Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆక్సిజన్ అందడం లేదు. బెడ్లు లేవు. చివరికి శ్మశానాల్లోనూ చోటు లేదు. ఆ భయానక దృశ్యాలు హృదయవిదారకంగా మారాయి. అంటే మీడియా నాణేనాకి ఈ ఒకవైపే చూపిస్తూ...రెండోవైపు సర్కారు చేతగానితనాన్ని దాచిపెడుతున్నది. దీనికి వెనుక భారీ కుట్ర, కుతంత్రాలు ఉన్నట్టు విమర్శలొస్తున్నాయి. అందులో భాగంగానే ప్రజలు జాగ్రత్తలు పాటించకపోవడంతో చావులు తప్పడం లేదని మీడియా మొసలి కన్నీరు కార్చుతున్నది. కరోనా చావులతో భయపెట్టి ప్రజల బలహీనతలతో ఆటాడుకుంటున్నది. కొన్ని మీడియా సంస్థలు భయపెట్టడమే పనిగా పెట్టుకున్నాయి తప్ప భరోసా కల్పించడం లేదనే విమర్శలున్నాయి. ప్రజల మనోధైర్యం మీద దెబ్బకొట్టి కార్పొరేటు ఆస్పత్రుల వ్యాపారాన్ని పెంచేస్తున్నాయి. కరోనా వైరస్ సోకడంపై పుంఖానుపుంఖాలుగా కథనాలు వస్తున్నాయి. అది మహా ప్రమాదకరమనీ, అది సోకితే ప్రాణాలు గాలిలో కలిసిపోకతప్పదనే భయాన్ని కలిగిస్తున్నాయి. ప్రారంభంలో అది వైరస్ మాత్రమే అందుకు భయపడాల్సిన అవసరం లేదని సెలవిచ్చారు. సెకండ్‌వేవ్ కరోనాకు ముందు నుంచే మార్కెట్లోకి అనేక మందులు, రకరకాల పరీక్షల పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఇమ్యునిటీని పెంచే వివిధ రకాలైన సిరఫ్‌లు, డ్రింకులు వచ్చాయి. అనేక రసాయనాల సమ్మిళితంతో సానిటైజర్లు, సబ్బులూ మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ఇవన్నీ ఆయా కంపెనీలు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టి తయారు చేశాయి. వాటిని మార్కెట్లో అమ్ముకోవడానికి కరోనా భయాన్ని సృష్టించి దాంతో వినియోగదారులు, రోగుల బలహీనతపై వ్యాపారాన్ని చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. కరోనా వస్తే ప్రాణాలు గాలిలో కలుస్తాయి. మీ శవాలను కూడా ఎవరూ తాకరు. అందుకే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. దీని వెనుక కథంతా కార్పొరేటు కంపెనీలు తయారు చేసిన వస్తువులను వాడాలనేది ఓ కాన్సెప్ట్. అందుకు ప్రసారమాద్యమాలను పావుగా వాడుకుంటున్నాయి. ఈ మాస్టర్ ప్లాన్‌లో భారీ కుట్ర. పెద్ద ఎత్తున ముడుపుల వ్యవహారాలు కూడా ఉన్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కరోనాను అడ్డంపెట్టుకుని కార్పొరేటు కంపెనీలు కోట్లకు పడగలెత్తాలని భావిస్తున్నాయి. అందుకు ఆయా ప్రభుత్వాల సాయం ఆర్జిస్తున్నాయి. కేంద్రం ప్రభుత్వం తమ వైఫల్యాలు బయటకు రాకుండా కరోనా చావుల వైపు ప్రజల దృష్టి మళ్లిస్తున్నది. కరోనా ఉధృతి నేపథ్యంలో గతంలోనూ ముందస్తు చర్యలు చేపట్టలేదు. ఈసారి కూడా చేతులెత్తిసింది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించడం, భారీగా సభలు, ర్యాలీలు నిర్వహించడం, కుంభమేళాకు అనుమతివ్వడంతో కరోనా దావనంలా వ్యాపించింది. కరోనా సోకి ఆస్పత్రుల్లో చేరిన రోగుల అర్తనాదాలు చూపిస్తున్న మీడియా సంస్థలు... కరోనాతో బయటపడుతున్న సక్సెస్ స్టోరీలను చూపించడం లేదని కొంత మంది డాక్టర్లు చెబుతున్నారు. కరోనా నివారణ కోసం సూచనలు, సలహాలు, చిట్కాలతో వీలైనంత మనోధెర్యం ప్రజలకు నూరిపోయాల్సిన మీడియా, ఇప్పుడు ప్రజల్లో భయాందోళనలను నింపే ప్రయత్నంతో సర్కారు వైఫల్యాలను కావాలనే మరుగున పెడుతున్నది. కరోనా చావుల్లో 90శాతం భయాన్ని పెంచడం వల్లే చనిపోతున్నారు. మరో 10శాతం ఇతర రోగాలతో చనిపోతున్నారు. మిడియా బ్రేకింగ్న్యూస్లు, వ్యూస్‌లు, కథలు, కథనాలు హోరెత్తిస్తుండగా, దీంతో సాధారణ జర్వం, దగ్గు, జలుబు వంటివి వచ్చినా జనం ఆస్పత్రులకు పరిగెత్తుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు లేవంటూనే... ప్రయివేటు ఆస్పత్రుల్లో రోగుల బాధలను చూపించడం లేదు. ప్రయివేటు ఆస్పత్రుల్లో అంత సవ్యంగా ఉన్నట్టు... ఆ ఆస్పత్రి డాక్టర్లతోనే కరోనా సలహాలు, సూచనలు ఇప్పిస్తున్నారు. కరోనా రోగులకు సలహాల పేరుతో కార్పొరేటు ఆస్పత్రి తప్ప మరో దారి లేదన్నంతంగా లైవ్‌లోనే భయపెడుతున్నారు. పలాన ఆస్పత్రి పేరు చూపించి, అందులో రోగికి జరుగుతున్న అన్యాయం, కార్పొరేటులో ఖర్చెంత? చేసిన వైద్యమెంత? అనే విషయాలను ఎక్కడా చూపించరు. అందుకు వారితో ఉన్న చీకటి ఒప్పందమే కారణమనే ఆరోపణలున్నాయి. అరకొర సిబ్బంది, అత్తెసరు సౌకర్యాలు, చాలీచాలని బెడ్లతోనే నిరంతరం కరోనా రోగులకు సేవలందిస్తున్న ప్రభుత్వ ఆస్పత్రుల సేవలను చూపించకుండా మీడియా బాధ్యతారాహితంగా వ్యవహరిస్తున్నది. ప్రయివేటు ఆస్పత్రిలో చేరితే లక్షలరూపాయలు ముక్కుపిండి వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆక్సిజన్ కోసం, బెడ్ల్ల కోసం, రెమిడెసివర్ మందుల కోసం రోగుల బంధువులతో బేరసారాలు చేయడానికి కార్పొరేటు ఆస్పత్రికి చెందిన మధ్యదళారులు సంధాన కర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఏదో రకంగా రోగుల బలహీనతను ఆసరా చేసుకుని సదరు ఆస్పత్రిలో చేర్చేలా చేస్తారు. అక్కడ ప్రారంభమవుతుంది జేబుకు చిల్లు. రోగిని ఐసీయూలో చేర్చిన తర్వాత ఏమవుతుందో తెలియదు. ఏ మందులు ఇస్తున్నారో తెలియదు. ఆక్సిజన్ పెట్టారో, లేదో తెలియదు. అంతా రహస్యమే. గంటగంటకు ఆరోగ్య పరిస్థితి వివరిస్తూనే... కౌంటర్లో బిల్లు కట్టండి అంటూ ఆదేశాలు ఇస్తుంటారు. మనం కడుతూనే ఉంటాం. మనోళ్ల ప్రాణాలు దక్కించుకోవా లన్న తాపత్రయాన్ని కార్పొరేట్ ఆస్పత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి. అందుకే రోగుల్లో మానసిక ధైర్యం నింపాల్సిన మీడియా, భయపెట్టే వార్తలతో సామాజిక బాధ్యత విస్మరిస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియా కూడా ఆ రొంపిలో పడింది. అడ్డు అదుపూ లేకుండా చావు కబుర్లతో పోస్టులు పెడుతున్నది. రోగులకు మనోధైర్యాన్ని కల్పించి, సలహాలు, సూచనలు ఇద్దామనే ఆలోచన లేకుండా చేస్తున్నది. కొంత మంది డాక్టర్లు, ప్రభావశీలురు కరోనా రోగులకు భరోసా ఇస్తున్నప్పటికి తగిన ప్రాచుర్యం లభించడం లేదు. మీడియా సృష్టిస్తున్న భయోత్పతంతో కరోనా రోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చిన్నా, చితకా లక్షణాలకు కూడా ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. ప్రజల పక్షాన నిలిచి భరోసానివ్వాల్సిన మీడియా ప్రభుత్వాలకు, ప్రయివేటు కంపెనీలకు, కార్పొరేట్ హాస్పిటల్స్‌కు వత్తాసు పలకడం, జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తుండటం విచారకరం.
గుడిగ రఘు
సెల్:9490099017