Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మేడేను కూడా ప్రతి సంవత్సరం పారాయణం చేసే కథ స్థాయికి అనేక మంది దిగజార్చారు. ఇది తప్పు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ వంటి పార్టీలు తమ అనుయాయులకు ''కార్మిక రత్న''లు, తమని మంచిగా ''అరుసుకునే' యాజమాన్యలకు ''యాజమాన్య రత్న''లుగా బిరుదాంకితులను
చేసి తాము పులకించి పోవడం రివాజు. కనీస వేతనాలు అమలు చేయడం, కార్మికశాఖను కార్మికులకోసం నడపడం తప్ప, ఏవో సంక్షేమ కార్యకలాపాలు చేస్తున్నట్టు పోజులు కొట్టడం ఆనవాయితీగా మారింది.
''వినుడు, వినుడు రామాయణగాథ వినుడీ మనసారా!'' అని శ్రావ్యంగా ఇద్దరు ప్రఖ్యాత గాయణీమణులు 'లవకుశ' సినిమాలో పాడినపాట ఆనాడు చాలామంది నోళ్ళలో నాట్యం చేసేది. మేడే చరిత్ర రామాయణం కాదు. భారతం అంతకన్నా కాదు. పెట్టుబడిదారీ విధానాన్ని దాన్ని మెట్టినింట్లో 'నిటారుగా' నిలబడి సవాలు చేసిన గాథ. డైనమైట్ బాంబువిసిరి 11మంది పోలీసులను హత్య చేశారన్న సాకుతో 8గంటల పనిదినం ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న అనేక మంది నాయకులపై విచారణ సాగించింది ఇల్లినాయస్ (చికాగో నగరం ఈ రాష్ట్రంలోనే ఉంది) కోర్టు ఆనాడు. జరుగుతున్న విచారణ మోసపూరితమైందని అందరికి తెలుసు. ''పోలీసుల హత్య'' కేసులో తీర్పు ఎలా ఉంటుందో కూడా తెలుసు. అయినా కోర్టులో లొంగిపోయి పూలదండ మెళ్లో వేసుకున్నంత సునాయాసంగా ఉరితాడు మెడకి తగిలించుకుని అమరుడైన వీరుడి త్యాగాన్నేమని కీర్తించినా, ఎంత కీర్తించినా తరిగేదికాదు. వీరంతా పురాణ పురుషులు కాదు. 1886 మేనెల్లో జరిగింది సినిమా కాదు. అప్పటికి 2/3 సంవత్సరాల నుంచి పెట్టుబడి చేస్తున్న కుట్రకు అది పరాకాష్ట.
ఒక విషయం ముందే స్పష్టం చేయాలి. పై ఉపోద్ఘాతానికి తాత్పర్యమేమంటే మేడేను కూడా ప్రతి సంవత్సరం పారాయణం చేసే కథ స్థాయికి అనేక మంది దిగజార్చారు. ఇది తప్పు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ వంటి పార్టీలు తమ అనుయాయులకు ''కార్మిక రత్న''లు, తమని మంచిగా ''అరుసుకునే' యాజమాన్యలకు ''యాజమాన్యరత్న''లుగా బిరుదాంకితులను చేసి తాము పులకించి పోవడం రివాజు. కనీస వేతనాలు అమలు చేయడం, కార్మికశాఖను కార్మికులకోసం నడపడం తప్ప, ఏవో సంక్షేమ కార్యకలాపాలు చేస్తున్నట్టు పోజులు కొట్టడం ఆనవాయితీగా మారింది. సారాంశంలో, జరిగిన అతిపెద్ద వర్గపోరాటాన్ని తక్కువ చేసి చూపడమూ, పురాణ కథా కాలక్షేపం స్థాయికి దిగజార్చడం ఈ రెండు పద్ధతులూ ద్రోహపూరితమైనవి. మేడే సమకాలీన దోపిడీపై దండయాత్ర! దాదాపు వందేండ్లక్రితం (1926లో) సాధించుకున్న సంఘంపెట్టుకునే హక్కు సమ్మె చేసే హక్కుతో సహా ప్రతి హక్కునూ విధ్వంసం చేసిన మోడీ సర్కార్‌పై కత్తులు నూరాల్సిన తరుణంలో పైధోరణులు చాలా ప్రమాదకరం.
ఆ ఘటన అక్కడే ఎందుకు జరిగింది..?
''శ్రామిక వర్గంలో అమితమైన అసంతృప్తి పేరుకొని ఉన్న ఈ సమయంలో అమెరికా అంతటా రహస్య శ్రామిక సమాజాలు నిర్మితమవుతున్నాయి. రైలు రవాణా సంస్థలకు, ఇతర కార్పొరేషన్లకు మేము సూచించేదేమంటే మీ స్వంత ఉద్యోగుల్లో పథకం వేయగలిగే వారిని సునిశితంగా పరిశీలిస్తూ ఉండండి వీరే... ఈ సంఘాలలో చేరవల్సిందిగా ఉద్యోగులని ప్రోత్స హిస్తూ, చివరకు సమ్మెలకు కారణమ వుతున్నారు. ఇదంతా తరచూ జరుగుతూండేదే. ముఖ్య నాయకులను కనిపెట్టి వారి పట్ల సకాలంలో చర్యలు తీసుకునేట్టయితే మున్ముందు ఎదురుకానున్న ఇబ్బందులను తొలగిం చుకోవచ్చు'' పింకెర్టన్ గూఢచారి సంస్థ 1885 అక్టోబర్‌లో అన్ని కంపెనీలకు రాసిన లేఖ ఇది.
పై విషయాలను చూస్తే కార్మికులపైన, కార్మిక సంఘాలపైనా ఎటువంటి నిర్బంధాలు నాడు అమెరికాలో ఉండేవో అర్థమవుతుంది. ఆధునిక పెట్టుబడిదారీ దేశంగా 1885 నాటికే ఎదుగుతున్న లేదా ఎదిగిన అమెరికాలో తామే సిసలైన ప్రజాస్వామ్య విలువలకు పవర్ ఆఫ్ అటార్నీ పుచ్చుకున్న పట్టాదారులమని చెప్పుకునే అమెరికాలోని పరిస్థితి అనేది ముఖ్యమైన విషయం. 1880ల నాటికే చికాగో ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో అగ్రగామిగా నిలిచిందని ప్రొ.విలియం అడెల్మన్ రాశారు. వివిధ దేశాల నుంచి పొట్టచేత పట్టుకుని ఉపాధి కోసం ఆ రోజుల్లో ఈ ''కొత్తభూమి'' (అమెరికా)లో కాళ్ళూనడం ఆనవాయితీ. (క్రిష్టఫర్ కొలంబస్ అమెరికా ఖండాన్ని కనుగొన్న తర్వాత అప్పటికే పారిశ్రామికవంతమైన ఐరోపా నుంచి పెద్ద ఎత్తున వలసలు- ముందు ధనికులు వారి వెంట సామాన్య జనం వెళ్ళారు. స్థానికుల్ని ఊచకోత కోయడం ద్వారా భూములు సంపాదించుకున్నారు. కొందరు ఫ్యాక్టరీలు నిర్మించుకున్నారు. వాటిలో ఉపాధి పొందడానికి రెండు, మూడు శతాబ్దాల పాటు వలసలు జరిగాయి. పెట్టుబడిదారీ విధాన ప్రారంభ దినాల్లో ఐరోపాలో నిరుద్యోగం నియంత్రణలో ఉండటానికి ఇదొక కారణమని ప్రొ||ప్రభాత్‌పట్నాయక్ అంటారు. (సోషల్సైంటిస్టు 2015). అందుకే అమెరికాను పెట్టుబడిదారీ విధానానికి మెట్టినిల్లు అనింది.
ఐక్యమవుతున్న కార్మికులు కలుసుకోకుండా ఉండేందుకు ముఖ్యంగా ఆదివారాలు, సెలవు దినాల్లో బీర్ షాపులను, గెస్ట్‌హౌస్‌లను మూసివేయాలని నిర్ణయించారు. వాక్సభా స్వాతంత్రాలని అడ్డుకోవడం వారి రాజ్యాంగం ప్రకారం సాధ్యం కాదు కాబట్టి కార్మికులు కలవకుండా నగర యంత్రాంగం దీనికి ఒడికట్టింది. అయినా కార్మికులు కలుసుకున్నారు, సంఘటితమయ్యారు, పోరాడారు. 1872లో జరిగిన ''రొట్టెల దొమ్మి'' ఆనాటి పరిస్థితికి నిలువెత్తు నిదర్శనంగా చరిత్రలో నమోదైన ఘటన. శీతాకాలంలో బ్రెడ్ కూపన్ల కోసం వెళ్ళిన వేలాది మందిని ఒక బిలంలోకి మందగాతోలి విపరీతంగా కొట్టారు పోలీసులు. ఆర్థిక వ్యవస్థలో ఎగుడు, దిగుడులు కార్మికుల బతుకుల్ని దెబ్బతీశాయి. కార్మికుల జీతంలో ఎక్కువ భాగం తిండికే ఖర్చవుతోందని 1880 బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ పేర్కొంది. ఆనాడు జరిగిన ట్రామ్‌ల సమ్మె, రైల్వే సమ్మె లాంటివాటిపై జరిగిన పోలీసు దమనకాండ మొదలైన వాటన్నింటినీ ప్రొవిలియం అడెల్మన్ మేడే ఘటనలను లోతుగా అధ్యయనం చేసి వివరించారు.
తెగనాడే జాతంతా ఒకటే
హిందూ పురాణాల్లో తిట్టదల్చుకున్న వారందర్నీ రాక్షసులుగా చిత్రీకరించినట్టు ప్రపంచ వ్యాపితంగా పెట్టుబడిదారీ విధానాన్ని వ్యతిరేకించే వారందరినీ రౌడీలు, గూండాలు అని ప్రచారం చేయడం కద్దు. దీనికి మించి ''కమ్యూనిస్టులని'', ''నాస్తికులని'' తిట్టడం పరిపాటి. ఇది హేమార్కెట్ వీరుల మొదలు, మన రాష్ట్రంలో 2000 సంవత్సరంలో జరిగిన విద్యుత్ టారీఫ్ వ్యతిరేక ఉద్యమకారుల వరకు, దేశవ్యాపిత సార్వత్రిక సమ్మెలు చేసే కార్మికులను, కార్మిక సంఘాలను మన ఆర్థిక వ్యవస్థను నష్టపరిచే వారిగా చిత్రీకరించడం చూస్తున్నాం. నాడు అమెరికన్ పత్రికలు ఈ గూండాలను తెగనాడుతూ సంపాదకీయాలు రాశారు. అల్బనీ లా జర్నల్ 1886 మే 15న ''చాలా కాలంగా మనలో ఉన్న కోరికలు, అంటే వలసలు నిరోధించడం, దేశ బహిష్కరణ శక్తి, అత్యుత్తమ రీతిలో పోలీసులను సాయుధం చేయడం, అల్లర్లు తలెత్తిన వెంటనే (అంటే కార్మికులు రోడ్డెక్కిన వెంటనే అని అర్థం చేసుకోవాలి) కఠినంగా వ్యవహరించడం వంటివి బలంగా పున:ప్రతిష్టించబడాలి. మహానగరంలో ఉత్తములు, సాహసికులైన పురుషులు, అమాయక స్త్రీలు, పిల్లల జీవితాలకు రక్షణ, సంపద సంరక్షణ బాధ్యత పెద్ద జులపాలు పెంచుకున్న నాస్తికుల చేతుల్లో ఉండరాదు. ధనికుల పట్ల ఉన్మత్త పూరితమైన అసూయ పరుల చేతిలో ఉండకుండా చూడాలి. ఇలాంటి విష సర్పాలు పడగవిప్పి కాటేయక ముందే వాటిని అణచగల చట్టాలు కావాలి. దేవుడులేడనే ఈ దెయ్యాలను హంతకులుగా భావించి శిక్షించే శక్తి ఇల్లినాయిస్ రాష్ట్ర శిక్షాస్మతికి ఉండాలి.''
అనేక ఆదివారాలు చర్చిల్లో ఈ ''అరాచక వాదుల్ని'' ఖండిస్తూనే ఉన్నారు. వ్యాపారస్తులు, పెట్టుబడిదార్లు కలిసి ప్రయివేటు సైన్యాన్ని సమీకరించారు. మన దేశంలో, రాష్ట్రంలోని పాలకులు ట్రేడ్ యూనియన్లను ''అభివృద్ధి నిరోధకులు'' అన్నట్టుగానే ఆనాటి పాలకులూ నిందించారు. సారీ! వారిలాగే వీరూ తిట్టారు. తిట్లు కామన్. తిట్టబడే కార్మికులు, కార్మిక సంఘాలు కామన్. స్థల కాలల్లోనే తేడా!
సమస్యను దారి మళ్ళించడంలో పెట్టుబడిదారి విధానం ఘనపాటీనే! 1894లో అంటే హేమార్కెట్ స్క్వేర్ ఘటన జరిగిన ఎనిమిదేండ్లకి ఆనాటి అమెరికా (22వ) అధ్యక్షుడు గ్రోవర్ క్లీవ్్ల్యాండ్ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మొదటి సోమవారాన్ని ''లేబర్ డే'' గాను, ఆ రోజును జాతీయ సెలవు దినంగాను ప్రకటించాడు. ఇది మేడే ప్రాధాన్యతను తగ్గించడానికేనని వేరే చెప్పక్కర్లేదు. మన దేశంలో ఆర్ఎస్ఎస్, బిఎంఎస్‌లు చేసే విశ్వ కర్మదినం కూడా సెప్టెంబర్‌లోనే ఉంది. దేశ ట్రేడ్ యూనియన్ ఉద్యమం ఏ మాత్రం బలహీనపడ్డా మోడీ సర్కార్ విశ్వ కర్మ దినాన్ని (సెప్టెంబర్ 17ను) జాతీయ సెలవు దినంగా ప్రకటిస్తుంది. పని గంటల తగ్గింపునకై జరిగిన పెద్ద వర్గ పోరాటాన్ని కనుమరుగు చేసే ఈ ప్రయత్నాన్ని కార్మిక వర్గం అప్రమత్తంగా ఉండి ఎదుర్కోవాలి.
ఒక మిలిటెంట్ పోరాటం అణిచివేయబడ్డ తర్వాత ఏయే తరగతులు ఎలా ఏకమవుతాయో హేమార్కెట్ ఘటన ఒక నిదర్శనం. మన భాషలో చెప్పుకోవాలంటే సేట్లందరూ ఏకమైనారు. అటు చికాగో యంత్రాంగం ఇటు ఫెడరల్ (కేంద్ర) ప్రభుత్వ యంత్రాంగం అండదొరికింది. ముందే చెప్పినట్టు కోర్టులు పచ్చిగా ఈ ఉద్యమానికి వ్యతిరేకంగా నిలిచాయి. బడా పత్రికలు వంతపాడాయి. దీనికి మన దేశంలో సీక్వెల్ తెలంగాణ సాయుధ పోరాటంపై సాగిన దుష్పచారం మనం చూశాం. ఆ తర్వాత 1955 ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల్లో కమ్యూనిస్టులపై సాగిన దుష్ప్రాచారం చూశాం. చివరికి విద్యుత్ ఉద్యమం సందర్భంగా సాగిన దుష్ప్రచారమూ చూశాం. 2010 (తర్వాత) సార్వత్రిక సమ్మెల సందర్భంగా ట్రేడ్ యూనియన్లపై జరిగిన, జరుగుతున్న దుష్ప్రచారం మనం చూస్తూనే ఉన్నాం కదా! తాజాగా ఢిల్లీ చుట్టూ మోహరించిన రైతాంగ ఉద్యమంపై ఏ స్థాయిలో నీచ ప్రచారం చేస్తున్నారో మన అనుభవంలోదే. రహదారి కోసం జాగా వదిలిపెట్టినా ఆక్సిజన్ సిలెండర్లను అడ్డుకుంటున్నారన్న నీచ ప్రచారాన్ని ఆపట్లేదు బీజేపీ పాలకులు. రెండో పక్క కార్మికులు ఆ ఉద్యమానికి అండగా నిలిచారు. ఇంగ్లండులోని 49నగరాల్లో కార్మిక వర్గం ప్రదర్శనలు చేసింది. జాడ్జి బెర్నార్డ్ షా (ప్రపంచ ప్రఖ్యాత కవి) ''ఏ ఉద్యమమైతే కోట్లాది అణగారిన జీవుల నుంచి పుట్టుకొచ్చిందో, ఎవరైతే అనుక్షణం జీవించే హక్కు కోసం శ్రమిస్తూ, దారిద్య్రంలో మునిగివున్నారో, వారు చేపట్టిన ఉద్యమాల్ని ఉరితీయడం ద్వారా అణగదొక్కగలమని మీరు భావిస్తే-మమ్మల్ని కూడా ఉరితీయండి' అని గర్జించారు.
నేటి మన కర్తవ్యం ఏమిటి?
మేడే కర్తవ్యమంటే పెట్టుబడి దోపిడీని ప్రశ్నించడమే! అది ఏరూపంలో ఉన్నా సరే! 19వ శతాబ్దంలో పనిగంటలే కీలకం. నేడు ప్రభుత్వరంగ రక్షణ, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవటంతో పాటు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాల పరిరక్షణ, దేశ ఆహారభద్రతను దెబ్బతీసే వ్యవసాయ చట్టాల రద్దు కూడ కార్మిక సంఘాల, కార్మిక సమూహాల కీలక కర్తవ్యం. ప్రస్తుత బీజేపీ పాలన కార్మికవర్గంపై మరో ముఖ్య కర్తవ్యాన్ని ఉంచింది. ఒకపక్క మతాన్ని మారణాయుధంగా వాడుతూ మరోపక్క హిందూ సమాజంలోని నిచ్చెనమెట్ల కుల వ్యవస్థను శాశ్వతం చేసే పనిలో ఉంది. దీన్ని ప్రతిఘటించడం నేటిదశలో మరో ప్రధాన కర్తవ్యం.
- ఆర్.సుధాభాస్కర్