Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''నాయకులు చెప్పేది ఉత్త గ్యాసూ
వినాయకుల చప్పట్లూ శుద్ధ గ్యాసూ
పోచుకోలు పాలిటిక్సు పరమ గ్యాసూ
దానికన్న ఉపయోగం సోడా గ్యాసు''.. ఇది ఓ పాత తెలుగు సినిమాలో నేపధ్య గాయకుడు పిఠాపురం నాగేశ్వరరావు పాడిన హిట్ సాంగ్. అప్పట్లో గ్యాస్ కొట్టే నాయకుల్ని జనం ఇట్టే పట్టేసేవారు, వాళ్ళ భరతం పట్టేవాళ్ళు. కాని ఇప్పుడు రోజులు మారాయి. ప్రచారార్భాటం ఎక్కువైంది. ఆ ఆర్భాటమే మోడీ పట్ల జనాల్లో భ్రమలను కల్పించింది. గత ఏడేళ్ళుగా మన్ కీ బాత్ వినీ వినీ చెవులు తుప్పట్టిపోయాయి. చెప్పొచ్చేదేమంటే ఇప్పుడు దేశానికి కావలసిందే ఆ గ్యాస్. అందులో ఉండే ఆక్సిజన్. కాని ఆ గ్యాస్ కూడా అవసరమైన వాళ్ళకి అందకుండా పోతోంది.
సుప్రీం కోర్టు తాజాగా దేశంలో తగినంత ఆక్సిజన్ నిల్వలు ఉండేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాని ఆ ఆదేశాలను అమలు చేయడానికి కేంద్రం ఏం చర్యలను తీసుకుంటోందో ఆ వివరాలను కూడా కోర్టువారికి తెలియజెయ్యమని పట్టుబడితే బాగుండును. ఇంతకీ మన దేశానికి ఇప్పుడు ఎంత ఆక్సిజన్ కావాలి? కరోనా కేసులు పెరుగుతున్న వేగాన్ని బట్టి మే నెల నాటికి సగటున రోజుకు 5 లక్షల కేసులు రావచ్చెనని అంచనా వేశారు. (ఇక్కడ మనం అధికారిక లెక్కల గురించి మాత్రమే మాట్లాడుతున్నాం సుమా) ఆ లెక్కన రోజుకు 12,000 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం ఔతుంది.
ఇప్పుడు మన దేశంలో ఉత్పత్తి అవుతున్న మెడికల్ ఆక్సిజన్, పారిశ్రామిక ఆక్సిజన్ అంతా కలిపి 9250 మెట్రిక్ టన్నులు మాత్రమే. అది కూడా తప్పనిసరిగా ఆక్సిజన్ ను ఉపయోగించవలసిన స్టీల్, అణు విద్యుత్, ఫార్మా, పెట్రోలియం శుద్ధి కర్మాగారాలు వంటి రంగాల అవసరాలను కూడా పక్కన బెట్టి ఆ ఆక్సిజన్ ను కూడా కరోనా వైద్యానికే మళ్ళించితేనే. (ఇలా ఎక్కువ కాలం మళ్ళించితే ఆ కీలక రంగాలు పడకేస్తాయి.) ఆగస్టు 2020 నాటికి 5700 మెట్రిక్ టన్నుల దినసరి ఉత్పత్తి ఉండేది. అప్పటినుంచీ ఇప్పటికి ్ష అంటే గడిచిన 8 నెలల కాలంలో దానిని 9250 మెట్రిక్ టన్నుల స్థాయికి తీసుకురాగలిగారు. ఇక్కడినుంచి 12000 మెట్రిక్ టన్నుల దినసరి సామర్ధ్యానికి తీసుకెళ్ళాలంటే ఇంకెంత కాలం పడుతుంది? మే నెల నాటికే 12000 టన్నులు అవసరం కదా? ఈ ప్రశ్నకు కేంద్రం దగ్గర సమాధానం లేదు.
కానీ కేంద్రం మాత్రం తన వైపు నుంచి ఆక్సిజన్‌కు అవసరమైన అన్ని ఏర్పాట్లనూ ఎప్పుడో చేసేసినట్టు, రాష్ట్రాలే ఆ వేగాన్ని అందుకోలేక చతికిలబడినట్టు, అందుకే ఈ సంకట పరిస్థితి ఏర్పడినట్టు చెప్పుకుంటూ బాధ్యతను రాష్ట్రాలపైకి నెట్టేస్తోంది. (ఈ విషయంలో రాష్ట్రాలకు కూడా బాధ్యత ఉంది. కేరళ బాధ్యతగా, దూరదృష్టితో వ్యవహరించింది గనుకనే తమ రోజువారీ అవసరాలకు మించి రెట్టింపు ఆక్సిజన్ ను ఉత్పత్తి చేయగలుగుతోంది.) దేశంలో ప్రతీ జిల్లాకూ తలా ఒక పిఎస్ఎ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ చొప్పున (ప్రెషర్ స్వింగ్ ఎడ్సార్ప్షన్ ) మంజూరు చేసినట్టు, వాటికి నిధులను కూడా కేంద్రం విడుదల చేసినట్టు చెప్పుకుంటోంది. ఈ తరహా ప్లాంట్లను ఇప్పటికి 713 మంజూరు చేసినట్టు వ్రివిధ సందర్భాలలో ప్రకటించారు. నిజానికి ఈ తరహా ప్లాంట్లకు పిఎం కేర్స్ నుంచి కేంద్రమే నేరుగా సప్లయర్స్‌కు చెల్లిస్తుంది. వాటిని అమర్చుకునే ఏర్పాట్లను చేయడమే రాష్ట్రాల బాధ్యత. అదలా ఉంచితే, ఈ తరహా ప్ల్రాంట్లను మంజూరు చేయడం గత అక్టోబరు లోమాత్రమే మొదలెట్టారు. ఇప్పటికి అమర్చినవి కేవలం 33! ఈ లెక్కన 713 ప్లాంట్లూ ఎప్పటికి పనిలోకి వస్తాయో చూసుకోండి! ఒక ప్లాంట్ ను అమర్చడానికి సగటున 4 నుండి 6 వారాలు పడుతుంది. పోనీ, శరవేగాన అన్నింటినీ అమర్చగలిగారనుకున్నా ఈ తరహా ప్లాంట్ల ఉత్పత్తి సామర్ధ్యం ఎంత? గతేడాది ఆర్డరిచ్చిన 162 ప్లాంట్ల మొత్తం సామర్ధ్యం కేవలం 154 మెట్రిక్ టన్నులే ! సగటున ప్లాంట్ ఒక్కంటికీ ఒక్కో మెట్రిక్ టన్ను అనుకున్నా 713 ప్లాంట్లకూ కలిపి 713 మెట్రిక్ టన్నులు మాత్రమే. అది కూడా అమర్చడం ఎంత కాలం పడుతుందో తెలియదు! మే నెల నడిమిలో రోజుకు 5000 మెట్రిక్ టన్నుల కొరత ప్రతిరోజూ ఏర్పడనున్నట్టు అంచనా. ఈ సంక్షోభాన్ని ఏ విధంగా అధిగమించాలి?
పెద్ద ఎత్తున ఆక్సిజన్‌ను దిగుమతి చేసుకుంటున్నాం అని భరోసా ఇచ్చేస్తోంది కేంద్రం. ఇప్పుడు 50,000 మెట్రిక్ టన్నుల మేరకు నిల్వలున్నాయని, మరో 50,000 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను దిగుమతి చేసుకోడానికి టెండర్లు పిలిచామని కేంద్రం ప్రకటించింది. రోజుకు 5000 లన్నుల కొరత ఉన్నప్పుడు ప్రస్తుత నిల్వలు కేవలం పది రోజులకు మాత్రమే సరిపోతాయి.
ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను వాడడాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ఇంకో పరిష్కారంగా చెపుతున్నారు. క్రిటికల్ కండిషన్లో ఉండే రోగికి నిమిషానికి 40 నుంచి 50 లీటర్ల ఆక్సిజన్ అవసరం ఈ కాన్సెంట్రేటర్లు నిమిషానికి 5 నుంచి 10 లీటర్ల ఆక్సిజన్‌ను మాత్రమే ఇవ్వగలదు. అంటే ఈ కాన్సెంట్రేటర్లు ఇండ్ల దగ్గర ఉండి వైద్యం చేయించుకుంటూ, అప్పుడప్పుడూ ఆక్సిజన్ సపోర్టు తీసుకునే రోగులకు సరిపోతాయి తప్ప సీరియస్ కేసులలో వీటి ఉపయోగం లేదు. ఏదో ఒక మేరకు ఉపయోగమే అనుకున్నా ఇప్పుడు ఇండియాలో వీటి ఉత్పత్తి జరగడం లేదు. దిగుమతి చేసుకోవలసిందే. గతంలోనే మన బీహెచ్ఈఎల్కు అనుమతిచ్చి ఇక్కడే ఉత్పత్తి చేయడానికి అవకాశం ఇమ్మనమని కోరారు. కాని, ఇది మోడీ ప్రభుతవం కదా! వినిపించుకుంటుందా? కోవిడ్‌కు ముందు ఈ కాన్సెంట్రేటర్ల డిమాండు ఏడాదికి 40,000 ఉంటే ఇప్పుడది నెలకు 40,000కి పెరిగింది. విదేశాలనుండి ఏ మేరకు దిగుమతి అయితే ఆ మేరకే మనకు దొరుకుతాయి. అదీ బ్లాక్ మార్కెట్లో మాత్రమే సుమా! ద్రవరూపంలో ఉండే ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే చోటునుండి అవసరమైన చోటికి రవాణా చేయడం కూడా ఒక సవాలే. ఇప్పుడున్న ట్యాంకర్లు అన్నీ కలిపితే దాదాపు 16,000 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను మాత్రమే రవాణా చేయగలవు. ఈ ద్రవ రూపంలోని ఆక్సిజన్‌ను మైనస్ 180 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంచి రవాణా చేయాలి. అందుకు ప్రత్యేకమైన ట్యాంకర్లు మాత్రమే ఉపయోగపడతాయి. ఒక్కో ట్యాంకరూ ఒక ట్రిప్పుకు సగటున 6 నుంచి 7 రోజులు తీసుకుంటుంది. ఆ లెక్కన చూస్తే ఇప్పుడున్న ట్యాంకర్లు కేవలం మూడోవంతు అవసరాన్ని మాత్రమే తీర్చగలవు. పోనీ రైలు మార్గాన రవాణా చేయాలనుకున్నా, ఈ ల్యాంకర్లు రైలు మార్గాన పోలేవు. మార్గమధ్యంలో వచ్చే బ్రిడ్జిలు, టన్నెళ్ళు వీటి సైజుకి సరిపోవు.
ఎక్కువ మొత్తంలో ద్రవరూపంలో ఉండే ఆక్సిజన్ ను నిలవ ఉంచడం కూడా చిక్కులతో కూడుకున్నదే. వెంటవెంటనే ఉత్పత్తి చేసి, ఆ వెంటనే రవాణా చేసే విధానం ఉండాలి. ఒటువంటి సంక్లిష్ట పరిస్థితులలో ఏ విధంగా వ్యవహరించాలన్నది నిపుణులు మాత్రమే సూచించగలరు. ఇందుకోసం కేంద్రం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ బృందం 2020 ప్రారంభం లోనే ఏర్పడింది. కాని ఆ బృందం ఇప్పటివరకూ సమావేశమే కాలేదు. ఇదంతా చూస్తూంటే కేంద్ర ప్రభుత్వపు క్షమార్హం కాని బాధ్యతా రాహిత్యం వల్లనే ప్రస్తుత ఆక్సిజన్ సంక్షోభం నెలకొందని స్పష్టంగా అర్థం ఔతోంది.
ఎం.వి.ఎస్.శర్మ