Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంతర్జాతీయ కార్మికవర్గ సంఘీభావ దినోత్సవమైన మేడేను వరుసగా రెండవ సంవత్సరం కోవిడ్ మహమ్మారి మధ్య కార్మికవర్గం జరుపుకుంటున్నది. ఒకటిన్నర సంవత్సరం క్రితం మొదటిసారి కోవిడ్ కనపడినప్పటినుంచి అనేక దేశాలు ఈ మహమ్మారి సెకండ్, థర్డ్ వేవ్‌లను, దీని అనేక రూపాంతరాలను ఎదుర్కోవటంలో మునిగివున్నాయి. దేశమంతటా దావానలంలా విస్తరించిన ఈ సెకండ్ వేవ్ విధ్వంసకరూపాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ముఖ్యంగా కార్మికులు, ఇతర అన్ని తరగతుల శ్రామికప్రజల జీవితాలపై, జీవనోపాధులపై ఇది పెద్ద ఉపద్రవాన్నే కలిగించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఇచ్చిన వివరాలననుసరించి ఏప్రిల్ 25సాయంత్రానికి ప్రపంచవ్యాపితంగా14 కోట్ల 60 లక్షల నిర్ధారిత కేసులు ఉన్నాయి. 30లక్షల మందికి పైగా ఈ మహమ్మారి వలన చనిపోయారు.
ఈ మహమ్మారి, దానితో వచ్చిన ఆరోగ్య సంక్షోభం, పెద్దఎత్తున జరిగిన ఉపాధి, ఆదాయాలు, జీవనభతుల నష్టం- ఇవన్నీ ఒక ప్రశ్నను లేవనెత్తుతున్నాయి: ఇంత పెద్దయెత్తున జరిగిన ప్రాణనష్టం, భరించలేని కష్టాలు నివారించలేనివా? ఇంతటిఘోర మానవ విషాదాన్ని అడ్డుకోవటం సాధ్యం కాదా? అడ్డుకోవటం సాధ్యమేనని సమాధానంగా గట్టిగా చెప్పవచ్చు, అయితే పాలకవర్గాలకు దీనిని ఎదుర్కోవాలనే ధఢమైన రాజకీయ చిత్తశుద్ధి ఉండాలి. కోవిడ్ వల్లఈనాడు సంభవించిన మరణాలలో చాలావాటిని తప్పించవచ్చు. చాలమంది జీవితాలను కాపాడవచ్చు. అయితే దానికి కావలసినది ప్రభుత్వం అధ్వర్యంలో సార్వజనిక ఆరోగ్య సంరక్షణ, శాస్త్రీయ అవగాహన, ప్రజలపట్ల అంకిత భావం. అంతేగాని లాభాల దృష్టి కాదు.
అయితే, మనదేశంసహా ప్రపంచంలోని అనేక దేశాలలోవున్న పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరించే ప్రభుత్వాలకు ప్రజల ప్రాణాలు కాపాడటం, కార్మికవర్గపు జీవనోపాధులకు రక్షణకల్పించటం ప్రాధాన్యతగల అంశాలు కావు. కార్పొరేట్ల లాభాలకు రక్షణ ఇవ్వటం వాటికున్న ప్రాధాన్యత. అందువలన అందరికీ ఉచిత ఆరోగ్య సంరక్షణ కల్పించటం అనే బాధ్యత నుంచి ప్రభుత్వాలు తప్పుకున్నాయి. ప్రయివేటు కార్పొరేట్ హాస్పిటల్స్, బీమాకంపెనీలు ప్రజల మూలుగుల్ని పీల్చి లాభాలను గడించే విధంగా ప్రయివేటు హెల్త్ ఇన్సూరెన్సును ప్రోత్సహించాయి. రోజురోజుకు సంఖ్యరీత్యా పెరుగుతున్న బీదశ్రామికజనంతో పాటు దేశంలోని పేదలందరు ఆరోగ్య సంరక్షణకు దూరమవుతున్నారు. అమెరికాలో కోవిడ్ కారణంగా వెతలపాలయిన, మరణించిన వారిలో పేదలు, నల్లవారు, లాటిన్ ప్రజలు, మహిళలు ఎక్కువగా ఉన్నారు. అమెరికాలో ఆరోగ్య సంరక్షణ అనేది బీమాతో, ప్రయివేటు హాస్పిటల్స్‌తో ముడిపడి ఉన్నది. యూరొప్ లోని అనేక దేశాలలో ఇంగ్లాండులోలాగా బలమైన ప్రజారోగ్య సంరక్షణ ఉండేది. అయితే నయాఉదారవాద విధానాల మూలంగా ఆ వ్యవస్థ నాశనమయ్యే పరిస్థితిలో ఉంది. భారతదేశం తన జీడీపీలో 1శాతం మాత్రమే ప్రజారోగ్యం మీద ఖర్చు చేస్తున్నది. నాణ్యమైన, అందుబాటులో ఉండే ఆరోగ్యసంరక్షణ విషయంలో 180 దేశాలలో మనదేశం 145వ స్థానంలో ఉన్నది. ప్రభుత్వ బడ్జెట్లలో ఆరోగ్య రంగానికి ప్రాధాన్యత ఇచ్చే విషయంలో 189 దేశాలలో మనదేశం 179వ స్థానంలో ఉన్నది.
గత ఒకటిన్నర సంవత్సరకాలంలో మన అనుభవం చెపుతున్నదేమిటంటే- ఈ వైరస్ కొత్తది అయినప్పటికీ, దాని తీరుతెన్నులు, అది కలిగించే జబ్బులు, ఆ జబ్బుల చికిత్స పట్ల అవగాహన ఏర్పడానికి కొంత సమయం పట్టినప్పటికీ, శాస్త్రజ్ఞులు శీఘ్రంగానే దానిని అదుపులో పెట్టటానికి, ప్రజల జీవితాలు, ఉపాధులు కాపాడటానికి సమర్ధవంతమైన మార్గాలు కనుగొన్నారు. అనేకదేశాలు అనుకున్న సమయం కంటే ముందుగానే చక్కగా పనిచేసే వాక్సిన్లు కనిపెట్టి, ఉత్పత్తి చేయటం జరిగింది. అయితే, ఈనాటి అన్యాయమైన బౌగోళిక వ్యవస్థలో, ఎక్కువమంది పేదలు, ముఖ్యంగా పేద దేశాలకు చెందిన ప్రజలు వాక్సిన్ అందుకునే స్థితిలో లేరు. ఇప్పటికే అనేక ధనిక దేశాలు వాక్సిన్ తయారీదారులతో మాట్లాడుకుని, వాటిని నిల్వ పెట్టుకున్నారు. ప్రపంచ జనాభాలో 4.3శాతం జనాభామాత్రమే ఉన్న అమెరికా మొత్తం వాక్సిన్ ఉత్పత్తిలో 22.9 శాతాన్ని తీసుకున్నది. 'అమెరికా ఎన్నడూ వాడని ఆస్ట్రాజెనికా వాక్సిన్ను 3.5 నుంచి 4 కోట్ల డోసుల దాకా తన దగ్గరనే ఉంచుకున్నది' అని తెలుస్తున్నది. వారువాడుతున్నవి ఇతర వాక్సిన్ లు. వాక్సిన్ లలో సగం దాకా ప్రపంచ జనాభాలో 16 శాతం మాత్రమే వున్న దేశాల వద్దకు చేరాయి. బ్లూమ్ బర్గ్ వారి వాక్సిన్ ట్రాకర్ ప్రకారం, పేద దేశాల కన్నా 25 రెట్ల వేగంతో ధనిక దేశాలు వాక్సిన్ తమ ప్రజలకు అందించాయి. ప్రపంచంలోని 92 అత్యంత పేద దేశాలు వచ్చే 3 ఏండ్లకైనా తమ జనాభాలో 60 శాతానికి వాక్సిన్ అందించటం గగనమే అని వాషింగ్టన్ పోస్ట్ వార్తాపత్రిక పేర్కొంటున్నది. దీనికి భిన్నంగా, అందరికీ ప్రజారోగ్య సంరక్షణను అందిస్తూ, సోషలిస్టు వ్యవస్థలో ఉన్న చైనా, వియత్నాం, క్యూబా, ఉత్తర కొరియా దేశాలు కోవిడ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొని, అదుపులోకితెచ్చి ప్రజల ఆరోగ్యానికి రక్షణగా నిలిచాయి. అమెరికా ఎన్ని కఠినమైన ఆంక్షలు విధించినా క్యూబా సొంతంగా వాక్సిన్ ను అభివద్ధి చేసుకోగలిగింది. యూరప్ సహా అనేకదేశాలకు కోవిడ్ చికిత్సలో సహాయపడటానికి క్యూబా తన వైద్య బందాలను పంపింది. కోవిడ్ మొదటగా చైనాలో ప్య్రత్యక్షమైంది. అయినా చైనా దానిని సమర్ధవంతంగా అదుపులో పెట్టి, తన ఆర్ధికరంగాన్ని సానుకూల వద్ధి దిశగా నడిపించగలిగింది. పేదరికాన్ని నిర్మూలించటంలో అది మిలీనియం డెవెలప్మెంట్ గ్రోత్ (ఎండీజీ) లక్ష్యాలను ముందుగానే చేరుకుంది. ప్రజల ఆరోగ్యాన్ని, సంక్షేమాన్ని పణంగాపెట్టి, కార్పొరేట్లకు లాభాలు కట్టబెట్టటమే పరమావధిగా భావించే పెట్టుబడిదారీ విధానానికీ, ప్రజలకు, వారి సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చే సోషలిస్ట్ వ్యవస్థకూ మధ్యవున్న వ్యత్యాసాన్ని కొవిడ్ మహమ్మారి సూటిగా ముందుకుతెచ్చింది.
మనదేశంలో మోడీ నాయకత్వాన ఉన్న బీజేపీ ప్రభుత్వం, కరోనాపై విజయం సాధించామనే తప్పుడు ప్రకటనలతో ప్రజల ఆరోగ్యం, జీవితాలపట్ల అలసత్వాన్ని ప్రదర్శించింది. కోవిడ్ సెకండ్ వేవ్‌ను ఎదుర్కోవటంలో మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమయింది. ప్రపంచంలో అత్యంత కఠినమైన లాక్‌డౌన్‌ను ఆరోగ్య సదుపాయాలు కలిగించటానికి కాక, లేబర్ కోడ్స్ తో కార్మికుల మౌలికహక్కులమీద దాడికి, మూడు వ్యవసాయ చట్టాలతో రైతుల జీవనాధారంమీద దాడికి ఉపయోగించింది. అంతేకాదు, ప్రయివేటీకరణ మార్గంలో దేశవనరులను తన కార్పోరేట్ మిత్రుల హస్తగతం చేయడానికి ఉపయోగించుకున్నది. సెకండ్ వేవ్ గురించి అంచనాలు, హెచ్చరికలు వస్తున్నప్పటికీ, మొదటివేవ్లో భారీగా ప్రాణనష్టం, ఉపాధి, ఆదాయాల నష్టం వంటివి చవిచూసినప్పటికీ కార్మికులు, ముఖ్యంగా వలస కార్మికులు, అసంఘటితరంగ కార్మికులను కాపాడటానికి బీజేపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. నగదు బదిలీ, ఉచితంగా ఆహారధాన్యాల పంపిణి, ప్రజారోగ్య సంరక్షణను ఉధృతరం చేయటం లాంటి డిమాండ్లను కార్మిక సంఘాలు, ప్రముఖ ఆర్ధిక వేత్తలు, ఇతర అనేక తరగతుల ప్రజలు లేవనెత్తారు. ప్రభుత్వం వాటినన్నింటిని బేఖాతరు చేసింది. వేలాదిమంది వలస కార్మికులు ఇప్పటికే పారిశ్రామిక ప్రాంతాలను వదిలి తమ సొంత ఊర్లకు బయలుదేరారు.
ప్రజలకోసం వాక్సిన్ ఉత్పత్తి, సరఫరాలను వేగవంతం చేయటంలో బీజేపీ ప్రభుత్వం విఫలమయింది. సరిపడేంత స్థాయిలో వాక్సిన్ ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చేయటంలో నిర్లక్ష్యం చూపింది. కరోనాకు వ్యతిరేకంగా అందరికీ ఉచితంగా వాక్సిన్ ఇవ్వాల్సిన బాధ్యతనుంచి ప్రభుత్వం తప్పుకుంది. పైగా, మే 1నుంచి 18ఏండ్ల పైబడిన వారందరూ వాక్సిన్ తీసుకోవచ్చు అంటూ ప్రకటనచేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు వాక్సిన్లను బహిరంగ మార్కెట్ లో కొనుగోలు చేసుకోవాలని చెప్పింది. వాక్సిన్ తయారీదారులు పెద్దఎత్తున లాభాలు పోగేసుకునే విధంగా తమ వాక్సిన్ ధరలను వారే నిర్ణయించుకోవచ్చు అంటూ వివక్షతతో కూడిన వాక్సిన్ విధానాన్ని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఒక వాక్సిన్ డోస్‌ను రూ.150లకే పొందుతుంటే, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకడోస్కు రూ.400 లేక రూ.600లకు కొనాల్సి వస్తుంది. వాక్సిన్ కొరత వల్ల మే 1 నుంచి 18ఏండ్ల పైబడిన వారికి ప్రాంభించాల్సిన వాక్సిన్ కార్యక్రమం నిర్వహించలేమని రాష్ట్ర ప్రభుత్వాలు తమ అసక్తతను తెలిపాయి. మరో వైపు, లేబర్ కోడ్స్ నియమాలు నిర్ణయించక మునుపే, యాజమాన్యాలు కార్మికులపై దాడిని ఉధతం చేసాయి. వారు రిట్రెంచిమెంట్లకు, ఉద్యోగాల కోతకు, జీతాలలో కోతకు పాల్పడుతున్నారు. కార్మిక సంఘాలను, వాటి నాయకులను, కార్యకర్తలను విక్టిమైజేషన్కు, వేధింపులకు గురిచేస్తున్నారు. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని మౌనంగా వీక్షిస్తున్నాయి. వీకెండ్ కర్ఫ్యూ, నైట్ కర్ఫ్యూ, పాక్షిక లాక్డౌన్, లోకల్ లాక్డౌన్ మొదలైన ఆంక్షలను రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించటం మొదలుపెట్టాయి. కార్మికులు, అందులోనూ వలస కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు అనిశ్చితమైన, భయంకలిగించే భవిష్యత్తును గురించిన చింతలో పడ్డారు. పోయిన ఏడాది జరిగిన ఉపాధి నష్టం, ఆదాయాలు కోల్పోవటం, షెల్టర్లు దొరక్కపోవటం లాంటి చేదు అనుభవాలు వారి బుర్రలో ఇంకా తాజాగానే వున్నాయి. దీనితో వేలాదిమంది తమ సొంత ఊర్లకు బయలుదేరుతున్నారు.
కోవిడ్ సెకండ్ వేవ్ గురించి హెచ్చరికలు ఉన్నప్పటికీ, బీజేపీ ప్రభుత్వం వాటిని అసలు పట్టించుకోలేదు. ప్రస్తుతం దేశం హాస్పిటల్స్‌లో బెడ్స్, ఆక్సిజన్, వెంటిలేటర్స్, మందుల కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్నది. హెల్త్ కేర్ ఉద్యోగులు, కార్మికులు పనిభారంతో సతమతమవుతున్నారు. కోవిడ్ తాకిడి తీవ్రంగావున్న రాష్ట్రాలలో ఒకటైన ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి బదులుగా, పరిస్థితి తీవ్రత పట్ల ఆవేదన వెలిబుచ్చిన వారిపై, దాడులకు, హెచ్చరికలకు దిగుతున్నది. దీనిపై దేశాన్ని అస్థిరపరచటానికై 'బయటి శక్తుల' జోక్యంగా ఆర్ఎస్ఎస్ ఆరోపిస్తున్నది. గత సంవత్సరం ప్రజలపై లాక్డౌన్ రుద్దేటప్పుడు, బతుకుతెరువుకన్నా ప్రాణాలకు తన ప్రభుత్వం విలువనిస్తుందని మోడీ గొప్పగా చెప్పుకొచ్చారు. సంవత్సరం గడిచిపోయింది. ఈ ప్రభుత్వం అటు ప్రాణాలపట్ల, ఇటు కార్మికుల, రైతుల, ఇతర శ్రామిక ప్రజల జీవనోపాధులపట్ల ఏమాత్రం శ్రద్ధను కనపరచలేదు.
మొత్తం ప్రపంచంలో పెట్టుబడిదారీ విధానం ప్రజలకు, యువతరానికి అనుకూలంగా ఏమీ చెయ్యదని కోవిడ్ మహమ్మారి మరోమారు స్పష్టపరిచింది. తనను ఎన్నుకున్న ప్రజల కనీస అవసరాలను పట్టించుకునే బాధ్యతను విస్మరించి, బడా కార్పోరెట్ల ప్రయోజనాలను పెంచి పోషించే ప్రభుత్వం వలన బాధలకు గురి అవుతున్న ప్రజల గొంతుకగా కార్మిక వర్గం లేవాలి. కార్మికవర్గం గళమెత్తటమేకాదు, పేదలపట్ల మొసలి కన్నీరు కారుస్తూ, సూపర్ రిచ్ కోసం పనిచేసే పాలకవర్గాలు, వారి తైనాతీలు ప్రజలపై చేస్తున్న అక్రమాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించే శక్తిగా మారాలి.
ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌టీయూ) చెప్పినట్లు 'ఇటువంటి పాశవిక వ్యవస్థను కూల్చటం వినా మనకి ఇంకొక మార్గమే లేదు' అనే దానిని కార్మికవర్గం అవగాహన చేసుకుని, దానిని విస్తరింపచేయాలి. అందుచేత, కార్మికవర్గ, ఇతర శ్రామిక జనంపై బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా, కార్మికులు పోరాడి సాధించుకున్నహక్కులు, 8గంటల పనిదినంపై లేబర్ కోడ్స్ ఆధారంగా చేస్తున్న దాడిని త్రిప్పికొట్టటానికి, పెట్టుబడిదారి విధానంలో స్వభావ సిద్ధంగావున్న దోపిడీ లక్షణాన్ని ఎండగడుతూ, దోపిడీ పీడనలు లేని సోషలిస్టు సమాజం కొరకు పోరాటానికి, కార్మికవర్గ అంతర్జాతీయ సంఘీభావాన్ని పునరుద్ఘాటిస్తూ, ఈ మేడే రోజు మనల్ని మనం అంకితం చేసుకోవాలి.
- సీఐటీయూ అధ్యక్షురాలు
డాక్టర్ కె. హేమలత