Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ విజయం అంత తేలికైంది కాదు, దీని వెనుక మీ ప్రజల చైతన్య పూరిత కార్యాచరణ, నీ కత్యంత ప్రీతి పాత్రమైన ఎర్రజండా బిడ్డల పట్టుదల, త్యాగం, అలుపెరుగని పోరాటం, కార్యదీక్ష, పాలనా దక్షతా దాగున్నాయి. నీ మీద ఎన్నో విషప్రచారాలు చేశారు. కుట్రలు చేసి నీ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయాత్నాలు జరిగాయి. వాటన్నిటిని తిప్పి కొట్టావు. సత్యం, శ్రమ ఆయుధాలైతే విజయం నీ బానిసవుతుందన్న నానుడిని మరోసారి రుజువు చేశావు.
నీ ముద్దుబిడ్డ, ముఖ్యమంత్రి విజయన్ తలనరికి తెచ్చిన వారికి కోట్ల రూపాయలు ఇస్తామన్నాయి మతోన్మాద శక్తులు. నిన్ను హత్యల క్షేత్రం అని ప్రచారం చేశారు. నీకు వ్యతిరేకంగా దేశ వ్యాపిత నిరసనలు చేశారు. చిన్నబుద్దుల పెద్దమనిషి అమిత్‌షా, పాదయాత్ర పేరుతో 15రోజులుందామని, మతోన్మాద నిప్పు రాజేద్దామని నీ వద్దకు వచ్చాడు. నువ్వు స్వాగతించావు. పాదయాత్రకు వచ్చే పెద్దమనుషుల్లారా రండి, మంత్ర నగరుల్లాంటి మా పర్యాటక ప్రదేశాలున్నాయి. వాటిని చూసి ఆనందించండి. దైవభూమిగా పేరున్న మా నేలమీద తిరిగి తరించండి. మా రాష్ట్ర ప్రజల నిర్మల ఆతిధ్యాన్ని స్వీకరించండి. అంతేకానీ మా దగ్గర గోద్రాలూ, ముజఫర్పూర్లూ సృష్టించకండి అన్నావు. అదీ నీ సంస్కారం. నీ సంస్కారం ముందు కుసం స్కారులు తట్టుకోలేక పారిపొయ్యారు. నీ లౌకిక, ప్రజాస్వామిక, సోషలిస్టు ఆలోచనా శక్తి ముందు ఆయనను 3రోజులు కూడా తట్టుకోలేకుండా చేశావు. నీ ప్రజలు పాల్గొనక పోతే పక్క రాష్ట్రాలనుంచి తీసుకువచ్చి అయినా నడుపుదామని చూశారు. కానీ అది కూడా సాధ్యం కాక నిన్ను వదలి వెళ్ళాల్సి వచ్చింది.
దేశంలో వామపక్ష పాలన ఉన్న ఏకైక రాష్ట్రమయిన నువ్వు మిగిలిన రాష్ట్రాలకు, అన్ని విషయాల్లో ఆదర్శమయ్యావు. గత ఐదేండ్లనే చూస్తే, నిఫా వైరస్‌ను తట్టుకున్నావు. రెండు తుఫాన్లు, ఒక వరద విపత్తును ఎదుర్కొన్నావు. కరోనా మొదటి దశ కాలంలో ప్రపంచంలోనే ప్రత్యేకమయ్యావు. ఐక్యరాజ్యసమితి నీ అనుభవాలను విశ్వమానవాళికి అందించమన్నది. గార్డియన్, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ లాంటి అంతర్జాతీయ పత్రికలలో ఆకర్షణీయ అంశమయ్యావు. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడైన ధారవిని కరోనా నుంచి కాపాడే మార్గమయ్యావు. కరోనా ప్యాకేజీ మొదట కేంద్రం 15,000కోట్లే ప్రకటించింది. నువ్వు రూ.20,000కోట్లు ప్రకటించాకనే కదా, ఆత్మనిర్భర్ భారత్ అంకెల గారడీలతో వచ్చింది. 18 రకాల సరుకులు ప్రతినెలా అందించావు. రెండవదశ కరోనా కాలంలో కూడా దేశమంతా ఆక్సిజన్ కొరతతో అల్లాడుతుంటే నీ ముందు చూపుతో ఒకే ఒక్క సంవత్సరంలో 58శాతం అదనపు ఆక్సిజన్ ఉత్పత్తి చేశావు. నీ అవసరాలు తీర్చుకొని, పక్కరాష్ట్రాలకు కూడా ఆక్సిజన్ అందించి ప్రాణదాతవవుతున్నావు. నీ ముందు చూపు, గొప్పతనం దేశం అంతా చర్చింకుకొంటున్నారు. ప్రభుత్వ వైద్యం అంటేనే పనికిరాని వైద్యమని భయపడుతున్న దేశంలో 95శాతం కరోనా రోగులు ప్రభుత్వ వైద్యాన్నే కోరుకొనే నీ ఆరోగ్య మిషన్ కలిగించిన విశ్వాసం అద్భుతం కాక మరేమవుతుంది.
దేశ ప్రధమ పౌరుణ్ణి కూడా దేవాలయాలలోకి రానివ్వని దుర్మార్గ సాంప్రదాయాలు అమలు చేస్తున్న దేశంలో, దళితులను పూజారులను చేశావు. ఏకంగా గర్భగుడిలో దేవుడి చెంతకే పంపావు. సాంప్రదా యాలను తిరగరాశావు. భవిష్యత్‌లో కూడా ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేకుండా, రిజర్వేషన్ ప్రాతిపదికన కేపీయస్సీ ద్వారానే పూజార్ల నియామకాలు జరిగేట్లుగా చట్టం చేశావు. దేశ వ్యాపితంగా శతాబ్దాలుగా దగా పడుతున్న దళితులను, అవమానాలకు గురవుతున్న జాతులను, తలెత్తి, తొడగొట్టి నిలబడేట్టు చేశావు. కేంద్రం జంతుహింస నిషేదం పేరిట ఒక గెజిట్ తీసుకువచ్చి గోమాంసంపై నిషేధం విధించాలని చూసింది. అట్టడుగు వర్గానికి అందుబాటులో ఉన్న పోషకాహారాన్ని దూరం చేయం అన్నారు మీరు. ప్రజలతో బీఫ్ ఫెస్టివల్స్ పెట్టించారు. కేంద్రం నిర్ణయాలవల్ల పాడి పరిశ్రమ, తోళ్ళ పరిశ్రమ, పశుపోషణ వ్యవస్థ ఎలా దెబ్బతింటాయో వివరించావు. సాక్షాత్తూ ప్రభుత్వమే అసెంబ్లీలో బీఫ్‌తో అల్పాహారం పెట్టి, కేంద్రాన్ని ఎదిరించిన ఏకైక రాష్ట్రమయ్యావు. కార్మికులకు ఇవ్వాల్సిన కనీస వేతనాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే ఎక్కువ నిర్ణయించి అమలయ్యేట్లు చేస్తున్నావు. వలస కార్మికులకు ఆరోగ్యభీమా కల్పించిన ఏకైక రాష్ట్రమయ్యావు. కరోనా కాలంలో వలస కార్మికుల రక్తపుటడుగుల రోదనతో, వేదనతో భారతమాత తల్లడిల్లుతుంటే, నీ దగ్గర మాత్రం వారిని అక్కున చేర్చుకొని అతిధుల్లా ఆదరించావు.
మహిళాభ్యున్నతి కోసం ప్రభుత్వంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశావు. రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేకంగా మహిళాభ్యున్న తికోసం 16శాతం కేటాయించావు. పోలీసు విభాగంలో మహిళలకు 25శాతం అవకాశాలకోసం ప్రయత్నిస్తున్నావు. కేవలం మహిళలే ఉన్న పోలీసు బెటాలియన్లు ఏర్పాటు చేశావు. ప్రతి 20కి.మీ పరిధిలో మహిళలకు ఒక ప్రత్యేక పోలీసు స్టేషన్‌ను ఏర్పాటు చేశావు. నవజాత శిశు మరణాల్లో దేశంలోనే అత్యల్పంగా ఉన్నావు. స్త్రీ-పురుష నిష్పత్తిలో దేశానికే ఆదర్శంగా ఉన్నావు. అంతెందుకు కొద్దికాలం క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో రాష్ట్ర రాజధాని నగరానికి 21సంవత్సరాల అమ్మాయిని మేయర్‌ని చేశావు. సాటి మనుషుల్లో కలువలేక, కలుద్దామన్నా కలువనివ్వక బతుకీడిస్తున్న ట్రాన్స్ జెండర్స్‌ను జనజీవన స్రవంతిలో కలిపి నడపడానికి నిర్దిష్ట చట్టం తెచ్చావు. ప్రతిరోజు మిమ్ములను ప్రజలలో కలుపుతాం చూడమని కోచి మెట్రోరైల్ నిర్వహణ ఉద్యోగ అవకాశాలు వారికే ఇచ్చి వారి ఆత్మగౌరవ సాక్షి వయ్యావు.
దేశంలో సగటు ఆయు:ప్రమాణంలో, అక్షరాస్యతా శాతంలో, మహిళల అక్షరాస్యతలో కూడా దేశంలో నువ్వేముందు. అత్యంత విలువైన విదేశీ మారక ద్రవ్యనిధులు దేశానికి అందించడంలో నువ్వే ముందు. వందశాతం బహిరంగ మలవిసర్జనా రహిత రాష్ట్రంగా దేశంలో నువ్వొక్కదానివే ఉన్నావు. ఇంటర్నెట్ సౌకర్య లభ్యత పౌరుల హక్కుగా నిర్ణయించిన ఏకైక రాష్ట్రం నువ్వే.
అన్నిటికి మించి ప్రజాసంస్కృతిని రూపొందించడంలో నువ్వు చూపించే మార్గం దేశానికే కాదు. ప్రపంచానికి కూడా ఆదర్శం. వరదలొచ్చి భీభత్సంగా ఉన్నప్పుడు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భారీ సహాయం చేస్తానని ముందుకు వచ్చింది. తీసుకోవాటానికి వీల్లేదని వరదల్లోనూ రాజకీయం చేసింది కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీ. సహాయాన్ని రానివ్వవా, మా బిడ్డలే దాతలవుతారు చూడు, అని సవాల్ చేశావ్. పిలుపిచ్చావు. 4,912 కోట్లు నీ ప్రజలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళమిచ్చారు. కేంద్రప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పారు. శబరిమలై దేవాలయంలోకి మహిళల ప్రవేశంపై ప్రతిపక్షాలు రాద్దంతం చేస్తుంటే, లింగసమానత్వం, మహిళా సాధికారం కోసం పిలుపిచ్చావు. 60లక్షలమంది మహిళలు నీ మెడలో మానవహారం అయ్యారు. ప్రపంచ రికార్డు సృష్టించారు. దేశంలోని మహిళలందరికీ స్ఫూర్తినిచ్చారు.
ఇలాంటి శ్రమైక జీవన సౌందర్యాన్ని, వాతావరణాన్ని చెడగొట్టేందుకు మతోన్మాద శక్తులు చేయని ప్రయత్నం లేదు. ఇస్లామిక్ ఉగ్రవాదం జడలు విప్పుతున్న రాష్ట్రమని, లవ్ జిహాద్‌ను పెంచి పోషిస్తున్న రాష్ట్రమని అన్నారు. కేంద్ర మంత్రులు కూడా పెట్టిన ఒక తప్పుడు వీడియో, నీ దగ్గర ఒక హత్యాఘటనను వేడుకుగా జరుపుకొంటున్నారని. మరీ దుర్మార్గం ఏమిటంటే మతోన్మాద శక్తులే హత్య గావించిన గౌరీలంకేశ్ మృతదేహం ఉన్న వీడియోను, ''కేరళలో ముస్లింల చేతిలో హత్య గావించబడిన హిందూ మహిళ'' అంటూ ప్రచారంలోకి తేవటం. మలప్పురం జిల్లాలో (ముస్లింలు అధికంగా ఉన్న జిల్లా) హిందువులను భూములు కొననివ్వటం లేదని దుష్ప్రచారం చేశారు. లౌకికతత్వం కోసం గట్టిగా నిలబడుతున్న అభిమన్యు లాంటి ఆణిముత్యాలైన నీ బిడ్డలను వందల మందిని పొట్టన పెట్టుకొన్నారు. చివరకు నీ బిడ్డడు సాధారణ పాత్రికేయుడు అయిన సిద్ధికీ కప్పన్ హత్రాస్ ఘటనా స్థలానికి వెళితే, కరోనా వచ్చినా మంచానికి కట్టేసి కక్ష తీర్చుకొంటున్న పచ్చి మతోన్మాది యోగి ఆదిత్యనాధ్ వ్యవహారం చూస్తున్నాం. బంగారం లాంటి నీ బిడ్డ, ముఖ్యమంత్రిపై బంగారం నేరం మోపి వెనక్కు కొట్టాలని చూసింది. నీ పట్ల దుర్మార్గంగా వ్యవహరించడంలో కాంగ్రెస్ కూడా తక్కువేమీ కాదు. అయినా వీటన్నిటినీ ఎదుర్కొంటున్నావు. తిప్పికొడుతున్నావు. నీదైన మార్గంలో ముందుకు సాగుతున్నావు. సాగిపో, విశ్వ వ్యాపితంగా నీ పేరు ప్రతిష్టలు పెంపొందిస్తున్న, నీ ఎర్రబిడ్డలు అందుకొన్న విజయాన్ని చూసి గర్వించు. మతోన్మాద రాజకీయాల, దోపిడీ రాజకీ యాల మదమణచు. విజయ యాత్ర కొనసాగించు. నీ కివే మా వందనాలు. జయహౌ కేరళ, జయహౌ.
- పోతినేని సుదర్శన్‌రావు