Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనగనగా ఒక తెలుగు రాజ్యం. ఆ రాజ్యానికి శేఖరవర్మ రాజు. శేఖరవర్మ సాధారణ రాజు కాదు. అంతకు ముందు ఉన్న ఉమ్మడి తెలుగు రాజ్యంలో తన ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందని పెద్ద ఎత్తున ప్రజలతో తిరుగుబాటు చేయించి, స్వతంత్రం ప్రకటించుకున్నాడు. ప్రజలు కూడా తమకు అన్యాయం జరుగుతుందని, వేరు పడితే లాభపడతామని చెప్పిన శేఖరవర్మ మాటలు నమ్మి ఆయనకు మద్దతునిచ్చి కొత్త రాజ్యానికి శేఖరవర్మనే రాజుగా ఎన్నుకున్నారు. శేఖరవర్మకు సన్యాసం మీద, మునుల మీద విశ్వాసం మెండు. వారి సలహా లేనిదే అడుగుతీసి అడుగువేయడు. ఒక యతీంద్రుడు శేఖరవర్మ జాతకాన్ని పరిశీలించి నీవు క్షీరాభిషేకం చేయించుకుంటే నీ పదవి శాశ్వితం అన్నాడు.
యతీంద్రుడు చెప్పింది శేఖరవర్మకు బాగా నచ్చింది. కానీ పాలాభిషేకం ఎలా చేయించుకోవాలో అర్థం కాలేదు. అదే ఆలోచిస్తూ నిద్దురపోయాడు. గాఢనిద్రలో తన ఇష్టదైవం యాదగిరి నర్సింహ్మస్వామి, చెంచులక్ష్మితో సహా ప్రత్యక్షమయ్యాడు! శేఖరవర్మ తన ఇష్టదైవానికి నమస్కరించాడు. ''దేవా! నన్ను కరుణించినందుకు సంతోషం! నాకొక వరమివ్వు'' అని అర్థించాడు.
''నాయనా! రామదాసు తర్వాత నీవే! అనాడు గోపన్న రాముడికి సొమ్ములు చేయించి, రామదాసు అయ్యాడు. ఈనాడు నీవు నాకు పెద్ద గుడి కట్టిస్తున్నావు. నీ కోరిక తీర్చటం నా బాధ్యత. ఏమి నీ కోరిక'' అని అడిగాడు నర్సింహ్మస్వామి.
''స్వామీ నాకు క్షీరాభిషేకం నిత్యం జరగాలి'' అని కోరుకున్నాడు శేఖరవర్మ.
నర్సింహస్వామి ఆశ్చర్యపోయి చెంచులక్ష్మి వంక చూశాడు. ''కానివ్వండి'' అన్నట్లు నవ్వింది చెంచులక్ష్మి.
''తథాస్తు! అయితే ఒక షరతు!'' అన్నాడు నర్సింహ్మస్వామి.
''మీ షరతులన్నీ తలదాలుస్తాను స్వామీ!'' అన్నాడు శేఖరవర్మ.
ఇది కలియుగం! అందువల్ల ఎవరూ తమకు ప్రయోజనం లేనిదే ఏమీ చేయరు. నేను గుడికట్టకపోతే నీ కల్లోకి వచ్చేవాడిని కాను. అందువల్ల నీవు ఏదైనా ఉపకారం చేస్తేనే నీకు ప్రజలు క్షీరాభిషేకం చేసేలా వరమిస్తున్నాను. క్షీరాభిషేకం నీ చిత్రపటానికి చేసినా, నీకే చేసిన ఫలితం వస్తుంది. అయితే ఒకే రోజు మూడుసార్లకి మించి నీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తే, నాలుగోసారి నుంచి పాలు నేరుగా నీ మీదే పడతాయి'' అని లక్ష్మితో సహా నరసింహ్మస్వామి అదృశ్యమయ్యాడు.
నిద్రలోంచి దిగ్గున లేచాడు శేఖరవర్మ. ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ ఉంది. తాను కట్టిస్తున్న గుడియొక్క పుణ్యం ఊరికే పోలేదని నమ్మాడు. తెల్లారేదాకా ఎదురుచూశాడు. తెల్లవారగానే సభ ఏర్పాటు చేశాడు.
''రాజ్యంలోని పారిశుధ్య కార్మికులు తమ జీతభత్యాలు పెంచమని పనులు మానేశారు. వారు ఎంతో పనిచేస్తున్నారు. కాబట్టి ఈ రాజధాని నగరంలోని పారిశుధ్య కార్మికులకు వేతనాలు పెంచుతున్నాను'' అని ప్రకటించారు.
శేఖరవర్మ ప్రకటన పారిశుధ్య కార్మికులకు ఎంతో ఆనందం కలిగించింది. వెంటనే శేఖరవర్మ చిత్రపటానికి రాజధానిలో పెద్ద ఎత్తున క్షీరాభిషేకం చేశారు.
గూఢచారులు ఈ సమాచారం శేఖరవర్మకు చేరవేశారు. రాజుకు పట్టరాని ఆనందం కలిగింది. కోశాధికారి వచ్చాడు. ప్రభూ! పారిశుద్ధ్య కార్మికులకు పెంచిన వేతనాలు విడుదల చేయమంటారా?'' అని అడిగాడు.
శేఖరవర్మ కోశాధికారిని పిచ్చివాడిని చూసినట్టు చూశాడు. ''నేను చెప్పేవరకు ఎవరికీ పెంచిన వేతనాలు విడుదల చేయొద్దు!'' అన్నాడు.
''రాజ్యంలో శాంతిభద్రతలు బాగుపడ్డాయని నివేదిక వచ్చింది!
''శాంతిభద్రతలకు కారణమైన రక్షకభటులకు ఒక నెల వేతనం అదనంగా చెల్లిస్తాం!'' ప్రకటించాడు శేఖరవర్మ.
''ప్రతి రక్షకభట నిలయం ముందు శేఖరవర్మ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. శేఖరవర్మ ఎంతో ఆనందించాడు.
రాజ్యంలో పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తలు వచ్చారు ''మాకు తక్కువ వేతనాలు ఉన్నాయి. మాకూ వేతనాలు పెంచండి ప్రభూ!'' విజ్ఞప్తి చేశారు. వారందరి చేతుల్లో పాలడబ్బాలు సిద్ధంగా ఉన్నాయి. వాటిని గమనించి శేఖరవర్మ తన ముక్కు చాటున ముసి ముసిగా నవ్వుకున్నాడు. ''ఇది మన రాజ్యం. మీకు వేతనాలు తప్పక పెంచుతాను!'' అన్నాడు.
ఇక ఆరోగ్య కార్యకర్తలు క్షణం కూడా ఆలస్యం చేయలేదు. వెంటనే రాజప్రసాదం ముందుకు దౌడు తీశారు. తమ వెంట తెచ్చుకున్న పాలడబ్బాలతో రాజు చిత్రపటానికి అభిషేకం చేశారు. రాజ ప్రాసాదంపై నుంచి ఇదంతా ఆనందంతో శేఖరవర్మ పరికించాడు.
రాజ్యంలో పని చేస్తున్న పారిశుద్ధ కార్మికులు వచ్చారు. కాని ద్వారపాలకులు వారిని రాజప్రసాదంలోకి రానివ్వలేదు. ఒకరిద్దరు ప్రతినిధులను మాత్రం లోనికి పంపారు. ''ప్రభూ రాజధానిలో పని చేస్తున్న మాతోటి పారిశుధ్య కార్మికులకు జీతాలు పెంచారు. మేమంతా ఒకటే కదా! మాకూ వేతనాలు పెంచండి!'' అని వేడుకున్నారు.
శేఖరవర్మ ఉలకలేదు! పలకలేదు! కాసేపు చూసి ప్రతినిధులు బయటకు వచ్చారు. ''రాజు గారు మన మొర ఆలకించారు!'' అని ప్రకటించారు. అంతే క్షీరాభిషేకం మొదలయ్యింది.
ఉపాధ్యాయ ప్రతినిధులు, రాజోద్యోగ ప్రతినిధులు వచ్చి శేఖరవర్మను కలిశారు. వారికి మంచి భోజనం పెట్టించాడు శేఖరవర్మ. కడుపునొప్పి వచ్చేదాకా భోజనం చేసి బయటకు వచ్చి రాజు చిత్రపటానికి పాలాభిషేకం చేయాలంటూ ఉపాధ్యాయులకు, రాజోద్యోగులకు సమాచారం పంపారు. ఉద్యోగులకు గందరగోళమయ్యింది. పాలాభిషేకం ఎందుకు చెయ్యమన్నట్టు అని రందిపడుతూనే చిత్రపటానికి పాలుపోశారు.
ఇక రవాణా ఉద్యోగుల వంతు వచ్చింది. కొందరిని పిలిపించుకుని మంచి భోజనాలు ఏర్పాటు చేశాడు శేఖరవర్మ. ఎప్పుడూ పూటకూళ్ళ ఇళ్ళలో తినే రవాణారంగ ఉద్యోగులకు ఏకంగా రాజుతో భోజనం చేశాక, రవాణా ఉద్యోగులు గాల్లో తేలిపోయారు. మీకు ''అతి తక్కువ జీతాలు ఉన్నాయి. ఇది మనరాజ్యం మనమే జీతాలు పెంచుకుందాం!'' అని శేఖరవర్మ హామీ ఇచ్చాడు. ఆనందం పట్టలేని రవాణా ఉద్యోగులు ఇండ్లకు వెళ్ళి, ఇంట్లోఉన్న పాలు తెచ్చి శేఖరవర్మ చిత్రపటానికి భారీగా క్షీరాభిషేకం చేశారు. శేఖరవర్మ ఆనందంగా నిద్రపోయాడు. ఎంతసేపు నిద్రపోయాడో కాని దిగ్గున లేచాడు. తన మీద పాలు పడుతూ ఉన్నాయి. శేఖరవర్మకు నిద్రమత్తు వదిలింది. పాలాభిషేకాన్ని కాసేపు ఆస్వాదించాడు. కాని ఆ తర్వాత భరించలేకపోయాడు. పాలాభిషేకం ఆగేలా కన్పించటం లేదు. తాను వద్దన్నా వినకుండా కోశాధికారి జీతాలు పెంచి ఇచ్చాడేమో! అందుకే ఉద్యోగులంతా సంతోషంగా పాలాభిషేకం చేస్తున్నారేమోనని అనుమానపడి కోశాధికారిని పిలిచాడు. ఎంతోసేపటికి గాని కోశాధికారి వచ్చాడు.
''నేను చెప్పేదాక జీతాలు పెంచరాదని ఆదేశించితి కదా! ఎందుకు పెంచితివి!'' ఆగ్రహంగా ప్రశ్నించాడు శేఖరవర్మ.
''అయ్యో! ప్రభూ నేను జీతాలు పెంచి ఇవ్వలేదు! కోశాగారం నిండుకుంది. అప్పు ఇచ్చే పుణ్యాత్ములు ఉన్నారేమోనని వెదుకుటకు వెళ్ళితిని'' విన్నవించుకున్నాడు కోశాధికారి.
''శేఖరవర్మ ఆశ్చర్యపోయాడు. తాను ఎవరికీ ఏమాట ఇవ్వలేదు. అయినా ఎందుకు పాలాభిషేకం చేస్తున్నారని ఆలోచిస్తున్నాడు. మరోపక్క శేఖరవర్మ మీద పాలు ధారగా కురుస్తూనే ఉన్నాయి. రాజుకు ఊపిరి ఆడటం లేదు.
ఈలోగా ఒక అధికారి వచ్చాడు. ''ప్రభూ! మన రాజ్యంలో ఒకవారం రోజుల పాటు పాలాభిషేకం చేయాలని నిర్ణయించుకున్నారట!'' విన్నవించుకున్నాడు.
''ఎవరు? ఎందుకు?'' ధారగా పడుతున్న పాలతో ఉక్కిరి బిక్కిరి అవుతూ ప్రశ్నించాడు.
''మన రాజ్యంలోని పాలవ్యాపారులు ప్రభూ! మీరు రాజయ్యాక పాలకు ఎక్కడలేని గిరాకీ వచ్చిందంట. పసిపిల్లలకు, ఎదిగే పిల్లలకు, తేనీరుకు కూడా దొరకకుండా ఎగబడి కొనుక్కుని మీ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారట! అందుకే కృతజ్ఞతగా ఎవరికీ అవకాశం ఇవ్వకుండా పాలవ్యాపారులే వారంరోజుల పాటు తమ చిత్రపటానికి అభిషేకం చేయాలని నిర్ణయించుకుని ఈ రోజు పొద్దుటి నుంచే అమలు చేస్తున్నారు'' అని వివరించాడు.
'ఇదంతా వినే పరిస్థితిలో శేఖరవర్మ లేడు. తనపై పడుతున్న పాలధార నుంచి తప్పించుకుంటానికి రాజప్రసాదమంతా పరుగెత్తాడు. కాని లాభం లేదు. పాలాభిషేకం నుంచి తప్పించుకోలేకపోయాడు. చివరి ప్రయత్నంగా పూజామందిరంలోకి వెళ్ళి తన ఇష్టదైవమైన నర్సింహ్మస్వామి విగ్రహాన్ని బిగ్గరగా పట్టుకున్నాడు.
''స్వామీ! నన్ను కాపాడు! పాహిమాం!'' అని వేడుకున్నాడు. దాంతో పాలాభిషేకం ఆగింది. లక్ష్మీ, నరసింహులు ప్రత్యక్షమయ్యారు.
''నాకీ క్షీరాభిషేకం వద్దే వద్దు! నన్ను పాల నుంచి కాపాడు స్వామీ!'' మొరపెట్టుకున్నాడు శేఖర్ వర్మ.
''ఇదేమి భక్తా! నీవు కోరిన కోరికే కదా! తీర్చితిమి! ఇప్పుడు వద్దందువేమి?'' ప్రశ్నించాడు నర్సింహ్మస్వామి.
''కోరింది నిజమే! కాని తట్టుకోలేకపోతున్నాను!'' అన్నాడు శేఖరవర్మ.
''నీవు ఎంత తప్పుచేశావ్, ఇప్పటికైనా బోధపడినదా! నీవు రాజువు, ప్రజల సమస్యలు తీర్చవలసిన బాధ్యత నీది. కాని బాధ్యతను మర్చిపోయి, అధికారం శాశ్వతం కావాలని ఆశపడ్డావు. ప్రజల సమస్యలు పరిష్కరించకుండానే, గారడీ మాటలతో కాలయాపన చేస్తున్నావు. నీకు నమ్మినబంట్లుగా ఉండే భృక్యులతో క్షీరాభిషేకం చేయించుకుంటున్నావు. పసిపాపల ప్రాణాలు నిలుపవలసిన పాలు వృధాగా వీధులపాలై, మట్టిలో కలసిపోతున్నాయి. మరోపక్క పాలులేక పసిపిల్లలు ప్రాణాలు కోల్పోతుంటే, ఇంకా క్షీరాభిషేకాలు కావాలని కోరుకోవటానికి నీకు సిగ్గుగా లేదూ! నీకు ఇష్టమని పాలాభిషేకం చేస్తేనే తమ సమస్యలు పరిష్కరిస్తావని, అమాయక ప్రజలు భావించేస్థాయికి నీ పాలన దిగజారిపోయింది! ఇప్పటికై బుద్ధి తెచ్చుకో!'' అని ఆగ్రహంగా పలికి లక్ష్మీ నరసింహస్వామి అంతర్థానమయ్యారు.
ఉషా కిరణ్