Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పైనున్న టైటిల్ చూడగానే ఓ సూపర్ డూపర్ సినిమా గుర్తుస్తోంది కదూ. మెగాస్టార్ చిరంజీవి హీరోగా 2004లో వచ్చిన ఈ మూవీ... ఆద్యంతం కితకితలు పెడుతూ మనల్ని నవ్వుల్లో ముంచెత్తుతుంది. గ్యాంగ్ రౌడీ అయిన కథానాయకుడు... హీరోయిన్ సోనాలీబెంద్రేని ప్రేమలోకి దించేందుకోసం ఎంబీబీఎస్ చదువుతున్నట్టుగా నటిస్తాడు. ఆ తర్వాత ఏకంగా ఒక ఆస్పత్రే నిర్వహిస్తున్నట్టు ఫోజిస్తాడు. 17 ఏండ్ల క్రితం నాటి ఆ సంగతి ఇప్పుడెందుకా..? అని మీరు తెగ ఇదై పోవద్దు. ఎందుకంటే కరోనా పుణ్యమాని... ఏడాది కాలంగా ప్రతీ ఊళ్లోనూ, ఇంకా చెప్పాలంటే ప్రతీ ఇంట్లోనూ డాక్టర్లు తయారైపోతున్నారు. కరోనా లక్షణా లుంటే ఇది తాగండి...ఆ కషాయాన్ని రుచి చూడండి... ఫలానవన్నీ తింటే ఒంట్లో వైరస్ మాయమవటం ఖాయం... అంటూ అదే పనిగా సామాజిక మాధ్యమాల్లో వచ్చిన మెసేజ్‌లను కనీసం నిర్దారణ కూడా చేసుకోకుండా ఒకటే ఫార్వర్డ్ చేయటం షరా మామూలైంది. ఇంకొంతమంది ఒకడుగు ముందుకేసి... 'ఆక్సిజన్ లెవల్స్ పడిపోతే... వాము, ఇతర సుగంధ ద్రవ్యాలు కలిపి నూరి... ముక్కు దగ్గర పెట్టుకుంటే వెంటనే ఆ లెవల్స్ పెరుగుతాయి...' అంటూ ప్రవచించటం మొదలు పెట్టారు. బహుశా ఇలాంటి ఉచిత ప్రవచనాలు వినే కాబోలు... ఒక మండల విద్యాధికారి తన ముక్కులో నిమ్మరసం పిండుకున్నారు. ఆ తర్వాత ఆ రసం ఊపిరితిత్తులకు చేరటంతో గాలి ఆడక మరణించారు. ఈ చిట్కాలన్నీ నిజమైతే...ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఇన్ని ఆస్పత్రుల్లో లక్షలాది మంది కరోనా రోగులు ఎందుకు చేరుతున్నట్టు..? వారిలో వేలాది మంది ప్రాణాలు ఎందుకు కోల్పోతున్నట్టు..? వ్యాక్సిన్లు, ఇంజక్షన్లు, ఆక్సిజన్ కోసం జనం రోడ్ల వెంట ఎందుకు పరుగులు తీస్తున్నట్టు..? అందుకే వాట్సాప్ వీరులారా.. ఫేస్బుక్ ప్రేక్షకులారా.. ఇన్‌స్ట్రాగ్రామ్ యోధులారా.. ట్విటర్ పిట్టలారా... శాస్త్రీయంగా నిరూపిత మైన మెసేజ్‌లను, ప్రభుత్వం, వైద్యశాఖ, అధికారిక సంస్థలు ధృవీకరించిన సమాచారాన్ని మాత్రమే ఇతరులకు పంపి.. పుణ్యం కట్టుకోండి, తద్వారా జనానికి అవగాహన కల్పించండి. అంతేతప్ప శంకర్‌దాదా ఎంబీబీఎస్లాగా ఫోజు కొడుతూ... ప్రతీ ఫేక్ మెసేజ్‌ను ఫార్వార్డ్ చేస్తే... వాటిని చూసి మన స్నేహితులు, బంధువుల్లో కూడా ఎవరో ఒకరు, ఎప్పుడో ఒకప్పుడు 'ముక్కులో రసం పిండుకోవటం...' ఖాయం... ఆ తర్వాత మీ ఇష్టం... -బి.వి.యన్.పద్మరాజు