Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డబ్బు ఖర్చు చేయకుండా ఎన్నికలలో గెలుపు సాధ్యం కాదన్న భయం వెన్నాడుతున్నది. పేదల ప్రతినిధులైన కమ్యూనిస్టులు పోటీ చేయటమే కష్టమన్న ఆందోళన పెరుగుతున్నది. కానీ ఆందోళన చెందటం వల్ల ప్రయోజనం లేదు. పరిష్కారం వెతకటం ప్రధానం. ఇందుకు బలమైన
ఉద్యమం ఉన్న కేరళ మాత్రమే కాదు. తెలంగాణ రాష్ట్రంలో కూడా గుణపాఠాలు తీసుకోగల్గిన చిన్న చిన్న అనుభవాలున్నాయి. ఎన్నికలు డబ్బుమయం అయిన విషయం వాస్తవం. అయినా డబ్బుతో పోటీ పడకుండా, ప్రజలను అంటిపెట్టుకుంటే ప్రజలు కూడా ఎర్రజెండా వెన్నంటే ఉంటారని ఈ అనుభవాలు చెబుతున్నాయి.
భారతదేశం మూడు ముఖ్యమైన సమస్య లను ఎదుర్కొంటు న్నది. ఈమాటలు రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. కోవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్ దేశాన్ని ముంచెత్తుతున్న విపత్కర సమయంలో నాయకత్వలేమి, ముందుచూపు లేమి, ఆత్మసంతృప్తి మన దేశాన్ని వెంటాడు తున్నాయన్నారు. మూడవ విషయం చాలా సౌమ్యంగా చెప్పినట్టున్నారు. నిర్మొహమాటంగా చెప్పే విశ్లేషకులైతే జబ్బలు చరుచుకుని గొప్పలకు పోతున్నారని చెబుతారు. ఇందుకు కేరళ పూర్తి భిన్నం. కేరళ రాష్ట్రం దేశానికే వెలుగు దివ్వెలా నిలిచింది. దాని ఫలితమే.. కేరళ ప్రజలు వామపక్ష ఫ్రంట్‌కు రెండవసారి పట్టంకట్టారు. ఒక ప్రజా సర్వే సంస్థ అధినేత కేరళ ముఖ్యమంత్రి విజయన్ గురించి మాట్లాడుతూ.. ''ఎదిగిన కొద్దీ ఒదిగిన నేత'' అన్నారు. ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే తప్పుడు ఆరోపణలనూ, దుష్ప్రచారాలనూ కేరళ ప్రజలు తిప్పికొట్టారని మరో రాజకీయ విశ్లేషకుడన్నారు. వీటిని మించి కేరళ ప్రభుత్వం అనుసరించిన ప్రత్యామ్నాయ విధానాలే ప్రజలను అంతగా ఆకట్టుకున్నాయి.
కమ్యూనిజానికి కాలం చెల్లిందనీ, సోషలిజానికి భవిష్యత్తు లేదనీ కొందరు విర్రవీగుతున్న కాలమిది. బెంగాల్, త్రిపురలలో ఎర్రజెండా పనైపోయిందనీ, ఇప్పుడు కేరళ సౌధం కుప్పకూలనున్నదని ఎదురు చూసినవారి కలలు కల్లలైనాయి. కేరళ చరిత్రలో మొదటిసారి ఒక ప్రభుత్వం వరుసగా రెండవసారి అధికారంలోకి వచ్చింది. వామపక్ష ఫ్రంట్కిది అసాధారణ విజయం. అనేక విధాలుగా ప్రత్యేకతలు సంతరించుకున్నది. ప్రభుత్వానికి వరుసగా రెండవసారి పట్టం గట్టడమే కాదు.. ఇది ప్రభుత్వానికి అనుకూల ఓటు. ఐదు సంవత్సరాల ఎర్రజెండా పాలన చూసి ప్రజలు వేసిన ఓటు. ఐదురాష్ట్రాల ఎన్నికల సందర్భంగా మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరించిన ప్రజలు కేరళలో విజయన్ పాలనకు బ్రహ్మరథం పట్టారు. ఈ విజయం ఎట్లా సాధ్యమైంది?
కేరళ ప్రభుత్వం ప్రజల మీద విశ్వాసం ఉంచింది. ప్రజలను భాగ స్వాములను చేస్తూ, ప్రజల సహ కారంతో సమస్యలను ఎదుర్కొన్నది. అధికార దర్పం కాకుండా సేవాగుణం ప్రదర్శించింది. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు నెరపుతూ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేసింది. 2011లో ఒక్కసీటు తక్కువ రావడంతో ఐదేండ్లు ప్రతిపక్షంలో ఉన్నది వామపక్షం. మూడు సీట్లున్న ఒక పార్టీ ఎన్నికల ఫలితాలు రాగానే యూడీఎఫ్‌ను వీడి, ఎల్డీఎఫ్లో చేరుతానని ప్రకటించింది. వామపక్ష ఫ్రంట్ అంగీకరించలేదు. రాజకీయ, సామాజిక, సాంఘిక విషయాలన్నింటిలో సూత్రబద్ధమైన వైఖరి ప్రదర్శించింది. ప్రజాస్వామ్య పద్ధతులు అనుసరించింది. ప్రజానుకూల ప్రత్యామ్నాయ విధానాలు అమలు జరిపింది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అంబానీలు, అదానీల ప్రయోజనాల కోసం దేశాన్ని పణంగా పెడుటుంటే... ఇందుకు భిన్నంగా ప్రజల ప్రయోజనాల కోసం కేరళ పాలకులు, ప్రభుత్వ యంత్రాంగం తమ వ్యక్తిగత జీవితాలను పణంగా పెట్టారు.
అది కరోనా అయినా, నిఫా వైరస్ లేదా వరదలు లేదా అయ్యప్ప దర్శనం సమస్య... ఇట్లా సమస్య ఏదైనా.. ముఖ్యమంత్రి ముందుగా ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకున్నారు. సంప్రదించారు. వరదల సమయంలో ముఖ్యమంత్రి స్వయంగా ప్రతిపక్షనేతను వెంటబెట్టుకుని హెలిక్యాప్టర్ ద్వారా పర్యవేక్షణ చేసారు. ప్రజాసంఘాలను, స్వచ్ఛంద సంస్థలను, ప్రముఖులను భాగస్వాములను చేసారు. శాస్త్రీయ పరిష్కారాలను అమలు చేసారు. విపత్తు సమయంలో మంత్రులు, శాసనసభ్యులు, ఉన్నతాధికారులన్న తేడా లేకుండా ప్రత్యక్షంగా రంగంలోకి దిగి ఆదుకోవటం వామపక్ష ప్రభుత్వ ప్రత్యేకత.
కరోనా తొలిదశలో సమర్థవంతంగా ఎదుర్కొన్న రాష్ట్రంగా ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ ప్రశంసలను అందుకున్నది. ఇప్పుడు సెకండ్ వేవ్ దేశాన్ని వణికిస్తున్న సమయంలో కూడా కేరళ తన ప్రజలకు భరోసా కల్పించింది. దేశమంతా ఆక్సిజన్ కొరతతో వణికిపోతున్న సమయంలో తమ అవసరాలు తీర్చుకోవటంతో పాటు తమిళనాడు, కర్నాటక, గోవా, లక్షద్వీప్ రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తున్న రాష్ట్రం కేరళ. సెకండ్ వేవ్ వస్తుందని తెలిసికూడా కేంద్రం నిర్లక్ష్యం ప్రదర్శించింది. ఫలితంగా ఆక్సిజన్ కొరత, మందుల కొరత, వ్యాక్సిన్ కొరత, ఆస్పత్రుల కొరత, టెస్టింగ్ కిట్లు కొరత.. అన్నీ కొరతలే! సెకండ్ వేవ్ కాలంలో కరోనా భయం కన్నా ఈ కొరతల భయమే ప్రజలను వణికిస్తున్నది. కేరళ వామపక్ష ప్రభుత్వం ఇందుకు పూర్తి భిన్నంగా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నది. అందుకే ఈ విపత్కర పరిస్థితుల్లో దేశానికి దిక్సూచిగా వెలుగుతున్నది కేరళ.. వైద్యరంగం ప్రభుత్వం చేతుల్లో ఉంటేనే ఇలాంటి విపత్తులను ఎదుర్కోగలమని మరోసారి రుజువైంది. ప్రభుత్వరంగ సంస్థలో పెట్టుబడులు పెంచి, ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచింది కేరళ ప్రభుత్వం. 80లక్షల కుటుంబాలకు నేటికీ నిత్యజీవితావసర సరుకులు ఉచితంగా అందిస్తున్నది. నూరుశాతం అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రమే కాదు.. అత్యధిక మానవాభివృద్ధి సూచీలలో ముందున్నది కేరళ. దళితుడిని పూజారిగా నియమించిన రాష్ట్రం అది. అయ్యప్ప దర్శనం కోరుకున్న మహిళలకు దర్శించుకునే హక్కు ఉండాలని స్పష్టం చేసింది. అదే సమయంలో సుప్రీం కోర్టు తీర్పును అమలు చేసింది. అన్ని విషయాలలోనూ, ప్రజానుకూల ప్రత్యామ్నాయ విధానాలు అమలు జరపటం ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకత.
ప్రజా ప్రతినిధులులేకపోతే పార్టీ బతకటం కష్టమన్న భావనలు విస్తరిస్తున్న రోజులివి. అందుకోసం ఏదో ఒక పార్టీ సహకారం కావాలన్న ప్రయత్నాలు. ఇవి తాత్కాలికంగా ఒకటీ రెండు సీట్ల గెలుపునకు ఉపయోగపడినా, దీర్ఘకాలంలో కమ్యూనిస్టుల ప్రజా పునాది మరింత బలహీనపడేందుకే దారితీసాయి. మరో వైపు డబ్బు ఖర్చు చేయకుండా ఎన్నికలలో గెలుపు సాధ్యం కాదన్న భయం వెన్నాడుతున్నది. పేదల ప్రతినిధులైన కమ్యూనిస్టులు పోటీ చేయటమే కష్టమన్న ఆందోళన పెరుగుతున్నది. కానీ ఆందోళన చెందటం వల్ల ప్రయోజనం లేదు. పరిష్కారం వెతకటం ప్రధానం. ఇందుకు బలమైన ఉద్యమం ఉన్న కేరళ మాత్రమే కాదు. తెలంగాణ రాష్ట్రంలో కూడా గుణపాఠాలు తీసుకోగల్గిన చిన్న చిన్న అనుభవాలున్నాయి. మేడ్చెల్జిల్లాలో ప్రగతినగర్ ఒకరకమైన అనుభవమైతే, అమరచింత మునిసిపాలిటీలో మరో చిన్న అనుభవం. లాక్డౌన్ ప్రకటించగానే తెలంగాణలో మొట్టమొదట ప్రజలకు కూరగాయలు అందుబాటులోకి తెచ్చింది ప్రగతినగర్‌లో సీపీఐ(ఎం). రెండు దశాబ్దాలపాటు ప్రగతినగర్ గ్రామ పంచాయతీ సీపీఐ(ఎం) సభ్యుల నాయకత్వంలో నడిచింది. సీఐటీయూ ఆధ్వర్యంలో ఆల్విన్ కార్మికుల కోసం నిర్మించిన కాలనీ ఒక గ్రామ పంచాయతీగా ఎదిగింది. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసినప్పటికీ, వారంతా ఎర్రజెండా బిడ్డలుగా అందరికీ తెలుసు. దాదాపు అన్ని స్థానాలు, నాలుగు టర్ములూ గెలుచుకున్నారు. ప్రణాళికా బద్ధమైన కృషితో ఆదర్శప్రాయమైన గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దారు. ఐఎస్ఓ ప్రశంసాపత్రం పొంది దేశం దృష్టిని ఆకర్షించింది. బార్‌షాప్ లేని, ప్లాస్టిక్ రహిత పంచాయతీగా వెలుగొందింది. లీలా సుందరయ్య పేరుతో నిర్మించిన పెద్ద హాల్ ప్రజలకు సేవలందిస్తున్నది. కార్మికుల వేతనాలు కూడా ఇతర పంచాయతీలకు భిన్నంగా, చట్ట పరమైనవన్నీ అమలు చేసారు. ఉద్యోగ భద్రతకు భరోసా ఇచ్చారు. ప్రజలకు అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. ట్రస్టు ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. సకల సదుపాయాలతో కూడిన ఆస్పత్రి, పేద విద్యార్థినీ, విద్యార్థులకు ఉచిత విద్య, వసతి గృహాలు అమలు చేస్తున్నారు. ఆల్విన్ కార్మికులతోనే ప్రారంభమైనప్పటికీ క్రమంగా 90శాతం ప్రజలు ఆల్విన్‌కు సంబంధం లేనివారితో గ్రామం విస్తరించింది. అయినా ప్రజలు ఎర్రజెండా బిడ్డలనే ఆదరించారు. కాంట్రాక్టర్లూ, బిల్డర్లూ నాయకులకు పర్సెంటేజీలివ్వటం దేశమంతా ఉన్నదే. కానీ ఇక్కడ నాయకులు వాటికి కక్కుర్తిపడేవారు కాదు. ఆ డబ్బు కూడా వదలకుండా పారదర్శకంగా ఎకౌంట్ పెట్టి, విరాళం రూపంలో జమ చేసి ప్రజల కోసం ఖర్చుచేసిన ఘనత ఈ నాయకత్వానిది. అందుకే ప్రజలకు అంతటి అభిమానం. ఇక్కడ అభ్యర్థుల ఎంపికకు ప్రాతిపదిక డబ్బు కాదు.. అంకిత భావమే! రెండు దశాబ్దాల అనంతరం ప్రగతినగర్‌ను నిజాంపేటతో కలిపి నిజాంపేట మునిసిపల్ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేసారు. ప్రగతినగర్‌లో తొమ్మిదికార్పొరేటర్ స్థానాలున్నాయి. కరపత్రాలు తప్ప మరో ఖర్చు లేకుండా ఆరుస్థానాలు అవలీలగా గెలిచారు. ఏ పార్టీతోనూ పొత్తులేదు. ప్రత్యర్థులు ఒక్కొక్క స్థానంలో కోటికిపైగా ఖర్చుచేసినా ప్రజలు ఎర్రజెండా బిడ్డలనే గెలిపించారు. ఒకస్థానంలో ప్రధాన నాయకత్వాన్ని, కక్షతో అత్యధిక డబ్బు ఖర్చుచేసి, అందరూ కలిసినా కేవలం ఐదు ఓట్లతో ఓడించగలిగారు.
అమరచింత మునిసిపల్ ఎన్నికలలో రెండు వార్డులు సీపీఐ(ఎం) స్వతంత్రంగా పోటీ చేసి గెలిచింది. గతంలో అది సీపీఐ(ఎం) నాయకత్వంలో ఉన్న గ్రామం. ఇప్పుడు మునిసిపాలిటీలో కలిసింది. ఒక వార్డులో అందరూ కలసి కూడా ఓడించలేకపోయారు. సీపీఐ(ఎం) అభ్యర్థులు పాలమూరు బిడ్డలు. ఖర్చులు పెట్టగల శక్తి కూడా ఉండదు. పార్టీని గుండెల్లో దాచుకునే వారు అభ్యర్థులు. ప్రజలే పునాదిగాపోటీ చేసారు. బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా యువత ఎర్రజెండా పునాది అక్కడ.
ఈ రెండు ఉదాహరణలలోనూ ఒంటరిగా పోటీ చేయడం ఆదర్శం కాదు. అవసరమైనప్పుడు ధైర్యంగా, ఒంటరిగానైనా నిలబడి, పునాదిని నిలబెట్టుకోవటమే ప్రత్యేకత. ఎన్నికలు డబ్బుమయం అయిన విషయం వాస్తవం. అయినా డబ్బుతో పోటీ పడకుండా, ప్రజలను అంటిపెట్టుకుంటే ప్రజలు కూడా ఎర్రజెండా వెన్నంటే ఉంటారని ఈ అనుభవాలు చెబుతున్నాయి.
- ఎస్. వీరయ్య