Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విస్మరిస్తే వినాశనమే
1939 నుంచి 1945 వరకు ఆరేండ్లపాటు అత్యంత భయానకమైన రెండవ ప్రపంచయుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో 8.5కోట్ల మంది చనిపోయారు. 10 కోట్లమందికి పైగా నిర్వాసితులయ్యారు. యుద్ధం 1945 మే 9న నాటి సోషలిస్టు సోవియట్ రష్యా ఎర్రసైన్యం హిట్లర్ జర్మనీని ఓడించి జర్మన్ పార్లమెంట్‌పై ఎర్రజెండా ఎగురవేయడంతో ముగిసింది. దాదాపు 8 దశాబ్దాలు గడిచాయి. తిరిగి ఆ స్థాయిలో ప్రపంచ యుద్ధం అయితేరాలేదు కానీ భయానకమైన యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. లక్షలాది మంది అమాయక జనం బలవుతూనే ఉన్నారు. పొట్టచేతపట్టుకుని కోటాను కోట్ల మంది తమ దేశాలను వదిలిపెట్టి నిర్వాసితులుగా ఇతర దేశాలలో తలదాచుకుంటున్నారు. నిర్వాసితుల సమస్య నేడు ఓ ప్రపంచ వ్యాపిత సమస్యగా మారింది. పరిష్కారం దొరకని సంక్షోభంగా తయారయింది. రెండవ ప్రపంచ యుద్ధం నాడు ఉన్న విధంగానే నేడు కూడా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ప్రపంచాన్ని చుట్టుముట్టింది. పేదరికం, ఆకలి, అంటువ్యాధులు, నిరుద్యోగం, పర్యావరణ సమస్యలు భూమండలాన్ని ఆవహించాయి. ఈ నేపథ్యంలో రెండవ ప్రపంచ యుద్ధం అందిస్తున్న గుణపాఠాలను విస్మరించటం వలనే మానవాళి నేడు వినాశనపుటంచుకు చేరుకున్నది అనటం అతిశయోక్తికాదు.
సామ్రాజ్యవాద మాయాజాలం
మొదటి ప్రపంచయుద్ధం (1914-18) సామ్రాజ్యవాదుల సృష్టి. భూమండలాన్ని పంచుకోవడంలో జరిగిన యుద్ధాలు చిలికిచిలికి ప్రపంచయుద్ధంగా తయారయ్యాయి. యుద్ధం ముగిసిన వెంటనే ఉద్రిక్తతలు తగ్గించడానికి 1919లో నానాజాతి సమితి (లీగ్ ఆఫ్ నేషన్స్) ఏర్పాటు చేశారు. కానీ ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించడంలో, చివరకు రెండవ ప్రపంచ యుద్ధాన్ని నివారించడంలో విఫలమైందని, ఆ ఉద్రిక్తతలకూ ప్రపంచ యుద్ధానికీ కారణమైన సామ్రాజ్యవాదులే నానాజాతి సమితిని రద్దుచేసి 1945లో ఐక్యరాజ్యసమితిని ఏర్పాటు చేశారు. రెండవ ప్రపంచయుద్ధం సోషలిస్టు రాజ్యం సోవియట్ రష్యా వీరోచిత పోరాటం వల్ల ముగిసింది. ప్రపంచం యావత్తూ సోవియట్ రష్యాను ప్రశంసించడం భరించలేని అమెరికా యుద్ధం ముగిసిన వెంటనే జపాన్‌లోని హిరోషిమా నాగసాకీ పట్టణాలమీద అణుబాంబులు కురిపించి సర్వనాశనం చేసింది. ఆ విధంగా రెండవ ప్రపంచ యుద్ధం జపాన్‌పై అమెరికా అణుబాంబుల దాడితో బుగ్గిపాలు చేసి మిగిల్చిన బూడిద పునాదుల మీద తిరిగి అదే అమెరికా ఆధిపత్యంతో ఐక్యరాజ్యసమితి ఏర్పడింది. అందువల్ల ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్సరం రెండవ ప్రపంచ యుద్ధం గురించి దాని గుణపాఠాలగురించి చర్చలు నిర్వహిస్తూ ఉంటుంది. తీర్మానాలు చేస్తుంది. గత సంవత్సరం తీర్మానంలో ''మతం జాతుల పేరిట సృష్టించబడే అసహనం, విదేశాలపై విద్వేషం, ఎంతటి భయానకర పరిస్థితులను సృష్టిస్తుందో మనకు రెండవ ప్రపంచ యుద్ధ చరిత్ర చూపిస్తున్నది. అందువలన ప్రభుత్వాలు ఇక తమ దేశాలలో ఎటువంటి అసహన రాజకీయాలకు తావివ్వకుండా చూడాలి'' అని చెప్పబడింది. ''ఈ రోజు కరోనా మహమ్మారి ఒక్కటే ప్రపంచ వ్యాప్త సమస్య కాదు. జాతీయ ఉన్మాదం, అసహనం, ఆర్థిక ఆసమానతలు, పర్యావరణ విధ్వసం, పేదరికం, ఆకలి, యుద్ధాలు వంటివి ప్రపంచ వ్యాప్త సమస్యలై కూర్చున్నాయి'' అని కూడా ఆ తీర్మానంలో పేర్కొనడం జరిగింది. అయితే గత 75సంవత్సరాలుగా ఐక్యరాజ్యసమితి తీర్మానాలకూ, ఆచరణకూ పొంతలేకపోవడం, ప్రత్యేకించి అమెరికా వంటి సామ్రాజ్యవాద దేశాలు తీర్మానాలు ఉల్లంఘించడంతో ఐక్యరాజ్యసమితి కూడా విఫలమైందని సర్వత్రా వినపడుతోంది. ఏమైనా రెండవ ప్రపంచ యుద్ధ గుణపాఠాలను చిత్తశుద్ధితో పట్టించుకోకపోతే వినాశనం తప్పదు.
యుద్ధాలకు సామ్రాజ్యవాదమే కారణం
యుద్ధాలు లేకుండా సామ్రాజ్యవాదం మనజాలదు. అందుకే సోషలిస్టు రష్యా అధినేత కామ్రేడ్ స్టాలిన్ ''ప్రపంచ యుద్ధాలను నివారించాలంటే సామ్రాజ్యవాదాన్ని అంతం చేయాల్సి ఉంటుంది'' అని ప్రకటించాడు. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన పదిసంవత్సరాలకే మళ్ళీ దురాక్రమణలను, యుద్ధాలను సామ్రాజ్యవాద దేశాలు ప్రారంభించాయి. జపాన్ మంచూరియాను, చైనాలో అత్యధిక భాగాన్ని ఆక్రమించుకున్నది. ఇటలీ అల్బేనియాను, ఇతియోపియాను ఆక్రమించుకున్నది. జర్మనీ గ్రీస్‌ని, యుగోస్లావియాని, నార్వేని, డెన్మార్క్‌ని, బెల్జియంని, హాలెండ్ని ఆక్రమించుకున్నది. ఇంగ్లండ్ అప్పటికే మనలాంటి దేశాలతో సహా అనేక దేశాలలో వలస పాలన సాగిస్తున్నది. వాస్తవానికి రెండవ ప్రపంచ యుద్ధం జర్మనీ, రష్యాల మధ్య ప్రారంభం కాలేదు. జర్మనీ, ఇటలీ, జపాన్ ఒక శిబిరంగానూ, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, అమెరికా మరో శిబిరంగానూ యుద్ధం ప్రారంభమైంది. కానీ ఈ రెండు శిబిరాలకూ తొలి కార్మిక రాజ్యమైన సోవియట్ రష్యాను యుద్ధంలోకి లాగి అంతం చేయాలనే ఆశ ఉంది. ప్రపంచ యుద్ధానికి ఒక వారంరోజుల ముందు జర్మన్ అధినేత హిట్లర్ దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ''పోలెండ్‌ని అతిత్వరలో జనాభా రహితంగా చేసి జర్మన్లతో నింపుతాము. సోవియట్ రష్యాకు కూడా అదే గతి పట్టిస్తాము. సోషలిస్టు రష్యాన్ని ధ్వంసం చేయడంతో జర్మన్ యొక్క ప్రపంచ పాలనకు పొద్దు పొడుస్తుంది'' అని ప్రకటించాడు. జర్మనీ వ్యతిరేక శిబిరంలో ఉన్న అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ పాలకుల మనస్సులో కూడా అదే ఉంది. తర్వాత కాలంలో అమెరికా అధ్యక్షుడిగా మారిన హారి ట్రూమన్ ''ఒక వేళ జర్మనీ రష్యామీద విజయం సాధిస్తుంటే రష్యాకి సహాయం చేద్దాం.. రష్యా గెలుస్తుంటే జర్మనీకి సహాయం చేద్దాం.. ఆ విధంగా రెండు దేశాలు ఎంత ఎక్కువగా వాళ్ళ జనాలను చంపుకుంటే మనకు అంత మంచిది'' అన్న ప్రకటన వారి కపటత్వానికి అద్దం పడుతుంది. నిజానికి రష్యా కచ్ఛితంగా ఓడిపోతుందని, కమ్యూనిజం ధ్వంసం చేయబడుతుందని ఈ క్రమంలో జర్మనీ కూడా బలహీనపడి ప్రపంచానికి ఒక ప్రమాదంగా లేని స్థితి వస్తుందని సామ్రాజ్యవాద దేశాధినేతలు గట్టిగా నమ్మారని సమ్మల్వెల్స్ అనే ప్రభుత్వాధినేత తన జ్ఞాపకాల్లో రాశారు. ఆ విధంగా మొదటి ప్రపంచ యుద్ధంలో సామ్రాజ్యవాద శిబిరాల్లో లేని సోషలిస్టు రాజ్యం రష్యాను అంతం చేయాలన్న ఉమ్మడి కోరిక రెండవ ప్రపంచ యుద్ధం ఆరంభం నుండి చివరి దాకా, యుద్ధానంతరం కూడా కొనసాగుతూ వచ్చింది.
సోషలిజం అంతానికే ఫాసిజం సృష్టి
మొదటి ప్రపంచ యుద్ధం ముగింపునాటికి (1917) రష్యాలో ఏర్పడ్డ తొలిసోషలిస్టు రాజ్యం అనతికాలంలోనే అగ్రరాజ్యం అమెరికాకు ధీటుగా ఎదగటం ప్రారంభించింది. పెట్టుబడిదారీ ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే సోవియట్ రష్యా పంచవర్ష ప్రణాళికలతో దూసుకుపోతూ ప్రపంచ దేశాలను ఆకట్టుకుంటున్నది. పైగా సామ్రాజ్యవాద దోపిడీకి గురవుతున్న దేశాలన్నింటికీ సోవిట్ రష్యా మద్దతు ప్రకటించింది. అనేక దేశాలలో కమ్యూనిస్టుపార్టీలు ఏర్పడ్డాయి. విప్లవ కార్మిక ఉద్యమాలు ఊపందుకున్నాయి. ఈ దశలో కమ్యూనిస్టు సిద్ధాంత విస్తరణను, సోషలిస్టు ఉద్యమాల వెల్లువను నిలువరించడానికే సామ్రాజ్యవాదం ''ఫాసిస్టు'' సిద్ధాంతాన్ని సృష్టించింది. 1920లో ఇటలీలో ముస్సోలినీ, 30లలో నాజీయిజం పేరిట జర్మనీలో హిట్లర్ పచ్చి అభివృద్ధి నిరోధక విద్వేషపూరిత విధ్వంసం ప్రారంభించారు. కనీవినీ ఎరుగని పైశాచికత్వంతో దాడులు చేశారు. స్పెయిన్, బెల్జియం, ఇతర అనేక తూర్పుయూరప్ దేశాల పాలకులు ఫాసిస్టు తరహా పాలన మొదలుపెట్టారు. నరరూప రాక్షసుడు హిట్లర్ వీటిని పరాకాష్టకు తీసుకుపోయాడు. ప్రపంచ ఆధిపత్యం కోసం తెగబడ్డాడు. ఈక్రమంలో ఈ యుద్ధం కమ్యూనిజం - ఫాసిజంల మధ్య యుద్ధం అనే రూపాన్ని సంతరించుకున్నది.
గ్రేట్ డిప్రెషన్
1929లో నేటి లాగానే మొత్తం పెట్టుబడిదారీ ప్రపంచం అతీగతీలేని తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నది. ఆర్థిక మాంద్యం దేశ దేశాలను చుట్టుముట్టింది. ఈ నేపథ్యంలో బడా పారిశ్రామిక దేశాలు వెనకబడిన దేశాలను కొల్లగొట్టుకుని తినటం పెరిగింది. ప్రపంచవ్యాప్తంగానే ప్రజల జీవన పరిస్థితులు దారుణంగా దిగజారాయి. ఈ ఆర్థిక పరిస్థితులు జాతుల మధ్య, దేశాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడానికి అనువైన వాతావరణం సృష్టించాయి. ప్రజల సమస్యలు పరిష్కరించలేని దోపిడీ పాలకులు అనివార్యంగా ఉన్మాదపూరితమైన ఫాసిస్టు పోకడలను అందిపుచ్చుకున్నారు. కనీవినీ ఎరుగని తీరిలో ప్రజా ఉద్యమాలపైన నిరంకుశంగా వ్యవహరించారు. ప్రగతిశీల శక్తులను, శాస్త్రీయ దృక్పథాన్ని, ఆధునిక భావాలను క్రూరంగా అణచివేసి వాటిస్థానంలో అత్యంత మూర్ఖపు ఆలోచనలను, అశాస్త్రీయ పద్ధతులను ముందుకు తెచ్చారు. కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ 7వ మహాసభలో ప్రధాన కార్యదర్శి జార్జి డిమిట్రోల్ పరిస్థితిని వివరిస్తూ... ''అన్ని శాస్త్రాలను పథకం ప్రకారం ధ్వంసం చేయటమే ఫాసిజం'' అని ప్రకటించాడు. అలాగే జర్మన్ కమ్యూనిస్టు యోధురాలు క్లారా జెట్కిన్ ''ఫాసిజం సామ్రాజ్యవాదుల చేతిలోని కావలికుక్క'' అని సరిగ్గా అభివర్ణించారు. అంటే ఫాసిజం యొక్క వర్గపునాది సామ్రాజ్యవాద ద్రవ్య పెట్టుబడివారీ వర్గాలని ఆమె స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల పర్యావసానంగా రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఎడతెరిపిలేకుండా ఆరుసంవత్సరాలు సాగింది.
యుద్దాన్ని అంతం చేసింది సోషలిజమే...
ఈ భయంకరమైన యుద్ధానికి చమరగీతం పాడి తెరదించింది సోషలిజమే. కానీ ఇప్పటికీ ఈ వాస్తవం మింగుడుపడక పాలకవర్గాలు వారి కొమ్ముగాసే సిద్ధాంతకారులు, అంటకాగే మీడియా ఈ విషయాన్ని అంగీకరించవు. కానీ యుద్ధం చివరి దశకు వచ్చిన సందర్భంలో జనవరి 9న చర్చిల్ (ఇంగ్లండ్ అధినేత) స్టాలిన్‌కి రాసిన మెసేజ్‌లో ''మీ వీర సైనికుల పోరాట పటిమ, సామర్థ్యం అన్ని సైన్యాలను ఉత్సాహపరుస్తున్నాయి. గెలుస్తామన్న నమ్మకాన్ని కలిగిస్తున్నాయి'' అని పేర్కొన్నారు. అలాగే అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్ ''రష్యన్ ఎర్రసైన్యం ఆస్ట్రియా, వియన్నా సైన్యాలను కుప్పకూల్చి జర్మనీపై విజయం సాధిస్తుందని స్పష్టమవుతున్నది'' అని పొగిడాడు. అలాగే వారు స్టాలిన్‌కు యుద్ధం అయిన వెనువెంటనే యిచ్చిన తంతిలో ''నాజీ నియంతను మట్టికరిపించి మీ గడ్డమీద నుంచి తరిమి తరిమికొట్టి ఓడించినందుకు మీకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము'' అని పేర్కొన్నారు. సోషలిస్టు రష్యా 2 కోట్ల మంది తమ దేశ సైన్యం, పౌరుల బలిదానంతో నాజీ జర్మనీని అంతం చేసింది. నాడు ఐరోపానే కాదు, హిట్లర్ సృష్టిస్తున్న విధ్వంసం నుంచి విలవిలలాడిన యావత్ ప్రపంచం ఊపిరి పిల్చుకుంది. సోషలిస్టు రష్యా, ఎర్రసైన్యం లేకుంటే రెండవ ప్రపంచయుద్ధానికి అంతం లేదు. ప్రపంచ మానవాళికి విముక్తిలేదు అన్నది వాస్తవం.
నేడు రష్యాలో సోషలిస్టు వ్యవస్థ కనుమరుగైంది. కానీ ప్రతి సంవత్సరం మే 9న ప్రపంచం యావత్తూ నాజీయిజంపై (ఫాసిజంపై) విజయం సాధించిన రోజుగా విక్టరీడే జరుపుకుంటున్నారు.
గుణపాఠాలు
నేడు మక్కీకి మక్కీ అవే పరిస్థితులు లేకపోయినా నాటికీ, నేటికీ అనేక పోలికలు కనపడుతున్నాయి. మొదటిది ఆర్థిక సంక్షోభం. రెండవది పెట్రేగుతున్న ఫాసిస్టు శక్తులు. మూడవది పైరెండిటి పర్యవసానంగా దేశాల మధ్య పెరుగుతున్న విద్వేషాలు. 2007-08లో ప్రారంభమైన ఆర్థిక సంక్షోభం పెట్టుబడిదారీ ప్రపంచానికి కాలం చెల్లిందన్న సంకేతాలు అందిస్తున్నదని ఆర్థికశాస్త్ర నిపుణులు బలంగా వాదిస్తున్నారు. వారి వాదనల్లో అతిశయోక్తులు ఉన్నాయనుకున్నా నిరుద్యోగం, ఆకలి, పర్యావరణం, పేదరికం, నిర్వాసితుల వంటి ఏ సమస్యనూ ఈ వ్యవస్థ పరిష్కరించగలిగే స్థితి లేదన్నది మనదేశంతో సహా దేశ దేశాల అనుభవం. ఇక ప్రత్యామ్నాయం సోషలిజమే. ప్రపంచం ఆవైపు నడవకతప్పదు. అందుకు సోషలిస్టు శక్తులు నడుం బిగించాల్సిందే. అలాగే ఆర్థిక సంక్షోభం తీవ్రమవుతున్న కొద్దీ రాజకీయంగా ఉదారవాద ప్రజాస్వామ్యం కండ్లు తేలేస్తున్నది. ఆ స్థానంలోకి పచ్చి మితవాద, ఫాసిస్టు తరహా శక్తులు ఎగబాకుతున్నాయి. ఈ క్రమాన్ని నిలువరించే శక్తి కూడా, ఎంత బలహీన పడ్డా వామపక్ష ప్రజాతంత్ర శక్తులకే ఉంటుంది. ఇది ప్రపంచాను భవం. రెండవ ప్రపంచ యుద్ధం నేర్పుతున్న గుణపాఠం కూడా ఇదే. అందువలన కునారిల్లుతున్న పెట్టుబడిదారీ వ్యవస్థను సంపూర్ణంగా ఓడించి, దాని స్థానంలో కులం, మతం, జాతి, ప్రాంతం, భాష పేరు మీద మనిషిని మనిషి దోపిడీ చేయని ఓ నూతన ప్రపంచాన్నీ, అందులో భాగంగా ఓ నూతన భారతదేశాన్నీ నిర్మించడమే కర్తవ్యం.
-ఆర్. రఘు