Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ బెంగాలీ నవలా రచయిత బిబూతి భూషణ్ బెనర్జీ నవలను (1929) సత్యజిత్ రే 1955లో కథా చిత్రంగా రూపొందించి, ఆధునిక భారతీయ వాస్తవిక చలన చిత్రోద్యమానికి నాంది పలికారు. చిత్రం రూపొందించడానికి ముందూ, ఆ తర్వాతా ఆయనకు ఎవరి నుంచీ ఏ ప్రోత్సాహమూ లభించలేదు. తన భార్య నగలతో సహా తన ఆస్తులన్నీ అమ్ముకుని, తన మొదటి సినిమా తను అనుకున్న విధంగా తీయాలని రే సంకల్పించుకున్నారు. ప్రొఫెషనల్ నటీనటుల్ని కాదని, చిత్రీకరణ నాలుగు గోడల మధ్య వేసుకునే సెట్టింగుల్లో కాదనీ, ఆయన ఒక విప్లవాత్మకమైన మార్పునకు పునాదులు వేశారు. నటనలో ఏమాత్రం అనుభవంలేని సాధారణ వ్యక్తుల్ని నటీనటులుగా ఎన్నుకున్నారు. అంతా అవుట్డోర్ షూటింగ్ జరిపి వాస్తవికతకు అద్దం పట్టారు. పాశ్చాత్య దేశాల్లో 'పథేర్‌పాంచాలి' విజయఢంకా మోగించిన తర్వాత, భారతీయ ప్రేక్షకులు ఆలస్యంగా దాని గొప్పతనాన్ని గుర్తించారు.
చారిత్రకంగా 'పథేర్ పాంచాలి' సినిమాలో 1910-1920 నాటి భారతీయ గ్రామీణ పరిస్థితులు చిత్రితమయ్యాయి. బెంగాల్‌లోని ఒక మారుమూల గ్రామం - నిశ్చింది పూర్. తరతరాలుగా ఆ ఊళ్ళో ప్రజలు తమ ప్రపంచంలో తాము బతుకుతూ ఉంటారు. దేశంలో వస్తున్న సామాజిక, ఆర్థిక, సాంకేతిక మార్పులు వారికి అంతగా తెలియవు. హరిహర్ రే, అతని భార్య సర్బొజయ. వీరి కూతురు దుర్గ, కొడుకు అపూర్బా(అపూ) అంతే! ఇవీ ఆచలన చిత్రంలోని నాలుగు ముఖ్యమైన పాత్రలు. వీరుకాక, వీరితో పాటు ఇందిర్ అనే వృద్ధ విధవరాలు (పిషి) వీరితో ఉంటుంది. ఆమె హరిహర్‌కు దూరపు చుట్టం. పూర్వం నుంచి వస్తున్న కొన్ని సంప్రదాయ సిద్ధమైన కట్టుబాట్ల మూలంగా ఆమె, ఈ కుటుంబంపైనే ఆధారపడి ఉంటుంది. ఇంతకన్నా దగ్గరి బంధువులు ఆమెకు ఎవరూ ఉండరు.
సత్యజిత్‌రే ఈ చిత్రంలో ప్రధానంగా మానవ సంబంధాల మీద దృష్టిపెట్టారు. అందుకే హరిహర్ రే కుటుంబ సభ్యులమధ్య, వారికీ.. సమాజంలో ఇతర వ్యక్తులకూ మధ్య గల సంబంధ బాంధవ్యాలు, వాటి స్వరూపం మనకు ఇందులో ప్రధానంగా కనిపిస్తుంది. జీవితమే ఇందులో - హీరో. జీవితమే ఇందులోని హీరోయిన్. జీవితమే విలన్. జీవితమే కమేడియన్! ముఖ్యపాత్రధారి హరిహర్ రే ఒక బ్రాహ్మణ పండితుడు, వంశ పారంపర్యంగా ధర్మకర్తృతం నెరిపే కుటుంబంలోంచి వచ్చినవాడు. రాను రాను మారుతున్న కాలానికీ, మతపరమైన వృత్తికీ పొత్తు కుదరక, అతను ఇతర ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తాడు. ఒక పెద్ద ధనవంతుడి దగ్గర జమా ఖర్చులు చూడటానికి గుమస్తాగా చేరతాడు. అతనిలో కొన్ని గొప్ప గొప్ప కోర్కెలుంటాయి... కవిత్వం రాయాలని, నాటకాలు రాయాలని... అవన్నీ పుస్తకాలుగా రావాలనీ... వగైరా వగైరా...
హరిహర్ రే ఇంటికి రెండే రెండు పొరుగిళ్ళు ఉంటాయి. ఒకటి ముఖర్జీ కుటుంబం. రెండు నీలమణి కుటుంబం. ముఖర్జీలది సిరి సంపదలు గల కుటుంబం. వీరు హరిహర్ రేకు రక్తసంబంధీకులు! పూర్వం హరిహర్ తాతగారు ముఖర్జీల దగ్గర మూడు వందలు (ఆరోజుల్లో అది చాలా పెద్ద మొత్తం) అప్పుతీసుకుంటాడు. తరాలు మారినా ఆ అప్పుతీరదు. ఇంటి పక్కన గల తోటను అప్పజెప్పి, హరిహర్ తాతలనాటి బాకీ తీర్చేస్తాడు. సినిమాలో కనిపించే ముఖర్జీ కుటుంబ సభ్యులు శెజ్బో, రాను, టును. ఇంటి యజమానురాలు శెజ్బో పెద్దావిడ.. మధ్య వయస్కురాలు. రాను, టునులు ఆవిడ కూతుర్లు. (దాదాపు దుర్గ వయస్సు వాళ్ళు. దుర్గతో ఆడుకుంటూ ఉంటారు) వీరితో సూడో అనే అబ్బాయి, ఇంకా ఇతర పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. నీలమణి కుటుంబంలో అతనూ, అతని భార్య, కూతురు బిని - ఉంటారు.
హరిహర్ రే ఇల్లు పాతబడి, వంగిపోయి ఉంటుంది. వెంటనే బాగు చేయించకపోతే ఇప్పుడో అప్పుడో కూలిపోయేట్లుగా ఉంటుంది. ముఖద్వారంలో అడుగు పెట్టగానే లోపల విశాలమైన వాకిలి (ఆవరణ) ఉంటుంది. ఆవరణ మధ్యలో తులసి కోట ఉంటుంది. ఎదురుగా వరండా, రెండు గదులూ ఉంటాయి. అదే హరిహర్ రే ఇల్లు. పక్కన పిషి (ఇందిర్) గదీ, గొడ్ల చావిడీ ఉంటాయి. లోపలి ఆవరణలో హరిహర్ ఇంటికి ఎదురుగా పాడుబడ్డ గుడిసెలుంటాయి. బయట ముఖద్వారానికి ఎదురుగా చిన్న కొలను ఉంటుంది. దాని చుట్టూ గట్టు మీద పెద్ద పెద్ద వృక్షాలూ, లోపలి వైపు వెదురు చెట్లూ ఉంటాయి. హరిహర్ ఇంటికి మరో వైపు, వాళ్ళు బాకీ కింద వదిలేసిన పెద్దతోట ఉంటుంది. మరో వైపు మంచినీళ్ళ బావి ఉంటుంది.
దగ్గర్లో మరో చోట నీలమణి ఇల్లుంటుంది. కొద్ది దూరంలో రాజు ఇల్లు ఉంటుంది. పిషి - సర్బొజయ (హరిహర్ భార్య)తో పోట్లాడినప్పుడల్లా కొద్ది రోజుల పాటు రాజు కుటుంబాన్ని ఆశ్రయిస్తూఉంటుంది. ఆ వీధి దాటి మరికొంత దూరం పోతే ప్రసన్న తాటాకుల గుడిసె కనిపిస్తుంది. ప్రసన్న అసలైతే దుకాణదారుడు. కానీ, మరోవైపు పిల్లలకు చదువు కూడా చెపుతుంటాడు. ఆ వూరికి ఇక అదే బడి!
గ్రామంలో వీధులు సరిగా ఉండవు. అన్నీ పిల్ల బాటలే. బాటల పక్కన దట్టమైన పొదలు పెరిగి ఉంటాయి. తీగలు పాకి ఉంటాయి. భారీ వర్షాలు ఆ ప్రాంతంలో అతి సహజం. అవి మట్టిలో కొత్త ప్రాణాన్ని గమ్మరిస్తాయి. ఒక్కోసారి మనుషుల ప్రాణాలు కూడా తీస్తుంటాయి. ఊరికి కొద్ది దూరంలోనే పంట పొలాలుంటాయి. పొలాలలో టెలిఫోను స్తంభాలు వాటిమీదుగా నగరాలకు దూసుకుపోయే వైర్లు. వాటి నుంచి వచ్చే ధ్వనులు - పిల్లలకు అద్భుతమనిపిస్తూ ఉంటాయి! పొలాలకు ఇంకా పై నుంచి రైల్వేలైను ఉంటుంది. రైళ్ళ రాకపోకలు నిశబ్దపు రాత్రిలో హరిహర్ ఇంటిదాకా వినిపిస్తూ ఉంటాయి. సినిమాలో వేరు వేరు సన్నివేశాలో వేరు వేరు గ్రామస్థులు అనేక సందర్భాలలో కనిపిస్తుంటారు.
గ్రామంలో పెత్తందారు పేరు మజుందార్. ఆయనే దుర్గాపూజ ఉత్సవ నిర్వాహకుడు. మధ్య మధ్య చక్రవర్తి అనే వ్యక్తి కనిపిస్తుంటాడు. అతను చేపలు పట్టడంలో దిట్ట. ఎప్పుడూ చేతిలో గాలం పట్టుకుని తిరుగుతూ కనిపిస్తుంటాడు. మిఠాయిలు అమ్మే చిన్ని బాస్ ఊళ్ళోకి తరచుగా వస్తుంటాడు. దుర్గ అనారోగ్యంగా ఉన్నప్పుడు డాక్టరు వచ్చి చూసి వెళతాడు. ఉత్సవం జరుగుతున్నప్పుడు, జానపద కళారూపం జాత్రా ప్రదర్శన జరుగుతున్నప్పుడు ఎంతో మంది వాయిద్య కారులు కనిపిస్తారు. ముఖర్జీ వాళ్ళ ఇంట్లో రానూ పెండ్లి జరుగుతున్నప్పుడు ఇంగ్లీషు వాళ్ళ బృందం యూనిఫామ్స్ వేసుకుని ఊళ్ళోకి వస్తుంది. మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారి మార్చింగ్ సాంగ్ శైలిలో వాళ్ళు బ్యాగ్ పైప్‌లు ఊదుతూ ఉంటారు.
'కాశీపట్నం చూడర బాబూ' - లాంటి పాట పాడుతూ పిల్లలకు బయస్కోపు పెట్టెలో బొమ్మల్ని చూపే వాడొకడు ఊళ్ళోకి వచ్చి పోతుంటాడు. కొద్దిపాటి డబ్బులు తీసుకుని, దేశంలోని వివిధ ప్రాంతాల ఫొటోలు బయోస్కోపులో చూపెడుతూ ఉంటాడు. ఢిల్లీ, ఆగ్రా, ముంబాయి, చెన్నై, కలకత్తా లాంటి ప్రాంతాలు బయోస్కోపు (పిక్చర్ బాక్స్)లో చూస్తూ నిశ్చిందిపూర్లోని 'అపూ' - లాంటి పిల్లలు ఎంతో ఉత్తేజతులవుతూ ఉంటారు. మారుమూల గ్రామమైన నిశ్చిందిపూర్లోని పిల్లలకు మారుతున్న ఆధునిక భారతదేశ స్వరూపం తెలిసే అవకాశం అంతకన్నా లేదు. ఇదీ నిశ్చిందిపూర్ గ్రామంలోని చిన్న ప్రపంచం. ఆ గ్రామం నుంచి కొద్ది దూరంలో దాస్ ఘరా, రాణాహట్ అనే రెండు పట్టణాలున్నాయి. హరిహర్ రే ఉద్యోగం కోసం ఈ పట్టణాలకు వెళ్ళి వస్తుంటాడు. హరిహర్ భార్య - సర్బోజయ లాంటి గృహిణులకు ఇవి ఎక్కడో చాలా దూరంగా ఉన్న స్థలాలు. భర్త దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సర్బోజయ భర్త నుంచి అప్పుడప్పుడు పోస్ట్‌కార్డ్ అందుకుంటూ ఉంటుంది.
దాస్ఘరా, రాణాహట్ పట్టణాలకు ఇంకా పైన బనారస్ నగరం ఉంది. సినిమా మొదలయ్యే నాటికి హరిహర్ ఒకసారి బనారస్ వెళ్ళివస్తాడు. అయితే, తన తండ్రి తాతల వారసత్వంలో లభించిన నిశ్చిందిపూర్ ఇంట్లో స్థిరపడతాడు. చిత్రం ముగింపులో హరిహర్ రే ఇల్లూ, వాకిలీ అంతటినీ దాని మానాన దాన్ని వదిలేసి, ఒక కొత్త జీవితం ప్రారంభించడం కోసం తన కుటుంబంతో సహా నిశ్చిందిపూర్ వదిలి బనారస్ వెళ్ళిపోతాడు. ఇది బి బూతి భూషణ్ బెనర్జీ నవల 'పథేర్ పాంచాలి'లో సగం మాత్రమే - మొత్తానికి మొత్తంగా సినిమాలో చేర్చలేకపోయారు. రూపం, లయ, కదలికల గూర్చి సత్యజిత్ రే అంతగా ఆలోచించలేదు. ఈ కథకు కుటుంబమే కేంద్రకం అని గుర్తించారు. భార్యా భర్తలు, వారి ఇరువురు పిల్లలు, ఒకముసలవ్వ! ఈ పాత్రల్ని రచయిత ఎంత ప్రతిభావంతంగా మలిచాడంటే... పాత్రలు వాటంతట అవే సర్దుకుని, అన్నీ సమంగా సరితూగేట్లు నిలిచిపోయాయి. చిత్ర నిర్మాణం మొదలు పెట్టినతర్వాత సత్యజిత్ రేకు మరో సంవత్సరం కాలం దొరికింది. ఆ సమయంలో పాత్రలు, వాటి స్వరూప స్వభావాలు దృశ్యానికీ, భావోద్రేకానికీ, ధనిక-పేదకూ- నవ్వుకూ కన్నీటికీ - పల్లె సహజ అందానికీ అక్కడి దారిద్రానికీ మధ్య గల అంతరాన్ని దర్శక నిర్మాత సత్యజిత్ రే నిశితంగా అవగాహన చేసుకోగలిగారు. వీటికి మించి హృదయ విదారకమైన, అతి సహజమైన రెండు చావులు ఇందులో ప్రేక్షకులను కదిలించి వేస్తాయి. మానవత్వం, భావనా ప్రధానమైన అంశాలు, జీవిత వాస్తవాలు కలగలిపి 'పథేర్ పాంచాలి'ని వరల్డ్ క్లాసిక్‌గా నిలబెట్టాయి. అంతర్జాతీయ అవార్డులు అందరికంటే ఎక్కువగా స్వీకరించిన ఒకే ఒక్క భారతీయుడు, భారతరత్న, ప్రత్యేక ఆస్కార్ విజేత, చిత్రకారుడు, స్వరశిల్పి, కథానికా రచయిత ఈ నేల మీద పుట్టి వందేండ్లయ్యింది. తన మానవతా దృక్పథాన్ని సినిమా మాధ్యమం ద్వారా పంచి, ప్రపంచ పౌరుల హృదయాల్లో నిలిచిన మహౌన్నతుడు.. సత్యజిత్ రే!
- డా|| దేవరాజు మహారాజ
వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త