Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతం శాసనసభ ఎన్నికలు ముగిసి నూతన ప్రభుత్వాలు ఏర్పాటవుతున్నాయి. తమిళనాడు మినహా మిగిలిన రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలే తిరిగి గెలిచాయి. పుదుచ్చేరిలో ప్రభుత్వం మారినా అదే నేతలు పార్టీలు మారి కొత్త రూపంలో వచ్చారు. అన్నిటిలోకి చారిత్రాత్మకమైంది కేరళలో ఎల్డీఎఫ్ పునరాగమనం కాగా ఎక్కువ నాటకీయంగా కనిపించేది పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఘన విజయం. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా ప్రత్యక్షంగా మకాం వేసి ఆ రాష్ట్రం కైవశం చేసుకోవడానికి శతవిధాల ప్రయత్నించినా సఫలం కాలేకపోయారు. కాంగ్రెస్ వామపక్షాలు దెబ్బతిన్న ఫలితంగా బీజేపీ పెద్ద ప్రతిపక్షంగా రావడమే ఘన విజయమని ఇప్పుడు చెబుతున్నారు. వాస్తవానికి ఎన్నికలు ఎనిమిది దశల్లో జరపడంతో సహా బీజేపీ శ్రుతిమించిన ఎత్తుగడలు, హిందూత్వ కార్డును ప్రయోగించడం మోడీ రవీంద్రనాథ్ ఠాగూర్ వేషాలు వేయడం, తృణమూల్ నుంచి విపరీతంగా ఫిరాయింపులు ప్రోత్సహించడం ఇలాటివన్నీ బెంగాలీలలో నిరసన పెంచాయి. మమత పాలనపై ప్రజలకుి అనేక ఫిర్యాదులున్నా పక్కన పెట్టి ఆమెకే పెద్ద ఎత్తున ఓటేశారు. నందిగ్రామ్‌లో ఆమె ఓడిపోవడం ముఖ్యమంత్రి కావడానికి ఆటంకం కాలేదు గాని అందులోని రాజకీయ సంకేతం విస్మరించరానిది. బీజేపీకి, మోడీ షా ద్వయం దూకుడుకు దురహంకారానికి బెంగాల్ తిరస్కరణగానే ఈ ఫలితాలను పరిగణించాల్సి ఉంటుంది,
కేరళ, తమిళనాడు ప్రత్యేకతలు
ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ఒకటి తర్వాత ఒకటి వంతుల వారిగా గెలుస్తూ వచ్చిన కేరళలో నలభై ఏండ్ల వరవడిని తిరగరాసి పినరాయి విజయన్ నాయకత్వంలో ఎల్డీఎఫ్ మళ్లీ విజయం సాధించడం, తమిళనాడులో స్టాలిన్నాయకత్వంలోని డీఎంకే విజయభేరి మోగించడం కూడా మోడీ ప్రభుత్వ ఏకపక్ష పోకడలకు ఎదురుదెబ్బలు. రాష్ట్రాల హక్కుల కోసం జరిగే పోరాటానికి ఊతమిచ్చే విజయాలు. కేరళ దేశానికి మొదటి ప్రతిపక్ష ప్రభుత్వాన్ని ఇచ్చిన రాష్ట్రం కాగా తమిళనాడు తొలి ప్రాంతీయ పార్టీగా డీఎంకేకు పట్టం కట్టిన రాష్ట్రం, అన్నాడీఎంకే పునాదితో తను పాగా వేయాలని జయలలిత అనారోగ్యం నాటి నుంచి బీజేపీ చాలా పాచికలు వేసింది. రజనీకాంత్‌ను తేవాలని ప్రయత్నించి విఫలమైంది. స్టాలిన్ ఘన విజయం సాధించగా అన్నాడీఎంకే కూడా గౌరవ ప్రదంగా బయిటపడటం, దాని సాయంతో బీజేపీ నాలుగు స్థానాలకు పరిమితం కావడం అంచనాలకు తగినట్టే ఉంది. విజయన్, స్టాలిన్ ఇద్దరూ మోడీ విధానాలపై తీవ్ర విమర్శకులే. కేరళలో విజయన్ ప్రభుత్వం రెండు సార్లు వరదలనూ నిప్పో కోవిడ్ వైరస్‌లను తట్టుకుని ప్రజలను ఆదుకోవడంలో జయప్రదమైన తీరు ప్రపంచ ప్రశంసలు పొందింది. అలాంటి చోట శబరిమలై సమస్యను, బంగారం స్మగ్గింగ్ వంటి లేనిపోని ఆరోపణలను తెచ్చి కేంద్రం అధికారాల సహాయంతో ప్రయోజనం పొందాలని బీజేపీ చేయని ప్రయత్నం లేదు. మరోవంక కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా సర్వశక్తులూ సమయమూ సీపీఐ(ఎం)ను ఓడించడానికే వెచ్చించి అసోంను కూడా ఉపేక్షించారు. ఈ రెండు దాడులను తట్టుకుని ప్రకృతి వైపరీత్యాలను కోవిడ్‌ను కూడా అధిగమించిన ఎల్డీఎఫ్కు కేరళ విజయం చేకూర్చింది. బెంగాల్ ఫలితాలలో చాలా నిరుత్సాహం కలిగించిన తరుణంలో కేరళలో అసాధారణ విజయం వామపక్షాల ప్రాధాన్యతను చాటింది. ప్రత్యామ్నాయ రాజకీయాలకు ఊపిరిపోసింది. కేరళ తమిళనాడు ఫలితాలతో దక్షిణాదిన బీజేపీ విజయం సాధించడం దుస్సాధ్యమని తేలింది. ఇదే సమయంలో ఏపీ తెలంగాణ ఉప ఎన్నికలలో బీజేపీ డిపాజిట్లు కోల్పోయింది కూడా. ఒక్క పుదుచ్చేరిలో మాత్రం కాంగ్రెస్ నుంచి వచ్చిన కొత్త పాత ఫిరాయింపుదార్ల కూటమిలో భాగం సంపాదించింది.
మత పరమైన విభజన
అస్సాంలో బీజేపీ ఎన్డీఏ అధికారం నిలబెట్టుకున్నా కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమి గట్టిపోటీనే ఇచ్చింది. బెంగాల్లో బెడిసి కొట్టిన హిందూజాతీయ వాద వ్యూహం సీఏఏ, విదేశీ చొరబాట్ల ప్రచారంతో కూడిన మత పరమైన ఉద్వేగాల వ్యూహం అసోంలో అక్కరకు వచ్చింది. అయితే అక్కడ కూడా ఏజీపీతో కలసి మాత్రమే విజయం సాధ్యమైందని గుర్తుంచుకోవాలి. మిగిలినరాష్ట్రాలతో పోలిస్తే అసోంలో బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్‌లో బలమైన నాయకులు లేకపోవడం, దాని వ్యూహాత్మక తప్పిదాలు, ఎఐఎంఎల్ నాయకుడైన పరిమళవ్యాపారి అజ్మాల్ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవాలన్న మత ప్రచారం కూడా పనిచేశాయి. బెంగాల్లో అసోంలో మత ప్రాతిపదికన జరిగిన ప్రచారం పర్యవసానాలు దేశానికి మరీ ముఖ్యంగా తూర్పు ఈశాన్య బారతానికి ఆందోళనకర సంకేతాలే. మమత విజయంతో పాటే బెంగాల్లో పెరిగిన హింసాత్మక ఘటనలు ఇందుకొక హెచ్చరికగా ఉన్నాయి. వీటిని దేశ విభజన నాటి మత మారణహోమంతో పోల్చిన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మాటల్లో ఈ హెచ్చరిక దాగివుంది. నిజంగానే దేశ విభజన సమయంలో అతి భయానకమైన హత్యాకాండ చూసిన రాష్ట్రాల్లో బెంగాల్ ఒకటి. కానీ వామపక్షాల ముప్ఫై ఏండ్ల పాలనలో ఆ ఊసే అందరూ మర్చిపోయేంత మతసామరస్యం విలసిల్లింది. ఇప్పుడు బీజేపీ పెద్ద ప్రతిపక్షంగా రాగానే వాటిని గుర్తుచేయడం యాధృచ్చికం కాదు. బీజేపీకి హిందూత్వకు వ్యతిరేకంగా తను ముస్లిం కార్డు ప్రయోగించిన మమతా విధానాలు కూడా ఈ పరిస్థితిని తీవ్రం చేస్తాయి. బెంగాల్లో ఘోరంగా దెబ్బతిన్న వామపక్షాలు కూడా సమీక్ష చేసుకుని సరైన పాఠాలు తీసుకోవలసి ఉంది.
రాష్ట్రాలలో పారని మోడీత్వ!
మొత్తంపైన బీజేపీ కేంద్రంలో పాలిస్తున్నా రాష్ట్రాలకు వచ్చేసరికి అంత స్థాయిలో ప్రభావం చూపలేకపోత్నునదని ఈ ఫలితాలతో మరోసారి స్పష్టమైంది. పార్లమెంటులో 303 స్థానాలు లేదా యాభై అయిదు శాతం పొందిన బీజేపీ, రాష్ట్రాలలోని 4 వేల పై చిలుకు అసెంబ్లీ స్థానాలలో కేవలం 1400 లేదా ముప్పైశాతం కూడా దాటలేకపోతున్నది. అత్యధిక స్థానాలున్న శాసనసభల్లో మహారాష్ట్ర కోల్పోయాక కేవలం యూపీలో మాత్రమే ఆ పార్టీ పాలన చేస్తున్నది. తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లలో ప్రాంతీయ పార్టీలే పాలిస్తున్నాయి. ఇదే సమయంలో బీజేపీ పాలిత యూపీ, గుజరాత్, కర్నాటకలలో జరిగిన స్థానిక ఎన్నికలలోనూ ప్రతిపక్షాలకు హెచ్చుగానే స్థానాలు రావడం గమనార్హం. ఆఖరుకు మోడీ ప్రాతినిధ్యం వహించే వారణాసిలోనూ సమాజ్‌వాదిపార్టీకి అత్యధిక స్థానాలు వచ్చాయి. 2022లో యూపీ, గుజరాత్, పంజాబ్ తదితర రాష్ట్రాల ఎన్నికలు 2023లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్నాటక, త్రిపుర ఇంకా ఇతర రాష్ట్రాల ఎన్నికలు వస్తాయి. ఇవేవీ కూడా బీజేపీకి నల్లేరు మీద బండిలాగా ఉండబోవు. 31రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలతో కూడిన ఈ దేశం వైవిధ్యాన్ని భిన్నత్వాన్ని గౌరవించకుండా ఒకేదేశం, ఒకే మతం, ఒకే పార్టీ, ఒకే పన్ను, ఒకే ఎన్నిక, ఒకే మోడీ అనే తరహాలో ఆలోచిస్తున్న బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రాలకు కోవిడ్ సహాయంలోనూ విమర్శలనెదుర్కొంది. ఏపీ, తెలంగాణలతో సహా రాష్ట్రాల సమస్యల పట్ల ఇచ్చిన వాగ్దానాల పట్ల ఉపేక్ష ప్రదర్శించింది. స్థానిక బీజేపీ నేతలు కూడా ముఖ్యమంత్రులను అరెస్టు చేస్తామని తామే నిధులు ఇస్తున్నామని ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. సీబీఐ, ఈడీ, ఎన్ఐఏ వంటివాటిని ప్రత్యర్థిపార్టీలపై ప్రయోగిస్తున్నారు. ఇవి ప్రజలు ఆమోదించడం లేదు గనకనే రాష్ట్రాల ఎన్నికలలో బీజేపీని తిరస్కరిస్తున్నారు. ఈశాన్యాన చిన్న రాష్ట్రాలు ఉత్తరాఖండ్, హిమచల్ ప్రదేశ్ వంటివి మినహాయిస్తే యూపీ, గుజరాత్ మాత్రమే గతసారి బీజేపీ గెలవగలిగింది. మధ్యప్రదేశ్, కర్నాటక ఫిరాయింపుల తర్వాత తెచ్చుకుంది. బీహార్, హర్యానా, అసోం, త్రిపుర వంటివి ప్రాంతీయ పార్టీల తోడ్పాటుతో గాని పాలించలేని పరిస్థితి. అఖిలభారతం తమ అధీనంలోకి వచ్చేసిందని అశ్వమేధయాగం తర్వాత రాజసూయమే మిగిలిందని అనుకున్నది కాస్తా ప్రతి రాష్ట్రం బీజేపీకి సవాలుగానే మారుతున్నది. రైతాంగ ఉద్యమం, ప్రయివేటీకరణ, ఆర్థిక క్షీణత, నిరుద్యోగం, అధికధరలు, కోవిడ్‌పై పోరులో వైఫల్యం, తగ్గని సెకండ్ వేవ్ మరింత తక్షణ సమస్యలవుతాయి.
మమత చుట్టూ చర్చ అర్థరహితం
అయిదు రాష్ట్రాల ఫలితాల తర్వాత బీజేపీ ఏకపక్షపోకడలకు, మోడీ విధానాలకు వ్యతిరేకంగా ప్రతిపక్ష వేదిక గురించిన చర్చ మీడియాలో పెరుగుతున్నది. అయితే ఉద్దేశపూర్వకంగా మమత చుట్టూ ఈ చర్చ నడిపిస్తున్నారు. ఆమె గతంలోనూ అధికారంలో ఉన్నారు. ప్రధాని కావాలని ఆరాటపడ్డారు కూడా. మాయావతి, జయలలిత కూడా ఆ విధంగా ఆశపడిన వారే. అయితే విజయాలతో పాటు ఆయా నాయకుల విశ్వసనీయత, విధానాల సమంజసత్వం, సమతుల్యత వంటివన్నీ ప్రభావం చూపిస్తాయి. ఖచ్చితమైన ప్రజాస్వామ్య లౌకిక విలువలు, సమాఖ్య తత్వం, దేశ సార్వభౌమత్వం, ప్రజానుకూల ఆర్థిక విధానాలు వంటివి కొలబద్దలుగా ఉంటాయి. ప్రాంతీయ పార్టీలే బీజేపీని ఓడించగలవనే పల్లవి అదేపనిగా వినిపిస్తున్నా వైసీపీ, టీడీపీ, టీఆర్ఎస్, బీజేడీ, జేడీఎస్ వంటి పార్టీలు బీజేపీని విధానపరంగా వ్యతిరేకించేందుకు సిద్దం కావడం లేదు. రకరకాల పిల్లిమొగ్గలు వేస్తున్నాయి. మరికొన్ని ప్రాంతీయ పార్టీలు ఏకంగా ఎన్డీఏలోనే ఉన్నాయి. వీటి పరిమితులను గురించి సీపీఐ(ఎం) వంటిపార్టీలు గతంలోనే స్పష్టంగా చెప్పాయి కూడా. ఈ పూర్వరంగంలో కేవలం ప్రాంతీయ జాతీయ జపం ఒక్కటే తీరం చేర్చదు. తనే ఇప్పటికీ పెద్ద జాతీయ పార్టీనని భావించే కాంగ్రెస్ బాగా బలహీనపడటమే గాక అధ్యక్షుడిని కూడా ఎన్నుకోలేని దుస్థితిలో ఉంది. కనుక రాష్ట్రాలలో ప్రజల తీర్పులు బీజేపీకి పగ్గంవేస్తున్నా కొన్ని ప్రాంతీయ పార్టీల అవకాశవాదాలు, కాంగ్రెస్ బలహీనత అది పబ్బం గడుపుకునేందుకు అవకాశమిస్తున్నాయి. ప్రజా ఉద్యమాలు, ప్రత్యామ్నాయ రాజకీయాల ద్వారానూ రాబోయే ఎన్నికలలో బీజేపీని మరింత దీటుగా ఎదుర్కోవడం ద్వారానూ ఈ పరిస్థితిని మార్చవలసి ఉతరతంటుంది. అయిదు రాష్ట్రాల తీర్పు ఆ విధమైన చర్చకు దారితీస్తే మంచిది.
- తెలకపల్లి రవి