Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మీడియా ద్వంద్వ స్వభావం, దానిపై పాలకులవత్తిళ్లు, పాచికలు, దాని ద్వారా సాగించే పథకాలు ప్రచారాలు దేశంలోనూ తెలుగురాష్ట్రాల్లోనూ మరింత బాహాటంగా అర్థమవుతున్నాయి. మీడియా సోషల్ మీడియాలలో వచ్చే కథనాలు, రాని కథనాలు, వాటి కారణాలు, కల్పనలు ఇప్పుడు పాఠకులు వీక్షకులు కూడా పరిశీలించి చూడకతప్పడం లేదు. అసలు ఒక పత్రికలోనో ఛానల్లోనో వచ్చింది మాత్రమే చూసి ఇదే నిజమనుకునే దశ ఎప్పుడో పోయింది. అంతర్జాతీయ మీడియాలో అంగీకార సృష్టి పేరిట నామ్‌చోమ్‌స్కీ వంటివారు లేదంటే ఇండియాలో పాలగుమ్మి సాయినాథ్, ఎన్రామ్ వంటివారు గతంలో చెప్పిన పాఠాలు ఇప్పుడు ప్రత్యక్షంగా అర్థమవుతున్నాయి. ఇరాక్ యుద్ధ సమయంలో బీబీజీ సీనియర్ జర్నలిస్టు ఒకరు అసత్యాలు చెప్పలేక అంతరాత్మ ఘర్షణ తట్టుకోలేకపోతున్నానంటూ ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు టైమ్స్ నౌ జర్నలిస్టుల బృందం కూడా తమ ప్రధాన యాంకర్లకు బహిరంగ లేఖ రాయడం అచ్చంగా ఆ సన్నివేశాన్నే గుర్తు చేసింది. దేశంలో బడా మీడియా (నరేంద్ర)మోడియాగా మారిపోయిందని ఒకప్పుడు మాలాంటి వాళ్లం చేసిన చమత్కారం ఎంత నిజమో టైమ్స్ నౌ బృందం లేఖ నిరూపించింది. మనం ఇంత కాలంలో కేంద్రంపై ఒక్క విమర్శనాత్మక చర్చ అయినా చేశామా? అని వారు తమ నిర్వాహకులను ప్రశ్నించారు. కోవిడ్ వ్యాపిస్తున్న సమయంలో అందుకు భారీ సభలే కారణమంటూ ప్రతిపక్ష సభలు చూపామే గాని బెంగాల్లో ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా జరిపిన భారీ ర్యాలీల ఫొటోలు చూపామా? అని ప్రశ్నించారు. మనం కొంచెం వెనక్కు వెళ్లి ఆర్నాబ్గోస్వామి ఉదంతం గుర్తు చేసుకుంటే మొత్తం మోడీ బృందం ఆయనను కాపాడేందుకు ఎంతగా పరితపించిందో సుప్రీం కోర్టు కూడా ఆసాధారణంగా ఎలా జోక్యం చేసుకుందో కనిపిస్తుంది. టైమ్స్ నౌకు కొన్ని రెట్లు ఎక్కువగా రిపబ్లిక్ టీవీ నేరుగా మోడీ బాకాగా వ్యవహరించింది.
కోవిడ్‌పై పోరాటంలో అతిశయోక్తులు
కోవిడ్19 విషయంలోనూ కేంద్రం వైఫల్యాలను మీడియా మొదట దాచిపెట్టిందే తప్ప విమర్శనాత్మకంగా వెల్లడించలేదు. చైనా నుంచి వచ్చిందనే కథలకు పెద్దపీట వేసింది. అంతకంతకూ కేసులు పెరిగి పరిస్థితి చేయిదాటిపోతుంటే అప్పుడు మరోవైపునుంచి కూడా కథనాలు ఇవ్వడం మొదలెట్టింది. ఆ సమయంలోనే సెకండ్ వేవ్ అవకాశాలను నిపుణులు చెబుతుంటే మీడియా ఉపేక్షించింది. వాక్సిన్ విజయాల ప్రచారానికి వాహికగా మారింది. సెకండ్ వేవ్‌లో చికిత్స, మందులు, ఆక్సీజన్ వంటివి కూడా అందక దేశం ప్రపంచంలోనే ప్రథమ స్థానానికి చేరుతుంటే అప్పుడు కండ్లు తెరిచింది. అయితే ఆత్మ విశ్వాసం కలిగించాలి గాని మీడియా విమర్శనాత్మక కథలు ఎక్కువగా ప్రచారం చేయకూడదని ప్రభుత్వం సుద్దులు చెప్పింది. సోషల్ మీడియాలోనూ ఆ విధమైన కథనాలు రాకుండా కట్టడి చేసింది. యాభై మంది సోషల్‌మీడియా ఖాతాలు ట్విటర్ అకౌంట్లు ఆపించింది. సీనియర్ జర్నలిస్టులకూ తాఖీదులు ఇచ్చింది. దేశద్రోహం వంటి ఆరోపణలు కూడాచేయించింది. ఇదంతా ఇటీవలి వ్యవహారమే. ఇంకా కొనసాగుతున్నది కూడా.
సిద్దిక్ కప్పన్పై కక్ష
ఇదే సమయంలో కేరళకు చెందిన సిద్దిక్ కప్పన్ యూపీలోని హత్రాస్ ఘోర అత్యాచారం ఘటనను నివేదించేందుకు బయిలుదేరితే ఆయనపైనా ఇలాంటి ఆరోపణలే మోపి జైలుపాలు చేసింది. ఆయన భార్య, జర్నలిస్టు సంఘాలు ఎన్నిసార్లు కోర్టును ఆశ్రయించినా ప్రయోజనం లేకపోయింది. ఆర్నాబ్ గోస్వామి విషయంలో ఆఘమేఘాల మీద జోక్యం చేసుకున్న సుప్రీంకోర్టు కప్పన్ విషయానికి వచ్చేసరికి హైకోర్టులోనే అప్పీలు చేసుకొమ్మని ఆదేశించింది. చివరకు ఆయనకు కరోనా సోకితే ఆస్పత్రిలో జంతువులాగా బెడ్‌కు కట్టేశారని ఆయన భార్య పిటిషన్ దాఖలు చేసింది. కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కూడా ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తికి చేశారు. ఈ పూర్వరంగంలో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సీజేఐ రమణ ధర్మాసనం సిద్దిక్కప్పన్ను యూపీ నుంచి ఢిల్లీలో ఎయిమ్స్‌కు తరలించవలసిందిగా ఆదేశాలిచ్చింది. సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దీనిపై ఎంతగా నిరసన తెలిపారంటే దేశంలో ఎందరో వృద్ధులు ఆక్సీజన్ అవసరమైన వారు ఆస్పత్రి సదుపాయం దొరక్క అవస్థ పడుతుంటే కప్పన్‌ను అనవసరంగా మీరు ఢిల్లీకి తరలించమంటున్నారని అభ్యంతరం చెప్పారు. మానవీయ కోణంలో ఆయనకు మెరుగైన చికిత్స లభించేలా మాత్రమే చేస్తున్నామని సీజేఐ రమణ ఆయనకు సమాధానమివ్వాల్సివచ్చింది. ఈ కాలంలోనే ఫ్రాన్స్‌లో రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అక్రమాల గురించి భారతీయ దళారికి భారీగా ముడుపులు ఇవ్వడం గురించి సాధికారిక సమాచారం వచ్చింది. ఒకప్పుడు బోఫోర్స్, 2జీ కేసు వంటివాటి గురించి అత్యుత్సాహంతో కథనాలు ఇచ్చిన బడా మీడియా దీనికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకుండా తొక్కిపట్టింది.
సుప్రీం కోర్టు అభ్యంతరం
కోవిడ్19కు సంబంధించి ఏవైనా పోస్టులు వ్యతిరేక పోస్టులు రాకుండా ఆపడంకోసం ప్రభుత్వం ఉత్తర్వులు మార్గదర్శకాలు జారీచేస్తే సుప్రీం కోర్టు అందుకు భిన్నమైన వ్యాఖ్యలు చేయవలసి వచ్చింది. బాధితులుగా వారు సోషల్‌మీడియాను ఉపయోగించుకుంటే మీరు స్పందించాలేగాని శిక్షించడం ఏమిటని ఆక్షేపించింది. వాక్సిన్ గురించి వైద్యసదుపాయాల లోటు గురించి వచ్చిన కథనాలను దాదాపు ధృవీకరిస్తూ సుప్రీం కోర్టు రాష్ట్రాల హైకోర్టులు కూడా ప్రభుత్వాలను చివాట్లు పెడుతూనే ఉన్నాయి. అయితే మీడియాలో వాటిని ఆ స్థాయిలో చూపించారా అంటే అది ఎంతమాత్రం జరగలేదు. విడివిడిగా వార్తాకథనాలు ఇచ్చినా వాటికి కారణమైన విధానలోపాలను తప్పులను ఎత్తిచూపిన దాఖలాలే ఉండవు. మోడీ రాజీనామా చేయాలంటూ ఒక హాష్‌ట్యాగ్‌కు ఆదరణ బాగా రావడంతో దాన్నీ తొలగింపచేశారు. ఇదేమిటని నిరసన వచ్చాక మా ప్రమేయం లేదని కేంద్రం విడగొట్టుకుంది. ఫేస్బుక్ టీమ్ దాన్ని తామే తొలగించాం గాని ప్రభుత్వం కోరలేదని ప్రకటించింది. ఇదంతా ఒక మాయాజాలం. ఫేస్బుక్ గూగుల్ ట్విటర్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను నడిపే అంతర్జాతీయ సంస్థలు కూడా దాగుడు మూతలాడుతూ తమ వ్యాపార ప్రయోజనాలు కాపాడుకుంటాయి. వీటిని ఎవరైనా ఉపయోగించుకునే అవకాశం విమర్శలకు చోటు ఉండేమాట నిజమే. ఆ హక్కును కాపాడు కోవలసిందే. అదే సమయంలో మీడియానే శాసించే బడా పాలకపార్టీలకు సోషల్ మీడియాను ప్రభావితం చేయడం పెద్ద పని కాదు.
తెలుగులోనూ అదే తంతు
ఉదాహరణకు తెలుగులో చూస్తే పత్రికలు ఛానళ్లతోపాటు సోషల్ మీడియాను కూడా వైసీపీ, టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ వంటి పార్టీలు ప్రత్యక్షంగా పరోక్షంగా నడిపించడం ఎవరికైనా అర్థమవు తుంది. ఆ కథనాల శీర్షికలే ఏకపక్షంగా ఉంటాయి. సమస్యనుబట్టి గాక ఏ పార్టీకి చెందిన వారనేదానిపై ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు అనుసరించాల్సిన ప్రజానుకూల విధానాలకు, ప్రత్యామ్నాయాలకు ప్రాధాన్యత ఉండదు. మోడీ ప్రభుత్వ నిరంకుశపోకడలు, బీజేపీ మత రాజకీయాల విషయంలో దాటవేత వైఖరి ప్రదర్శిస్తుంటాయి. తెలంగాణలో ప్రధానమైన ఛానళ్లు పాలకపక్ష టీఆర్ఎస్కు అనుకూలమైనవిగా పేరు పొందితే బీజేపీ అనుకూల యాజమాన్యంలోనూ ఒకటి రెండు చానళ్లున్నాయి. వారి స్వంత పత్రిక అచ్చంగా సర్కారు భజనలో మునిగితేలుతుంటే బీజేపీ పట్ల సానుకూలంగా ఉండే మరో పెద్ద పత్రిక స్థానికంగా అనుకూల వైఖరినే అనుసరిస్తుంటుంది. వైసీపీకి సంబంధించిన పత్రికా పెద్ద విమర్శనాత్మకంగా ఉండదు. కోవిడ్ తాకిడిలో బలహీనపడ్డామంటున్న పత్రికలలో సిబ్బంది కోతతో పాటు విలువల తారుమారు, నాణ్యత తగ్గుదల కూడా కనిపిస్తున్నది. నవతెలంగాణ వంటి పత్రికే లేకపోతే ఈ సమయంలో వాస్తవికమైన సమస్యా ప్రధానమైన వార్తలకు అవకాశం ఉండేదా అన్నది సందేహమే.
విశ్వసనీయత, సమతుల్యత ఏదీ?
సోషల్ మీడియాలోనూ మితిమీరిన పొగడ్తలు లేదా శృతి మించిన బూతులు ఏకపక్ష చిత్రణలు చూస్తాం, వ్యక్తిగతంగానూ స్తోమత గల బడానేతలు స్వంత వేదికలను స్పాన్సర్ చేసుకుంటుంటారు. సాధారణంగా మతచాందసం, హిందూత్వ పోకడల వంటి విషయాలలోనూ ఇవి పాక్షికంగానే వ్యవహరిస్తాయి. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలకు సంబంధించి ప్రాంతీయ ధోరణులకు పెద్దపీట వేయడానికి కూడా వెనకాడవు. ఇక ప్రజాస్వామిక విలువలు, ఉద్యమాలు, ప్రత్యామ్నాయ రాజకీయాల పట్ల, శ్రామికవర్గ హక్కుల పట్ల ఆసక్తి అసలేనాస్తి. ఈ క్రమంలోనే పాలకులు ప్రభుత్వాలు తమ ఇష్టాయిష్టాలను బట్టి మీడియాపై వత్తిళ్లు తేవడం వరాలు కురిపించడం జరుగుతుంటుంది. ముఖ్య మంత్రులు నేరుగా పేర్లు తీసి మరీ దాడి చేస్తుంటారు. ఏతావాతా జాతీయంగానూ రాష్ట్రాల స్థాయిలోనూ మీడియా విశ్వసనీయత, వాస్తవికత, సమతుల్యత కోల్పోతున్న పరిస్థితి. ఎప్పుడు ఏ ఎజెండాను తీసుకురావాలి, ఎవరు లక్ష్యంగా దాడి సాగించాలనేది ముందే నిర్ణయమైపోయినట్టు స్పష్టంగా అర్థమవుతుంటుంది. మీడియా అనేది వ్యవస్థ స్వభావానికీ వర్గ రాజకీయాలకూ అతీతమైందిగా ఉండదు గానీ, మరీ పాక్షికత్వానికి లోనైతే ప్రజలకు సత్యం చేరడం కష్టమవుతుంది.
- తెలకపల్లి రవి