Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా రెండో ఉధృతి విలయతాండవం చేస్తున్నది. ఊపిరాడటం లేదు. ప్రాణవాయువు కొరత, పడకల కొరత, ఔషధాల కొరత, వ్యాక్సిన్ కొరత. కడకు ప్రాణం పోతే దహన సంస్కారాలకు సైతం శ్మశానాలు కొరత. ఘోర విపత్తులు ప్రజానీకానికి కొత్తేమీ కాదు. వస్తుంటాయి. పోతుంటాయి. చీకటి తర్వాత వెలుతురు రావడం తథ్యం. ప్రజలు సంఘటితంగా పోరాడి ఇంతకంటే ఘోర విపత్తులను ఎక్కడికక్కడ పారద్రోలిన ఘటనలు కోకొల్లలు. వరదలు, తుఫానులు, భూకంపాలు ప్రకృతి ఉత్పాతానాలను ఎదుర్కొన్నారు.చివరకు మానవ ప్రేరిత భయంకర యుద్ధాల నుంచి కూడా తమని తాము కాపాడుకున్నారు. ఇది చరిత్ర చెప్పిన సత్యం.
అయితే విపత్తుల వేళ పాలకులు, ప్రజలు ఎలా స్పందిస్తున్నారు. గుణపాఠాలు ఏమి తీసుకుంటున్నారనేది ప్రశ్న. విపత్తులు సంభవించిన వేళ పాలకులు స్వార్థపూరిత రాజకీయ, ఆర్థిక, వ్యాపార ప్రయోజనాలు పక్కనపెట్టి ఎంత మానవీయంగా వ్యవహరిస్తున్నారు? ప్రజాస్వామ్య పద్ధతుల్లో నడుచుకుంటూ న్రపజలను ప్రతిపక్షాలను, పౌర సమాజాన్ని ఏవిధంగా కదిలిస్తున్నారు? ఎలా భాగస్వామ్యం చేస్తున్నారు? అనేది ముందుకు వస్తుంది. అందుకే నేడు అంతర్జాతీయ మీడియా నోట్లో నాలికగా మారింది భారత్.
కరోనా మొదటి ఉధృతివేళ చెప్పాపెట్టకుండా ప్రధాని మోడీ అకస్మాత్తుగా లాక్డౌన్ ప్రకటించడంతో పొట్టచేత పట్టుకుని వలస కార్మికులు అసంఖ్యాకంగా పుట్టిన ఊర్లకు వందలమైళ్ళు నడుచుకుంటూ తిరిగి వచ్చారు. ఆ మహా విషాద పాదయాత్రలో ఎందరో తల్లులు, పిల్లలు, పెద్దలు ప్రాణాలు కోల్పోయారు. కరోనాను ఎదుర్కోవడంలో ఎక్కడికక్కడ వైద్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, రక్షణ సిబ్బంది ప్రాణాలకు తెగించి, అంకితభావంతో పనిచేశారు. సేవామూర్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వలసకార్మికులకు అన్నాలు పెట్టారు. ఆహార పదార్థాలు ఇచ్చారు. ఆపన్నులను ఆదుకున్నారు. ప్రజల దయార్ద్ర హృదయానికి కండ్లు చమర్చాయి కూడా. ప్రభుత్వానికి మించిన ప్రజా సహాయం ఇది. అయినా కొందరు స్వార్థపరులు ఈ సానుకూల చర్యలను గమనించక కరోనా రాకడను ఒక మతంపై నెట్టి ప్రజల్లో మత విద్వేషాలు రెచ్చకొట్టేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించారు. వారి రహస్య రాజకీయ ఎజెండా అమలుకు అమానవీయంగా నిర్లజ్జగా వ్యవహరించారు.
కరోనాను పారద్రోలేందుకు అంటరానితనంతో సహా అన్ని అశాస్త్రీయ పద్ధతులను పున్ణప్రతిష్టించేందుకు విఫలయత్నం చేశారు. దీపాలు వెలిగించమన్నారు. పళ్ళాలు మోగించమన్నారు. చప్పట్లు కొట్టమన్నారు. ప్రభుత్వం, ప్రధాని పదవి, మీడియా మీద గురితో చాలామంది, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజానీకం నమ్మికతో పాటించారు. అయినా ఆ పప్పులేం ఉడకలేదు. ఎందుకంటే ఎప్పటికైనా శాస్త్రీయమే ఆధారం. భౌతికచర్యే పరిష్కారం. భౌతికదూరం పాటించడం, మాస్క్ ధరించడం, చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం, వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడం కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు శాస్త్రీయ మార్గాలుగా అంతటా ఉనికిలోకి వచ్చాయి.
జనసాంద్రం లేకుండా ఉండేందుకు పెద్ద పెద్ద మాల్స్, సినిమాహాల్స్, క్లబ్లు, పబ్లు, కార్యాలయాలు, విద్యాలయాలతో పాటు, చివరకు ప్రార్థనా స్థలాలకు కూడా తాళాలు పెట్టవలసి వచ్చింది. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించి ప్రజలకు ఉపశమనం చేకూర్చి, ఉన్నంతలో కాస్త మెరుగైన జీవితాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడకుండా కరోనా సమయాన్ని తన స్వార్థప్రయోజనాలకు వాడుకునేందుకు కక్కుర్తిపడింది. కార్పొరేట్లకు అనుకూలంగా, కార్మిక హక్కులను కాలరాసే రీతిలో అమాంతంగా లేబర్కోడ్లను తీసుకువచ్చింది. శీఘ్రగతిన ప్రభుత్వ సంస్థలను ప్రయివేటీకరించేందుకు పూనుకుంది. అన్నిటికీ మించి రైతులకు వ్యతిరేకంగా మూడు వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. ఈ చట్టాలు రైతులకే కాదు, దేశ ప్రజల ఆహార భద్రతకే పెనుప్రమాదం అని లోకం కోడైకూసినా వినిపించుకోలేదు. గడ్డకట్టే చలిలో ప్రాణాలకు తెగించి రాజధాని ఢిల్లీ శివార్లలో పిల్లా, జల్లా, ముసలి, ముతక, మహిళలతో సహా లక్షలాది మంది రైతులు ఉద్యమిస్తున్నా చలించటంలేదు. ఆ ఉద్యమం మొదలై 150రోజులు గడచిపోయింది.
ఇది ఇలా ఉండగానే కరోనా వ్యాక్సిన్ను విడుదల చేయడం, కరోనాను జయించడంలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందని విజయగర్వంతో ఉప్పొంగడం, మీడియాలో అందరూ గమనించిందే. ఆ తర్వాత వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రకటించడం, ఎనిమిది తడవలుగా వీటిని నిర్వహించడం, లక్షలాది మంది ప్రజానీకం ఆ ఎన్నికల్లో పాల్గొనడం, అదీ భౌతికదూరం పాటించక, మాస్క్లు ధరించక వ్యవహరించడం, కుంభమేళాలో దాదాపు నలభైలక్షల మంది సామూహిక స్నానమాచరించడం కరోనా రెండో ఉధృతికి కారణమని పరిశీలకులు అంటున్నారు. అంటే కరోనా ఉధృతి పట్ల ప్రభుత్వానికి ముందుచూపు కొరవడటంతో పాటు, దాని రాజకీయ ప్రయోజన స్వార్థదృష్టిని, ప్రజల ప్రాణ భద్రత పట్ల నిర్లక్ష్య తెంపరితనాన్ని పరిస్థితులు రుజువు చేస్తున్నాయి. అంతర్జాతీయ మీడియా ఈ పరిణామాలనే ఎండగడుతున్నది. పాలకవర్గాల భజన మీడియా ఇది మింగలేక కక్కలేక గమ్మునుంటున్నది. అసలు ఏం చెప్పాలో తెలియక గందరగోళస్థితిలో పడిపోతున్నది.
అసలు మోడీ అబద్ధాలే రెండో కరోనా ఉధృతికి కారణం అని 'గార్డియన్' పత్రిక ఏకరువు పెట్టింది. ఒకశాతం వ్యాక్సిన్ కూడా పూర్తికాకుండానే భారత్ 'ఔషధాలయం' అని మోడీ ప్రకటించుకుని పులకించిపోయారు. అదీ ఆర్నెల్ల క్రితమే. అంతే కాకుండా కరోనా అనంతర ప్రధాన జీవన స్రవంతిలోకి భారత్ వచ్చేసినట్టు చెప్పుకొచ్చారు.
క్రికెట్ స్టేడియాలు కిక్కిరిసిపోవడం, కుంభమేళ, ఎన్నికలు యథేచ్ఛగా సాగాయి. మోడీ తన జన సమ్మోహన శక్తికి సంతృప్తిపడవచ్చు. కానీ అందరికీ వ్యాక్సిన్ అందించే మాటేమిటి? అని ప్రశ్నిస్తోంది ప్రపంచ మీడియా. ఆక్సిజన్ అందక ప్రాణాలు వదిలిన భారీ భారత ఏనుగు కళేబరం అంబారీపై మోడీ ఊరేగుతున్న కార్టూన్ నెట్లో చక్కర్లు కొడుతున్నది. అంటే ప్రధాని మోడీ చెప్పే మాటలకు, జరుగుతున్న కార్యాచరణకు పొంతన ఉండటం లేదని మీడియా వ్యాఖ్యానిస్తున్నది. తాము పండించే పంటకు మద్దతుధర ప్రకటించేలా చట్టం చేయమని రైతులు వత్తిడి చేస్తున్నా, 'అది కుదరదు, నామాట మీద నమ్మకం ఉంచండి' అని ప్రధాని భీష్మించుకున్న తీరుకు ఇదేమీ భిన్నంగా లేదు.
'వదంతులు నమ్మకండి. అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తాం' అని ప్రధాని చెప్పినదానికి ఆచరణలో ఎక్కడెక్కడ ఎలా వ్యత్యాసాలుగా ఉంటున్నది మీడియా పుంఖాను పుంఖాలుగా నేడు వివరిస్తున్నది. వాస్తవాలను కండ్లకు కడుతున్నది. అంతకంటే ఎక్కువగా ప్రజల అనుభవంలోకి వస్తున్నది. ఏదైనా అనుభవంలోకి వచ్చాక కేవలం మాటలపై విశ్వాసం ఉంచడం చాలా కష్టం.
ఈ విపత్కర పరిస్థితుల్లో వైద్య నిపుణులను, శాస్త్రవేత్తలను, ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకుని, అరమరికలు లేకుండా సంప్రదింపులు జరిపి, చిత్తశుద్ధితో కార్యాచరణకు అడుగిడితే కరోనాను జయించడం చాలా సులభం. ప్రజలు కూడా నమ్మికతో ఉత్సాహంగా అప్పుడు కదులుతారు. అదే వారికి వేయి ఏనుగుల బలం. కేరళ చూపుతున్న ఆదర్శమార్గం కూడా ఇదే.
కె. శాంతారావు
సెల్:9959745723