Authorization
Mon Jan 19, 2015 06:51 pm
138 కోట్ల జనాభా కలిగిన భారతదేశం ప్రపంచంలో రెండవ స్థానం ఆక్రమించింది. ఇందులో 26.62 శాతం (36.73 కోట్ల మంది) 14 సంవత్సరాలలోపు బాలబాలికలు ఉన్నారు. వీరి ఆరోగ్యాన్ని పరిరక్షించటానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు నామమాత్రంగానే ఉన్నాయి. 15-64 సంవత్సరాల వయస్సు కలిగిన వారు 92.46 కోట్ల మంది, 65 సంవత్సరాల పైన ఉన్న వారు 8.1 కోట్ల మంది ఉన్నారు. ఈ రెండు తరగతులకు కూడా ఆరోగ్య సౌకర్యాలు అంతంత మాత్రమే. హ్యూమన్ డెవలప్మెంట్ ఇన్డెక్స్లో 153దేశాలలో భారత దేశం 2020-21 నాటికి 131వ ర్యాంకులో ఉంది. భారత్‌లో శిశుమరణాలను పరిశీలిస్తే 1000కి 26.6మంది, ఐదు సంవత్సరాలలోపు పిల్లలు 32.97మంది మరణిస్తున్నారు. జనాభా పెరుగుదల భారత్‌లో ప్రతి 1000మందికి 18.2 పుడుతుండగా 7.3 మరణిస్తున్నారు. అనగా జనాభా గ్రోత్‌రేట్ భారత్‌లో 1.2శాతంగా ఉంది. ఈ గణాంకాలు భారత దేశ ప్రజల ఆరోగ్య పరిస్థితిని విషదీకరిస్తున్నాయి. భారత దేశంలో ప్రభుత్వ ప్రయివేటు హాస్పిటల్స్‌లో 26.89 శాతం మందికి మాత్రమే సరైన వైద్య సౌకర్యం కల్పించబడుతుంది.
అంగన్వాడీ కేంద్రాలు : ''నేషనల్ పాలసీ ఫర్ చిల్డ్రన్'' కింద 02.10.1975లో అంగన్వాడీ వ్యవస్థను ప్రారంభించారు. దీనికి 1. పిల్లల హెల్త్ చెకప్, 2. పిల్లల ఆరోగ్యం కోసం ట్రైనింగ్, 3. పౌష్టికాహార పంపిణీ, 4. నాణ్యమైన ఆహారాన్ని అందించడం లాంటివి బాధ్యతలుగా పెట్టారు. కర్ణాటకలో భాగ్యలక్ష్మీ పథకాన్ని కూడా ఇందులో చేర్చారు. ఆ పథకం కింద 1.ఆడపిల్లల పుట్టుకను బలపర్చడం, 2. సామాజంలో ఆడపిల్లల ప్రోత్సహం, 3. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలలో ఆడపిల్లల పుట్టుకను పోత్సహించడం, 4. ఆర్థిక సహాయం చేయడం తదితర కార్యక్రమాలను చేపట్టాలి. ఈ పథకాన్ని మొదట కొన్ని జిల్లాల్లో ప్రారంభించి ఆ తరువాత దేశవ్యాప్తం చేయాలన్న లక్ష్యానికి భిన్నంగా 1978లో ప్రధాని మురార్జి దేశారు ఈ పథకాన్ని మూసి వేశాడు. తిరిగి ప్రజాందోళన వల్ల, ఇతర దేశాలలో జరుగుతున్న పిల్లల అభివృద్ధి, ఆరోగ్యం, చూస్తున్న సంస్థల వల్ల 10వ ప్రణాళికలో అనగా 2002-07లో మరల ప్రారంభించారు. దీన్ని విస్తరించటానికి అంగన్వాడీ కేంద్రాలకు ఐసిడిఎస్ (ఇంటేగ్రేటేడ్ చిల్డ్రన్ డెవలప్మెంట్ స్కీం) కింద విస్తృత బాధ్యతలు కల్పించారు. 1. ఇమ్యూనైజేషన్, 2. పౌష్టికాహారం సరఫరా, 3. హెల్త్ చెకప్ 4. రీపరల్ సర్వీస్, 5. ప్రీ స్కూల్ ఎడ్యూకేషన్ పిల్లలకు (బడికి రాని పిల్లలకు), 6. జాతీయ, ఆరోగ్య సమాచారాన్ని తెలసుకోవడంతో పాటు 15 పాయింట్ల ప్రోగ్రామ్‌ను నిర్వహించారు. బాల్వడీ, న్యూట్రిషన్ ప్రొగ్రామ్, మాల్న్యూటిషన్ ప్రొగ్రామ్, మధ్యాహ్న భోజనం తదితర పథకాలను చేబట్టారు. దీని నిర్వహణకు సూపర్వైజర్లను, హెల్పర్లను జిల్లా, రాష్ట్ర, అధికారులను నియమించారు. 31.01.2013 నాటికి 13.3 లక్షల అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 12వ ప్రణాళికలో వ్యయంలో కేంద్రం, రాష్ట్రాలు 75, 25శాతాలు భరించాలని ఆ తరువాత 90, 10శాతాలకు సవరించారు. దీనిని మహిళ శిశు సంక్షేమ శాఖలో చేర్చి బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నారు.
మొత్తం బడ్జెట్లో ఇది 0.7శాతం మాత్రమే. దాదాపు 27శాతంగా ఉన్న జనాభాకు బడ్జెట్లో 0.07 మాత్రమే కెటాయింపులు చూపారు. గత 3సంవత్సరాలలో 0.1శాతాన్ని తగ్గించడం జరిగింది. ఇంత వరకు అంగన్వాడీ కేంద్రాలకు పూర్తి స్థాయిలో శాశ్వత భవనాలు లేవు. రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, బీహార్, అస్సాంలు రక్తహీనతలో మొదటి స్థానంలో ఉన్నాయని చత్తీస్‌ఘడ్‌లో 39.93శాతం ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారని వీరి ఆరోగ్యాన్ని కాపాడడానికి ''ఆక్విటేషన్, సాక్షియం, హెల్త్ యాక్టివిస్ట్'' ఆషా వర్కర్ల వ్యవస్థను నాటి మహిళా సంక్షేమ మంత్రి మేనక గాంధీ సోనేఫట్ నియోజకవర్గంలోని ఉస్నాపూర్ గ్రామంలో స్థాపించారు. ఈ కార్యకర్తలు గర్భిణి మహిళలను దవాఖాను తీసుకెళ్ళడం, ప్రసూతి చేయించడం, తిరిగి ఇంటికి చేర్చడం, పిల్లల్లో ఉన్న విటమిన్ లోపాలను, బరువు తక్కువ తనానికి తక్షణమే మందులు ఇప్పించడం చేయాలి. 2006లో ఏర్పాటు చేయబడిన ఈ వ్యవస్థ నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కింద పని చేస్తున్నది. 2008 నాటికి 3 లక్షల మంది ఆశాలకు ట్రైనింగ్‌లు ఇచ్చారు. 2015 నాటికి 9,37,595 మంది ఆశా వర్కర్లు పని చేస్తున్నారు. ఇప్పటికీ ప్రధాన రాష్ట్రాలలో 30శాతం, ఈశాన్య రాష్ట్రాలలో 29 శాతం, మిగిలిన రాష్ట్రాలలో 16శాతం గ్రామాలకు మాత్రమే ఉన్నారు. భారత దేశంలో 2020 నాటికి 741 జిల్లాలు ఉండగా గ్రామాలు 6,64,369 ఉన్నాయి. ఈ గ్రామాలలో సగం గ్రామాలకు కూడా ఈ సౌకర్యం కల్పించలేదు.
ఈ వ్యవస్థలన్ని ఆలంకార ప్రాయమైనవే తప్ప పేద ప్రజానీకానికి, మురుగు ప్రాంతాల ప్రజలకు ఏ మాత్రం ఉపయోగకరంగా లేవు. పేరుకు గ్రామాలలో 75 శాతం, పట్టణాలలో 25శాతం నిధులు కేటాయిస్తున్నారు. కేటాయించిన నిధులు పాలకులే కాజేస్తున్నారు. బాధిత పిల్లలకు, తల్లులకు వర్తించడం లేదు. సూపర్వైజర్లకను, హెల్పర్లను, ఆశా వర్కర్లను, ఎఎన్యంలను మొదట పార్ట్‌టైం ఉద్యోగులుగా గుర్తించి రూ.4,5వేలు మాత్రమే ఇచ్చారు. నేటీకి వారికి కనీస వేతనం ఇవ్వడంలేదు. ప్రధానంగా ఆంగన్వాడీల బాధ్యత ఈ విధంగా ఉంది. 1. పౌష్టిక ఆహార పంపిణీ, 2. ఆహార పంపిణీ (15 రోజులు, 25 రోజులు, 30 రోజులు), 3. బరువు తూకం వేయడం (వారం, 15 రోజులు, నెల రోజులు, 2 నెలలు), 4. తల్లుల సమావేశంలో పిల్లల ఆరోగ్యం, పారిశుద్యం, పౌష్టిక ఆహారం తయారీ, లెట్రీన్ల వాడకం, భాగ్యలక్ష్మి కార్యక్రమం అమలు, చనుపాల ప్రోత్సహం, పరిశుభ్రత కాపాడడం, మైనర్ పిల్లల వివాహాల రద్దు తదితర అంశాలను ఆ సమావేశాలలో చర్చించి వారిని చైతన్యవంతం చేయాలి. కానీ ఈ సమావేశాలు జరుగుతున్నాయా ? పేరుకు మహిళలను శిశువులను ప్రోత్సహిస్తున్నామని చెప్పడమే తప్ప వారికి తగిన బడ్జెట్ కెటాయింపులు, పర్యవేక్షణ ఏమాత్రం లేదు. ఐక్య రాజ్య సమితిలో రిపోర్టు చేసుకోటానికి తప్ప? వాస్తవంగా బాధితులకు ఉపయోగం జరగడం లేదని అనేక పరిశోధనా సంస్థలు రిపోర్టులు తయారు చేశాయి. కార్పొరేట్ దవఖానాలకు లాభాలు కట్టబెట్టడానికి ప్రభుత్వం పౌష్టిక ఆహార పంపిణీకి కోతలు పెడుతున్నది.
నేడు భారత దేశంలో ఏ గ్రామానికి వెళ్ళినా పౌష్టిక ఆహార లోపంతో, రక్తహీనతతో తల్లులు, పిల్లలు దర్శనం ఇస్తుంటారు. సరైన పౌష్టిక ఆహారం ఉంటే, నిరోధక శక్తి ఉన్న వారిని ఏ కరోనా ఏమీ చేయలేదు. పౌష్టిక ఆహార సరఫరాకు మాత్రం కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టదు. ముడి బియ్యం సరఫరా చేసి చేతులు దులుపుకుంటున్నారు. పాలు, పండ్లు, ముతక ధాన్యాలు, వాటితో తయారైన ఉప ఉత్పత్తులను విరివిగా గ్రామీణా ప్రాంతాలలో పంపిణీ చేయాలి. ప్రతి 50 ఇండ్లకు ఒక వాలంటీర్‌ను నియమించి అతని ద్వారా స్వయంగా కుటుంబానికి అందేట్లు చూడాలి. చిన్న దేశాలైనా నార్వే, ఐర్లాండ్, స్విట్జర్లాండ్ అనుభవాలను గుణ పాఠాలుగా తీసుకొని పాలకులు పౌష్టిక ఆహార లోపాన్ని నివారించాలి.
సారంపల్లి మల్లారెడ్డి
సెల్:9490098666