Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నది మనకు బాగా తెలిసిన సామెత. పిల్లలు అల్లరి చేసినా, తప్పులు చేసినా ''ఎలా పెంచిందమ్మా పిల్లల్ని'' అనటం కూడా పరిపాటి. అంటే ఇంటిని, పిల్లలని చక్కదిద్దుకోవటం ఇల్లాలి బాధ్యత. కొన్ని తరాలుగా ఇది భారతీయ సమాజంలో పాతుకుపోయిన ఆచారం. ఇంతా చేసి ఆ ఇల్లాలి శ్రమకు గౌరవం, గుర్తింపు, విలువ ఉన్నాయా అంటే అదీ లేదు. పైగా రోజు చేసేపనికి ఏ మాత్రం తేడా వచ్చినా ''ఇంట్లోనే ఉంటావు. రోజంతా ఎం చేసావు'' లాంటి మాటల్ని కూడా వినాల్సి ఉంటుంది.
గత సంవత్సరం కోవిడ్ కారణంగా దేశవ్యాప్త లాక్డౌన్ విధించిన సమయంలో ఎక్కువ సంస్థలు ఇంటినుంచి పనికి వీలు కల్పించాయి. ఆ సందర్భంగా మగవాళ్ళు ఇంటిపని చేయటంపైన సోషల్ మీడియాలో కార్టూన్లు వెల్లువెత్తాయి. దీనంతటి సారాంశం పురుషాధిక్యత వేళ్ళూనుకున్న ఈ సమాజంలో ఇంటి పని, వంటపని, పిల్లల పెంపకం, పెద్దల సంరక్షణ ఈ బాధ్యతలన్నీ గంపగుత్తగా ఇల్లాలి లేదా మహిళలకి కేటాయించబడ్డాయి లేదా దఖలు పరచబడ్డాయి. ఇటీవలి కాలంలో ''హౌస్ వైఫ్'' (ఇంటి ఇల్లాలు) అనే మాటని హౌమ్ మేకర్ (గహాన్ని నిర్వహించే వ్యక్తి)గా మార్పు చేయటం కొంతవరకు మెరుగు. అయితే పదాల్లో వచ్చిన మార్పు వారి పరిస్థితుల్లో రాలేదనేది నిర్వివాదాంశం.
మహిళల ఇంటిపని గురించి అనేక పార్స్వాలల్లో మాట్లాడుకోవాలి. వారి పనికి గౌరవం, గుర్తింపు, విలువ, మానసిక శారీరక దోపిడీ ఇవన్నీ కూడా దీనిలోకే వస్తాయి. కానీ ఇప్పుడు మనం ముఖ్యంగా చెప్పుకోబోతున్న అంశం ''మహిళల ఇంటిపనికి విలువ'' కట్టడం గురించి. ఇది వినటానికి తేలికగా ఉన్నా చాలా సున్నితమైన అంశం. సంవత్సరంలో 365 రోజులు ఇంటిపనికే అంకితమైన మహిళ తన ఆర్థిక అవసరాలకు భర్త లేదా బయట ఉద్యోగం చేసి సంపాదించే వ్యక్తి పైన ఆధారపడాల్సి వస్తుంది. ఏమి అవసరం, అంతెందుకు ఖర్చయింది మొదలైన ప్రశ్నలని కూడా ఎదుర్కోవాలి.
ఇప్పటికే ఈ సమస్య లేదా అంశంపైన జాతీయంగా, అంతర్జాతీయంగా అనేక స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు, వేదికలు, వ్యక్తులు దృష్టిపెట్టి పనిచేస్తున్నాయి. కానీ 2021 జనవరి 5న సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఒక కేసులో ఇచ్చిన చారిత్రాత్మకమైన తీర్పు ఈ అంశంపై మళ్ళీ విస్తృతమైన చర్చ జరగటానికి తెరలేపింది. 2020 డిసెంబర్లో ఒక రోడ్డు ప్రమాదంలో మరణించిన మహిళ కుటుంబానికి నష్టపరిహారం లెక్కపెట్టే క్రమంలో ఈ తీర్పు వెలువడింది. దేశంలో గహిణులు చేసే పనికి ఆర్ధిక విలువ లేదనే అభిప్రాయం సరైంది కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఒక గహిణి చేసే పనులకు ఆమెకు ఎంత ఆదాయం లభించాలో అంచనా వేయడం అత్యంత ముఖ్యమని స్పష్టం చేసింది. ఈ తీర్పునకు అదనంగా ఇందులో భాగస్వామి అయిన జస్టిస్ ఎన్.వి. రమణ (సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి) మరో ప్రత్యేక తీర్పును వెలువరించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం15.98కోట్ల మంది మహిళలు తాము ఇంటిపని చేస్తున్నామని చెప్పగా, కేవలం 57.9లక్షల మంది పురుషులు మాత్రమే ఇంటిపని చేస్తున్నట్టు చెప్పారన్నారు.
''కుటుంబానికి వండి పెట్టడం, ఇంటి నిర్వహణ (ఖర్చులు, జమలు, సరుకులు కొనటం మొదలైన), పిల్లలు, వృద్దుల అవసరాలు చూడటం మొదలైన అన్ని పనులు మహిళలే చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పనులతోపాటు పొలం పనులు, పశుపోషణ, నీరు, వంటచెరుకు తెచ్చుకోవడం వంటి ఇతర బాధ్యతలు కూడా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఒక గహిణి కార్యకలాపాలు కుటుంబ ఆర్థికవ్యవస్థకు, తద్వారా దేశ ఆర్థికవ్యవస్థకు దోహదం చేస్తాయని'' జస్టీస్ రమణ చెప్పారు. స్వయానా ఒక అత్యున్నత న్యాయస్థానంలోని న్యాయమూర్తి మహిళల శ్రమకు గుర్తింపు, విలువ లభించాలని చెప్పటం సమస్య తీవ్రతను తెలియజేస్తున్నది.
ఇంటిపనికి విలువ కట్టటం ఎలా? ''ఒక మహిళ కుటుంబ జీవనశైలిని బట్టి ఆమె అర్హతలను పరిగణనలోకి తీసుకుని కోర్టు ఆమె ఆదాయాన్ని అంచనాగా లెక్కిస్తుంది. ఈ ప్రక్రియలో కోర్టు వాస్తవ పరిస్థితులను, కేసుకు సంబంధించి నిర్ధిష్ట అంశాలను దృష్టిలో పెట్టుకుని గృహిణి చేసేపనికి విలువ కల్పించటమే ఈ తీర్పు వెనుకనున్న ఉద్దేశ్యం'' అని కూడా కోర్టు పేర్కొంది.
పైన పేర్కొన్న కేసులో మహారాష్ట్రలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మహిళ చనిపోయింది. అమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారికి రూ.17 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని కోర్టు చెప్పింది. చనిపోయిన మహిళ వేతనాన్ని కోర్టు రూ.5,000గా ఉజ్జయింపుగా లెక్కించడమే కాకుండా, ప్రతి సంవత్సరం 40శాతం పెరుగుదలను కూడా అంచనావేసింది. ''కుటుంబ సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న మహిళ కష్టానికి కూడా భవిష్యత్ పెరుగుదలను పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు సూచించింది.
ఈ తీర్పు నేపథ్యంలో రాజకీయ నాయకులు, గృహిణులు, వృత్తినిపుణులు, లాయర్లు, కార్పొరేట్లు మొదలైన వారందరితో వివిధ రకాలైన చర్చలు నడిచాయి. కోర్టు సూచనను అత్యధిక మంది హర్షించించారు. అయితే గహిణుల వేతనాన్ని లెక్కకట్టటానికి ప్రామాణికంగా కనీసవేతనాలను తీసుకోవాలా లేదా మరే ఇతర పద్ధతైనా ఉందా అనే అనుమానం వ్యక్తమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనికోసం నిధిని కేటాయించాలని కొందరు అభిప్రాయపడితే, మరికొందరు అది సాధ్యపడే విషయం కాదని ఎవరైతే గృహిణి నుంచి సేవలు పొందుతున్నారో (ఉదా. భర్త) వారే ప్రోవిడెంట్ ఫండ్ లాగా నెలకు ఇంత మొత్తంగా వారి బ్యాంక్ ఖాతాలలో జమ చేయాలని అంటున్నారు. ''తమ భార్యలకు నెలకు ఇచ్చే డబ్బు మీద ప్రభుత్వం పన్ను రాయితీ కల్పించినట్టయితే ఇది సాధ్యపడుతుందనే'' వాదన కూడా ముందుకు వచ్చింది. అయితే ఇప్పుడు ఉచితంగా పనులు చేయించుకుంటేనే అధికారం చేలాయించే భర్తలు లేదా పురుషులు, ఆ పనికి విలువ కట్టి నెలవారీ చెల్లించినట్టయితే ఇంకా ఎక్కువ, నాణ్యమైన పని కావాలని వేధించేందుకు కూడా అవకాశం లేకపోలేదని కొంతమంది మహిళలు అనుమానం వ్యక్తం చేశారు.
మహిళల ఇంటిపనికి సంబంధించి ''మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్'' విడుదల చేసిన ''టైం యూజ్ ఇన్ ఇండియా (భారతదేశంలో సమయం వినియోగం) -2019'' నివేదిక ప్రకారం ఇంటిపని కోసం మహిళలు సగటున రోజుకు 299 నిమిషాలు కేటాయిస్తే, పురుషులు మాత్రం కేవలం 97 నిమిషాలు వెచ్చిస్తున్నారు. గృహిణులు చేసే పనికి విలువ లేకపోవడమనే వైఖరి కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు. జర్మనీ, ఇటలీ, అమెరికా, బ్రిటన్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలలోను ఇదే పరిస్థితి ఉంది.
చూసారా... అసలు గుర్తింపేలేని మహిళల పనిపై చర్చ మొదలైతే ఎన్ని రకాల విశ్లేషణలు, అభిప్రాయాలు, అనుమానాలు తెర మీదికి వచ్చాయో. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే హర్షం వ్యక్తం చేసిన వ్యక్తులలో ప్రముఖ హీరో, రాజకీయ నాయకుడు కమల్‌హాసన్ మొదటివాడు. ఆయన ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో తన పార్టీ మ్యానిఫెస్టోలో దీనిని చేర్చి శభాష్ అనిపించుకున్నారు. అయితే ముందుగానే చెప్పుకున్నట్టు మన దేశంలో ప్రతి అంశాన్ని భావోద్వేగాలకు ముడిపెట్టడం ఆనవాయితీ. దానికి కారణం కూడా పురుషాధిక్య ధోరణే. ఈ ధోరణి మహిళల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. వార్తలలో వ్యక్తి, ప్రముఖ నటి కంగనా రనౌత్ తీర్పు పట్ల స్పందిస్తూ ''మా ఇండ్లకు మేము మహారాణులం. మా పిల్లల్ని పెంచుకోవడంలో మేము ఎంతో ఆనందాన్ని పొందుతున్నాం. భర్తకి, కుటుంబానికి ప్రేమతో చేసే పనులకు విలువ కట్టి మమ్మల్ని అవమానించకండి. మా భర్తలు మా కనుసైగలలో మెలగటమే మాకు అన్నిటికన్నా ప్రేమపాత్రం'' అని ట్వీట్ చేశారు. ఫక్తు పితృస్వామ్య భావజాలానికి ఇదొక ఉదాహరణ.
ఏదేమైనా ఇప్పటికైనా ఈ విషయం సమాజం దృష్టిని, న్యాయస్థానాల దృష్టిని ఆకర్షించడం చాలా మంచి పరిణామం. ఇది ఆరంభం మాత్రమే. ఆచరణ సాధ్యమయ్యేలా చేయటానికి చాలా కసరత్తు అవసరం. అన్ని వైపులనుంచి మద్దతు కూడగట్టాలి. అన్ని తరగతుల వారిని భాగస్వాములను చేయాలి.
సమాజంలోను, కుటుంబంలోను మహిళల పేదరికం, ఆర్థికంగా ఇతరులపై ఆధారపడి జీవించటం వ్యవస్థాగతం చేయబడ్డాయి. ఎన్నో పోరాటాల ఫలితంగానే నేడు నామమాత్రంగానైనా మహిళల కుటుంబ శ్రమకు, సమాజంలో వారి పాత్రకు గుర్తింపు లభించింది. వివిధ వేదికలపై చర్చ నడుస్తోంది. కాబట్టి పేదరికం, ఇంటా బయట ఎదుర్కొంటున్న శారీరక దోపిడీ పోవాలంటే, చేస్తున్న పనికి తగిన విలువ, గుర్తింపు పొందాలి. దానికి ఏకైకమార్గం విభిన్న రూపాలలో పోరాటాలు నిర్మించడం. దానిలో బాధితులను, అభివృద్ధి కాముకులను భాగస్వాము లను చేయాలి. చట్టసభల్లో సైతం దీనిపై విస్తృత చర్చ జరగాలి. సమగ్రమైన విధానాలను రూపొందించాలి. ఇదంతా జరగాలంటే ఎంతో ప్రణాళిక, పట్టుదల అవసరం. అందుకు ముందుగా పితృస్వామ్య భావజాలం నుంచి మహిళలు బయటపడేందుకు విస్తృతమైన కృషి జరగాలి. నేడు మన సమాజం ఉన్న పరిస్థితులలో అదేమి చిన్న విషయం కాదు. అయితే సర్వ శక్తులు ఒడ్డి రంగంలోకి దిగితే కొంతకాలానికైనా ఫలితం లభించి తీరుతుంది. ''కృషితో నాస్తి దుర్భిక్షం'' కదా..!
- పద్మశ్రీ
సెల్: 9490098687