Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీశ్రీ ఒక స్ఫూర్తిదాయకమైన పేరు. ఆయనను తలచుకోగానే కదిలించే కవిత్వం వినపడి విస్తరిస్తుంది. లావాలా ఎగిసిపడే చైతన్యం అది. యుద్ధ సంగీతమై నిప్పులు కక్కుతుంది. పదండి ముందుకు పదండి తోసుకు అంటూ నెత్తురుమండే శక్తులకు నూతనోత్తేజాన్ని అందించే మార్చింగ్ గీతాలాపకుడు శ్రీశ్రీ. ఆయన గురించిన విశేషణమేదయినా ఆయన సృజించిన మాటల్లోనే వివరించగలం. ఎందుకంటే కవిత్వ భాషా సముదాయాన్ని సముద్రఘోషలా శబ్ధించి విస్తరించినవాడు శ్రీశ్రీ. ఆయన కవితా ప్రభావం ప్రజల నవనాడుల్లోకి పాకింది. అభ్యుదయ సాహిత్యోద్యమానికి కంచుకాగడాలా కాంతిని విరజిమ్మింది. ప్రజా ఉద్యమాలకు ఊపును ఉత్సాహాన్నిచ్చింది. ఎందరో ప్రజాకవులను సృష్టించింది.
'హృదయం ఎలా కంపిస్తే ఆ కంపనలకి మాటల రూపాన్ని ఇవ్వడం అతనికే తెలుసు. మాటల్ని కత్తులూ, యీటెలూ, మంటలుగా మార్చటం అతనికే చేతనవును. శ్రీశ్రీ పద్యాలు చదువుతుంటే అవి అక్షరాలూ మాటలూ కావు.. ఉద్రేకాలు, బాధలు, యుద్ధాలు, అతని హృదయంలోంచి మన హృదయాల్లోకి డైరెక్ట్‌గా పంపిన ఉత్సాహాలు, నెత్తురు కాలవలనిపిస్తుంది' అని చెలంగారు చెప్పిన మాటలు అక్షరాలా నిజం. రెండు విషయాలలో శ్రీశ్రీ వేసిన ప్రభావం నిరంతర చైతన్యస్ఫూర్తిని అందిస్తూనే ఉంది. అవి, ఒకటి కవిత్వాన్ని విప్లవీకరించి ఒక నూతన దారిని ఏర్పరచి మహాప్రస్థానమై సాగిపోయాడు. రెండవది ఒక విప్లవ చూపును కవిత్వంలోకి తెచ్చి ఝంఝానిలషడ్జధ్వానం సృష్టించాడు. ఎగరేసిన ఎర్రని జెండాని పట్టుకు కవిత్వ పల్లకీమోశాడు. సామాన్యుల బాధల్ని గాధల్ని గానం చేశాడు. పతితుల, భ్రష్టుల, బాధా సర్పద్రష్టుల, కూడులేని, గూడులేని హీనుల, దీనుల, దగా పడిన తమ్ముల్లందరికీ నేనున్నానని కవన కోరస్ పాడి ఏడవకండని ఓదార్చాడు. కడుపు దహించుకుపోయే పడుపుకత్తె రాక్షసరతిలో, అర్థనిమీలిత నేత్రాల, భయంకర బాధల పాటల పల్లవిని విని, ఉరితీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యాన్ని గురించి గానం చేస్తున్నప్పుడు మనకు భగత్‌సింగ్ జ్ఞాపకాలు, సామ్రాజ్యవాదుల లాభాల వేటలో చమురు దోపిడీదారులచే ఉరితీయబడ్డ సద్ధాంహుస్సేన్ స్మృతి కండ్లలోకి రాకుండావుంటాయా! విప్లవ కవిత్వపు ధ్వని మన చూపును విశాలం చేస్తుంది. 'సమ్మె కట్టిన కూలీల, సమ్మెకట్టిన కూలీల భార్యల, బిడ్డల ఆకటి చీకటి చిచ్చుల హాహాకారం, ఆర్తారావాన్ని, ధనిక స్వామిక దాస్యంచేసే యంత్ర భూతముల కోరలు తోమే, కార్మిక ధీరుల కన్నుల నిండా, కణకణమండే గలగల తొణకే విలాపాగ్నులను, విషాదాశ్రులను, కష్టం చాలక కడుపుమంటచే తెగించి సమ్మెలు కట్టే వాళ్ళ అశాంతిని దీర్ఘశ్రుతిలో తీవ్రధ్వనితో వినిపించాడు గనకనే ఇన్నేండ్లయినా ఆయన కవితా చైతన్యాన్ని పలవరిస్తూనే ఉన్నాం.
ఏప్రిల్ 30న ఆయన జయంతి. మరుసటిరోజే మేడే. ప్రపంచ కార్మికుల దినోత్సవం. సకలదేశ కార్మికుల విముక్తిగీతాన్ని ఆలపించిన శ్రీశ్రీ గీతాలు మేడే రోజు శ్రామిక మహాప్రదర్శనలా సాగుతూనే ఉంటాయి. తన కవిత్వం కార్మికలోకపు కల్యాణానికి శ్రామికలోకపు సౌభాగ్యానికి, త్రిలోకాలలో, త్రికాలాలలో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదని, కష్టజీవులకు, కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశించే కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుందని నిబద్ధుడై నినదించాడు. ఎందుకు శ్రీశ్రీ కవిత్వం ఇప్పటికీ ప్రాసంగికతను కోల్పోలేదంటే... ఎవరి విముక్తికోసం శ్రీశ్రీ ఎలుగెత్తిపాడాడో, వాళ్ళ జీవితాలు ప్రపంచవ్యాపితంగా మరింత దోపిడీకి పీడనకు గురవుతూనే ఉన్నాయి. వేదనతీరలేదు, బాధలు తొలగలేదు. మరింత దోపిడీ పెరిగింది. కాబట్టి శ్రీశ్రీ అప్పటికంటే మరింత అవసరంగా మారాడు.
మనదేశంలోని కార్మికవర్గంపై పాలకులు మరింత భారాలను పెంచుతున్నారు. ధనికవర్గాల మేలుకోసం శ్రామికుల దోపిడీకి నడుంకట్టారు. కార్మికులు ప్రపంచవ్యాపితంగా పోరాడి సాధించుకున్న హక్కులను హరిస్తున్నారు. పనిగంటలు పెంచుతున్నారు. సమ్మె హక్కును తొలగిస్తున్నారు. శ్రమ దోపిడీ వేగాన్ని పెంచారు. అందుకనే శ్రీశ్రీ చీనాలో రిక్షావాలా, చెక్ దేశపు గని పనిమనిషి, ఐర్లాండున ఓడ కళాసీ, అణగారిన ఆర్తులందరూ ఒకే గొంతుకతో నినదించాలని పిలుపునిచ్చాడు. శ్రామికులందరూ సంఘటితమవ్వాల్సిన అవసరం నేడు మరింత పెరిగింది. ఇది కేవలం హక్కులు, వేతనాలు, పెంపుకోసమే కాదు, దోపిడీని సమూలంగా అంతంచేసే విముక్తి విప్లవ పోరాటంగా కొనసాగాల్సి ఉంది. అప్పటి వరకూ శ్రీశ్రీ మనకు స్ఫూర్తినిస్తూనే ఉంటాడు. ఆకలేసి కేకలేసానన్నాడు శ్రీశ్రీ. ఆకలి, వేదన, పీడన, హాహాకారాలు మరింత మరింత పెరుగుతున్న నేటి తరుణంలో ఆయన కవిత్వం మనతో పయనిస్తూనే ఉంటుంది. తన జయంతి, వర్థంతి సందర్భంగా మనల్ని మనం పునర్మూల్యీకరించుకొంటూ ప్రజల పక్షాన పునరంకితమవ్వాలి. జనుల గుండెలయల్ని, బాధల్ని అక్షరీకరించాలి.
దేశం నేడు శ్మశానవాటికలో చోటు కోసం వరుసలు కడుతున్న దయనీయ స్థితిలోకి నెట్టివేయబడింది. ఊపిరి అందక కండ్లముందే ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఆసుపత్రుల్లో జాగాలేక తల్లడిల్లుతున్న సామాన్యుల రోదన ఒకవైపు. అధికారం కోసం అర్రులు చాస్తున్న అధికార ఉన్మాద చర్యలు మరోవైపు. ప్రజల్ని ఆదుకోవాలన్న కనీస స్పందన లేకుండా, కుబేరులకు లాభాలు చేకూర్చుతున్న పాలకుల నిస్సిగ్గు పనితనాలు చూసి నివ్వెరపోతున్న ప్రపంచం. ఈ దుస్థితికి అద్దం పట్టే కవితా చూపును ఆనాడే మనముందుంచాడు శ్రీశ్రీ. ఈ సమాజంలోని అధర్మాన్ని నిధనం చేసే కవితా 'ఖడ్గసృష్టి'లో జాబిలితో సంభాషిస్తూ (శరశ్చంద్రిక) 'అంతా అగమ్యగోచరం, అంతా అరుణ్యదోదనం, ద్వేషం ఇచ్చే పర్సెంటేజి ప్రేమం ఎలా ఇవ్వగలదు? / కష్టపడి ఆర్జించిన స్వాతంత్య్రం, గద్దలు - తన్నుకుపోతాయి, కంచిమేక పాపం ఎప్పుడూ, కసాయివాణ్ణే నమ్ముతుంది. ఈ ప్రపంచంలో ఎందరో అభాగ్యులున్నారు, పలకరించువాళ్ళని చల్లగా, ఆసుపత్రి కిటికీల్లోంచి నీ కిరణాలను జాలుగా పంపించి, వ్యాధిగ్రస్తుల పాలిపోయిన కపోలాలను, జాలిగా స్పృశించడం మరచిపోకు' అని శరశ్చంద్రికకు విన్నవించాడు. ఈ కవిత నేటి దేశ ప్రజల స్థితిని కండ్లకు కట్టిస్తుంది. 'ఏవో, ఏవేవో, ఘోషలు వినపడుతున్నారు, గుండెలు విడిపోతున్నారు, ఇంకిన, తెగిపోయిన, మరణించిన, క్రొన్నెత్తురు, విపంచికలు, యువ యోధులు' అంటూ అక్షరాలతో దృశ్యమానం చేసినా, ఏవితల్లీ! నిరుడు కురిసిన హిమ సమూహములు? అని ప్రశ్నలతో తనలో తాను ఆవేదన చెందినా, చల్లారిన సంసారాలూ, మరణించిన జనసందోహం, అసహాయుల హాహాకారం, చరిత్రలో మూలుగుతున్నవని అసలైన నిజమైన చరిత్రను వివరిస్తూ నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయినత్వమేననీ, చిరకాలంగా జరిగే మోసాలూ, బలవంతుల దౌర్జన్యాలు, ధనవంతుల పన్నాగాలూ ఇంకానా ఇకపై చెల్లవని నినదించినవాడు శ్రీశ్రీయే.
ఢిల్లీలో నూటాయాభై రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం అన్నదాతలను ద్రోహులుగా, దోషులుగా చిత్రీకరిస్తూ ఆందోళన జీవులని ఎగతాళి చేయటం, మూడువందల మంది రైతులు ప్రాణాలు కోల్పోయినా గొంతుపెకలని నాయకుల దుర్మార్గ వర్తనలు చూస్తూనే ఉన్నాం. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రజలను మతాల వారీగా, ప్రాంతాల వారీగా విభజించేందుకు విద్వేషాలను రెచ్చగొట్టటాన్ని వీక్షిస్తున్నాము. అందుకనే 'అదృష్టవంతులు మీరు, వెలుగును ప్రేమిస్తారు, ఇతరుల ద్వేషిస్తారు, వడ్డించిన విస్తరి మీ జీవితం. అభాగ్యులం మేము, అన్నీ సమస్యలే, సందేహాలే మాకు, మాకు గోడలులేవు, గోడలు పగులగొట్టటమే మాపని, అలజడి మా జీవితం, ఆందోళన మా ఊపిరి, తిరుగుబాటు మా వేదాంతం' అని స్పష్టంగానే చెప్పాడు శ్రీశ్రీ. 'పాలికాపు నుదుటి చెమట, కూలివాని గుండెచెరువు, బిచ్చగాని కడుపు కరువు తిరుగుబాట్లు, సంగ్రామం మాయంటావూ, స్వామీ మిథ్యంటావూ? అని మిథ్యావాదులను సూటిగా ప్రశ్నించాడు. ఈనాటి ఆధిపత్య రాజకీయాలు దేవున్ని ఎలా పావుగా వాడుతున్నయో కూడా వ్యంగ్యంగా చిత్రించాడు.
'కాషాయం ట్రేడు మార్కుగా
దేవుని యేజెంటుగ
పెంచిన గడ్డంతో జన
వంచన కావించువాడు
సన్యాసం వైరాగ్యం
సద్గుణాలుగా వచించి
ధనస్వామ్య వర్గాన్నే
వెనకేసుకు తిరుగుతాడు' ఇంతకంటే నేటి యథార్థాన్ని చెప్పగలిగిన కవిత మరేమున్నది. అందుకనే ఆయన అక్షరాలు శ్రీశ్రీని సజీవంగా నిలబెడుతున్నాయి. ఇప్పుడు సామాన్య ప్రజల విశ్వాసాలను, ఉద్వేగాలను ఆసరా చేసుకుని ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి, ప్రశ్నించే గొంతులను నిర్భంధాలకు గురిచేస్తున్న నియంతృత్వ పోకడలను ప్రత్యక్షంగా చూస్తున్నాం. సృజనకారులను, మేథావులను, ఉద్యమ జీవులను నిషేధానికి గురిచేస్తూ నిర్భంధాలతో వెలివేస్తున్న దొరస్వామ్యాలను, నిరంకుశత్వాలను కలాలు ఎక్కుపెట్టి ఎదిరించాల్సిన అవసరం ఇప్పుడున్నది. అవును అన్యాయాలను, అక్రమాలను ఎండగట్టటం, స్వేచ్ఛకోసం పరితపించే కవితా సృజనతో పాటుగా ఈ అన్ని దౌష్ట్యాలకు, రుగ్మతలకు కారణభూతమయిన వ్యవస్థను అర్థం చేసుకోగలిగే రాజకీయ అవగాహనతో కవనం రావాల్సిన అవసరం ఉంది. ఏదో ఒకటి రాస్తున్నామంటే సరిపోదు నేడు. సాంస్కృతిక వ్యవస్థలపై వ్యూహంలో భాగంగానే దాడులు జరుగుతున్నప్పుడు, మానవీయ అంశాలను ధ్వంసం చేస్తున్నప్పుడు, వీటిని ఎదుర్కొనేందుకు మరింత ఎరుకతో, నిబద్ధ సామాజిక రాజకీయ దృక్పథంతో ముందుకు పోవాల్సి ఉంది.
అందుకు శ్రీశ్రీ కవిత్వం ఎప్పటికయినా స్ఫూర్తిని ఇస్తూనే ఉంటుంది. ఆయన జయంతిరోజున మనం పొందాల్సిన చైతన్యం అదే. వ్యక్తిగా శ్రీశ్రీ జీవితం కొన్ని వైరుధ్యాలతో కొనసాగినప్పటికీ ఆఖరి శ్వాస వరకూ ప్రజల పక్షపాతిగా బతికిన అమరుడు అతడు. మరో ప్రపంచపు కలను సాకారం చేసేందుకు పదండి ముందుకని ఎర్రబావుటా నిగనిగల సౌరభాన్ని తెలుగు కవిత్వాని కందించి, సాహితీ ప్రవాహంపై చెరగని చైతన్య సంతకాన్ని చేసిన మహాకవి అతడు. దాన్ని కాపాడుకుంటూ కొనసాగడమే మనముందున్న కర్తవ్యం.
ఆనందాచారి
సెల్: 9948787660