Authorization
Mon Jan 19, 2015 06:51 pm
1990 ప్రారంభంలో బీజేపీ సీనియర్ నాయకులు, ఆరెస్సెస్ సంఫ్‌ుపరివార్ సభ్యులు ఎల్కే అద్వానీ, వాజపేయి, అశోక్ సింఘాల్, ఆచార్య గిరిరాజ్ కిషోర్ తదితరులు మీడియాతో మాట్లాడుతూ భారతదేశాన్ని పూర్తిగా మార్చి వేస్తామని చెప్పారు. 1992 డిసెంబర్లో ఆరెస్సెస్ కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చిన రెండు మూడు నెలల తరువాత, ఆచార్య గిరిరాజ్ కిషోర్, మహంత్ రామచంద్ర పరమహంసలు, ''భారతదేశంపై 450 సంవత్సరాలుగా ఉన్న మచ్చను, హిందూత్వ యోధులు బాబ్రీ మసీదును కూల్చడం ద్వారా తొలగించారని, ఇది హిందూత్వ సంస్కృతి, సామాజిక, రాజకీయ ఆచారాలకు ఒక పెద్ద చారిత్రక విజయం'' అని అన్నారు. హిందూ మత రాజ్య స్థాపనకు దారితీసే మరికొన్ని విజయాలు చేరువలో ఉన్నాయని, ఆఖరి లక్ష్యాన్ని సాధించడానికి బాబ్రీ మసీదు లాంటి అనేక చారిత్రక కళంకాలను తొలగించాల్సిన జాబితా ఉందని అన్నారు. దానిలో ప్రధానంగా కాశీలో విశ్వనాథ దేవాలయాన్ని ఆనుకొని ఉన్న జ్ఞానవాపి మసీదు, మధురలో శ్రీకృష్ణ జన్మస్థాన దేవాలయాన్ని ఆనుకొని ఉన్న జమా మసీదు, ఆగ్రాలోని తాజ్ మహల్, ఢిల్లీలోని కుతుబ్ మినార్లు ఉన్నాయని తెలిపారు. అదే జాబితాలో, బహిరంగంగా చర్చించడానికి అవకాశం లేని ఆశ్చర్యకరమైన లక్ష్యాలూ ఉన్నాయి.
భారత పార్లమెంట్ అణచివేత, అవమానాలకు చిహ్నంగా ఉన్న సంస్థలలో ఒకటిగా ఉందని గిరిరాజ్ కిషోర్ అన్నాడు. పార్లమెంట్ భవన నిర్మాణం, పార్లమెంటరీ విధానాలు, సాంప్రదాయాలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చేసే చట్టాలు అన్నీ బ్రిటిష్ వారి ఆధిపత్యానికి చిహ్నంగా ఉన్నాయని తెలిపాడు. భారత రాజ్యాంగం కూడా ఆ పార్లమెంటరీ విధానాల కొనసాగింపేనని, అది భారతీయ స్ఫూర్తిని ఉల్లంఘిస్తుందని అన్నాడు. మన రాజ్యాంగం ఏర్పడే నాటికే, గురూజీ ఎం.ఎస్.గోల్వాల్కర్ ఇవే అభిప్రాయాలను వెలిబుచ్చుతూ, సంఫ్‌ుపరివార్ ఆధ్వర్యంలో ఏర్పడే 'హిందూమత రాజ్యం' వీటన్నింటినీ రద్దు చేస్తుందని అన్నాడు. సామ, దాన, బేధ, దండోపాయాలు, భిన్నమైన వ్యూహాలు, ఎత్తుగడలు ఉపయోగించి బాబ్రీ మసీదును కూల్చిన విధంగా ''అవమానాలకు చిహ్నాలుగా'' ఉన్న ఇతర సంస్థలను కూడ కూల్చుతామని రామచంద్ర పరమహంస అన్నాడు.
1984 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అవమానకరమైన ఓటమిని చవిచూడడంతో, ఆరెస్సెస్ 'మతం' అనే ఒక మంచి జనసమీకరణ సాధనాన్ని కనిపెట్టింది. బీజేపీకి ఒక ఆశాజనకమైన మార్గాన్ని చూపేందుకు విశ్వహిందూ పరిషత్ తన మొదటి సమావేశంలో, అయోధ్యలో రామజన్మభూమిని ''విముక్తి'' చేసేందుకు 1984లో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ''మతాన్ని ఆచరించడం, ప్రజా సమూహాన్ని ఏకీకరణ చేయడం, మఠాలను, మందిరాలను అభివృద్ధి చేయడం, హిందూ మత ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వాన్ని ఆదేశించడం, హిందూ సంస్కృతిని, హిందూ ధర్మాన్ని, హిందూ దేవుళ్ళను, దేవతలను, హిందూ జీవన విలువలను ఎగతాళి చేసే సినిమాలకు అనుమతులు ఇవ్వకూడదని, శ్రీరామ, శ్రీకృష్ణ జన్మస్థానాలు, కాశీ విశ్వనాథ దేవాలయాన్ని, ఇతర చారిత్రక దేవాలయాలను హిందూ మతానికి తిరిగి ఇవ్వాలనే'' లక్ష్యాలు ఆ తీర్మానంలో ఉన్నాయి.
బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత, 'హిందూమత రాజ్య స్థాపనే' లక్ష్యంగా పనిచేస్తున్న ఆరెస్సెస్ ప్రజలను మత ప్రాతిపదికన విభజించి, తన ఎజెండాను ముందుకు తీసుకొని పోయేందుకు కాశీలోని విశ్వనాథ దేవాలయాన్ని, మధురలోని శ్రీకృష్ణ జన్మస్థాన దేవాలయాన్ని వివాదం చేసే ప్రయత్నాలు చేస్తున్నది. ప్రపంచంలో మిలియన్ల సంఖ్యలో ఉన్న హిందూ భక్తులు పవిత్రంగా భావించే ఆ స్థలంలో దేవాలయాలను కూల్చి మసీదులు కట్టించారని సంఫ్‌ుపరివార్ సభ్యులు ఆరోపిస్తున్నారు. రామజన్మభూమి వివాదం కొనసాగే సమయంలో, మళ్ళీ ఇలాంటి వివాదాలు కాశీ, మధుర దేవాలయాల విషయంలో తలెత్తకుండా పి.వి.నరసింహారావు ప్రభుత్వం, (ూశ్రీaషవర శీట ఔశీతీరష్ట్రఱజూ Aష్,1991) 'ప్రార్థనా స్థలాల చట్టం1991' తెచ్చింది. ఆగస్ట్ 15, 1947 నాటికి వివాదాల్లో ఉన్న అన్ని మతాలకు సంబంధించిన ప్రార్థనా స్థలాలు ఏ స్థితిలో ఉంటే అదే స్థితిలో ఉంచాలనీ, వాటిపై ఏ విధమైన వ్యాజ్యాలు స్వీకరించబడవని ఆ చట్టం సారాంశం. అయోధ్య వివాదానికి సంబంధించిన చారిత్రక తీర్పును ప్రకటించే సమయంలో, సుప్రీంకోర్టు కూడా ఆ తీర్పులో 'ప్రార్థనా స్థలాల చట్టాన్ని' సమర్థించింది. అప్పటికే (1991) రామజన్మభూమి వివాదం కోర్టులో ఉంది కాబట్టి దానికి ఆ చట్టం నుంచి మినహాయింపు ఉంది. రామమందిర నిర్మాణం చేయాలని కోరుకున్న వారికి తీర్పు అనుకూలంగా వచ్చినప్పుడు, రామమందిర వివాదానికి తెరపడుతుందని అందరూ ఆశించారు. కానీ అయోధ్య తీర్పు వెలువరించిన తొమ్మిది నెలల లోపే, సుప్రీంకోర్టు సమర్థించిన 'ప్రార్థనా స్థలాల చట్టాన్ని' ప్రశ్నించే పరిస్థితి దాపురించింది. దీనితో 1991 చట్టం ద్వారా మానిన గాయాలు మళ్ళీ పుండుగా మారుతాయని చాలా మంది భయపడుతున్నారు.
జ్ఞానవాపి మసీదును ప్రాచీన శివాలయం శిధిలాలపైన నిర్మించారు కాబట్టి మసీదు స్థలాన్ని హిందువులకు ఇవ్వాలని కోరుతూ విజరు శంకర్ రస్తోగి దాఖలు చేసిన పిటిషన్‌పై (ప్రార్థనా స్థలాల చట్టం లోని కొన్ని సెక్షన్లను సమీక్షీంచాలని చేసిన విజ్ఞప్తులను సుప్రీంకోర్టు స్వీకరించిన తర్వాత) వారణాసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)ను జ్ఞానవాపి సముదాయాన్ని సమగ్రంగా సర్వే చేసి, మసీదును నిర్మించడానికి దేవాలయాన్ని కూల్చిందీ, లేనిదీ తేల్చాలని ఆజ్ఞలు జారీ చేసింది. అసలు జ్ఞానవాపి మసీదును హిందువులకు అప్పగించాలనే కేసు 1991లోనే దాఖలు అయ్యింది. కానీ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు, అంజుమన్ ఇంతెజామియా మసీదు (మసీదు నిర్వహణ కమిటీ)లు స్టే కోరుతూ 1998లో హైకోర్టుకు వెళ్లాయి. ఎంతో కాలంగా దేవాలయం, మసీదులలో ఎటువంటి అవరోధాలు లేకుండా ఎవరి ప్రార్థనలు వారు చేసుకుంటున్నారు. కానీ అయోధ్య విషయంలో హిందువులకు అనుకూలంగా తీర్పు వచ్చిందన్న ధైర్యంతో, రస్తోగి కాశీ దేవాలయం మసీదుల సముదాయాలను పురావస్తు సంబంధిత సర్వే చేయాలని పిటిషన్ వేశాడు. దానిపై వాదనలు ఏప్రిల్ 2, 2021 నాడు పూర్తయ్యాయి. సివిల్ జడ్జి అశుతోష్ తివారీ, తన తీర్పును రిజర్వ్‌లో ఉంచుకొని, ఏఎస్ఐ చేసే సర్వే నివేదిక మాత్రమే వాస్తవాలను బహిర్గతం చేస్తాయని భావిస్తూ, కొంత మంది ప్రముఖులతో ఒక సర్వే కమిటీని నియమించి, వారికి మార్గదర్శకాలను జారీ చేశాడు.
అయోధ్యలోని రామమందిరానికి సంబంధించిన తీర్పు వెలువడిన తర్వాతనే 'ప్రార్థనా స్థలాల చట్టం'పై అనేక పిటీషన్లు దాఖలయ్యాయి. ఈ చట్టం, భారత దేశానికి వచ్చిన దురాక్రమణదారుల చట్ట వ్యతిరేక చర్యలను, చట్ట సమ్మతం చేస్తూ హిందువులు, జైనులు, సిక్కులు, బౌద్ధ మతస్థుల ప్రార్థనా స్థలాలు వారికి చెందకుండా వారి హక్కులను హరిస్తుందని బీజేపీ నాయకుడు అశ్వినీ ఉపాధ్యాయ తన పిటీషన్లో పేర్కొన్నాడు.
దేశంలో గత ఆరేడు సంవత్సరాలుగా అనేక రూపాల్లో ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛపై దాడులు జరుగుతున్నాయి. రాష్ట్రాలతో చర్చించకుండా కేవలం నాలుగు గంటల ముందు జాతీయ లాక్డౌన్ ప్రకటించి, ప్రజలను కష్టాలపాలు చేసి, అనేక మంది మరణాలకు కేంద్ర ప్రభుత్వం కారణమైంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి చేపట్టాల్సిన చర్యల భారం రాష్ట్రాలపై మోపి, న్యాయంగా చెల్లించాల్సిన బకాయిలను ఆయా రాష్ట్రాలకు చెల్లించకుండా, కేంద్రం రాష్ట్రాలను వదిలేసి, మన రాజ్యాంగానికి ఉన్న నాలుగు మౌలిక లక్షణాలలో ఒకటైన సమాఖ్యస్ఫూర్తికి భంగం కలిగించింది. అదే విధంగా సంబంధితశాఖ మంత్రితో, ఆర్బీఐతో చర్చించకుండానే కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసి, అప్పటీకే క్షీణించిన భారత ఆర్థిక వ్యవస్థను మరింత బలహీన పరిచి, నిరుద్యోగ సైన్యాన్ని పెంచింది. భారత రిపబ్లిక్కు చెందిన పార్లమెంటు, న్యాయ వ్యవస్థ, ఎలక్షన్ కమిషన్ లాంటి అన్ని వ్యవస్థలను బలహీన పరిచి, పార్లమెంటరీ సాంప్రదాయాలను పక్కకు నెట్టి, ప్రజావ్యతిరేక చట్టాల ద్వారా వ్యవసాయ రంగం, విద్యా రంగం, పారిశ్రామిక రంగం లాంటి అనేక రంగాలను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఇంకా అనేక సందర్భాల్లో రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు ప్రభుత్వం పాల్పడినప్పుడు, ఈ బీజేపీ నాయకులు ఎక్కడా రాజ్యాంగబద్దత గురించి సందేహాలు వ్యక్తం చేయలేదు. కానీ ప్రజల జీవితాలపై ఎటువంటి ప్రభావం చూపని ప్రార్థనా స్థలాల వివాదాల విషయంలో మాత్రం రాజ్యాంగం అమలు తీరును ప్రశ్నిస్తున్నారు.
ఒకవైపు చట్టపరంగా కాశీ, మధురలలోని ప్రార్థనా స్థలాలను 'విముక్తి' చేయడానికి ప్రయత్నిస్తూనే, మరొక వైపు హిందూ మతానికి చెందిన మద్దతుదారులు ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ స్థలాలను 'విముక్తి'చేయడానికి ఒక ఉద్యమాన్ని ప్రారంభించడానికి ఫిబ్రవరి 2020లో అఖిల భారతీయ సంత్ సమితి కార్యక్రమాలను ప్రకటించింది. సమితి జాతీయ ప్రతినిధి, బాబా బాలక్ దాస్ ఫ్రంట్ లైన్‌తో మాట్లాడుతూ, ''మా ఉద్యమంలో రామ జన్మభూమిని విముక్తం చేయడం మొదటి దశ, అది ఇప్పుడు పూర్తయ్యింది. జ్ఞానవాపి మసీదు అదుపులో చిక్కుకున్న కాశీ విశ్వనాథ దేవాలయాన్ని విముక్తి చేయడం రెండవ దశ. మూడవ దశలో మధురలోని కృష్ణ జన్మభూమి దేవాలయాన్ని ''విముక్తి'' చేస్తాం. హిందూ సమాజం కోరుకుంటున్నది ఈ మూడు దేవాలయాలు మాత్రమే,'' అని అన్నాడు.
ఈ ప్రచారాలను గమనించిన ముస్లిం మతస్థులు స్పందించారు. ''ఇదంతా ఒక పథకం ప్రకారం, అయోధ్యలో జరిగిన విధంగా జరుగుతుందనీ, కానీ అప్పుడు మసీదు కూల్చివేతను తాము ఊహించలేదనీ, ఈ సారి ముస్లిం సమాజం అంతా మసీదును రక్షించుకుంటుందని, కాశీలోని మసీదును కాపాడేందుకు మసీదు చుట్టూ లక్ష నుంచి లక్షన్నర మంది ముస్లిం సోదరులు ఉన్నారని'', ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుకు చెందిన జాఫర్యాబ్ జిలానీ అన్నాడు. 2022లో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు, 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇటువంటి అంశాలను ముందుకు తెస్తున్నారు. వారిటువంటి భావోద్వేగాల సమస్యలను తెస్తేనే, అభివృద్ధి లాంటి కీలకమైన అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్ళించవచ్చు.
అయోధ్యలోని రామమందిరానికి సంబంధించిన తీర్పులో 'ప్రార్థనా స్థలాల చట్టాన్ని' ఉటంకించి, సమర్థించిన సుప్రీంకోర్టు, కాశీ, మధురలలోని మసీదు స్థలాల విషయంలో అదే చట్టాన్ని పునరుద్ఘాటిస్తుందా? లేదా? అనేదే ప్రశ్న.
- బోడపట్ల రవీందర్
సెల్ : 9848412451