Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 61ఏండ్లకు పెంచుతూ రాష్ట్ర శాసనసభలో ''ఉద్యోగ విరమణ వయస్సు సవరణ చట్టం-3/2021'' చేసి 30 మార్చి 2021 నుంచి అమలయ్యే విధంగా ఉత్తర్వులు వెలువరించింది. ఈ ఉత్తర్వుల వల్ల ఉద్యోగ వర్గాలలో మిశ్రమ స్పందన వెలువడినా, నిరుద్యోగ యువతలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. రిటైర్మెంట్ వయసు పెంచడం ప్రతిపాదన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా, రోశయ్య ఆర్థిక మంత్రిగా ఉన్న కాలం నాటి నుంచీ ఉంది. ఆనాడు ఉన్న రాష్ట్ర దుర్భల ఆర్థిక స్థితి దృష్ట్యా రిటైర్మెంట్ సమయంలో ఉద్యోగులకు చెల్లించవలసిన బెనిఫిట్స్ గ్రాట్యుటీ, కమ్యుటేషన్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ మొదలైనవి చెల్లించలేని దశలో అట్టి చెల్లింపులు వాయిదా వేయడంలో భాగంగా రిటైర్మెంట్ వయసు పెంపు ద్వారా ఆర్థిక భారాన్ని వాయిదా వేసే ఆలోచన చేశారు. కానీ నిరుద్యోగ వర్గాల నుంచి వచ్చిన ఒత్తిడిని ఫీడ్ బ్యాక్‌గా తీసుకుని వయసు పెంపు ఆలోచన విరమించుకున్నారు. అంతకు పూర్వం 1983లో కూడా తెలుగుదేశం మొదటి సారిగా అధికారంలోకి వచ్చి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా, నాదెండ్ల భాస్కరరావు ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో రిటైర్మెంట్ వయసు మార్పు దుమారం రేగింది. 1983లో మొదటిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఎన్టిఆర్ అప్పటికే 58ఏండ్లుగా ఉన్న ఉద్యోగ విరమణ వయసు 55కు కుదిస్తూ 1983 ఫిబ్రవరి 16న ఉత్తర్వులిస్తూ ఆ రోజువరకు 55ఏండ్లు పైబడిన ఉద్యోగులందరూ 1983 ఫిబ్రవరి 28 సాయంత్రం నిర్బంధ ఉద్యోగ విరమణ చేయాలని ఆదేశించారు. ఉద్యోగ వర్గాల్లో ఈ రిటైర్మెంట్ వయస్సు తగ్గింపు కలకలం లేపింది. ఆనాడు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగితను కారణంగా చూపుతూ యువతకు ఉద్యోగాలు కల్పించాలంటే 55ఏండ్లు పైబడిన వారిని ఉద్యోగం నుంచి తప్పించడం అనివార్యమని తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించింది. 55ఏండ్లు పైబడిన వారితో పని చేయించుకుని యువతను ఖాళీగా కూర్చోబెట్టడం సబబుగా లేదని చెప్పింది. కానీ ఉత్తర్వులపై చాలా దుమారం రేగింది. ఉద్యోగవర్గాలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశాయి. ఇంతలో ఆర్థిక మంత్రిగా ఉన్న నాదెండ్ల భాస్కరరావు అదును చూసి ఎన్టిఆర్ ప్రభుత్వాన్ని కూలదోసి 1984 ఆగస్టు 16న అడ్డదారిలో అప్రజాస్వామికంగా ముఖ్యమంత్రి అయ్యారు. ఈ సందర్భంలో అధికారగణం, ఉద్యోగులను శాంతపరచి తనవైపు తిప్పుకోవడానికి ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు 1984 ఆగస్టు 23న ఉద్యోగ విరమణ వయస్సును 55 నుంచి మళ్లీ 58ఏండ్లకు పెంచారు. ఉద్యోగ విరమణ వయసు 58 తగ్గిస్తున్నప్పుడు నిరుద్యోగితను కారణంగా చూపిన ఆర్థికశాఖ మంత్రి నాదెండ్ల భాస్కరరావు తాను ముఖ్యమంత్రి కాగానే యూటర్న్ తీసుకుని ఉద్యోగులను ప్రసన్నం చేసుకోవడానికి రిటైర్మెంట్ వయసు మళ్లీ 58 పెంచారు. ఈ రెండు సందర్భాల్లో కూడా ప్రభుత్వం సహేతుకంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయలేదు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు అనేది ఉద్యోగుల నుంచి వచ్చిన డిమాండ్ కాదు. ఉద్యోగ విరమణ వయసు 61ఏండ్లకు పెంచడం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కానీ ప్రజల్లో ఏ ఒక్క వర్గానికి ప్రయోజనం చేకూర్చేది కాదు. ఈ నిర్ణయం ఉద్యోగ వర్గాలను కానీ, నిరుద్యోగులను కానీ గమనంలోకి తీసుకుని చేసిన హేతుబద్ధ నిర్ణయం కాదు. ప్రభుత్వం కేవలం ప్రస్తుత ఆర్థిక దుస్థితి నుంచి బయట పడటానికి వేసిన ఓ ఎత్తుగడ మాత్రమే. ఈ ఉత్తర్వు వల్ల మూడేండ్ల పాటు రాష్ట్రంలో ఎలాంటి ఉద్యోగ విరమణలు ఉండవు కాబట్టి మూడేండ్ల పాటు ఉద్యోగ విరమణ సందర్భంలో చెల్లించే గ్రాట్యుటీ, కమ్యుటేషన్, లీవ్ ఎస్క్యాష్మెంట్ మొదలైన చెల్లింపులు కూడా ఉండవు. ఈ మూడేండ్లలో 2021 మార్చి నుంచి డిసెంబర్ వరకు 7,954 మంది, 2022 జనవరి నుండి డిసెంబర్ వరకు 9,213 మంది, 2023 జనవరి నుండి డిసెంబర్ వరకు 9,231 మంది, 2024 జనవరి నుంచి ఫిబ్రవరి వరకు 1,700 మంది చొప్పున మొత్తం 28,108 మంది ఉద్యోగుల రిటైర్మెంట్ వాయిదా పడుతుంది. సగటున సంవత్సరానికి 9,300 మందికి రిటైర్మెంట్ చెల్లింపులు వాయిదా వేసి అదే ఖర్చుతో పీఆర్సీ అమలు చేయడం కోసం ప్రభుత్వం లోపాయకారి నిర్ణయం చేసింది. ప్రభుత్వం ప్రకటించినట్టుగా ప్రజల ఆయుషు ప్రమాణాలు పెరగడం వల్ల రిటైర్మెంట్ వయస్సు పెంచామనడం శుద్ధ అబద్ధం. ఇక రెండో పార్శ్వాన్ని పరిశీలిస్తే రిటైర్మెంట్ వయస్సు పెంపు వల్లనే నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా పోతున్నాయనడం కూడా అర్థసత్యమే. ఎందుకంటే రాష్ట్రంలో లక్షా తొంభయొక్క వెయ్యికి పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పీఆర్సీ నివేదిక తెలుపుతుంది. వాటిని భర్తీ చేయడానికి ప్రభుత్వం దగ్గర ఎలాంటి ప్రణాళిక ఇప్పటి వరకు లేదు. నిజంగానే నిరుద్యోగులకు న్యాయం చేయదల్చుకుంటే ఉపాధి కల్పించదల్చచుకుంటే ఈ ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయవచ్చు. అలా చేయకుండా ఖాళీలను ఖాళీగానే ఉంచుతూ నిరుద్యోగులను రోడ్లపైనే వదిలేసింది. పైగా ఉద్యోగులకు, నిరుద్యోగులకు మధ్యన రిటైర్మెంట్ వయసు పెంపు చిచ్చు పెట్టింది. ఖాళీలు భర్తీ చేయడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వాల కనీస బాధ్యత. కానీ తెలంగాణ ప్రభుత్వం అందుకు భిన్నంగా ఉన్న ఉద్యోగాలను తొలగించే కార్యక్రమం చేపట్టింది. అందువల్లనే నిరుద్యోగ సమస్య తీవ్రరూపం దాల్చింది. ఇలాంటి పరిస్థితులలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యం అవుతుంది. ఖాళీలు భర్తీ చేసి, ఉపాధి కల్పించడంలో వైఫల్యం చెందిన ప్రభుత్వం ఇటు నిరుద్యోగులకు న్యాయం చేయకుండా, అటు ఉద్యోగులకు ధరల సూచి, ద్రవ్యోల్బణంకు అనుగుణంగా వేతనాల పెంపు అమలు చేయకుండా రెండు వర్గాలనూ మోసం చేస్తోంది.
- నాదెండ్ల శ్రీనివాస్
సెల్ : 9676407140