Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఆస్ట్రేలియన్'' అల్లిన ఓ కట్టుకథ
కరోనా వైరస్ పుట్టుక గురించి తేలక ప్రపంచం మల్లగుల్లాలు పడుతోంది. ఒకవైపు శాస్త్రవేత్తలు దాన్ని నివారించేందుకు యుద్ధంతో పాటు, గుట్టు విప్పేందుకు భాష, ప్రాంతీయ తేడాలు లేకుండా శ్రమిస్తున్నారు. మరోవైపు మీడియా సంచలన కథనాలతో జనం మెదళ్లను ఖరాబు చేస్తోంది. దున్న ఈనిందనగానే దూడను గాటన కట్టివేయమన్నట్టుగా కొందరు వ్యవహరిస్తున్నారు. తాజాగా వెలువడిన ఆస్ట్రేలియన్ కథనాన్ని తెలుగు మీడియా కూడా సొమ్ము చేసుకుంది. కష్టకాలంలో ఉన్నప్పుడు కుట్ర సిద్ధాంతాలకు జనం త్వరగా ఆకర్షితులవుతారు. మూడవ ప్రపంచ యుద్ధం వస్తే అది జీవ ఆయుధాలతోనే జరుగుతుందని అందుకోసం వాటిని తయారు చేయటం గురించి చైనా మిలిటరీ శాస్త్రవేత్తలు చేసిన 2015 నాటి సమాలోచనల రహస్య పత్రం తమకు దొరికిందంటూ ''ది ఆస్ట్రేలియన్'' అనే పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది.
బ్రిటన్‌లోని సన్ పత్రిక పేర్కొన్నదాని ప్రకారం అమెరికా విదేశాంగశాఖ నుంచి పత్రాలు తీసుకొని ఆస్ట్రేలియన్ చైనా జీవ ఆయుధ పరిశోధన కథ రాసింది. కోవిడ్-19 మూలాలను శోధించే క్రమంలో మిలిటరీ, చైనా ప్రజారోగ్య అధికారులు రాసిన పత్రాలు తమకు దొరికాయని అమెరికా అధికారులు చెప్పారట. అమెరికా వైమానిక దళ కల్నల్ మైఖేల్ జె కఫ్ మూడవ ప్రపంచ యుద్ధం జీవాయుధాలతో జరుగుతుందని చెప్పిన విశ్లేషణను పరిగణనలోకి తీసుకొని చైనా శాస్త్రవేత్తలు సార్స్ వైరస్‌తో జీవ ఆయుధాన్ని తయారు చేయటం గురించి చర్చించారట. 2003లో చైనాలో సార్స్ వైరస్ వ్యాపించింది.
ఆస్ట్రేలియన్ పత్రిక కథనం చదివిన వారందరూ దాని మీద చిలవలు పలవలుగా వ్యాఖ్యానాలు చేశారు. పత్రిక పేర్కొన్న పత్రాలు నకిలీవి కాదని ఇంటర్నెట్ నిపుణులు చెప్పేశారు. రాజకీయ నేతలు గళం విప్పేశారు. ప్రపంచంలో వైరస్‌తో జీవాయుధాలను తయారు చేసి యుద్ధాలలో వినియోగించే అంశాల గురించి కొందరు నిపుణులు వెలిబుచ్చిన అభిప్రాయాలను, అనేక అంశాలను పేర్కొంటూ చైనా మిలిటరీ వైద్యుడు గ్జు డెహౌంగ్ 2015లో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. అదేమీ రహస్యం కాదు, అమెజాన్ ద్వారా ప్రపంచమంతా కొనుగోలు చేసింది. దానిలో రహస్యాలు, కుట్ర ఆలోచనలు ఉంటే చైనా సర్కార్ అనుమతిస్తుందా? అమెరికా విదేశాంగశాఖ పుస్తకంలోని అంశాలను రహస్య పత్రాలని చెప్పటం వాటిని గుడ్డిగా ఆస్ట్రేలియన్ పత్రిక సంపాదకులు నమ్మి నిజమే అని ప్రచురించారని అనుకోజాలం. అంత రహస్యం అయితే అమెరికా అధికారులు తమ పత్రికలకు ఇవ్వకుండా ఆస్ట్రేలియా పత్రికను ఎంచుకోవటం ఏమిటి? అమెరికా ఏర్పాటు చేసిన చతుష్టయంలో అది భాగస్వామి, అమెరికా పెట్టిన చిచ్చుకారణంగా రెండు దేశాల మధ్య వాణిజ్యపోరు సాగుతోంది. కొద్ది రోజుల క్రితం ఆస్ట్రేలియాతో వాణిజ్య చర్చలను నిరవధికంగా వాయిదా వేసినట్టు చైనా ప్రకటించిన నేపథ్యంలోనే ఈ వార్తలు వెలువడ్డాయి. కాళిదాసు కవిత్వానికి తమ పైత్యం జోడించారన్నట్టుగా చైనా ప్రచురించిన పుస్తకంలోని అంశాలకు వక్రభాష్యాలు చెప్పి రాసిన కథనం అన్నది స్పష్టం. చైనాలో 2002, 04 సంవత్సరాలలో బయటపడిన సార్స్ మహమ్మారి విదేశాల నుంచి అసహజ పద్ధతిలో జన్యుమార్పిడి జరిగి వచ్చిన వైరస్ (ఇది కూడా కరోనా వైరస్ రకాలలో ఒకటి) అని చైనా పుస్తకంలో అభిప్రాయపడ్డారు. చైనాకు వ్యతిరేకంగా విదేశాల్లో ఉగ్రవాదుల జీవ ఆయుధాల తయారీని కూడా కాదనలేమని సంపాదకుడు గ్జు పేర్కొన్నారు. ప్రపంచంలో జీవ ఆయుధాల ప్రయోగాలు, యుద్ధంలో వాటి వినియోగం గురించి కూడా దానిలో చర్చించారు. 1941లోనే అమెరికా జీవ ఆయుధాల పరిశోధన ప్రారంభించిందని, తరువాత వాటి తయారీకి ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసిందని, 1940-45 సంవత్సరాల మధ్య జపాన్ జీవ ఆయుధాలను ఉపయోగించి తూర్పు చైనాలోని ఝెజియాంగ్, హునాన్ రాష్ట్రంలో ప్రయోగించి ప్లేగు వ్యాధి వ్యాపింప చేసిందని కూడా రచయిత దానిలో పేర్కొన్నారు. ఇన్ని అంశాలుండగా వాటన్నింటినీ పక్కన పెట్టి చైనా శాస్త్రవేత్తలు చైనాలో సార్స్ నుంచి జీవ ఆయుధాల గురించి చర్చ చేశారంటూ ఆస్ట్రేలియన్ వర్ణించింది.
2015లో బిల్ గేట్స్ టెడ్ టాక్ అనే కార్యక్రమంలో మాట్లాడుతూ రానున్న దశాబ్దంలో ఒక పెద్ద మహమ్మారి రానున్నదని, అది ఐదు కోట్ల మందిని బలితీసుకున్న 1918నాటి మహమ్మారి మాదిరి ఉంటుందని, ఆరునెలల్లో మూడు కోట్ల మందిని చంపి వేస్తుందని చెప్పాడు. దాన్ని యుద్ధం మాదిరి ఎదుర్కొనేందుకు ప్రపంచం తీవ్ర ప్రయత్నాలు చేయాలన్నాడు. బిల్ గేట్స్ మాటలను బట్టి గేట్స్ అప్పటికే మైక్రోచిప్ ద్వారా నియంత్రించే ఒక మహమ్మారి వైరస్‌ను ప్రయోగశాలలో రూపొందించి ఉన్నారని కొంత మంది అప్పుడే చెప్పారు. అవి బుద్దిలేని మాటలని తమ ఫౌండేషన్ ద్వారా వ్యాక్సిన్లను కొనుగోలు చేస్తున్నామని అందువలన మహమ్మారుల ప్రమాదం గురించి హెచ్చరించేందుకే తాను చెప్పానన్నాడు. ఆస్ట్రేలియన్‌కు, అమెరికాకు దీనిలో ఎలాంటి కుట్ర కోణం కనిపించలేదా ?
రష్యా-చైనా సరిహద్దుల సమీపంలో అమెరికన్లు ప్రయోగశాలల్లో జీవ ఆయుధాలను అభివృద్ది చేస్తున్నారని, వాటి పరిసరాలలో తడపర (తట్టు) వంటి ప్రమాదకర అంటు వ్యాధులు వ్యాపిస్తున్నాయని దాని మీద విచారణ జరపాలని ఏప్రిల్ మొదటి వారంలో రష్యా కోరింది. దానికి ప్రతిగా కూడా ఆస్ట్రేలియన్ కథనాన్ని ప్రచురించి ఉండవచ్చు. ప్రపంచంలోని 25 దేశాలలో అమెరికన్లు బయో ప్రయోగశాలలను ఏర్పాటు చేశారు. మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా, ఆగేయ ఆసియా, మాజీ సోవియట్ రిపబ్లిక్లలో అవి ఉన్నాయి. ఒక్క ఉక్రెయిన్‌లోనే 16 ఉన్నాయంటే అమెరికా కుట్రలను అర్థం చేసుకోవచ్చు.
జనాలను కొంత మంది ఎలా బురిడీ కొట్టిస్తారో ఒక ఉదంతాన్ని చూద్దాం. అమెరికన్ రచయిత డీన్ కూన్జ్ ఎప్పుడో కరోనా గురించి జోశ్యం చెప్పారని కరోనా వైరస్ బయట పడిన కొత్తలో గత ఏడాదే వార్తలు వచ్చాయి. డీన్ 1981లో రాసిన ది ఐస్ ఆఫ్‌ది డార్క్నెస్ అనే నవలలో పాత్రధారులతో ఊహాన్-400 అనే జీవ ఆయుధం, అది పనిచేసే తీరు, జనాలను ఎలా హతమారుస్తుందో, దాన్ని ఎలా తయారు చేస్తారో చెప్పించాడు చూడండి అంటూ ఆయన అభిమానులు లేదా ఆ నవలను విక్రయించే అమెజాన్ కంపెనీకి చెందిన వారు గానీ 2008నాటి నవలా సమీక్ష చిత్రాన్ని సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. ఒక పేజీలో జీవ ఆయుధం గురించి మరొక పేజీలో నవల ముఖచిత్రం ఉంది. ఇంకేముంది పుస్తకం మన ముందు ఉంది కనుక వాస్తవమే అని చాలా మంది నమ్మారు. ఈ నవల పేజీ ప్రచారంలోకి వచ్చిన తరువాత ఈ కథ ఊహించని మలుపు తిరిగింది. గూగుల్‌లో వెతికిన కొందరికి కొత్త అంశం కనిపించింది. అదే నవలలో అదే పాత్ర ధారులు రష్యన్లు గోర్కీ పట్టణంలో తయారు చేసిన గోర్కీ-400 జీవ ఆయుధం గురించి చర్చిస్తారు. ఆ పేజీ నవల 1981నాటి ముద్రణలో ఉంది. కానీ తరువాత గోర్కీ కాస్తా 2008 ముద్రణ నాటికి ఊహాన్‌గా మారిపోయింది. సోవియట్ కూలిపోయింది కనుక దాని స్థానంలో చైనాను చేర్చారు. కొత్త నవల రాయటం దండగ పేర్లు, స్థలాలను మారిస్తే చాలని రచయిత, ప్రచురణకర్తలు భావించి ఆ మేరకు మార్చి ప్రచురించినట్టు స్పష్టమైంది.
చరిత్రను తిరగేస్తే క్రీస్తు పూర్వం ఆరువందల సంవత్సరంలో క్రిసాను ముట్టడి సమయంలో రాజు సోలోన్ కటుక రోహిణీ అనే పుష్పాల నుంచి తీసిన రసాన్ని ప్రయోగించి విరేచనాలు, ఇతర వ్యాధులు కలిగించినట్టు చరిత్రలో ఉంది. 1346లో జెనోయీస్-తార్తార్ల మధ్య నేటి ఉక్రెయిన్‌లో ఆధిపత్య పోరు సమయంలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. ఓటమి దశలో ఉన్న తార్తార్లు ప్లేగువ్యాధి సోకిన, మరణించిన తమ వారిని ఫిరంగులకు కట్టి శత్రు ప్రాంతాల మీద పడేశారు. దాంతో జెనోయీస్ దళాలు వెనక్కు తగ్గాయి. ఈ పరిణామం గురించి గాబ్రియల్ డే ముసిస్ నమోదు చేశాడు. వెనక్కు తగ్గిన జెనోయీస్(ఇటాలియన్లు)లు తమతో పాటు ప్లేగు వ్యాధి కూడా తీసుకు వెళ్లారు. ఆ తరువాత అది ఐరోపా, ఆఫ్రికా, ఆసియాలో మన దేశంతో సహా అనేక దేశాలకు వ్యాపించింది. రెండున్నర కోట్ల మంది ఐరోపాలో దానికి బలయ్యారు. హైదరాబాదు సంస్థానంలో ప్లేగు వ్యాధి పదే పదే వస్తుండటంతో దాన్ని నివారించేందుకు 1591లో చార్మినార్‌ను నాటి నిజాం రాజు కట్టించిన విషయం తెలిసిందే. అమెరికాను ఆక్రమించుకొనే క్రమంలో గిరిజనుల నుంచి ఎదురైన ప్రతిఘటనను అణచివేసేందుకు బ్రిటిష్ పాలకులు పైన చెప్పుకున్నట్టు మసూచి(అమ్మోరు)వ్యాప్తిని ఒక ఆయుధంగా వాడుకున్న దుర్మార్గం గురించి చరిత్రలో నమోదైంది. అవి ఎలా పనిచేశాయో వివరిస్తూ సమాచారాన్ని బ్రిటిష్ సైనిక అధికారులు నమోదు చేశారు. పర్యవసానంగా దాదాపు రెండువందల సంవత్సరాల పాటు అమెరికాలో మసూచి వ్యాప్తి చెందింది.
రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత 22సంవత్సరాలకు 179 దేశాలు జీవ ఆయుధాల నియంత్రణకు ఒప్పందంపై సంతకం చేశాయి. ఎట్టి పరిస్ధితుల్లోనూ వాటి తయారీ, సేకరణ, నిల్వ, వినియోగించబోమని ఆ దేశాలు అంగీకారం తెలిపాయి. అయితే వైద్య అవసరాలకు కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ఉదాహరణకు ఒక ప్రాణాంతక వైరస్‌ను హతమార్చేందుకు మరొక వైరస్ తయారీకి అవకాశం ఇచ్చారు. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ సామ్రాజ్యవాదులు ఆపరేషన్ చెర్రీ బ్లూసమ్స్ పేరుతో జీవ ఆయుధాలతో అమెరికా సహా అనేక దేశాల మీద దాడి చేయాలనే పథక రచన చేశారు. అందుకు ప్రత్యేక దళాన్నే ఏర్పాటు చేశారు. 1932 నుంచి 1942వరకు పరిశోధనలు చేసి రూపొందించారు. తొలుత ప్రయోగాల్లో భాగంగా తన ఆక్రమణలోని చైనాలోని హార్బిన్, కొరియా, మంచూరియా ప్రాంతంలో దాడి చేశారు. దానిలో కలరా, ప్లేగు, అంతరాక్స్, మసూచి వంటి ప్రమాదకర క్రిముల్ని వాడారు. 2002లో ఒక అంతర్జాతీయ సమావేశంలో జపాన్ మిలిటరీ జరిపిన బాక్టీరియా బాంబు దాడుల్లో మరణించిన వారు ఐదు లక్షల ఎనభైవేల మంది ఉన్నట్టు వక్తలు వెల్లడించారు. ఒక్క చైనాలోనే ప్లేగు, కలరా, ఆంత్రాక్స్ వంటి వాటితో నాలుగు లక్షలమంది మరణించారని అంచనా. తాను పెద్ద ఎత్తున జీవ ఆయుధాలను తయారు చేసినట్టుగానే ఇతరులు కూడా తయారు చేసి తమ మీద ప్రయోగిస్తారని అమెరికా భయపడుతోంది. దీనిలో భాగంగానే దొంగే దొంగ అన్నట్లు చైనా మీద తప్పుడు ప్రచారం చేస్తోంది. మీడియా దానికి సాధనంగా ఉపయోగపడుతోంది. ఆస్ట్రేలియన్ కథ దానిలో భాగమే!
ఎం. కోటేశ్వరరావు
సెల్: 8331013288