Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రాణాలా..? లాభాలా..? అనే మౌలిక చర్చకు అంతర్జాతీయంగా తెరదీసింది కోవిడ్ సంక్షోభం. 'ప్రపంచ వ్యాప్తంగా నేడు ఆరోగ్య సంక్షోభం నెలకొని ఉన్నది. కోవిడ్ కారణంగా ఇక్కడా.. అక్కడా.. అని కాదు. ప్రపంచమంతటా అసాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. తత్ కారణంగా అసాధారణ చర్యలు తీసుకోవడం తప్పని సరి. పేటెంట్ (మేథోసంపత్తి) హక్కులను పరిరక్షించాలని అమెరికా గట్టిగా భావిస్తున్నది. కానీ అంతకంటే ఎక్కువగా కరోనా మహమ్మారిని అంతం చేయాలని కోరుకుంటున్నది. అందుకే కరోనా వ్యాక్సిన్ తయారీని మేథోసంపత్తి హక్కుల నుంచి మినహాయించడానికి మద్దతునిస్తున్నది' అని అమెరికా వాణిజ్య ప్రతినిధి కేథరిన్ థారు ప్రకటించారు.
సమర్థవంతమైన, సురక్షితమైన వ్యాక్సిన్లు ఎన్ని వీలైతే అన్ని అందుబాటులోకి రావాలని అమెరికా వాంఛిస్తున్నట్టు తెలిపారు. అమెరికా ప్రజలకు వ్యాక్సిన్ (టీకా) సరఫరా పూర్తయితే వాటి ఉత్పత్తిని సరఫరాను మరింత వేగవంతం చేస్తామని చెప్పారు. పేటెంట్లకంటే ప్రజలే ముఖ్యమని అమెరికా అధ్యక్షుడు బైడెన్ తేల్చి చెప్పారని, ఇందుకు మద్దతుగా వందమంది డెమోక్రటిక్ కాంగ్రెస్ సభ్యులు, పదిమంది సెనేటర్లు కూడా లేఖలు రాసారని వివరించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడే వ్యాక్సిన్ తయారీ టెక్నాలజీని పంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని, అందుకు పెటెంట్చట్టాలు అవరోధం కారాదని ప్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ అన్నారు. ఇప్పుడు పేద దేశాలకు వ్యాక్సిన్ల డోస్‌లను విరాళంగా అందించడమే సంపన్న దేశాల ధ్యేయంగా మారాలని, సంపన్నులు తమ లాభాలకన్నా పేదల ప్రాణాలు కాపాడాలనే మానవీయ దృక్పథంతో ముందుకు రావాలని ఉదారవాదులైన మేథావులు వ్యాఖ్యానిస్తున్నారు.
అసలు కరోనా వ్యాక్సిన్ల తయారీకి తాత్కాలికంగా పేటెంట్ల నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని భారత్, దక్షిణాఫ్రికాలు సంయుక్తంగా ప్రతిపాదించాయి. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇందుకు ప్రపంచ వాణిజ్య సంస్థ ఆమోదం లభించే అవకాశాలు ఏర్పడుతున్నాయని భావించవచ్చు. అందుకే కరోనాపై పోరాటంలో ఇది చారిత్ర సందర్భం అని ప్రపంచ ఆరోగ్య సంస్థఅధినేత టెడ్రోస్ ఎటనామ్ వ్యాఖ్యానించారు కూడా. ఉన్నంతలో కాస్త ఊపిరి తీసుకునే ఈ నిర్ణయం పైకి రావడానికి బహుళజాతిసంస్థలు, ఫార్మా దిగ్గజాలపై తెరవెనుక రాజకీయంగా పెద్ద ఎత్తున యుద్ధాలే చేయవలసి వస్తున్నది. పేటెంట్ చట్టాన్ని అడ్డం పెట్టుకుని మొత్తం యావత్ ప్రాపంచాన్నే లూటీ చేయడానికి ఈ సంస్థలు వెనుకాడటం లేదు. ఇందులో కొన్ని అగ్రరాజ్యాలూ పాలు పంచుకోవడం గమనార్హం. పెట్టుబడిదారీ వికృత దోపిడీ పతాక స్థాయికి చేరడం అంటే ఇదే కదా! వ్యాక్సిన్లను తయారుచేసే సంస్థలను, దేశాలను భయపెట్టి, బెదిరించి, బలవంతంగా సేకరించుకుని దొంగ నిల్వలు పెట్టుకున్నాయి. ఈ దేశాల్లో ప్రతి నలుగురికి ఒకరికి వ్యాక్సిన్ అందుతుంటే, భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రతి 500మందిలో ఒకరికి మాత్రమే వ్యాక్సిన్ లభిస్తున్నది. పేద దేశాలకైతే చెప్పనలనికాకున్నది. వేల సంఖ్యలో ప్రజానీకానికి అరకొరగా మాత్రమే దక్కుతున్నాయి.
ఈ ఆర్థిక అంతరాలవలన తీవ్రమవుతున్న వ్యాక్సిన్ వ్యత్యాసం ఎంతగానో కలవరపెడుతున్నది. ఈ తేడాల నడకతో కరోనా మహమ్మారి నుంచి విశ్వవిముక్తి సాధ్యమెన్నడో? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. కాగా, ఇప్పటికి ఉత్పత్తి అయిన వ్యాక్సిన్‌లో 87శాతం వ్యాక్సిన్ డోస్‌లు తమ ఆధిపత్యంతోనే కొల్లగొట్టాయి. కరోనాకు ధనిక బీధ తారతమ్యం లేదు గనుక ప్రాణాంతక వైరస్ నుంచి పేదలను రక్షించకుండా తాము మాత్రమే సుఖంగా ఉండగలం అనుకోవడం కూడా అజ్ఞానమేనని శాస్త్రజ్ఞులు అంటున్నారు. ఎందుకంటే జ్ఞానం ప్రజలందరిదీ అని భావించినప్పుడే సమానత్వ భావనలో అర్థం ఉంటుంది. ప్రకృతి రక్షణ, సమాజాభివృద్ధి క్రమగతిలో నడవడానికి, నడపడానికి వీలుంటుంది.
ఏ వ్యాక్సిన్ కూడా స్వతహాగా ఏ ఒక్క వ్యక్తి జ్ఞానంతోనూ, సంపదతోనూ పుట్టదు. ఆ ఉత్పత్తి అనేది తరతరాల జ్ఞాన క్రమానుగతి అనేది వాస్తవం. ప్రభుత్వాలు వ్యాక్సిన్ల ఉత్పత్తి పరిశోధనలకు నిధులు సమకూరుస్తాయి. ప్రభుత్వ నిధులు అంటే ప్రజల సొమ్మే. అలాకాని పక్షంలో ఎంత ఉన్నత స్థాయి చర్చల్లో సైతం డొల్లతనమే బయటపడుతుంది.
ట్రిప్స్ ఒడంబడిక ద్వారా ఏ పేటెంట్కైనా 20ఏండ్లపాటు గుత్తాధిపత్యం లభిస్తున్నప్పుడు మినహాయింపు ఇవ్వడం వలన ప్రపంచ వాణిజ్యానికి, పేటెంట్ చట్టానికి అర్థమేముంటుంది? అని వాదించే కార్పొరేట్ ప్రబుద్ధులు, వారికి కొమ్ముకాసే రాజ్యాధినేతలు దండిగానేఉన్నారు. కార్పొరేట్ వ్యవస్థ బతికేది కనికరం లేని లాభాలదోపిడీపైనే కదా..!
ఫైజర్ వంటి కొన్ని ఫార్మా కంపెనీలు తాము వ్యాక్సిన్ సరఫరా చేయాలంటే తనకు సైనిక స్థావరాలను, సార్వభౌమాధికార వనరులను తనఖాపెట్టమని కొన్ని లాటిన్ అమెరికా దేశాలను నిర్లజ్జగా డిమాండ్ చేయడం వ్యాపారమందమా..? దీనికి దోపిడీ లూటీ అనే మాటలు కూడా సరిపోవు కదా..!? అందుకేప్రపంచ వ్యాప్తంగా వీలైనంత త్వరగా కరోనా వ్యాక్సిన్‌ను అందరికీ అందుబాటులోకి ఎలా తీసుకురావాలి అనే అంశానికి ప్రాధాన్యత ఇవ్వకుండా లాభాల వేటకై పరుగుతీయడం అంటే ఎండమావులు వెంట పరుగుదీయడమే అవుతుందని ఇప్పుడు కొందరికైనా అర్థమవుతున్నది.
కె. శాంతారావు
సెల్: 9959745723