Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక్కడివో అనేకుడివో
ఆవేశానివో ఆశయానివో
సహనానివో సమరానివో
ఉద్యమ భాషవో విప్లవ శ్వాసవో
ఏదో ఏమి, అన్ని నీవైనవాడివి, వేడివి...
''సుందరయ్యా''..! అన్న శబ్దం
మా అందరయ్యలా ఈ నేల ధ్వనిస్తూనే ఉంది
మా గుండె ప్రతిధ్వనిస్తూనే ఉంది
సముద్రమంత నిండుతనం
కొండంత గుండెతనం
నీ తలంపులో మాకందుతోంది.
నీ అడుగుల జాడలు ఆదర్శాల దారులై
మేము నిలబడిన మార్గాన కదిలి వస్తున్నాయి!
మంచి కమ్యూనిస్టు ఎలా ఉంటాడని
ఎవరైనా అడిగితే
అచ్చం నీలా ఉంటాడని చూపిస్తున్నాం
మానవత అంటే?
పీడిత జనావళి బాధలపట్ల
నీ స్పందన కంటే వేరేమీ ఉంటుంది!
ప్రజా నాయకుడంటే?
ఇదిగో సుందరయ్యను చూడమని
గర్వంగా చూపిస్తున్నాం
నిరాడంబరతకు, నిజాయితీకి నీకంటే నిదర్శనం మరేముంది చెప్పు!
తెలంగాణ సాయుధపోరాటం
యోధుడుగా నీ చరిత్రను ప్రస్ఫుటం చేసింది.
కథనాన్ని నడిపించే ధీరుడివే కాదు,
కవనాన్ని పరిశీలించే సమర్థుడవు
కఠిన కార్యాల కడలినైనా ఈదగల
దృఢ సంకల్పుడవు
కాని పనులకు పూనుకొని యోచనాపరుడవు
మహానాయకుడివి సుందరయ్యా
ప్రజా నాయకుడివి అందరయ్యా
ఎన్ని మార్పులు ఎన్నో సంక్షోభాలు
ఎన్నెన్నో పరిణామాలు
ఆక్రమించిన వ్యవస్థాతలంపై నుండి
నీ జన్మదిన సందర్భాన నిన్ను
మరోసారి మననం చేసుకుంటున్నాం
మరింత చైతన్యాన్ని హృదిన నింపుకుంటున్నాం
- ఆనందాచారి