Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాకు ఊపిరి అందడం లేదు..
దయచేసి దిగిపొండి!
మాకో ప్రభుత్వం కావాలి..
దయచేసి దిగిపొండి!
తప్పనిసరిగా, తక్షణం మాకో ప్రభుత్వం కావాల్సి ఉంది. ప్రస్తుతం మాకు అది లేదు. మాకు గాలి ఆందడం లేదు. మేం చచ్చిపోతున్నాం. వ్యవస్థలేవీ వాటి తీరులో అవి లేవు. పరిస్థితులు అదుపులో ఉన్నప్పుడే సరైన నిర్ణయాలు తీసుకునే వ్యవస్థలు లేనప్పుడు.. ఇక ఇప్పుడు ఏం చేయడం? ఇప్పుడే - ఇక్కడే మార్పు జరగాలి!
2024వరకు మేం ఎదురు చూడలేం. నా లాంటి సామాన్యురాలు ప్రధాని నరేంద్రమోడీకి వ్యక్తిగతంగా వినతిపత్రం ఇవ్వాల్సి వస్తుందని ఎవరూ ఎప్పుడూ ఊహించుకుని ఉండరు. అలా చేస్తే జైలుకు వెళ్ళాల్సిందేనని ఈ దేశ ప్రజలకు తెలుసు.
కానీ, ఈ రోజు మేం మా ఇండ్లలో చచ్చిపోతున్నాం. మా వీధుల్లో చచ్చిపోతున్నాం. ఆసుపత్రి కారు పార్కింగుల్లో, మహానగరాల్లో, చిన్న పట్టణాల్లో, గ్రామాల్లో, అడవుల్లో, పొలాల్లో, అంతటా చచ్చిపోతున్నాం. ఒక సాధారణ పౌరురాలిగా, అశేషజనవాహిని ప్రతినిధిగా, కోట్లజనం మనోగతాన్ని వినిపిస్తున్నందుకు గర్వపడుతున్నాను.
అయ్యా, దయచేసి తప్పుకోండి!
ఇప్పటికైనా, ఇప్పటికైనా తప్పుకోండి!!
నా దేశ ప్రజల ప్రాణాల కోసం
దిగిపొమ్మని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను.
(అప్పటి నమస్తే ట్రంప్ కార్యక్రమం నుంచి ఇప్పటి కుంభమేళా దాకా) ఈ కరోనా సమస్య ఇంత ఉధృతమవడానికి మొదటి నుంచీ మీరే కారణం. దీన్ని మీరు ఇంకా ఇంకా అధ్వాన్నంగా చేయగలరే తప్ప, ఇక మీరు దీన్ని చక్కదిద్దలేరు.
భయం, ఏహ్యభావం, అమాయకత్వం, ఉన్మాదంతో మీరు రూపకల్పన చేసిన ఈ దేశ వాతావరణంలో వైరస్ బ్రహ్మండంగా వ్యాపిస్తుంది. నిజం మాట్లాడినవారి గొంతు మీరు నొక్కేస్తారే, అప్పుడే అది నిరాఘాటంగా వ్యాపిస్తుంది. దేశంలో మీడియాను మీరు అతిగా ప్రభావితం చేస్తే.. ప్రజలు వాస్తవాలు తెలుసుకోవడానికి అంతర్జాతీయ మీడియా మీద ఆధారపడుతున్నారు.
వైరస్ వ్యాపిస్తూనే ఉంది..
మీరు ఈ దేశ ప్రధానిగా ఆ పదవిని అలంకరించినప్పటి నుంచి ఇప్పటి దాకా ఒక్కటంటే ఒక్కటి విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి, నిజాయితీగా ప్రజలకు నిజాలు చెప్పలేదు. (అబద్దాలే చెపుతూ వచ్చారు) విలేకరుల ప్రశ్నలకు భయపడి పారిపోయే ప్రధాని ఇక వైరస్నేం ఎదుర్కోగలరూ? దేశం ఎదుర్కుంటున్న ఇలాంటి భయానక పరిస్థితుల్లో కూడా ప్రధానిగా, దేశ ప్రజలకు ధైర్యాన్ని అందించే ఒక చిన్న మాట చెప్పలేని స్థితిలో ఉంటే.. కరోనా వైరసే కాదు, ఇంకా ఎన్నెన్నో వైరస్లు వ్యాపిస్తాయి.
తమరు తక్షణం సీటు వదిలి వెళ్ళకపోతే, మాలో లక్షలమంది ఇంకా అనవసరంగా.. ఉత్త పుణ్యానికే చచ్చిపోతాం. అందువల్ల, దయచేసి ఇక మీరు (సన్యాసుల) జోలె పట్టుకుని వెళ్ళండి. మీ గౌరవానికి భంగం కలగకుండా ఉండాలంటే.. మీకు మీ భవిష్యత్తు అత్యద్భుతంగా ఉండాలంటే.. యోగా చేస్తూ, సమాధిలో కూర్చుంటూ (గోపూజలు చేస్తూ) ఉండొచ్చు. మీకేం కావాలో మీరే లోగడ చెప్పారు (గుర్తుందా?). సామూహిక మరణాలు ఇంత ఉధృతంగా జరుగుతూపోతే మీరనుకునే ఆ భవిష్యత్తు కూడా మీకు దొరకదు.
మీకు ప్రత్యామ్నాయంగా పనిచేయగల వాళ్ళు మీ పార్టీలో ఎవరైనా ఉండి ఉంటారు. విపక్షాలతో సత్సంబంధాలు గలవాళ్ళు, ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడానికి అందరితో కలిసి పనిచేయగలవాళ్ళూ ఉండి ఉంటారు. అది ఎవరైనా సరే.. మీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ు ఆనుమతితోనే కానివ్వండి. ఈ సమస్యను ఎదుర్కోగల ధీశాలికి అవకాశం ఇవ్వండి.
అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి కొందరిని ప్రతినిధులుగా ఎన్నుకొండి. దానివల్ల దేశంలోని రాజకీయ పార్టీలన్నీ తమ భాగస్వామ్యం ఉందని, ఉత్సాహంగా పనిచేయగలుగుతాయి. దేశంలో అతి పెద్ద జాతీయ రాజకీయ పార్టీ కాబట్టి కాంగ్రెస్‌ను కూడా కమిటీలో బాధ్యత తీసుకోనివ్వండి. ఇక శాస్త్రవేత్తలు, ప్రజారోగ్య నిపుణులు, డాక్టర్లు, పరిపాలనానుభవం ఉన్న ఉన్నతోద్యోగులు.. ఇదంతా ఏమిటో మీకు తెలియకపోవచ్చు. ప్రజాస్వామ్యమంటే ఇదే.. ప్రజాస్వామ్యంగా ఏర్పడే కమిటీలు ఇలాగే ఉంటాయి. వివక్షముక్త్ ప్రజాస్వామ్యం (విపక్షాలు లేని ప్రజాస్వామ్యం) అనేది ఉండదు. అది నిరంకుశత్వమవుతుంది. ఉపద్రవమవుతుంది.
వైరస్ ఉపద్రవాల్నే ప్రేమిస్తుంది (ఉపద్రవాల్నే సృష్టిస్తుంది).
ఉన్న ఫళంగా.. ఇది ఇప్పుడే చేయాల్సి ఉంది. లేకపోతే ఇది అంతర్జాతీయ సమస్య అవుతుంది. ప్రపంచానికే ప్రమాదకారి అవుతుంది. తమరి అసమర్థత వల్ల ఇతర దేశాల ముందు ఈ దేశ ప్రజలు తల దించుకునే పరిస్థితి కల్పించకండి. క్షమాపణలు చెప్పుకునేట్టు చేయకండి. ఇతర ప్రపంచ దేశాల ముందు మన దేశాన్ని హీనంగా, (దీనంగా) నిలబెట్టకండి. వారు మన అంతర్గత కార్యకలాపాల్లో జోక్యం చేసుకునే పరిస్థితి తీసుకురాకండి. అది మన సార్వభౌమత్వానికే ప్రమాదం. మళ్ళీ (మరోసారి) ఈ దేశ ప్రజలపై విదేశీయుల ఆధిపత్యం సాగకుండా అడ్డుకోండి. పరిస్థితులు ఇంకా ఇంకా దిగజారితే జరగబోయేది అదేనేమో.. (ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఆలోచించండి).
అర్థం చేసుకుని, త్వరితగతిన నిర్ణయం తీసుకోండి!
దయచేసి పదవి వదిలి వెళ్ళండి.
ఎంతో బాధ్యతాయుతంగా ఈ దేశానికి మీరు చేయగల అత్యుత్తమ సేవ అదొక్కటే.. ప్రధానిగా కొనసాగే నైతిక హక్కు ఇక మీకు ఎంతమాత్రమూ లేదు.
2021 మే 4 మధ్యాహ్నం: ప్రఖ్యాత భారతీయ రచయిత్రి అరుంధతీరారు ఒక ప్రకటన విడుదల చేశారు. అది దేశ ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించిందే అయినా, అందులోని విషయం భారతీయులంతా అర్థం చేసుకుని, సమస్య తీవ్రతను అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ సభ్యులు తప్ప, బహుశా దేశ ప్రజలంతా ఇదే కోరుకుంటున్నారు. భావ గర్భితంగా, ఉద్వేగ భరితంగా సాగిన ఆ రచయిత్రి వినతి పత్రం అందరినీ తప్పక ఆలోచింపజేస్తుంది. తెలుగు పాఠకుల కోసం దేవరాజు మహారాజు స్వేచ్ఛానువాదం...
- స్క్రోల్ డాట్ ఇన్ సౌజన్యంతో...