Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా కల్లోలంలో గర్భిణి స్త్రీలు కరోనా సోకినా, కరోనాకు దూరంగా ఉన్నా పలు శారీరక మానసిక అనారోగ్యాలకు గురి కావలసిన విషమ పరిస్థితి ఏర్పడింది. గర్భిణి స్త్రీలపై కరోనా మహమ్మారి ప్రత్యేక దుష్ప్రభావం చూపుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ, ఆ అమాయక మహిళలు, ముఖ్యంగా పేదలు సంతోష క్షణాలకు దూరంగా భయాందోళనలకు దగ్గరగా గడపాల్సిన అగత్యం ఏర్పడింది. కోవిడ్-19 విజృంభనతో ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖల ప్రాధాన్యతలు మారడం, గర్భిణిలకు అందాల్సిన ప్రత్యేక సదుపాయాలు అందక పోవడం జరుగుతున్నది. భారత్, చైనా గర్భిణి స్త్రీలపై చేసిన పరిశోధనల్లో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. గర్భిణి స్త్రీలు, ప్రసవమైన మహిళలకు కరోనా సోకుతుందనే భయంతో అతి జాగ్రత్తగా ప్రత్యేక గదుల్లో, కుటుంబ సభ్యులకు దూరంగా ఒంటరిగా ఉంచడంతో వారిలో శారీరక మానసిక ఒత్తిడి పెరుగుతూ, గర్భంలోని బిడ్డ పెరుగుదలపై కూడా దుష్ప్రభావం పడుతున్నదని తేలింది. కరోనా విధించిన నిబంధనలతో, రవాణా వ్యవస్థలు ఆగిపోవడంతో గర్భిణి స్త్రీలు, ముఖ్యంగా గ్రామీణ మహిళలు నియమిత వైద్య పరీక్షలు పొందలేక పోవడం జరుగుతున్నది. ప్రభుత్వ ప్రయివేటు ఆసుపత్రులు కరోనా వార్డులుగా మారడం, ఆసుపత్రుల్లో కరోనా సోకుతుందనే భయంతో గర్భిణులు నెలవారీ పరీక్షలకు దూరం ఉండడం జరుగుతున్నది. దీనికి తోడుగా ప్రసవ సమయంలో కరోనా భయం, నవజాత శిశువులకు సమయానుసారం టీకాలు ఇప్పించడం కష్టం అవుతున్న కారణంగా అంటువ్యాధులు పెరిగే అవకాశాలు అధికం అయ్యాయి.
గర్భిణి స్త్రీలను, నవజాత శిశువులను కాపాడుటలో ప్రభుత్వ వైద్య వ్యవస్థ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవలసిన సమయమిది. కరోనా కాలంలో గర్భిణి స్త్రీలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఏర్పడింది. పరిస్థితులను బట్టి గర్భిణులకు టెలిమెడిసిన్, గహాల వద్ద పరీక్షలు చేసేలా ప్రభుత్వాలు కృషి చేయాలి. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో జరగాల్సిన ప్రసవాలు ఇండ్లలోనే జరగడం, సుశిక్షితులైన మంత్రసానులు అందుబాటులో లేకపోవడంతో తల్లి, బిడ్డల ఆరోగ్యాలకు ప్రమాదం ఏర్పడుతున్నది. దీనితో ప్రసవ సమయాన తల్లి పిల్లల మరణాలు పెరిగే దుస్థితి వచ్చింది. కరోనా విపత్తు సమయాన్ని దృష్టిలో ఉంచుకొని గర్భిణి స్త్రీల బీపీ, షుగర్ లాంటి పలు పరీక్షలతో పాటు గర్భంలో ఎదుగుతున్న బిడ్డ ఆరోగ్యా పరీక్షలను కూడా గ్రామాల్లోనే నిర్వహించే ప్రయత్నాలు చేయాలి. పితృస్వామ్య వ్యవస్థ రాజ్యమేలుతున్న భారత్‌లో గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు ప్రత్యేక ప్రాధాన్యతలు లేనందున పోషకాహారం అందడం సత్యదూరం అయ్యింది. వారికి అత్యవసరమైన ఐరన్, ఫోలిక్ ఆసిడ్ లాంటి పలు ఔషధాలను ఇండ్లకు సరఫరా చేసే యంత్రాంగం ఏర్పాటు చేయాలి. కరోనా కాలానికి తగిన ఆరోగ్య వసతులను తక్షణమే కల్పించని యెడల గర్భిణులు, గర్భంలో బిడ్డలు, నవజాత శిశువులు, పాలిచ్చే తల్లుల ఆరోగ్యం ప్రమాదంలో పడవచ్చని ప్రభుత్వాలు, పౌర సమాజం గుర్తుంచుకోవడమే కాకుండా వారిని రక్షించుకునే ప్రయత్నాలు వెంటనే చేపట్టాలి.
డాక్టర్ బి. మధుసూదన్‌రెడ్డి,
సెల్: 9949700037