Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మేడే మళ్ళీ వచ్చింది. కార్మికవర్గం పోరాడి సాధించుకున్న హక్కులన్నీ కేంద్రంలో మోడీ సర్కారు హరించిన సమయంలో వచ్చిన మేడే. నాలుగున్నర నెలలుగా వేలాది రైతులు దేశ రాజధానిని చుట్టుముట్టి పోరాడుతున్న సమయంలో వచ్చిన మేడే. రాజ్యాంగ విలువలనూ, ప్రజాస్వామ్యాన్నీ, లౌకిక విధానాలను కేంద్ర పాలకులు ధ్వంసం చేస్తున్న సమయంలో, జాతీయ దురభిమానాన్ని రెచ్చగొడుతున్న కాలంలో నిర్వహిస్తున్న మేడే. ఇది ఉత్సవం కాదు. రణన్నినాదం చేయవల్సిన సమయం. అంతర్జాతీయ కార్మికవర్గ ఐక్యతను చాటవల్సిన సందర్భం.
నూట యాభై సంవత్సరాల కాలంలో భారత కార్మికోద్యమం అనేక విజయాలు సాధించింది. స్వాతంత్య్రోద్యమ కాలంలోనే కార్మికవర్గం తెల్లదొరలతో పోరాడింది. స్థూలంగా మన దేశ కార్మికోద్యమం మూడు ముఖ్యమైన విజయాలు సాధించింది. సమిష్టి బేరసారాల హక్కు, సమ్మె హక్కు, ప్రాతినిధ్యపు హక్కు కీలకమైనవి. చర్చల ద్వారా సమస్య పరిష్కారం కానప్పుడు సమ్మె చేసే హక్కు వారికి ఉన్నది. ఒక సంస్థలో ఒకటికి మించి యూనియన్లు ఉంటే మెజారిటీ కార్మికుల ప్రతినిధితోనే యాజమాన్యం చర్చలు జరపాలి.
ప్రభుత్వోద్యోగులు ఇంకా ఈ హక్కులు సాధించుకోలేదు. వీరు ప్రభుత్వంలో భాగమని పాలకులు చెబుతారు. ఉద్యోగులలో గణనీయమైన భాగం నమ్ముతున్నారు కూడా. అయినా.. నాటి జాతీయోద్యమం ప్రభావం గానీ, దేశంలో బలపడుతున్న కార్మికోద్యమం ప్రభావం గానీ ఉద్యోగుల మీద కూడా ఉన్నది. ఉద్యోగులు కూడా అనేక పోరాటాలు చేశారు. ఫలితంగా పీఆర్సీని సాధించుకున్నారు. కానీ ఇది సమిష్ఠి బేరసారాల హక్కు కాదు. సమ్మె హక్కుగా సంక్రమించకపోయినప్పటికీ వీరు సమ్మె పోరాటాలు కూడా చేస్తున్నారు. పీఆర్సీ ప్రతిపాదనలపై ప్రభుత్వం మీద ఒత్తిడి చేయగల్గుతున్నారు. ఇవన్నీ సంఘటిత శక్తి ప్రదర్శించటం వల్లనే సాధ్యమైనాయి. కానీ ప్రభుత్వం ఎవరిని గుర్తిస్తే వారే ఉద్యోగుల ప్రతినిధులు. రాజకీయ హక్కులకు కనుచూపు మేరలో కూడా చేరలేదు. పాలకులు ఇక్కడ ప్రభుత్వోద్యోగులను ద్వితీయ శ్రేణి పౌరులుగానే పరిగణిస్తున్నారు.
కార్మిక చట్టాలలో లోపాలు సవరించి మరిన్ని హక్కుల సాధన కోసం పోరాడాలి. కానీ మొదటికే మోసం తెచ్చింది మోడీ ప్రభుత్వం. కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలన్నీ రద్దు చేసింది. నాలుగు కోడ్స్‌గా మార్చుతున్నామన్న పేరుతో కీలకమైన హక్కులన్నీ తొలగించింది. సమిష్టి బేరసారాల హక్కు, సమ్మె హక్కులు ఆచరణలో నిషేధించినట్టే! కార్మికవర్గం ఉన్న హక్కులు కోల్పోతుంటే... ఉద్యోగులకు హక్కులు ఉంటాయా? కార్మికులకూ, ఉద్యోగులకు కూడా సమిష్టి బేరసారాల శక్తి మరింత బలహీనపడుతున్నది.
పని గంటల తగ్గింపు కోసం కార్మికుల వీరోచిత పోరాట క్రమంలోనే మేడే ఆవిర్భవించింది. ఈ పోరాటాల ఫలితంగానే 8గంటలు పని, 8గంటలు వినోదం, 8గంటలు విశ్రాంతి అన్న సూత్రం ఆవిర్భవించింది. 8గంటల పనిదినం హక్కుగా మారింది. ఆవిరి యంత్రాల కాలమది. ఎక్కువమంది కార్మికులతో తక్కువ ఉత్పత్తి జరిగేది. ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆవిష్కరించబడింది. డిజిటల్ యుగంలో ఉన్నాం. అతి తక్కువమంది శ్రామికులతో అత్యధిక ఉత్పత్తి జరుగుతున్నది. నాటి శ్రామికుల నైపుణ్యంతో పోల్చితే నేటి కార్మికుల నైపుణ్యం కొన్ని వందల రెట్లు పెరిగింది. పెట్టుబడిదారులకు లాభాల పంట పండింది. కానీ అదే 8గంటల పనిదినం కొనసాగుతున్నది. అంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఫలాలు పెట్టుబడిదారులు లాభాలు పెంచుకోడానికే వినియోగించబడుతున్నాయి. అందుకే పని గంటలు తగ్గించాలని డిమాండ్ ముందుకొచ్చింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) కూడా 6 గం. పనిదినం ప్రవేశపెట్టాలని సిఫారసు చేసింది. కానీ మన కేంద్ర ప్రభుత్వం మాత్రం పని గంటలు పెంచింది. 9 నుండి 12 గం.ల వరకు పని చేయించుకునేందుకు వీలుగా సవరణ చేసింది. అంటే పెట్టుబడిదారులకు లాభాల పంట... కార్మికుల మీద భారాల బండ కదా!
ఇప్పటికే... కరోనా కాలంలో ప్రజల బతుకులు చితికిపోయాయి. దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనపడింది. బడా బాబులు మాత్రం బలిసిపోయారు. ఒక్క అదానీ ఆస్తి కరోనా కాలంలో కూడా మూడు లక్షల అరవై మూడు వేల కోట్లు అదనంగా పోగుపడింది. ఇది ప్రపంచ కుబేరులలో 2వ స్థానంలో ఉన్న ఎలాన్ మస్క్ సంపాదించిన లాభాల కంటే ఎక్కువ. అంబానీ ఆస్తి లక్షా ముప్పై మూడు వేల కోట్లు అదనంగా పెరిగింది. శత కోటీశ్వరుల సంపద 35శాతం పెరిగింది. ఇప్పుడే కాదు. ప్రపంచ చరిత్రలో ఏ సంక్షోభ సమయమైనా కార్మికులూ, చిన్న పరిశ్రమలు చితికిపోగా, బడా పారిశ్రామికవేత్తలు బలిసిపోయారు. సంక్షోభంలో నష్టపోయేది కార్మికులు. లాభపడేది బడా పెట్టుబడిదారులు. ఈ విధానాలు అమలు చేసేది పాలకులు. బడా బాబులు లాభాలు పెంచుకోడానికీ, కార్మికులతో బానిస చాకిరీ చేయించడానికే లేబర్ కోడ్స్. సమ్మె హక్కు హరించటమే కాదు. పని గంటలు పెంచడంతోనూ ఆగలేదు. కనీస వేతనాలు నిర్ణయించే సూత్రం ఏమీ లేకుండా పాలకుల విచక్షణకే వదిలేసారు. సంక్షేమ చట్టాలకు తూట్లు పొడిచి పెట్టుబడిదారులకు బాధ్యత తగ్గించింది ప్రభుత్వం. ఈ బడా బాబుల కోసమే విద్యుత్తు సవరణ బిల్లు ప్రతిపాదించింది కేంద్ర ప్రభుత్వం. ఇది చట్ట రూపం దాల్చితే రైతులకు ఉచిత విద్యుత్తు అమలు చేయడం రాష్ట్రానికి తలకు మించిన భారం అవుతుంది. ప్రజలకు కరెంటు బిల్లులు భారీగా పెరుగుతాయి. కంపెనీల కరెంటు బిల్లులు మాత్రం తగ్గుతాయి. ఇప్పుడు వ్యవసాయరంగాన్ని కూడా అదానీలు, అంబానీలకు అర్పించేందుకు మూడు రైతు వ్యతిరేక చట్టాలు చేసింది కేంద్రం. రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చునన్న పేరుతో ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్లు, మద్దతు ధరకు తిలోదకాలిస్తున్నది. రైతులను వ్యాపారుల దయా దాక్షిణ్యాలకు వదిలేస్తున్నది. స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులకు వ్యవసాయ రంగాన్ని అప్పగించడమే కాదు... ఎంత ధాన్యమైనా కొనుగోలు చేసి స్టాకు చేయడానికి అనుమతినిస్తున్నది. ఇది ధరల పెరుగుదలకు దారి తీస్తుంది. పైగా విదేశీ బహుళజాతి సంస్థల ప్రవేశానికి కూడా అనుమతినివ్వడం వల్ల ఆహార భద్రతకూ ముప్పు ఏర్పడుతుంది.
కార్మికుల హక్కులు హరించటంలోనూ, శ్రమను దోచుకోవటంలోనూ పెట్టుబడిదారులందరిదీ ఒకే ధోరణి. కానీ... ఈ లాభాల కోసమే తమలో తాము పోట్లాడుకుంటున్నారు. బడా పారిశ్రామికవేత్తలు బాగా బలిసిపోతున్నారు. చిన్న, సూక్ష్మ పరిశ్రమలు చితికిపోతున్నాయి. బడా బాబులతో అంటకాగే కేంద్ర పాలకులు... ఆ బడాబాబుల కోసమే రాష్ట్రాలను గుప్పిట్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలను కూడా సహించగల స్థితిలో లేరు. ప్రాంతీయ పార్టీ నేతలు కార్మిక వ్యతిరేక చర్యలలో తమతో పోటీ పడుతున్నారు. కార్మికవర్గ పోరాటాలు అణచివేయటంలో నువ్వా నేనా అన్నట్టున్నారు. అయినా అంబానీలూ, ఆదానీల ప్రయోజనాలే కేంద్ర బీజేపీ సర్కారుకు ముఖ్యం. అందుకే ప్రాంతీయ పార్టీలనూ, వారి ప్రభుత్వాలనూ గొంతు నులిమే పనిలో పడ్డారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు ఐక్యంగా పోరాడటం ద్వారా మాత్రమే హక్కులను కాపాడుకోగల్గుతారు. పెట్టుబడిదారులు ప్రత్యక్షంగా పారిశ్రామిక కార్మికుల శ్రమను కాజేస్తారు. ఇప్పుడు వ్యవసాయ రంగాన్ని కబళిస్తున్నారు. వీరి ప్రయోజనాలు కాపాడాలంటే ఉద్యోగుల మానసిక శ్రమను కూడా దోచుకోవాల్సిందే. ఇది ప్రభుత్వాల ద్వారా పెట్టుబడిదారులు సాగించే పరోక్ష దోపిడి. ఈ పని సులభంగా అమలు కావాలంటే ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని మభ్యపెట్టాలి. వీరిని ఇతర శ్రామిక ప్రజల నుంచి వేరు చేయాలి. ఇప్పుడు దేశంలో పాలకులు చేస్తున్న పని ఇదే! స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్ పాలకులు ఈ పని చేసారు. స్వాతంత్య్రానంతరం భారతదేశ పాలకులు కూడా ఇదే ఎత్తుగడ అనుసరిస్తున్నారు. అందువల్ల కార్మికుల హక్కులు, రైతుల హక్కులూ కాపాడకుండా ఉద్యోగులకూ హక్కులు మిగలవు. కార్మికోద్యమంతో, రైతాంగ పోరాటాలతో మమేకం కాకుండా ఉద్యోగుల సంఘటిత శక్తి కూడా నిలబడదు.
శ్రామిక ప్రజలలో ఏమాత్రం ప్రతిఘటన వచ్చినా సహించగల స్థితిలో మోడీ ప్రభుత్వం లేదు. ఎమర్జెన్సీని మించిన నిరంకుశ పోకడల వైపు ప్రయాణం సాగుతున్నది. రాజ్యాంగంలో స్వతంత్ర వ్యవస్థలన్నింటినీ కేంద్రం గుప్పిట్లో పెట్టుకున్నది. గతంలో కాంగ్రెస్ పాలకులు కూడా ఇదే పని చేసారు. కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరింత దూకుడుగా పోతున్నది. దానికి తోడు రాజ్యాంగ మౌలిక విధానమైన లౌకిక విలువలను తుంగలో తొక్కుతున్నది. మతపరమైన విభజన సృష్టించి శ్రామికులను విభజిస్తున్నది. కీలక స్థానాలన్నీ ఆరెస్సెస్ అనుయాయులతో నింపుతున్నది. స్వాతంత్య్రానంతర భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేనంత ప్రమాదం ముంచుకొస్తున్నది. లౌకిక విధానాలకు కట్టుబడి ఉన్నానని చెప్పుకునే కాంగ్రెస్, ఆ మేరకు కూడా నిలబడటం లేదు. పచ్చి అవకాశవాదం ప్రదర్శిస్తున్నది. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం గానీ, ఏపీలో వైసీపీ ప్రభుత్వం గానీ తమ ప్రయోజనాల మేరకు కూడా కేంద్రాన్ని ప్రశ్నించేందుకు ఊగిసలాడుతున్నాయి. కేంద్రం వీరిని బ్లాక్మెయిల్ చేయగల్గుతున్నది. లాలూచీ కుస్తీ కొనసాగుతున్నది. ఈ పరిస్థితులలో కార్మికవర్గం తన హక్కుల కోసం మాత్రమే కాదు. ప్రజాస్వామ్యం, లౌకిక విలువల పరిరక్షణ కోసం పోరాడాలి. దోపిడీ నుంచి విముక్తి కోసం జరిగే సుదీర్ఘ పోరాటంలో ఇది తక్షణ కర్తవ్యం. ఈ మేడే సందర్భంగా ఇందుకు ప్రతిన బూనాలి.
- ఎస్. వీరయ్య