Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రశ్న: ప్రస్తుత సంక్షోభం నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏమిటి?
నా ఉద్దేశంలో రెండు విషయాలు ఉన్నాయి. మొదటిది మనదేశంలో ఒక పకడ్బందీ ఆరోగ్య ప్రణాళిక, దాన్ని అమలు పరిచే వికేంద్రీకరించబడిన యంత్రాంగం లేదు. దానిద్వారానే ఆరోగ్య వ్యవస్థను అభివృద్ధి చేయగలం. రెండవది వైద్యం పద్దుకు మనం కేటాయిస్తున్న నిధులు కేవలం జీడీపీలో ఒకశాతం మాత్రమే. కనీసం పదిశాతం కేటాయించాలి. ఇప్పుడు ఏ ఆలస్యం లేకుండా ప్రభుత్వ నిధుల కేటాయింపు జరగాలి. క్యూబా లాంటి దేశంలో ఆరోగ్య రంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారు.
ప్రశ్న: మీ సలహా ఏమిటి?
నేను వామపక్షవాదిని. కేంద్రంలో మా ప్రభుత్వం ఉండి ఉంటే మేము ఆరోగ్యరంగాన్ని, విద్యను ఇప్పటికే జాతీయం చేసేవారం. ఆరోగ్య సేవలపై ప్రభుత్వ పూర్తి నియంత్రణ ఉండాలి. అప్పుడే ధనిక, పేద అనే తేడా లేకుండా అందరికి వైద్యం సమానంగా అందుతుంది.
ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారీ సిద్ధాంతాన్ని కలిగిఉన్నది. పెట్టుబడిదారీ ఆలోచనలు ఉన్నా ప్రభుత్వ పరమైన ఆరోగ్య వ్యవస్థను అభివృద్ధి చేయడానికి వారు ప్రయత్నించాలి. ప్రయివేటురంగం ద్వారా ఆరోగ్య సేవలు అందిస్తున్నవారిపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. వాళ్ళు పేదవారిని దోచుకోకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
ప్రశ్న: ఇతర దేశాలలో ఏమన్నా మంచి ఉదాహరణలు ఉన్నాయా?
స్కాడినేవియన్ దేశాలు చాలా ఆదర్శంగా ఉన్నాయి. అయితే నేను వాటిని చూడలేదు. నేను ఇంగ్లాండ్ వెళ్లి వారి జాతీయ ఆరోగ్య సేవలు ఎన్హెచ్ఎస్, జీపీ సర్జరీ విధానాన్ని చూసి వచ్చాను. మేము కేరళలో కుటుంబ ఆరోగ్య కేంద్రాల వ్యవస్థను ప్రారంభించడానికి ఇంగ్లండ్‌లో ప్రాథమిక ఆరోగ్య విధానం, క్యూబాలోని కుటుంబ డాక్టర్ విధానం నుంచి ప్రేరణ పొందాము. ఆరోగ్య సంరక్షణ అనేది సార్వజనీయంగా ఉండాలి. క్షేత్రస్థాయిలో సౌకర్యాల కల్పనపై కొన్ని నిబంధనలు కచ్ఛితంగా పాటించాలి. ప్రాథమిక, మాధ్యమిక క్షేత్రస్థాయిలకు ఎక్కువ నిధులు కేటాయించాలి. కొన్ని నిబంధనలతో వికేంద్రీకరణ పద్ధతిని పాటించాలి. క్యూబా విజయం సాధించడానికి కేంద్ర స్థాయిలో ప్రణాళిక, రూపకల్పన జరిగి, దాని అమలు వికేంద్రీకరణ ద్వారా జరగడంలోనే ఉన్నది. అదే సరైన విధానం. వారి వైద్య విధానంలో ప్రజలు, పేషంట్స్‌ను కేంద్ర బిందువు చేసుకుని పనిచేస్తున్నారు. ఆ విధానాన్ని మనం ఇక్కడ అమలు జరపవచ్చును.
ప్రశ్న: ఇతర రాష్ట్రాలతో పోల్చితే కేరళ ప్రత్యేకత ఏమిటి?
మేము 2016లో అధికారంలోకి వచ్చినప్పుడు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు ఒక పూట మాత్రమే నడుస్తున్నాయి. అంటే మధ్యాహ్నం వరకే అందుబాటులో ఉన్నాయి. వాటిలో ల్యాబ్ సౌకర్యం ఉండేది కాదు. ఏమన్నా పరీక్ష చేయించుకోవాలంటే రోగులు పట్టణాలకు లేదా ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాలకు వెళ్ళవలస్సి వచ్చేది. అప్పుడు నేను ''రోగ నివారణ'' మీద కేంద్రీకరించాలని భావించాను. కేరళలలో జీవనసరళి రోగాలు ఎక్కువ. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రతి రోగిపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. వీటి దృష్ట్యా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు మంచి భవనాలు, మూత్రశాలలు, ల్యాబులు, అవుట్ పేషెంట్ గదులు, టీకాలు వేయడానికి పిల్లలకు సౌకర్యంగా ఉండే గదులు ఏర్పాటు చేశాము. స్థానిక ప్రభుత్వాలు కేఐఐఈబి ఇందులో కీలక పాత్ర వహించాలి. ఈ మౌలిక సౌకర్యాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున గ్రామ సర్పంచులకు, ఆరోగ్యశాఖ అధికారులకు శిక్షణ ఇచ్చాం. కేంద్ర నిధులు పరిమితంగా ఉన్నా వీరు మంచి పాత్ర పోషించారు. చాలా మంది స్వచ్ఛందంగా ఈ మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ఆర్థికంగా సహకరించారు.
మాకు ఉన్న 946 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు గాను 617కు కొత్త సొంత భవనాలు ఏర్పాటు అయినాయి. ఇది ప్రజా ఉద్యమంగా సాగింది. 100కి పైగా పీహెచ్‌సీలు జాతీయ నాణ్యతాస్థాయి ధృవీకరణ పొందాయి. తాలూకా స్థాయిలో రెండవ స్థాయి ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశాము. వీటిలో కొన్ని కార్పొరేట్ హాస్పటల్స్ కంటే ఎక్కువ సౌకర్యాలను కలిగి ఉన్నాయి. ప్రాంతీయ స్థాయి ఆరోగ్య వ్యవస్థ కూడా బాగా అభివృద్ధిని సాధించింది. వైద్య కళాశాలలను ఆధునీకరించాము. కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించాము. వీటిలో అత్యంత ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో వైద్య పరిశోధనకు కూడా మేము అవకాశం కల్పిస్తున్నాము. 2016లో 37శాతం మంది ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలపై ఆధారపడేవారు. ఇప్పుడు ఏ సంకోచం లేకుండా 50శాతం మంది ప్రజలు ప్రభుత్వ ఆరోగ్యకేంద్రాలకు వస్తున్నారు. ఆరోగ్య వ్యవస్థలో తీసుకువచ్చిన మార్పులు, మహమ్మారిని ఎదుర్కోవడంలో మాకు బాగా ఉపయోగపడ్డాయి. మా లక్ష్యం ఆరోగ్య సంరక్షణ అత్యంత సులభంగా అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దటం. వైద్యం వ్యవస్థ భారంగా ఉండకూడదు, స్నేహపూర్వకంగా పనిచేయాలి.
ప్రశ్న: ఆక్సిజన్, వ్యాక్సిన్ కొరతను ఈరోజు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి. దీని గురించి మీరు ఏమంటారు?
కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రణాళిక ఉండాల్సింది. కేరళ ఇందుకు మినహాయింపు కాదు కదా! ఆక్సిజన్ సరఫరా సమస్యలు రావచ్చని మేము ముందే అంచనాకు వచ్చాము. 2020 మేనెలలోనే మేము ఈ అంశంపై కేరళ పరిశ్రమల మంత్రిత్వశాఖతో సమావేశం జరిపిపాలఘాట్జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రారంభించాలని నిర్ణయించాము, నిర్మాణం పూర్తిచేశాం. ఇప్పుడు అది ఒక వరంలా పనికి వచ్చింది. ఆక్సిజన్ తగినంత ఉత్పత్తి జరుగుతున్నది. అయితే సరఫరాలో కొన్ని అడ్డంకులు ఉన్నాయి. వాటి పరి ష్కారం కోసం సిలిండర్లు, ట్యాంకర్లు తెప్పించాలని నిర్ణయిం చాము. కేంద్రం నిర్వహిస్తున్న మీటింగ్‌లు కేవలం మా దగ్గర ఉన్న సమాచారం ఇతరులతో పంచుకోవడానికి మా త్రమే పనికి వస్తున్నాయి. మేము కోరిన వ్యాక్సిన్ అందించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏ భరోసా ఇవ్వడం లేదు.
కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న టీకాల విధానం మందుల పరిశ్రమల యజమానులకు భారీ లాభాలు కట్టబెట్టేదిగా మాత్రమే ఉన్నది. కేంద్రం దీన్ని లాభాలు దృష్టితో చూడకూడదు. రాష్ట్రాలకు వారి ప్రజలకు తమ పద్ధతిలో వ్యాక్సిన్ ఇచ్చే స్వేచ్ఛను ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమల యజమానులతో తమ రాష్ట్ర ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని బేరసారాలు జరపడం కుదరదు. ప్రజల ప్రాణాలు, వారి ఆరోగ్యం అత్యంత ప్రాధాన్యత కలిగిన కీలక అంశాలు. అందుకని మా రాష్ట్రంలో 100శాతం వ్యాక్సిన్ వినియోగించబడుతున్నది. ఒక్క వ్యాక్సిన్ కూడా వృధా కావడంలేదు. మే ఒకటి నుంచి వ్యాక్సిన్ అమ్మకం జరుగుతుంది. కాబట్టి అక్రమ నిల్వలు జరుగుతున్నట్టు నాకు అనుమానం ఉన్నది. కేంద్రం నుంచి సరిపోయినంత వ్యాక్సిన్ సరఫరా జరగడం లేదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను నమ్మాలి. అప్పుడే ఈ రెండవ ఉప్పెనను సమర్ధవంతంగా ఒకనెలలో అడ్డుకోగలమని పూర్తి నమ్మకంతో ఈ మాటలు చెపుతున్నాను. కేరళ ఆరోగ్యశాఖ మంత్రి, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యురాలు, బిజినెస్ లైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ.
- కె.కె. శైలజ
- అనువాదం: టి.యన్.వి. రమణ,
సెల్: 8985628662