీయ అవలక్షణాలు రాజ్యవేలుతాయి. సరళ జీవన (సింప్లిసిటీ) విధానానికి పునాది నిజాయితీ మాత్రమే. నిజాయితీపరుల సమాజం సస్యశ్యామలంగా, పచ్చని సంసారాలతో, నిత్య చిరునవ్వుల పంటలతో వర్ధిల్లుతుంది. అందుకే నిజాయితీని అంతరంగ ఆభరణంగా ధరించి ప్రకాశవంతమైన వ్యక్తిత్వంతో జీవనయానాన్ని సాగించాలి.
-డా: బి.ఎం.రెడ్డి, సెల్: 9949700037